చిత్రమాలిక: రైతుల పాదయాత్ర- మా రెక్కల కష్టాన్ని గుర్తించండి!

రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 'భారతీయ కిసాన్ సభ' నిర్వహిస్తున్న మహారాష్ట్ర రైతుల లాంగ్‌ మార్చ్‌ 12వ తేదీ మధ్యాహ్నానికి ముంబై నగరానికి చేరబోతోంది.

మార్చి 7వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్‌లో 25 వేల మంది రైతులతో ఈ పాదయాత్ర ప్రారంభమైంది.

రైతుల పాదయాత్ర శనివారం రాత్రి భీవండీ చేరుకుంది. అక్కడి నుంచి ముంబై చేరేలోపు దాదాపు 50 వేల మంది రైతులు ఈ పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.

మార్చి 12వ తేదీన తాము మహారాష్ట్ర శాసనసభను చుట్టుముడతామని ఈ రైతులు చెప్తున్నారు. తమ స్వరాన్ని రాజకీయ నాయకుల చెవులకు వినపడేలా నినదిస్తామని అంటున్నారు.

మహారాష్ట్రలో భారతీయ కిసాన్ సభ చేపట్టిన ఈ పాదయాత్రలో పాల్గొనటానికి రాష్ట్రం నలుమలల నుంచీ రైతులు వచ్చారు. ఇప్పటికే ఏడు రోజులు నడిచారు.

ఇప్పటివరకూ దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరం నడిచారు. దాంతో చాలా మంది కాళ్లకు బొబ్బలొచ్చాయి. నడిచి నడిచి అలసిపోయి.. ఇలా రోడ్డు పక్కనే కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు.

వ్యవసాయ రుణాల మాఫీ నుంచి, పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించటం, భూమిపై యాజమాన్య హక్కులు కల్పించటం వరకూ ఎన్నో సమస్యలను పరిష్కరించాలని ఈ రైతులు డిమాండ్ చేస్తున్నారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని వీరు కోరుతున్నారు. చిన్న, సన్నకారు రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

‘‘రాష్ట్రంలో రుణ మాఫీ అమలు గురించి భారీగా లెక్కలు పెంచి చెప్తున్నారు. కానీ జిల్లా స్థాయిలో బ్యాంకుల్లో పరిస్థితి బాగోలేదు. రుణ మాఫీ అమలు అసంపూర్తిగానే మిగిలింది’’ అని మరాఠ్వాడా ప్రాంతంలో పనిచేసిన సీనియర్ పాత్రికేయుడు సంజీవ్ ఉనాహళే పేర్కొన్నారు.

‘‘రుణ మాఫీ ప్రక్రియను ఇంటర్నెట్ ద్వారా చేస్తున్నారు. కానీ ఈ రైతులకు డిజిటల్ అక్షరాస్యత అందించలేదు. అలాంటప్పుడు దీని ద్వారా వీరు ఎలా ప్రయోజనం పొందగలరు? ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని వీరు పరిశీలించగలరా?’’ అని సంజీవ్ వ్యాఖ్యానించారు.

స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం.. తాము పండించిన పంటలకు ఉత్పత్తి ఖర్చు కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా మద్ధతు ధర కల్పించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ రెక్కల కష్టాన్ని గుర్తించాలని వేడుకుంటున్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించాలంటే.. వారికి సరైన మద్దతు ధర అందించాలని, కేవలం కనీస మద్దతు ధర మాత్రమే ఇవ్వటం సరిపోదని సీనియర్ జర్నలిస్ట్ నిశికాంత్ భలేరావ్ పేర్కొన్నారు. ‘‘వీరి పరిస్థితి రోజు రోజుకూ విషమిస్తోంది. వీరికి సాయం అవసరం’’ అని ఆయన చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం.. వ్యవసాయ వృద్ధి రేటు గత ఐదేళ్లలో పడిపోయింది.

ఈ రైతుల పాదయాత్రలో వేలాది మంది గిరిజనులు పాల్గొంటున్నారు. నిజానికి లాంగ్ మార్చ్‌లో పాల్గొన్న వారిలో గిరిజనులే అధిక సంఖ్యలో ఉన్నారు.

‘‘అటవీ అధికారులు తరచుగా మా పొలాలను తవ్వేస్తున్నారు. వాళ్లకి ఇష్టమొచ్చినప్పుడల్లా ఇలా చేస్తున్నారు. మేం నిరంతరం వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సి వస్తోంది. మాకు మా భూమిపై హక్కు కావాలి’’ అని ఈ గిరిజనులు కోరుతున్నారు.

రైతుల పాదయాత్రకు వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. రైతుల డిమాండ్లను ప్రభుత్వం స్వీకరించాలని అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేసింది. లేదంటే తమ ఆందోళనలను విరమించబోమని హెచ్చరించింది.

రైతుల పాదయాత్ర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ముంబై శివార్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.