You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రెస్‌రివ్యూ: తెలంగాణలో రెండో అధికార భాషగా ఉర్దూ
సాక్షి: తెలంగాణ వ్యాప్తంగా ఇకపై రెండో అధికార భాషగా ఉర్దూ చలామణిలోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ అధికార భాషల చట్ట సవరణకు శాసనసభ గురువారం ఆమోదముద్ర వేసింది.
1966 లోనే ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించినా అప్పట్లో ఇది జిల్లా యూనిట్‌గా అమలైంది.
పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ దాన్ని అమల్లోకి తీసుకురాలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తం ఉర్దూకు రెండో అధికార భాష హోదా దక్కాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఇటీవల 31 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో జిల్లా యూనిట్ గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా ఉర్దూను రెండో అధికార భాషగా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు గురువారం సభలో బిల్లు ప్రవేశపెట్టింది.
హెచ్1బీ వీసా బిల్లుకు అమెరికా కాంగ్రెస్ కమిటీ ఆమోదం
ఈనాడు: హెచ్1బీ వీసాదారుల కనీస వేతనాన్ని పెంచుతూ సిద్ధంచేసిన బిల్లుకు అమెరికా కాంగ్రెస్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న కనీస వార్షిక వేతనం రూ. 39.15 లక్షలు (60,000 డాలర్లు)ను రూ. 58.73 లక్షలు (90,000 డాలర్లు)గా పెంచేందుకు దీనిలో ప్రతిపాదనలు చేశారు.
అంతేకాదు వీసా నిబంధనలు కఠినతరం చేసేందుకూ చర్యలను ప్రతిపాదించారు. ఈ వీసాలకు భారత ఐటీ నిపుణుల్లో డిమాండ్ ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే. అమెరికా ఉద్యోగుల స్థానాన్ని వీరితో భర్తీచేయకుండా తాజా బిల్లులో ఆంక్షలు సిద్ధం చేశారు.
అమెరికా ఉద్యోగాల పరిరక్షణ, పెంపు బిల్లు (హెచ్ 170) పేరిట ఈ బిల్లును రిపబ్లికన్ చట్టసభ సభ్యుడు డారెల్ ఇస్సా ప్రవేశపెట్టారు. దీన్ని న్యాయ వ్యవహారాల కమిటీ ఆమోదించింది. తదుపరి చర్యల నిమిత్తం కాంగ్రెస్‌కు పంపుతారు.
అనంతరం అధ్యక్షుడు ట్రంప్ ఆమోదముద్ర పడితే ఇది చట్టరూపం దాలుస్తుంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ చట్టసభ్యులు, శ్వేతసౌధ ప్రతినిధుల మధ్య విభేదాల నడుమ.. కాంగ్రెస్ ఈ బిల్లుకు ఆమోదం తెలపడం కష్టమేనని నిపుణులు అంచనావేస్తున్నారు.
అమెరికా కార్మికుల స్థానంలో హెచ్1బీ వీసాదారులను తీసుకునేందుకు కొన్ని సంస్థలకు ఇచ్చే సడలింపులను తాజా బిల్లులో ఎత్తివేశారు. హెచ్1బీ వీసాలపై ఆధారపడే ఉద్యోగ సంస్థలు మొదటగా అమెరికా ఉద్యోగులను నియమించేలా దీనిలో చర్యలు ప్రతిపాదించారు.
రూ. 8,500 కోట్ల విశాఖ మెట్రోలో కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ పెట్టుబడి
ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ ముందుకొచ్చింది.
ఈ మేరకు గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ప్రతినిధులతో జరుపుతున్న చర్చలు గురువారం ఒక కొలిక్కి వచ్చాయి. మొత్తం రూ. 8,500 కోట్లతో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నారు.
రూ. 4,000 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ ఆసక్తి చూపింది. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు 5 నుంచి 6 శాతం తక్కువ వడ్డీతో నిధులు సమకూర్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించి పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఇప్పటికే ఏఎంఆర్‌సీ టెండర్లను పిలవడం జరిగింది. సివిల్ పనులలో భాగంగా 42 కిలోమీటర్ల పొడవుగల మూడు కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,500 కోట్లు భరించనుంది.
రోలింగ్ స్టాక్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కింద మరో రూ. 4,000 కోట్లను ప్రైవేట్ డెవలపర్ భరించనున్నారు.
బంగారు తెలంగాణ రాత్రికిరాత్రే అసాధ్యం: కేసీఆర్
ఆంధ్రజ్యోతి: 'రాత్రికిరాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడం సాధ్యం కాదు. ఇలా చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు. తెల్లారే లోపే బిల్డింగ్‌లు కట్టలేం. దేనికైనా కొంత సమయం పడుతుంది.
బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు వేస్తున్నాం. ఇంకా పాత పద్ధతిలోనే విమర్శించడాన్ని కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి. 40, 50 ఏళ్లపాటు ధ్వంసమైన వ్యవస్థను మూడేళ్లలో నిర్మించడం సాధ్యం అవుతుందా?' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
గురువారం శాసనసభలో ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుపై లఘు చర్చజరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే తనకు అర్థం కావడం లేదని, దీనిపై ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నానని అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలలకు సొంత బిల్డింగ్‌లు లేవని, హస్టళ్లలో అనేక సమస్యల వల్ల విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, ఓయూలో విద్యార్థులు చెట్ల కింద స్నానాలు చేస్తున్నారని అన్నారు. విద్యార్థుల దుస్థితి ఇలా ఉంటే.. మరో వైపు ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెబుతోందన్నారు.
దీనిపై కేసీఆర్ స్పందిస్తూ రోజు, వారం, నెలలో బంగారు తెలంగాణ సాధ్యం కాదన్నారు. తెల్లారేలోపే బంగారు తెలంగాణ తెస్తామని తాము చెప్పాలేదని, కాంగ్రెస్ నేతలే భ్రమల్లో ఉన్నారని విమర్శించారు.
ఆసియాలో అంబానీయే టాప్: ఫోర్బ్స్
నమస్తే తెలంగాణ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన కుటుంబాన్ని ఆసియా సంపన్న కుటుంబాల జాబితాలో అగ్రస్థానం వరించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాదికిగాను విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
గతేడాదితో పోలిస్తే ముకేశ్ కుటుం బ సభ్యుల సంపద 19 బిలియన్ డాలర్లు పెరిగి 44.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నదని తెలిపింది. మన కరెన్సీలో సుమారు రూ. 3 లక్షల కోట్లు. కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ అధిపతి లీ కుటుంబాన్ని వెనుకకునెట్టి ముకేశ్ కుటుంబం సంపన్నుల జాబితాలో తొలి స్థానం దక్కించుకున్నది.
లీ కుటుంబం ఆదాయం 11.2 బిలియన్ డాలర్లు పెరిగి 40.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గడిచిన ఏడాదికాలంలో సామ్‌సంగ్ నికర విలువ 75 శాతం ఎగబాకింది. ఇక ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ ఆసియా 50 సంపన్న కుటుంబాల జాబితాలో 40.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో హాంకాంగ్‌కు చెందిన క్వోక్ ఫ్యామిలీ మూడో స్థానంలో ఉండగా, 36.6 బిలియన్ డాలర్లతో థాయిలాండ్‌కు చెందిన ఛెరావనోంట్ కుటుంబం నాలుగో స్థానం లో నిలిచింది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)