You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాదయాత్రలతో అధికారం నడిచొస్తుందా? గతంలో పాదయాత్రలు చేసినవారిలో ఎవరెవరికి అధికారం దక్కింది?
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాజకీయ పాదయాత్రలకు చిరునామా తెలుగు నేల. ప్రజా సమస్యలు తెలుసుకోవడం పేరిట గతంలో నేతలు చేపట్టిన పాదయాత్రల తరువాత వారికి అధికారం దక్కిన దాఖలాలున్నాయి. కేవలం పాదయాత్రలతోనే అధికారాన్ని అందుకున్నారా అన్నది పక్కనపెడితే అవి కూడా వారి విజయాల్లో పాత్ర పోషించాయనడంలో అనుమానం లేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం 'ప్రజాసంకల్ప యాత్ర' ప్రారంభించడంతో ప్రజలు మరో సుదీర్ఘ పాదయాత్రను చూస్తున్నారు.
నిజానికి భారతదేశంలో ఆధునిక పాదయాత్రలకు ఆద్యుడు మహాత్మాగాంధీ. 1930లో ఆయన ఉప్పు సత్యాగ్రహం పేరిట నిర్వహించిన పాదయాత్ర భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక మైలురాయి.
ఆ తరువాత ఆయన 1933-34లో అంటరానితనానికి వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్త పాదయాత్ర చేశారు.
అనంతరం 1951లో వినోభా భావే భూదాన్ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతం నుంచి మొదలుపెట్టి బిహార్‌లోని బోధ్‌గయ వరకు నడిచారు.
1983లో అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని చంద్రశేఖర్ ప్రజల కష్టసుఖాలు, దేశంలో పరిస్థితులు తెలుసుకునేందుకు ఆరు నెలల పాటు 4,260 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో ఆయన కన్యాకుమారి నుంచి దిల్లీ వరకు నడిచారు.
రాజశేఖరరెడ్డి విజయంతో..
ఇక తెలుగు నేలపై పాదయాత్రల విషయానికొస్తే స్వాతంత్ర్యం తరువాత కాలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలవారు, ఉద్యమకారులు వేర్వేరు కారణాలతో పాదయాత్రలు చేసినప్పటికీ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర వాటన్నికంటే భిన్నమైనది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003లో ఆయన ఈ యాత్ర చేపట్టారు. యాత్ర పూర్తయిన కొన్నాళ్లకే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అది మొదలు పాదయాత్రల ఫలాలపై నేతల్లో నమ్మకం పెరిగిపోయింది.
అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కాలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 2013లో పాదయాత్ర చేశారు.
60 ఏళ్లు దాటినా ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులకు వెరవక పాదయాత్ర పూర్తిచేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పార్టీకి అధికారం దక్కడం, ఆయన ముఖ్యమంత్రి కావడం తెలిసిందే.
అదే సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, జగన్ సోదరి షర్మిల.. 2012 అక్టోబరు 18న ప్రారంభించి 2013 జులై 29 వరకు 230 రోజుల పాటు సుమారు 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
తెలంగాణలో 2016-17లో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సహా మరికొందరు నాయకులు కూడా సుమారు 4 వేల కిలోమీటర్ల మేర మహాజన పాదయాత్ర చేశారు.
ఇతరత్రా అంశాలన్నీ కలిసొస్తే పాదయాత్ర అదనంగా ఉపయోగపడొచ్చు కానీ దానికదే అధికారం సంపాదించి పెట్టే తారకమంత్రం కాదు.
రాజకీయాలకు కేంద్రంగా..
తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సోమవారం నుంచి భారీ పాదయాత్ర చేస్తున్నారు. కడపజిల్లాలోని ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సాగే యాత్రలో ఆయన ఒక్కో జిల్లాను దాటుకుంటూ ప్రజలను కలవనున్నారు. జగన్ పాదయాత్ర చుట్టూ ప్రస్తుతం రాజకీయాలు సాగుతున్నాయి. యాత్రకు అనుమతుల విషయంలోనూ తొలుత కొంత అనిశ్చితి ఏర్పడినా అదీ సమసిపోయింది.
ఎక్కడ ప్రారంభించినా ముగింపు అక్కడే
తెలుగు రాష్ర్టాల్లోని ప్రధానమైన పాదయాత్రలన్నీ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోనే ముగిశాయి. ఉమ్మడి రాష్ఱ్టంలోనైనా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోనైనా అది తెలుగు రాష్ర్టాలకు ఉత్తర కొన. ప్రస్తుతం జగన్ గమ్యస్థానమూ అదే. పేరులోనే ఇచ్ఛ అని ఉన్న ఆ ప్రాంతం కొందరు రాజకీయ పాదయాత్రికుల కోరిక తీర్చే మజిలీగా నిలిచింది.
ఒకే కుటుంబం నుంచి ముగ్గురు
ఇక తెలుగు రాజకీయాల్లోని ప్రధాన పాదయాత్రలను పరిశీలిస్తే ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం నుంచే ముగ్గురు కనిపిస్తున్నారు. రాజశేఖరరెడ్డి, కుమార్తె షర్మిల ఇప్పటికే పాదయాత్రలు చేయగా ఇప్పుడు కుమారుడు జగన్ ఆ జాబితాలో చేరారు.
(ఆధారం: కథనంలో పాదయాత్రలకు సంబంధించిన గణాంకాలకు ఆధారం ఆయా రాజకీయ పార్టీల వెబ్‌సైట్లు)
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)