You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భూపాలపల్లిలో పోలీసుల ‘నిఘా కన్ను’
- రచయిత, విజయభాస్కర్
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో జయశంకర్ భూపాలపల్లి ఒకటి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల సరిహద్దులో ఉన్న ఈ జిల్లా సున్నిత ప్రాంతం. మావోయిస్టుల అలికిడి ఉండే జిల్లా కేంద్రం.
ఇక్కడ శాంతిభద్రతలను కాపాడటం కీలకమైన వ్యవహారం. దీని కోసం జిల్లా పోలీసు యంత్రాంగం ఓ కొత్త పరిష్కారాన్ని కనుగొంది. అదే డ్రోన్ కెమెరాల సహాయంతో పహారా కాయడం.
రాష్ట్రంలో డ్రోన్లను ఉపయోగిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న మొదటి జిల్లా భూపాలపల్లి కావడం విశేషం.
ఇక్కడే ఎందుకు?
నగరాల్లో నిర్వహించే కొన్ని ఈవెంట్లకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. వీటి ద్వారా ఉపరితలం నుంచే చిత్రీకరణ జరపవచ్చు. అయితే ప్రస్తుతం వీటి వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. కేవలం పోలీసులకు మాత్రమే వీటిని వినియోగించే వెసులుబాటు ఉంది.
ఈ అవకాశాన్ని భూపాలపల్లి జిల్లా పోలీసులు ఇప్పుడు వినియోగించుకుంటున్నారు. కీలకమైన 363వ జాతీయ రహదారితో అనుసంధానమైన ఈ జిల్లాలో గతంలో మావోయిస్టుల ప్రభావం బాగా ఉండేది.
అందుకే ఈ డ్రోన్ కెమెరా వ్యూహాన్ని జిల్లా పోలీసులు అనుసరిస్తున్నారు. దీంతో సమస్యాత్మక ప్రాంతాలపై కన్నేసి ఉంచవచ్చని భావిస్తున్నారు. ముందుగా జిల్లా కేంద్రంలో కొన్ని ప్రాంతాలను, రద్దీ కూడళ్లను డ్రోన్ కెమెరాల సహాయంతో పర్యవేక్షించి ఫలితాలను విశ్లేషిస్తున్నారు.
గగనతలం నుంచే నిఘా
ప్రయోగాత్మకంగా రెండు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ జిల్లా కేంద్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
శిక్షణ పొందిన పోలీసులను డ్రోన్ కెమెరాలను ఆపరేట్ చేసేందుకు నియమించారు. వీళ్లు రద్దీ కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలను చిత్రీకరిస్తుంటారు. అదే సమయంలో కంట్రోల్ రూం నుంచి పోలీసు అధికారులు వాటిని చూసి సూచనలిస్తుంటారు.
"డ్రోన్ల సహాయంతో రద్దీ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించడంతో పాటు, ఘర్షణ చోటు చేసుకునే ప్రాంతాలను ముందుగానే పసిగట్టే అవకాశం కలుగుతోంది" అని డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని, దీన్నిమరింత విస్తరిస్తామని ఆయన అంటున్నారు.
వచ్చే ఏడాది జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరలో డ్రోన్ కెమెరాలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
మా ఇతర కథనాలు:
అయితే, ప్రముఖుల పర్యటనలు, జాతరలు వంటి సందర్భాల్లోనే కాకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతరం డ్రోన్ కెమోరాలతో నిఘా పెట్టాలని సామాజిక కార్యకర్త రాజ్‌కుమార్ సూచిస్తున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)