అద్దాలు పగిలిన రాత్రి

సగం దించిన కారు అద్దాల లోంచి అక్కడ నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితిని అంచనా వేయడం కష్టం. అక్కడ రోజువారీ జీవితం అతలాకుతలం కావడం మాత్రమే కాదు, అక్కడ నుంచి అదృశ్యమైన, ధ్వంసమైన వస్తువులు కూడా తిరిగి రాని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. అవన్నీ ఎన్నో కథలు చెబుతాయి.
ఈశాన్య దిల్లీలో ఆ రాత్రి మంటలు చెలరేగిన ప్రాంతం నేను ఉంటున్న ఇంటి నుంచి కాస్త దూరంలోనే ఉంది. ఆ రాత్రి అక్కడ మంటల్లోంచి వచ్చిన పొగని, మంటల్ని, రక్తాన్ని కళ్లతో చూశాను. దిల్లీలోని శివ్ విహార్లో నివసిస్తున్న ఒక ముస్లిం కుటుంబం ఇంటిని మంటల్లో కాల్చడం మాత్రమే కాకుండా ఆయన పెంచుకుంటున్న పావురాలను కూడా పీక నులిమి హింసించారని చదివాను. ఆ పక్షులు ఎగిరిపోయి ఉంటాయనుకున్నాను. కుక్కల కళేబరాలు, చనిపోయిన బల్లులు, విరిగి పడిన పక్షుల మెడలు అక్కడ పడి ఉన్నాయి. ఇది దుఃఖించాల్సిన కాలం. అకాల వర్షాలు కురుస్తున్న కాలం.
మా ఇంటి నుంచి అక్కడికి వెళ్లడానికి పట్టిన సమయం చూస్తే అది చాలా దూరంగా అనిపించింది. నగరాల్లో ప్రాంతాల మధ్య దూరాలు ధనవంతులు, మధ్య తరగతి ప్రజలు, దిగువ మధ్య తరగతి, పేద వారి మధ్యలో అంతరాల్లా విభజించి ఉన్నాయి.
గత నెలలో దిల్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతానికి వెళ్లడానికి నేను నివసించే చోటు నుంచి సాధారణంగా 30 నిమిషాలు పడుతుంది.
మంటల్లో కాలిన కార్లలోంచి, తెగి పడిన తలల నుంచి, మసకబారిన గోడల నుంచి హింసకి మూలాలు ఎలా అర్థమవుతాయి?
వీటి నుంచి నిజాలని వెలికి తీయడానికి నేనేమీ ఫోరెన్సిక్ నిపుణురాలిని కాదు. కేవలం అక్కడ చిందర వందరగా విసిరేసిన వస్తువుల నుంచి, తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న వాళ్ల నుంచి అక్కడ నెలకొన్న పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
ముస్తఫాబాద్‌లో ఒక స్కూల్ బయట అంచులన్నీ కాలిన నోట్ బుక్ కనిపించింది.
పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌర పట్టికకి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న మహిళల చిత్రాలతో వీధిలో ఉన్న గోడలన్నీ నిండి ఉన్నాయి. ఆ చిత్రాలన్నీ ఒక విధమైన ఒంటరితనాన్ని, విచారాన్ని, అక్కడ జరిగిన పరిస్థితులని ప్రతిబింబిస్తున్నాయి.
ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని నిర్మాణాల ద్వారా అక్కడ జరిగిన పరిస్థితులను వివరించడానికి చేస్తున్నదే ఈ ప్రయత్నం.
నిజాన్ని, ప్రపంచాన్ని మౌనంగా చూసేవి ఆ నిర్మాణాలే!
తొలి సాక్ష్యం : సిగ్నేచర్ బ్రిడ్జి

ఈ రహదారి ఈశాన్య దిల్లీని దిల్లీ నగరంతో కలిపే వారధి.
ఈ బ్రిడ్జిని 2018లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. దీంతో ఈశాన్య దిల్లీ నుంచి దిల్లీ నగరంలోకి రావడానికి 45 నిమిషాలు పట్టే సమయం 10 నిమిషాలకు తగ్గిపోతుందని అంచనా వేశారు. దీంతో కాలుష్యం తగ్గి, ఇంధనం ఆదా అవుతుందని అన్నారు.
కానీ, ఫిబ్రవరి 24వ తేదీన ఆ సమయం ఏమీ తగ్గలేదు. పోలీసులు గొడవలు జరుగుతున్న ప్రాంతానికి సరైన సమయానికి చేరుకోలేకపోయారు. ఎవరూ ఫోన్ కాల్స్‌ని తీయలేదు.
ఆ బ్రిడ్జికి అవతల కాలిన కాగితాలు, చెక్కలు, మనుషుల వాసన అలముకుంది. ఇంధనం మాత్రం ఆదా అయి ఉంటుంది. ఇది ఒప్పుకుని తీరాల్సిన విషయం.
ఈ బ్రిడ్జి కుతుబ్ మినార్ కన్నా రెండింతలు పెద్దగా ఉందని బ్రిడ్జి ప్రారంభ సమయంలో మీడియా పేర్కొంది.

శనివారం నేను బ్రిడ్జి దాటి వెళ్ళాను. యమున పాయలుగా విడిపోయింది. కానీ మనుషులు దేన్నైనా విడగొట్టడానికి నదులతో కూడా పోటీ పడగలరు..
ఇది పర్యటకులను ఆకర్షిస్తుందని క్యాబ్ డ్రైవర్ చెప్పారు. కానీ నేనెప్పుడూ వినలేదు. ఒక్కసారి తల పైకెత్తి చూశాను.
నమస్కారం పెడుతున్నట్లున్న ఆకారంలో కేబుళ్లతో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జిని దిల్లీ పర్యటక రవాణా అభివృద్ధి శాఖ 1518.17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించింది.
ఈ బ్రిడ్జిపై నిల్చుని దిల్లీ నగరాన్ని వీక్షించవచ్చని, ఇది ఈఫిల్ టవర్‌ని తలపిస్తుందని పత్రికలు కొనియాడాయి. నేను ఈఫిల్ టవర్ ఎప్పుడూ చూడలేదు.
రెండో సాక్ష్యం: ఘటనలకు ఆధారాలు
మేము అస్తవ్యస్తంగా ఉన్న ప్రాంతంలోకి అడుగుపెట్టాం.
మధ్యాహ్నం కావడంతో పెద్దగా జన సంచారం లేదు. హిందూ జనాభా తగ్గిపోయి ముస్లింలు పెరిగిపోయిన ఈశాన్య ప్రాంతంలో ఒక భౌగోళిక మార్పు జరగబోతోందని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానించింది.
మూడో సాక్ష్యం: కాలిన పెట్రోల్ బంక్
సోమవారం పెట్రోల్ బంక్ కాలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఏదైనా ఒక వస్తువుని ఆస్వాదించాలంటే దాన్ని ముట్టుకోవాలని నేనెక్కడో చదివాను. ఆ అనుభూతి చెదరక ముందే అక్షరాల్లో పెట్టాలని అనుకున్నా.
కానీ, ఆ కాలిన పెట్రోల్ పంపును నేను నా చేతులతో పట్టుకోలేను. కేవలం, అక్కడ కాలి పడి ఉన్న వాహనాల్ని, ఇళ్ల శిథిలాలను, గోడలను, అక్కడ నెలకొన్న భయంకర నిశ్శబ్దాన్ని మాత్రం చూడగలను.
నాల్గో సాక్ష్యం: ప్రార్థనా స్థలం
చాంద్ నగర్ మెయిన్ రోడ్ మీద ఉన్న ఆ నిర్మాణం విభజన కోసం ఏర్పాటు చేసినట్లుగా ఉంది.
ఆ మందిరం బయట రెండు ధ్వంసమైన మోటార్ బైకులున్నాయి. లోపల సీలింగ్‌తో పాటు, సీలింగ్‌కి వేలాడుతున్న చాండ్లియర్ కూడా నల్లగా మాడిపోయింది.
గొడవలు జరిగిన మూడు రోజుల తర్వాత ఆ నిర్మాణానికి కాపలా కాసే వ్యక్తి గోడలను శుభ్రపరిచి, కిటికీలను తుడిచాడు.
ఇప్పుడు రాత్రి పూట ఎన్ని లైట్లను వెలిగిస్తే ఆ చాండ్లియర్ మళ్లీ కాంతులు విరజిమ్ముతుందో?
నలుపు వర్ణ రహితానికి సంకేతం. ఆ సమాధి మరణించిన వ్యక్తుల ఆవాసం. అందులో సమాధి అయిన వారిని తిరిగి బతికించలేము. ఆ సమాధి దగ్గర పూలు పెట్టి ప్రార్థించాను.
శనివారం ఆ మసీదును ప్రార్థన కోసం తెరిచారు. 50 ఏళ్ల మీరజ్ పెహ్లీవాన్ ఆ మందిరం లోపల కూర్చుని ఉన్నారు.
“ నేను గత 37 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను. ఇది సయ్యద్ చాంద్ బాబా ఉండే ప్రదేశం. ఇక్కడ చేసిన ప్రార్థనలన్నిటికీ ఫలితం లభిస్తుంది.”
ఈ మందిరం లోపల ఎంత మంది తమ ప్రార్థనలు వినిపించారో కదా అనిపించింది. యుద్ధాలు అంతమవ్వాలని, ప్రేమ పెంపొందాలని వారు ప్రార్థించారో లేదో అని అనిపించింది.
ఐదో సాక్ష్యం
మెయిన్ రోడ్డుపై చెల్లా చెదురుగా విసిరేసిన చెత్త కుప్పలో ఓ ఎరుపు రంగు బ్యాగ్ కనిపించింది. దాన్ని నేను ముట్టుకోలేదు. అది అక్కడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అది చెక్కు చెదరకుండా అక్కడే పడి ఉంది.
ఆ వీధులన్నీ పగిలిన అద్దాలతో నిండి ఉన్నాయి. ఆ రోడ్డు వెంబడి చిత్రాలతో నిండిన గోడ ఉంది.
స్వచ్ఛ భారత్‌కి సంబంధించిన పరిసరాల పరిశుభ్రత, డెంగీ నిర్మూలన సందేశాలతో ఆ గోడ నిండిపోయింది. అక్కడ ఉన్న మెట్రో స్తంభాలపై 'మీరు పర్యవేక్షణలో ఉన్నారు' అనే సందేశం కూడా రాసి ఉంది.
'పౌరసత్వ సవరణ చట్టం వద్దు, జాతీయ పౌర పట్టిక వద్దు' అని మసి బొగ్గుతో రాసిన రాతలు కూడా అదే స్తంభాలపై కనిపించాయి.
మద్యపానానికి బానిసైన వారిని దాన్నుంచి విముక్తి చేస్తామని చెప్పే బోర్డులు కూడా అక్కడే వేలాడుతున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా కేంద్రం శీలంపూర్‌ని గుర్తించింది. ఈ ప్రాంతాన్ని మాదకద్రవ్య రహిత ప్రాంతంగా చేసేందుకు జాతీయ కార్యాచరణ ప్రణాళికలో కూడా చేర్చింది.
ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఈ శీలంపూర్‌లో ఇళ్లు సూర్య రశ్మి కూడా చేరకుండా ప్రతి చదరపు కిలోమీటర్ విస్తీర్ణం కనీసం 30000 మంది జనాభాతో కిక్కిరిసి ఉంటుంది. ఇక్కడ హోటళ్లు, కెఫేలు, రెస్టారెంట్లు లాంటివి ఏమీ లేవు. అయితే మూడు పిజ్జా షాపులు మాత్రం ఉన్నాయి.
ఈ ప్రాంతానికి పశ్చిమంగా యమునా తీరం, తూర్పున ఘాజియాబాద్ ఉన్నాయి. ఇక్కడ జనాభా అంతా పేదలే. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా, అధిక నిరక్షరాస్యత నెలకొన్న ప్రాంతాల్లో శీలంపూర్ ఒకటి.
అద్దాలు పగిలిన ఆ రాత్రి
ఒక వీధి చివర్లో కాలిన ఇల్లు ఉంది. పగిలిన అద్దాలపై మేం నడిచాం. కొన్ని మీడియా రిపోర్టులు అక్కడ అంతా సవ్యంగానే ఉందని రాశాయి.
కానీ అక్కడ పగిలిన అద్దాలు, కాలిన వాసన మిగిల్చిన గాయాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒక సందు బయట ఒక కుక్క కూర్చుని ఎదురు చూస్తోంది. అక్కడ చెలరేగిన మంటల పొగకి దాని శరీరమంతా బూడిద రంగులోకి మారిపోయింది.
హింస మనుషులకి, జంతువులకి కూడా రంగులు మార్చేయగలదు.
అక్కడ ఉన్న గోడల్ని, వీధుల్ని, ఇళ్ళని ఎవరో ద్వేషం అనే రంగు పులిమి మార్చేసినట్లుగా కనిపించాయి. అక్కడ స్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉంది.
దేవుడే అన్నిటికీ సాక్షి అని, అన్నీ చూసుకుంటారని అక్కడ గుమిగూడిన మహిళలు అన్నారు. కానీ దేవుడు ఎక్కడున్నాడు?

వాళ్లంతా జాఫ్రాబాద్ - శీలంపూర్ నిరసనకారులు. గత రెండు నెలలుగా వారు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేస్తున్నారు.
షహీన్‌బాగ్ తరహా నిరసనలు దేశవ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో చోటు చేసుకున్నాయి. కొన్ని నిరసనలు వెలుగులోకి రాలేదు.
పాత అలీగఢ్‌లో అదే సమయంలో హింస చోటు చేసుకుంది. ఉద్యోగ ఉన్నతిలో రేజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పుకి నిరసనగా భీం ఆర్మీ నేత చంద్ర శేఖర్ ఆజాద్ ఫిబ్రవరి 23న దేశవ్యాప్త బంద్‌కి పిలుపునిచ్చారు.
శీలంపూర్ ప్రాంత మహిళలు జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర మౌజ్‌పూర్-యమునా విహార్‌ని కలిపే రహదారిని నిర్బంధించాలని నిర్ణయించుకున్నారు. వారు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించాలనుకున్నారు. చుట్టు పక్కల కాలనీ మహిళలు కూడా జత కలిశారు. కానీ, పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
మహిళలు నిరసనలు ఆపాలని, లేని పక్షంలో బలవంతంగానైనా వారిని తరిమి కొట్టాలని ఫిబ్రవరి 23న భారతీయ జనతా పార్టీ నాయకుడు కపిల్ శర్మ డిమాండ్ చేశారు.
శనివారం స్టేజి ఖాళీగా ఉంది. కానీ నిరసన కొనసాగుతూనే ఉంది.
ఆరో సాక్ష్యం
“ అతని మరణానికి ఇచ్చిన సాక్ష్యం తుది సాక్ష్యం కాదని మాకు తెలుసు. ఎందుకంటే, తెలిసిన నిజం వెనుక ఒక తెలియని నిజం దాగి ఉంటుంది.” (p. 43)
తిరిగి కోలుకోలేని దుఃఖం నెలకొన్న ఆ ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంది.
జాఫ్రాబాద్‌లోని 37వ నెంబర్ వీధిలో జరుగుతున్న అంతిమ యాత్రకి వెళ్లాలని నేను అనుకున్నాను. అక్కడ మొహమ్మద్ ఇర్ఫాన్ శవం తెల్లని వస్త్రాలతో చుట్టి ఉంది. ఉస్మాన్‌పూర్‌లో పిల్లలకి పాలు తేవడానికి బుధవారం రాత్రి ఆయన బయటకి వెళ్ళారు.
అంతకు ముందే అజిత్ ధోబాల్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. మీడియాలో అక్కడ ప్రశాంతత నెలకొందనే వార్తలు వచ్చాయి.
కానీ, ఇర్ఫాన్ ఇంటికి 300 మీటర్ల దూరంలో రౌడీ మూకలు ఆయనను కొట్టి చంపేశాయి. ఆయన తల పగిలిపోయి ఉంది.
నేను మరో రెండు రోజుల్లో ఇలాంటి ఎన్నో శవ పేటికలని చూడాల్సి వచ్చింది.
బ్యాగులు తయారుచేసే కంపెనీలో పని చేసే మొహమ్మద్ ఇర్ఫాన్ వయసు 27సంవత్సరాలు.
ముస్తఫాబాద్ ఇరుకు సందులు చూడగానే ఇక్కడ ఏదో జరగరానిది జరిగిందని అనిపిస్తుంది. ఆ రోడ్డు మీద ఒక చాక్లెట్ షాపును తగలబెట్టేశారు. ఆ కొట్టు ముందున్న బోర్డు పూర్తిగా కాలిపోయి, పేరు కూడా కనిపించడంలేదు. ఆ బోర్డు మీద అక్షరాలు కూడా కాలిన శరీరాల్లానే ఉన్నాయి.
చనిపోయిన వ్యక్తి కాలుని మాత్రమే ఇచ్చి ఒక కుటుంబాన్ని అంత్యక్రియలు జరుపుకోమని చెప్పారు.
కొంచెం ముందుకి కాలవ దాటుకుని నడిస్తే నాల్గో నెంబర్ వీధిలో ఉంటున్న 40 ఏళ్ల అఖిల్ అహ్మద్‌ని కూడా బుధవారం సాయంత్రం చంపేశారు. ఆయన 'లోని 'లో ఉంటున్న అత్తవారింటికి వెళ్లి ముస్తఫాబాద్‌లో ఉన్న తన ఇంటికి తిరిగి వస్తుండగా చంపేశారు. ఆయన కార్లు కడిగే వృత్తిలో ఉన్నారు. ఆయన శవం తెరిచి ఉంచిన శవ పేటికలో ఉంది. ఆయన ఖాన్ మార్కెట్‌లో ఉన్న పార్కింగ్ స్థలంలో పని చేసేవారు. నేను ఆయన్ను గుర్తు పట్టాను.
నిత్య జీవితంలో మనం కలిసే పేరు తెలియని ఎంతో మంది వ్యక్తుల లాంటి వారు ఆయన కూడా.జీటీబీ హాస్పిటల్‌లో గుర్తు తెలియని శవాల మధ్య ఉన్న ఆయన మృత దేహాన్ని కుటుంబం శనివారం గుర్తించింది. మూడు రోజుల పాటు వెతికిన తర్వాత ఆయన శవం దొరికింది. .
అక్కడ పగిలి ఉన్నది అద్దం ముక్కలు మాత్రమే కాదు. ఆ అద్దాల మధ్యలో ధ్వంసమైన మోటార్ సైకిళ్ళు, కార్లు, శిథిలమై పోయిన ఇళ్లు, చెదిరిపోయిన ఆశలు, నమ్మకాలు కనిపిస్తున్నాయి.
చరిత్ర పునరావృతం అవుతుందని అంటారు.
ధ్వంసమైన మసీదులు, మూకుమ్మడి అరెస్టులు, ముస్లింల ఊచకోత, రౌడీ మూకల దాడులు, ఈశాన్య దిల్లీలో ఒక భయాన్ని కలగచేస్తాయి. వ్యవస్థ అవలంబించిన నిర్లక్ష్య వైఖరి ఆశని చంపేసింది.
కనిపించని సాక్ష్యాలు
విరిగిన రెక్కలు, పావురాల మెడలు, కాలిన పుస్తకాల వాసనని ఎలా వర్ణించగలం? ఇదంతా చూస్తేనే నిరాశ ఆవహిస్తుంది. పాత ఉత్తరాలు, జ్ఞాపకాలు..వాటిని మళ్ళీ తేలేం. కొలవలేని బాధ, భయం, ప్రేమ, ఆశ, ఎదురుచూపులు - వీటి భారం మోయడం కష్టం.
ఒక చెప్పుల దుకాణంలో దొంగతనం జరిగితే కొందరు అక్కడ ఉన్న జోళ్లను తమతో పట్టుకుని వెళ్తున్నారన్న వార్తలు వచ్చాయి. నేను మాత్రం కాలిన మసీదు, ఖురాన్, ఒంటి కాలికి జరిపిన అంత్యక్రియల గురించి ఆలోచిస్తున్నాను. ఎటు చూసినా తీరని దుఃఖమే కనిపిస్తోంది.
మాటల్లో ఇంకా కొన్ని కోల్పోయిన వస్తువుల జాడ కన్పిస్తుంది.ఇక్కడ నెలకొన్న పూర్తి పరిస్థితిని మాటల్లో ఎలా చెప్పగలం?
ఇక్కడ ఖాళీగా ఉన్న సందులు, వెలుగు చేరని కిటికీలు ఈ భారాన్ని మోస్తూనే ఉంటాయి. ఇది మాటల్లో వర్ణించలేని దుఃఖం.
అనంతమైన సాక్ష్యాలు
వీధుల్లో నెలకొన్న భయంకర నిశ్శబ్దం, కాలిన పుస్తకం, మసి బారిన చాండ్లియర్, మూసేసిన దుకాణాలు... ఇదంతా సాధారణ స్థితేమీ కాదు.
శివ్ విహార్‌లో ఉన్న రెండు పార్కింగ్ ప్రదేశాలలో 170 కార్లను మంటల్లో తగలబెట్టేశారు.ముస్తఫాబాద్ నుంచి శివ్ విహార్‌ని కలిపే మార్గాలని సరిహద్దు అంటారు, సరిహద్దులో ఎప్పుడూ ప్రమాదం పొంచే ఉంటుంది.
అక్కడ అన్ని వీధుల్లోనూ సల్ఫర్ వాసన వస్తోంది.
అక్కడ కాలిన ఇంటి ముందు మెట్ల మీద కూర్చుని ఒక వ్యక్తి కన్పించాడు. అతని రెండు ఇళ్లనూ రౌడీ మూకలు తగలబెట్టేశారు. నాలుగు చిన్న మురికి కాల్వలు కలిసే ఒక పెద్ద మురుగు కాల్వలో ఎన్ని శవాలు మునిగాయో లెక్కే లేదని అటు వైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి అన్నారు.
అక్కడ నుంచి బయటకి వస్తుంటే, ‘అందంగా కనిపించే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండరు, కానీ ఆరోగ్యంగా ఉండేవారు ఎప్పుడూ అందంగానే ఉంటారు’ అనే అక్షరాలతో రాసిన బోర్డు కనిపించింది.
ఇదంతా భరించడం చాలా కష్టం. అక్కడ ఉన్న గొడవలు, వ్యతిరేకతలు, పగిలిన అద్దాలు.. ఈ ఒంటరితనం...అన్నీ...

ఫొటోలు: గెట్టీ ఇమేజెస్, చింకీ సిన్హా
చిత్రాలు: పునీత్ బర్నాలా
షార్ట్ హ్యాండ్: షాదాబ్ నజ్మీ