You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కన్నుల పండువగా మేడారం ఆదివాసీ జనజాతర
రెండేళ్లకో సారి జరిగే మేడారం సమ్మక్క - సారలమ్మ ఆదివాసీ జాతరలో జనం వెల్లువెత్తారు. రెండో రోజైన గురువారం నాటికి 50 లక్షల మంది మేడారం జాతరకు వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు.
జాతర పూర్తయ్యే సారికి దాదాపు కోటి మంది మేడారాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు.
తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి కూడా జనం జాతరకు తరలి వచ్చారు.
కాకతీయ రాజులతో యుద్ధం చేసిన నాటి ఆదివాసీ తల్లీకూతుళ్లు సమ్మక్క, సారలమ్మల జ్ఞాపకార్థం ఈ జాతర జరుగుతుందని చరిత్ర చెబుతుంది. దీనిని ఆసియాలోనే అతి పెద్ద ఆదివాసీ జాతరగా పరిగణిస్తుంటారు.
జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో ఉన్న మేడారం చుట్టుపక్కల ప్రాంతంలో, గోదావరి నదికి ఆవల ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో కోయ, గోండు ఆదివాసీల జనాభా ఎక్కువ.
ఈ ప్రాంతాల నుంచి కొంత మంది కాలినడకన కూడా మేడారం చేరుకుంటారు.
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలనే డిమాండ్ కూడా చాలా కాలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతర నిర్వహణకు దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు చేస్తోంది.
జాతరకు వచ్చేవారికి సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దీనిని ఇటీవలే ప్రారంభించారు.
గురువారం నాడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమన్ సింగ్ జాతర చూడడానికి వచ్చారు. మరెందరో వీఐపీలు కూడా జాతర కోసం వస్తున్నారు.
మేడారం జాతర కోసం బస్టాండును విస్తరించారు. ప్రయాణికుల కోసం అదనంగా మరుగుదొడ్లు వంటివి నిర్మించారు.
మేడారానికి వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ తలెత్తింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాతర కోసం వందలాది ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
మేడారం జాతరలో అమ్మవారికి 'బంగారం' (బెల్లం) సమర్పిస్తారు.
శుక్రవారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు జాతరను సందర్శిస్తారని అధికారులు తెలిపారు.
మేడారం జాతరలో చాలా మంది మహిళలను 'సమ్మక్క' తల్లి ఆవహిస్తుందని ప్రజలు నమ్ముతారు. వీరు తలపై ‘అమ్మవారి’ను ఎత్తుకొని నృత్యం చేస్తుంటారు.
పోటెత్తుతున్న భక్త జనాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లుల గద్దెలు 24 గంటలు తెరిచే ఉంచుతామని అధికారులు చెప్పారు.
జంపన్నవాగుపై ఉన్న వంతెన జనంతో నిండిపోయింది. జాతరకు వచ్చేవారు జంపన్నవాగులో స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి దాదాపు 2 కి.మీ. దూరంలో ఉన్న అమ్మవారి గద్దెల వద్దకు నడుచుకుంటూ వెళ్తారు.
కొంత మంది భక్తులు తల నీలాలు కూడా జంపన్న వాగు వద్దే సమర్పించుకుంటారు.
ఫొటోలు: బి. రాజేంద్ర ప్రసాద్ (వరంగల్) & తెలంగాణ ప్రభుత్వ సమాచార ప్రజా సంబంధాల శాఖ.