You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రెస్ రివ్యూ: అమ్మకానికి అన్నగారి ఇల్లు
చెన్నై టీ నగర్ బుజుల్లా రోడ్‌లో ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావుకు ఇల్లు ఉంది. నటుడిగా స్థిరపడిన తర్వాత 1953లో ప్రముఖ హాస్యనటుడు కస్తూరి శివరావు నుంచి ఈ ఇంటిని ఎన్టీఆర్ కొనుగోలు చేశారు.
రెండంతస్తుల ఈ ఇల్లును ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. ఏలుమలై అనే బ్రోకర్ పేరు, సెల్ ఫోన్ నెంబర్ ఆ ఇంటి గేటుకు వేలాడుతోంది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీయార్ ఇల్లు అమ్మకానికి పెట్టడంతో ఆయన స్మృతులు కాలగర్భంలో కలిసిపోనున్నాయని సాక్షి కథనం పేర్కొంది.
అనుమతి ఎందుకు ?
ఈ నెల 6 నుంచి పాదయాత్ర చేపడుతున్న జగన్.. పోలీసుల అనుమతి అడగరాదని నిర్ణయించుకున్నారు. పార్టీ ముఖ్యులతో భేటీ అయిన జగన్.. 'తుని తరహా విధ్వంసం జరగొచ్చు' అంటూ టీడీపీ సమన్వయ కమిటీలో వ్యక్తమైన అభిప్రాయంపై చర్చించారు.
జెడ్ కేటగిరీ రక్షణలో ఉన్న జగన్ ప్రత్యేకంగా అనుమతి కోరాల్సిన అవసరం లేదనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ప్రతిపక్ష నేతగా ఎక్కడైనా తిరిగే అధికారం ఉందని.. అందువల్ల జిల్లా ఎస్పీలకు పాదయాత్ర సమాచారాన్ని ముందుగా అందిస్తే చాలని తీర్మానించినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.
రాహుల్ గాంధీ వచ్చినా ఒరిగేదేం లేదు
రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై స్పందిస్తూ.. రాహుల్ గాంధీ వచ్చి కూర్చున్నా ఒరిగేదేమీ ఉండదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. రేవంత్ రాజీనామాపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. రేవంత్ రాజీనామాను మీడియా ఎక్కువగా హైప్ చేస్తోందని తలసాని అన్నట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.
తన రాజీనామా లేఖ కూడా స్పీకర్ వద్దే ఉందని తలసాని తెలిపారు. అయితే టీడీపీ శాసనసభాపక్షం అధికారికంగా టీఆర్‌ఎస్‌లో విలీనమైంది కాబట్టి తన రాజీనామా లేఖ ప్రస్తావన అనవసరమన్నారు.
‘పార్టీ బాధ్యత తెలంగాణ ప్రజలదే’
తెలంగాణలో టీడీపీని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలదేనని చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయాన్ని తనకు వదిలివేయాలని కార్యకర్తలకు సూచించారు.
తాను చెప్పేది వింటే శాశ్వతంగా నాయకులుగా ఉంటారని బాబు అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణ కార్యకర్తలకు కొంత సమయం కేటాయిస్తానని బాబు హామీ ఇచ్చినట్లు ఈనాడు కథనం పేర్కొంది.
విశాఖ జోన్ ఏమైంది ?
విశాఖ రైల్వే జోన్ డిమాండ్ అటకెక్కినట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా జోన్ ప్రస్తావన లేకపోవడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. జోన్ ఏర్పాటైతే ఉత్తరాంధ్రకు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
జోన్ ఏర్పాటుపై సర్వే చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది కమిటీ నియమించినా దానిలో ఎలాంటి పురోగతీ లేదు. జోన్ కోసం హైకోర్టులో పిల్ దాఖలు కాగా.. దానిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దీంతో జోన్ ఆశలు అడుగంటుతున్నాని ఆంధ్రప్రభ కథనంలో పేర్కొన్నారు.
వాకీటాకీలో మాట్లాడిన కోహ్లీ
న్యూజీల్యాండ్‌తో మొదటి టీ-20 మ్యాచ్ జరగుతుండగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వాకీటాకీలో మాట్లాడిన ఘటనపై ఐసీసీ స్పందించింది.
నిబంధనల ప్రకారం మ్యాచ్ జరుగుతున్నపుడు డగౌట్‌లో ఉన్న ప్లేయర్లు వాకీటాకీలను ఉపయోగించకూడదు. దీంతో కోహ్లీపై చర్యలు తప్పవని భావించారు. అయితే వాకీటాకీలో మాట్లాడడానికి కోహ్లీ ముందుగానే అనుమతి తీసుకున్నాడని ఓ ఐసీసీ అధికారి తెలిపారు. దీంతో కోహ్లీకి ఐసీసీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆంధ్రభూమి కథనం పేర్కొంది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)