You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ఎప్పుడు ఏ వైపు నుంచి తూటాలు దూసుకొస్తాయో!'
భారత్-పాకిస్తాన్‌ల మధ్య చోటుచేసుకునే కాల్పుల వల్ల పరోక్షంగా రెండు దేశాల ప్రజలూ నష్టపోతున్నారు. అయితే ప్రత్యక్షంగా ఈ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు.
ఎప్పుడు ఏ దిక్కు నుంచి తూటా దూసుకొస్తుందోన్న భయం మధ్య రెండు దేశాల సరిహద్దు గ్రామాల్లో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకున్నారు.
కశ్మీర్‌లోని ఓ సరిహద్దు గ్రామంలో ఉండే మొహమ్మద్ యాకూబ్, ఓసారి తన ఇంట్లోకి చొచ్చుకొచ్చిన తూటాల నుంచి తృటిలో తప్పించుకున్నారు.
ఫిబ్రవరి 22న భారత్-పాక్ సైనికుల మధ్య చోటు చేసుకున్న కాల్పుల కారణంగా తమ ఇళ్ల నుంచి తప్పించుకుని బయటపడ్డ వందలాది సరిహద్దు గ్రామాల ప్రజల్లో యాకూబ్ ఒకరు.
‘మేం నిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నాం’ అని యాకూబ్ అంటారు. ప్రస్తుతం ఉరీలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరంలో ఆయన ఉంటున్నారు.
కశ్మీర్ పూర్తిగా తమ అధీనంలోనే ఉందని భారత్, పాకిస్తాన్‌లు రెండూ చెబుతున్నా, నిజానికి అందులో ఒక భాగం ఒక దేశం నియంత్రణలో, మరో భాగం మరో దేశం నియంత్రణలో ఉన్నాయి.
2003కు ముందు 776 కి.మీ. మేర విస్తరించిన ‘లైన్ ఆఫ్ కంట్రోల్’కి ఇరువైపులా తరచూ కాల్పుల ఘటనలు చోటు చేసుకునేవి.
2003లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక ఆ ఘటనలు తగ్గినా, 2013నుంచి ఆ ఒప్పందం అనేకసార్లు ఉల్లంఘనకు గురవుతూ వస్తోంది.
భారత్-పాక్ సరిహద్దులోని ఐదు గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి వారిని ఉరీలోని శరణార్థి శిబిరాల్లో ఉంచారు.
ఇప్పటి దాకా ఉరీలో జరిగిన సైనిక దాడుల కారణంగా 7 వేల మందికి పైగా ప్రజలు నష్టపోయారని అధికారులు బీబీసీతో చెప్పారు.
తాజాగా చోటు చేసుకున్న దాడులే ఇప్పటిదాకా తమకు ఎక్కువ నష్టాన్ని చేకూర్చాయని కొందరు గ్రామస్థులు అన్నారు.
సిలికోట్ గ్రామంలో ఈ మహిళ పది రోజుల వయసున్న తన బిడ్డను దుస్తుల మాటున దాచిపెట్టి ఓ వాహనం దగ్గరకు పరుగెడుతున్నారు. దాడుల నుంచి ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆ వాహనాన్ని ఏర్పాటు చేశారు.
ఇప్పటిదాకా సరిహద్దులోని కేవలం మూడు గ్రామాల నుంచే దాడులకు భయపడి వెయ్యిమందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారని అధికారులు చెబుతున్నారు.
ఈ దాడుల కారణంగా ఊళ్లకు ఊళ్లే ఖాళీ అవుతున్నాయని శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న కొందరు ప్రజలు అంటున్నారు. కానీ ఇప్పటిదాకా ఎంత మంది పౌరులు గాయపడ్డారో, చనిపోయారోననే దానిపై స్పష్టత లేదు.
అధికారులు వీళ్లను ఉన్నఫళంగా ఖాళీ చేయించడంతో చాలా మంది పశువులను, ఇతర విలువైన వస్తువులను ఇళ్ల దగ్గరే వదిలి వచ్చేశారు. కొందరైతే కట్టుబట్టలతో గ్రామాలను వదిలేశారు.
‘మేం యుద్ధ వాతావరణంలో జీవిస్తున్నాం. రెండు దేశాలూ మా గురించి కాస్త ఆలోచించాలి’ అని లాల్ దిన్ అనే గ్రామస్థుడు అన్నారు.
శ్రీనగర్‌లోని అబిద్ భట్ అనే ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోలను తీశారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)