You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆరోగ్య బీమా పథకం: ‘ఆరు నెలల్లో అమలు.. 50 కోట్ల మందికి లబ్ధి’
దేశంలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఆరోగ్య పథకాన్ని ప్రకటించింది.
పది కోట్లకు పైగా పేద, నిస్సహాయ కుటుంబాలకు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కల్పించేందుకు 'జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం' తీసుకొస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
సుమారు 50 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు. దేశ జనాభాలో దాదాపు 40 శాతం మంది ఈ పథకం పరిధిలోకి వస్తారు.
ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో నిర్వహించే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే అవుతుందని జైట్లీ తెలిపారు. ఈ ప్రాధాన్య పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు అవసరమైనన్ని నిధులను సమకూరుస్తామని చెప్పారు.
ఈ పథకం మధ్యస్థాయి, స్పెషాలిటీ స్థాయి ఆస్పత్రుల్లో వైద్య సేవలకు ఉద్దేశించినదని మంత్రి పేర్కొన్నారు. 'ఆయుష్మాన్ భారత్' కార్యక్రమంలో ఇది భాగంగా ఉంటుందని తెలిపారు.
ఆరోగ్య పరిరక్షణకు, ఉత్పాదకతను పెంచేందుకు, అనారోగ్యం కారణంగా పనికి దూరమై వేతనాలు పొందలేని పరిస్థితులను, కుటుంబాలు పేదరికంలో కూరుకుపోయే ఆస్కారాన్ని నివారించేందుకు ఈ పథకం తోడ్పడుతుందని ఆయన చెప్పారు.
అందరికీ ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం సాగుతోందని మంత్రి తెలిపారు.
జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ఆరు నెలల్లో ప్రారంభిస్తామని ఆర్థిక కార్యదర్శి హస్ముక్ అధియా చెప్పారు. దీనిని బీమా నమూనాలో అమలు చేయాలా, లేక ట్రస్టు నమూనాలో అమలు చేయాలా అన్నది ఇంకా నిర్ణయించలేదని తెలిపారు.
కేంద్రం ఎంత? రాష్ట్రం ఎంత?
కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం చొప్పున పథకం వ్యయాన్ని భరించే అవకాశముందని హస్ముక్ అధియా చెప్పారు. వ్యయాన్ని కేంద్ర, రాష్ట్రాలు భరించాల్సిన విధానం, ఇతర విధివిధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు.
పథకం వ్యయాన్ని కేంద్ర, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో భరిస్తే, కేంద్ర ప్రభుత్వంపై రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు భారం పడొచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు.
ఈ పథకంపై 'నారాయణ హృదయాలయ' ఛైర్మన్ డాక్టర్ దేవి షెట్టి స్పందిస్తూ- ఇది ఆచరణ సాధ్యమైన పథకమేనని అభిప్రాయపడ్డారు. పథకం అమలుకు చాలా నిధులు అవసరమవుతాయని, అయితే ప్రభుత్వం భరించలేనంత స్థాయిలో ఏమీ కాదని వ్యాఖ్యానించారు.
ప్రైవేటు ఆస్పత్రుల నియంత్రణ ఎలా?
నాణ్యమైన వైద్యసేవలు భారత్‌లో చాలా ఖరీదైన వ్యవహారమని, అలాంటి దేశంలో పేదలకు ఆరోగ్య బీమాను కల్పించే ఈ పథకం ప్రశంసనీయమైనదేనని, అయితే ఈ పథకాన్ని ప్రైవేటు ఆస్పత్రులు దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు చేపడుతుందనేది చూడాల్సి ఉందని బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్ చెప్పారు.
ప్రైవేటు వైద్య రంగంపై చాలా వరకు నియంత్రణ లేదని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ప్రజారోగ్యంపై భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో ఒక్క శాతం కంటే కాస్త ఎక్కువగా మాత్రమే ప్రస్తుతం వెచ్చిస్తోంది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయం అతి తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి.
ఇవి కూడా చదవండి:
- జైట్లీ బడ్జెట్ రైతులకేమిచ్చింది?
- ఆర్థిక సర్వే 2017-18: పది ముఖ్యాంశాలు
- రోడ్ల ప్రాజెక్టు నిరుద్యోగులకు ఊరటనిస్తుందా?
- #BudgetWithBBC: మోదీ సర్కార్ ఈ సవాళ్లను అధిగమిస్తుందా!
- గౌతమి: కేన్సర్‌ను ఇలా జయించారు
- రొమ్ము క్యాన్సర్: ఈ అసాధారణ లక్షణాలు తెలుసుకోండి
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- క్యాన్సర్‌తో పోయిన గొంతు రూ.60తో తిరిగి వస్తుంది!
- ట్రంప్ మానసిక స్థితిపై మళ్లీ చర్చ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)