You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆందోళనకారులకు- పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం
ఆందోళనకారులకు-పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి జాహెద్ హమీద్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ఆమోదించే అవకాశం ఉంది.
పాకిస్తాన్‌లో మూడు వారాలుగా జరుగుతున్న ఆందోళనలు శనివారం హింసాత్మకంగా మారాయి. ఘర్షణల్లో ఆరుగురు నిరసనకారులు చనిపోయినట్లు, 200 మంది గాయపడినట్లు భావిస్తున్నారు.
దేశంలోని ఇతర ప్రాంతాలకూ ఆందోళనలు వ్యాపిస్తుండటంతో నిరసనకారులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఆందోళనలకు నేతృత్వం వహించిన తెహ్రీక్ లబ్బయిక్ పాకిస్తాన్ నుంచి ముగ్గురు, ప్రభుత్వం నుంచి హోంమంత్రి, హోం శాఖ కార్యదర్శి, మేజర్ జనరల్ ఫాయెజ్ హమీద్ సభ్యులుగా ఉన్నారు. వారి మధ్య ఒక ఒప్పందం జరిగింది.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు :
- పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. తెహ్రీక్ లబ్బయిక్ కూడా అతనిపై ఎటువంటి ఫత్వా జారీచేయదు.
- పాకిస్తాన్ ఎన్నికల సంస్కరణ చట్టం 2017లో చేసిన తాజా సవరణకు బాధ్యులు ఎవరో తేల్చుతూ పాకిస్తాన్ ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీకి నివేదిక సమర్పించాలి.
- బాధ్యులుగా తేలిన వారిపై పాకిస్తాన్ చట్టం ప్రకారం శిక్ష విధించాలి.
- ఆందోళనలో పాల్గొని అరెస్టైన వారిని మూడు రోజుల్లో విడుదల చేయాలి.
- ఆందోళనకారులపై దాడి చేసిన పోలీసులను గుర్తించేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేసి, 30రోజుల్లోగా విచారణను ముగించాలి. ఆందోళనకారులపై దాడి చేసిన పోలీసులను శిక్షించాలి.
ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి జాహెద్ హమీద్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి షాహిద్ అబ్బాసీకి అందించారు.
జాహెద్ హమీద్ రాజీనామా కోరుతూ 3000మంది 22 రోజుల నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నారని ఇస్లామాబాద్ నుంచి బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ తెలిపారు. తెహ్రీక్ ఏ లబ్బయిక్ ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తోందని ఆమె తెలిపారు.
పాకిస్తాన్ ఎన్నికల సంస్కరణ చట్టం 2017లో చేసిన సవరణకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభమైంది. ఈ బిల్లులో జరిగిన ఓ సవరణ మొహమ్మద్ ప్రవక్త గౌరవానికి భంగం కలిగించేలా ఉందని, దీనికి న్యాయశాఖ మంత్రి జాహెద్ హమీద్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
అసలేమిటి ఈ చట్టం?
పాకిస్తాన్ చట్టం ప్రకారం ఎన్నికల్లో పాల్గొనే ప్రతి ముస్లిం అభ్యర్థి మొహమ్మద్ ప్రవక్తే చివరి ప్రవక్తని నమ్ముతున్నట్లు ఆవిడవిట్ దాఖలు చేయాలి. అయితే పాకిస్తాన్ ఎన్నికల సంస్కరణ చట్టం 2017లో చేసిన తాజా సవరణలో ఈ షరతులో మార్పులు చేశారని ఆందోళనకారులు అంటున్నారు.
కానీ సాంకేతిక పొరపాటుతోనే ఇలా జరిగిందని ప్రభుత్వం వివరణనిచ్చినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి జాహెద్ హమీద్ మాత్రం ఎన్నికల సంస్కరణ చట్టాన్ని అన్ని పార్టీల సమ్మతితోనే తీసుకొచ్చామని, తాము సొంతంగా ఈ చట్టాన్ని తీసుకురాలేదని అన్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)