You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘నీళ్ల కోసం కొట్టుకోవద్దు రా అంటే.. కొట్టి చంపేశారు..’
ఇంకా ఎండాకాలం పూర్తిగా రానే లేదు. అప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎంతగా అంటే.. కొట్లాటలకు సైతం దారిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఓ నీటి కలహం వృద్ధుడి ప్రాణాలు తీసింది.
ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకొనే సమయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. వారిని ఆపడానికి అరవై ఏళ్ల లాల్ బహదుర్ ప్రయత్నించారు.
అది వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో వారు బహదుర్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ దాడిలో ఆయన మరణించారు.
'కాళ్లతో తన్నారు'
'నీటి ట్యాంకర్ వద్ద గొడవ జరుగుతోంది. మా చెల్లి వెళ్లేసరికే మా అన్నయ్యను కొంత మంది కొడుతున్నారు. ఆ విషయం మా నాన్నకు చెప్పింది. వారిని ఆపేందుకు నాన్న వెళ్లారు. గొడవను ఆపడానికి వెళ్లిన మా నాన్నను కాళ్లతో తన్నారు. ఆయనపై పిడిగుద్దులు కురిపించారు.'
హృదయ విదారకంగా విలపిస్తూ బహదూర్ చిన్నారి కూతురి చెప్పిన మాటలివి.
'కొనుక్కొని తాగుతాం'
అవసరాలకు తగినట్టుగా నీటి సరఫరా అసలే లేదని బహదుర్ ఇంటికి దగ్గర ఉండే ఇశార్థి దేవి అనే మహిళ అన్నారు. ఒకరి ప్రాణం తీసిన ఈ నీళ్లు తమకొద్దని ఆమె చెబుతున్నారు. కష్టమో నష్టమో ఇకపై కొనుక్కొనే నీళ్లు తాగుతామని అంటున్నారు.
గుక్కెడు నీరు గగనమే
లాల్ బహదుర్ మరణంతో స్థానిక ప్రజలు దిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ వేలాది మంది నివసిస్తుంటే ఒక్క ట్యాంకర్ నీళ్లు మాత్రమే వస్తాయని లలితా ప్రసాద్ అనే వ్యక్తి చెబుతున్నారు. ఒక్కొక్కరికి రెండు గ్లాసులు కూడా దక్కవని ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టులో కేసు
హరియాణా నుంచి నీటి సరఫరా తగ్గిందని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. అక్కడి నుంచి వచ్చే నీటిలో అమ్మోనియా శాతం ఎక్కువగా ఉంటున్నట్లు ఆ పార్టీకి చెందిన సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
దీనికి సంబంధించి ఒక కేసు దిల్లీ హైకోర్టు విచారణలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దిల్లీలో 30 నుంచి 40 ప్రాంతాల్లో మాత్రమే నీటి కొరత ఉందని, వారి అవసరాలకు తగిన విధంగా నీటిని సరఫరా చేయలేక పోతున్నట్లు తెలిపారు.
అన్నీ అబద్ధాలే
స్థానిక మహిళ కాజల్ మాత్రం నాలుగు నెలలుగా నీళ్లు రావడం లేదని చెప్పారు. ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని అంటున్నారు. వారిని గెలిపించడం వల్ల తమకు ఒరిగిందేమీ లేదని, నీళ్లు లేక ప్రాణాలు పోతున్నాయని ఆక్రోశం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)