భారత్‌లో లెక్కకు రాని
కోవిడ్ మరణాలు

సునీల్ శర్మ అనే హిందూ పూజారి చాలా చిన్న వయసులోనే మరణించారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఒంటరి వారయ్యారు.
రాజస్థాన్‌లోని గాన్వాడి అనే మారుమూల గ్రామంలో నివసిస్తున్న సునీల్ శర్మ కుటుంబాన్ని బీబీసీ కలిసింది.
‘‘మే 9న ఆయనకు జ్వరం వచ్చింది. స్థానిక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం’’ అని ఆయన భార్య సునీత వివరించారు.
ఒక వారం తర్వాత సునీల్‌కు కోవిడ్ టెస్ట్ చేయించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. మొదట్లో చికిత్సకు ఆయన శరీరం సహకరించింది. కానీ, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో జైపూర్‌లోని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

గన్వాడీ గ్రామం
గన్వాడీ గ్రామం
మే 20న సునీల్ మరణించారు. ఆయన గ్రామంలోనే అంత్యక్రియలు జరిగాయి.
‘‘ఆయన అంతక్రియలన్నీ కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారమే జరిగాయి. కానీ ఆయన పేరు మాత్రం కోవిడ్ మృతుల జాబితాలో చేరలేదు’’ అన్నారు సునీత.
సునీల్, హషీబ్, ఆషిక్, పునితా, కుందన్ ఇలా ఎంతో మంది కోవిడ్‌తో మరణించినా వారి పేర్లు అధికారిక డేటాలో చేరలేదు.
ఇలా రికార్డులకెక్కని మరణాల గురించి వివరాలు తెలుసుకునేందుకు 12 మంది బీబీసీ రిపోర్టర్లు 8 రాష్ట్రాల్లోని 12 నగరాలలో పరిశోధన చేశారు.
ఈ పన్నెండు నగరాలలోని ఆసుపత్రులు, శ్మశానాలు, దహన వాటికలు, స్వచ్ఛంద సంస్థలను కలిసి అధికారులు చెబుతున్న లెక్కలకు, వాస్తవాలను పోల్చి చూసే ప్రయత్నం చేశారు.
భౌగోళికంగా దేశాన్ని ప్రతిబింబించేవి, మే నెలలో మరణాలు ఎక్కువగా నమోదైన నగరాలను బీబీసీ ఎంచుకుంది.
బిజ్నోర్, దర్భంగా, జంషెడ్‌పూర్, జాన్‌పూర్, కరీంనగర్, మన్సా, నాగ్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాయ్‌పూర్, సికార్, సిమ్లాలాంటి నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. తూర్పున బిహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్య భారతదేశంలోని ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాదిన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమాన మహారాష్ట్ర, దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రాలలో ఈ పరిశీలన నిర్వహించాం. మరి ఇందులో ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఈ దిగువన చూడండి.
“ఆసుపత్రి వారు సునీల్ కోవిడ్‌తో మరణించారని చెబుతున్నారు. కానీ, ఆయన పేరు కోవిడ్ మృతుల జాబితాలో ఎందుకు చేరలేదో అర్థం కావడం లేదు’’
స్థానిక అధికారులను అడిగితే మాకు తెలియదు అంటున్నారు. కోవిడ్ మరణాలను నమోదు చేయడం వారి విధి.
ఆ ఊళ్లోని పాడైపోయిన ఓ స్కూల్ బిల్డింగ్ లోని రెండు చిన్న గదుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్నారు విమలా చౌధరి. సునీల్ శర్మ ఈ గ్రామంలో నివసించడం లేదని, గుజరాత్‌లో పూజారిగా పని చేస్తున్నారని, ఆయనకు సంబంధించిన వివరాలు తన దగ్గర లేవని విమలా చౌధరి చెబుతున్నారు. అయితే, గత ఏడాది నవంబర్ నుంచి సునీల్ శర్మ ఈ గ్రామంలోనే ఉంటున్నారు.
కోవిడ్ కారణంగా తిరిగి సొంత గ్రామాలకు చేరుకున్న లక్షలాది భారతీయులలో ఆయన ఒకరు.
కోవిడ్ కేసుల్లో పేషెంట్ మరణం గురించి ఆసుపత్రి సిబ్బంది అధికారులకు తెలియజేస్తారు. తద్వారా, ఆ వ్యక్తి పేరు కోవిడ్ మృతుల జాబితాలో చేరుతుంది.
తాము కోవిడ్ మరణాలకు సంబంధించి అన్ని ప్రోటోకాల్స్ పాటించామని ఆసుపత్రి సిబ్బంది బీబీసీకి తెలిపారు.
మరి, ఈ సమాచార లోపం ఎందుకు ఏర్పడిందంటూ రాజస్థాన్ ఆరోగ్య శాఖమంత్రి డాక్టర్ రఘు శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోవిడ్ మరణంగా నమోదు కానందున ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం చేస్తే, అది తమకు అందదేమోనని సునీల్ శర్మ కుటుంబం ఆందోళన చెందుతోంది
భారతదేశంలోని పలు నగరాల్లో ఇలాంటి కేసులు అనేకం ఉన్నట్లు తేలింది. వాస్తవిక మరణాలు ఎన్ని అన్నది తెలుసుకోవడంలో ఇలాంటి ఘటనల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అక్కడి నుంచి వందల కిలోమీటర్ల దూరం ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆ రాష్ట్రంలో 11,000 మంది జనాభా ఉన్న ఓ గ్రామంలో ఒక్కసారిగా భారీ సంఖ్యలో మరణాలు నమోదు కావడం ప్రారంభించాయి. ఒక్క ఏప్రిల్ రెండో వారంలోనే 50 మంది చనిపోయారు.
ఆషిక్ అలీ అనే జర్నలిస్టు అలా మరణించిన వారిలో ఒకరు.
‘‘ఏప్రిల్ 19న మా అన్నకు జ్వరం వచ్చింది. కానీ మనిషి బాగానే ఉన్నాడు. మందులు తీసుకున్నప్పుడు తగ్గుతోంది, మళ్లీ వెంటనే వస్తోంది’’ అని అతని తమ్ముడు అబ్దుల్ ఖాదిర్ బీబీసీతో అన్నారు.
‘‘మామూలు జ్వరమే అనుకున్నాం. అందుకే కోవిడ్ టెస్టు చేయించలేదు. కానీ మే 1న మా అన్న హఠాత్తుగా మరణించారు’’ అన్నారు ఖాదిర్
‘‘మా గ్రామంలో చాలామంది ఇలాగే మరణించారు. కొందరిలో దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించాయి. కొందరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు’’ అని వివరించారు స్థానిక జర్నలిస్టు కన్వాల్ జాఫ్రి. ఆయన కొన్నాళ్లుగా ఇక్కడి మరణాలను రికార్డు చేస్తున్నారు.
మరి ఇవన్నీ కోవిడ్ మరణాలుగా నమోదవుతున్నాయా?
ఇక్కడ మరణాలు పెరిగాయన్నది గుర్తించాం కానీ, వాటిని కోవిడ్ మరణాలుగా చెప్పలేమని జిల్లా అధికారులు వెల్లడించారు.
‘‘ ఆ ఊళ్లో చాలా క్యాంపులు ఏర్పాటు చేశాం. కానీ కోవిడ్ పాజిటివ్ అని ఎవరూ తేలలేదు’’ అని సీనియర్ అధికారి ధీరేంద్ర సింగ్ బీబీసీతో అన్నారు. ఇలా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయని అడిగినప్పుడు ‘‘అవి యాదృచ్ఛికంగా జరిగిన మరణాలు కావచ్చు’’ అన్నారాయన.
దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలోని పట్టణాలు, గ్రామాలలో నెలకొన్న పరిస్థితి ఇది.
వాళ్లంతా లెక్కకు రాని కోవిడ్ మృతులే
ఏప్రిల్ 8 నుంచి దేశంలో రెండో వేవ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి దాదాపు 44 రోజుల పాటు శ్మశానాలలో చితిమంటలు రగులుతూనే ఉన్నాయి
‘‘కొన్ని కుటుంబాలలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడే రగులుతున్న చితిమంటలపై తమ వారిని కూడా దహనం చేయమంటూ కొందరు వేడుకోవడం కనిపించింది. ఒకరినొకరు హత్తుకుని ఓదార్చుకునే పరిస్థితి కూడా లేదు’’
కానీ, కోవిడ్ అధికారిక గణాంకాలలో ఈ మరణాలన్నీ చేరడం లేదు.
కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వ ప్రణాళికలు సరిగా లేవని, ఈ లోపాలను కప్పి పుచ్చుకోవడానికి మరణాలను దాస్తున్నారని ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. దీని వల్ల భవిష్యత్ ప్రణాళికలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
సుమారు 3,88,000 మరణాలతో అత్యధిక మరణాలు సంభవించిన దేశాలలో అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడో స్థానంలో భారతదేశం నిలిచింది.
‘‘డేటాను సరిగా రిపోర్టు చేయకపోతే మీరు ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేసినట్లే’’ అన్నారు యూకేలోని గ్లోబల్ హెల్త్ అలయన్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ రాజే నారాయణ్
‘‘మరణాలను సరిగా రిపోర్ట్ చేయక పోవడం వల్ల ఏ స్ట్రెయిన్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయో తెలుసుకోవడం కష్టమవుతుంది’’ అన్నారాయన.
‘‘మరణాలను పారదర్శకంగా రిపోర్ట్ చేసే ప్రభుత్వ వ్యవస్థ ఒకటి కచ్చితంగా ఉండాలి’’ అన్నారు రాజే నారాయణ్
ఎన్నెన్నో ప్రశ్నలు
దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా కోవిడ్‌తో మరణించిన వారినే అధికారిక లెక్కల్లో చేరుస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి ఇది కూడా ఒక సమస్యే. ఇలాంటి వ్యాధులకు కోవిడ్ తోడై చాలామంది ఇంటి దగ్గరే మరణిస్తున్నారు. వారిలో ఎక్కువమందికి టెస్టులు జరగడం లేదు.
మూడింట రెండు వంతుల జనాభా ఉండే భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
తమ వారు కోవిడ్‌తో మరణించారని నిరూపించుకోవడం చాలా మందికి సాధ్యం కావడం లేదు.
‘‘ఆసుపత్రులలోని మరణాలే మా దగ్గర రికార్డవుతున్న మరణాలు’’ అని మహమ్మారి పీక్‌లో ఉన్న రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్ ఆరోగ్యశాఖమంత్రి జై ప్రతాప్ సింగ్ అన్నారు.
జమీర్ హష్మీలాంటి విషాద గాథలు కూడా కొన్ని కనిపిస్తాయి.
బెడ్లు, వెంటిలేటర్లు సరిపడినన్ని లేకపోవడం, వైద్య సిబ్బంది చేతులెత్తేయడంతో చాలామందికి తమ వారికి ఎలా ట్రీట్‌మెంట్ ఇప్పించాలో కూడా అర్థం కాలేదు.
మెకానికల్ ఇంజినీర్ అయిన తన అన్నకు జరిగిన అన్యాయాన్ని జమీర్ బీబీసీకి వివరించారు.
కోవిడ్ సోకడంలో జమీర్ తన అన్నను వైద్యం కోసం పట్నాలోని అనేక ఆసుపత్రులకు తిప్పారు. కానీ ఫలితం దక్కలేదు.
విధిలేక, చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేమని కండిషన్ పెట్టిన ఓ ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది.
ఏప్రిల్ 19న జమీర్ అన్న మరణించారు.
‘‘మా అన్నను చంపింది కరోనా కాదు. డాక్టర్లే. అతను ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ప్రాణాలు పోవడం నేను స్వయంగా చూశాను’’ అన్నారు జమీర్
బీబీసీ పరిశోధన

కోవిడ్ మరణాల నమోదు సందర్భంగా జరుగుతున్న అవకతవకలపై బీబీసీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పరిశీలన చేపట్టింది. ఇందుకోసం 12 నగరాలలోని ఆసుపత్రులు, శ్మశానాలు, దహనవాటికలు, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించింది. మే 1 నుంచి మే 15 వరకు నమోదైన అధికారిక గణాంకాలను వాస్తవిక పరిస్థితులతో పోల్చి చూసే ప్రయత్నం చేసింది.
ఇందుకోసం మే ఆరంభంలో మరణాలు ఎక్కువగా నమోదవుతున్న పట్టణాలను, భౌగోళికంగా దేశంలోని అన్ని ప్రాంతాలలోని పరిస్థితులను ప్రతిబింబించేలా నగరాలను బీబీసీ ఎంపిక చేసుకుంది.
బిజ్నోర్, దర్భంగా, జంషెడ్‌పూర్, జాన్ పూర్, కరీంనగర్, మన్సా, నాగ్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్,రాయ్‌పూర్, సికార్, సిమ్లాలాంటి నగరాలు ఎంపిక చేసిన జాబితాలో ఉన్నాయి. తూర్పున బిహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్య భారతదేశంలోని ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమాన మహారాష్ట్ర, దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రాలలో ఈ పరిశీలన నిర్వహించాం.
మేం ఎంపిక చేసుకున్న కాలం భారతదేశంలో కోవిడ్ మహమ్మారి తీవ్రత పీక్‌లో ఉన్నప్పటి కాలం. చాలామంది చనిపోయిన తమ వారిని దహనం చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్న సమయం. మరణించిన చాలామంది సమాచారం అందుబాటులో లేదు. గత ఏడాది ఇదే టైమ్‌లో ఎంతమంది మరణించారన్న సమాచారం కూడా మేం పరిశోధించిన చాలా ప్రాంతాలలో లభించ లేదు.
‘‘భారీ సంఖ్యలో వస్తున్న శవాల దహనం పెద్ద సవాలుగా మారింది’’ అన్నారు దీపేందర్ కుమార్ భట్. ఆయన జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లోని పార్వతి ఘాట్ శ్మశాన వాటికలో పని చేస్తారు.
ఈ శ్మశాన వాటికలో రెండు విద్యుత్ దహన వాటికలు ఉన్నాయి. రోజుకు 10 బాడీలను మాత్రమే దహనం చేయగలం.
‘‘సెకండ్ వేవ్‌లో రోజుకు 55-60 వరకు మృతదేహాలు వచ్చేవి. దీనివల్ల మేం మా దగ్గర ఉన్న బఫర్ స్టాక్‌తో మృతదేహాలను దహనం చేయాల్సి వచ్చింది. వర్షాకాలంలో ఇబ్బంది జరక్కుండా మేం బఫర్ స్టాక్‌ను పెట్టుకుంటాం. కానీ దానిని కూడా వాడేయాల్సి వచ్చింది’’ అన్నారు దీపేందర్ కుమార్.

బిహార్ రాజధాని పట్నాలో మే 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నమోదైన మరణాలు కేవలం 357. కానీ మున్సిపల్ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కాలంలో నగరంలో ఆరు శ్మశానాలలో 1352 మృతదేహాలను దహనం చేశారు.
నగరంలో సుమారు కోటీ డెబ్భై లక్షలమంది ఉండగా, 60 లక్షల మంది కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్నారు.
బిహార్‌లో కోవిడ్ మరణాల సంఖ్య మరో 4000 పెరిగింది
చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ లో 516 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ మరో 340 మంది అదనంగా మరణించి ఉంటారని అంచనా.
చిత్రంగా, మే 2020లో చత్తీస్‌గఢ్‌లో ఒకే ఒక్క మరణం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
12 నగరాల నుంచి తీసుకున్న డేటా దేశం మొత్తానికి వర్తింపజేయడం సమంజసంగా ఉండకపోవచ్చు. కానీ, గ్రౌండ్ లెవల్లో వాస్తవిక పరిస్థితులకు ఇది అద్దం పడుతుంది.
గ్రామీణ ప్రాంతాలలో కోవిడ్ డేటా నమోదు సవ్యంగా లేదన్న వాదనలకు మా పరిశీలనతో మరింత బలం చేకూరింది.
12 నగరాల నుంచి తీసుకున్న డేటాను దేశం మొత్తానికి వర్తింపజేయడం సమంజసంగా ఉండకపోవచ్చు. కానీ, గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులకు ఇది అద్దం పడుతుంది
వేలాది మృతదేహాలు నదుల ఒడ్డున పూడ్చిపెట్టారు.
ఇందులో చాలా మృతదేహాలు కోవిడ్ కారణంగా మరణించిన వారివే అయ్యుంటాయన్న అనుమానాలున్నాయి.
ఇందులో ఎంతమంది మృతదేహాలు అధికారుల రికార్డులకెక్కాయో తెలియదు
వైరస్ తీవ్రత భారత దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది.
అనేక జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన గ్రౌండ్ రిపోర్టులో కూడా అధికారిక లెక్కలకు, వాస్తవాలకు పొంతన కుదరడం లేదని తేలింది.
మార్చి 1 నుంచి మే 10 వరకు ప్రభుత్వం ప్రకటించిన డేటాకు, వాస్తవానికి పది రెట్ల అంతరం ఉందని గుజరాత్‌లోని ఓ న్యూస్ పేపర్ వార్తా కథనం రాసింది.
Estimated excess deaths in Gujarat during a 71 day period (March 1 to May 10) are around *ten times* official COVID deaths. That is the scale of the tragedy in Gujarat. @aashishg_ does the calculations. https://t.co/e9rnyteswU
— Murad Banaji (@muradbanaji) May 15, 2021
‘‘సెకండ్ వేవ్ సమయంలో మధ్యప్రదేశ్‌లో సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువగా మరణాలు సంభవించాయి’’ అనే హెడ్‌లైన్‌తో ‘ది స్క్రోల్‘ వెబ్‌సైట్ ఒక కథనం ఇచ్చింది.
‘‘కోవిడ్ కారణంగా ఎంతమంది చనిపోయారో చెప్పడం చాలా కష్టం’’ అని ఈ కథనం పేర్కొంది.
చాలా రాష్ట్రాలో ప్రభుత్వ లెక్కల కన్నా ఎక్కువ మరణాలే జరిగాయని ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది. చత్తీస్‌గఢ్‌లో అధికారులు నమోదు చేసిన మరణాల కంటే 4.85 రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఓ కథనంలో వెల్లడించింది.
అయితే, మరణాలు అధికారిక లెక్కల్లోకి రావడం లేదన్న వాదనను ప్రభుత్వం తోసి పుచ్చుతోంది.
‘‘ కోవిడ్ డేటా విషయంలో అంతా పారదర్శకంగా ఉంది’’ అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అధికారిక లెక్కల్లో చూపిన దానికన్నా 5-7 రెట్లు అధికంగా మరణాలు సంభవించాయన్న వాదనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు
దీర్ఘకాలిక వ్యాధులున్న వారితో సహా అన్ని రకాల కోవిడ్ మరణాలను గణాంకాలలో చేర్చాల్సిందిగా ఆదేశించామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నియమాలను ప్రభుత్వం తరఫున ఆరోగ్య వ్యవహరాలను చూసే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ 2020లో జారీ చేసింది.
కానీ, ఈ నిబంధనలను చాలా ఆసుపత్రులు పాటించినట్లుగా కనిపించడం లేదు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కోవిడ్‌తో మరణిస్తే వారిని కోవిడ్ మృతుల జాబితాలో చేర్చడం లేదు.
ప్రభుత్వం రూపొందించిన కోవిడ్ మృతుల జాబితాను అంగీకరించేది లేదని ఉత్తరాఖండ్ హైకోర్టు తేల్చి చెప్పింది. అల్మోరా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం గుండె పోటు తోనే 111మంది మరణించారంటే నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం ఆడిట్ కమిటీలు కోవిడ్ మృతుల లెక్కలను సమీక్షించే పనిలో ఉన్నాయి. కానీ ఇళ్లలో మరణించిన వారి పేర్లను ఈ జాబితాలో చేర్చడం కష్టమే.
ఎందుకంటే వీరిలో చాలామంది టెస్టులు చేయించుకోలేదు. ఆసుపత్రులకు వెళ్లలేదు. కాబట్టి వారిని కోవిడ్ మృతులుగా చెప్పడం కష్టం.
సమాచార లోపం

డేటాలో లోపాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు
బిహార్
బిహార్ రాజధాని పట్నాను ఉదాహరణగా తీసుకుంటే ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం కోవిడ్ మృతులు కేవలం 357మంది.
అయితే, పట్నా జిల్లా అధికారులు మే 2020లో 740 మరణాలు, మే 2019లో 964 మరణాలను నమోదు చేశారు. 2021 మే నెలలో 4775 మరణాలు నమోదయ్యాయి. అయితే, ఇందులో అందరూ కోవిడ్‌తో మరణించిన వారు కాదు.
ఈ సంఖ్యలు పూర్తి సమాచారాన్ని ఇవ్వలేవు.
బిహార్‌లోని మరో జిల్లా దర్భంగాను ఉదాహరణగా తీసుకుంటే మే 1-15 తేదీల మధ్య ఇక్కడ 52మంది మరణించారని అధికారిక డేటా చెబుతోంది.
దర్భంగా వ్యాప్తంగా 50 హిందూ శ్మశాన వాటికలు, 100 వరకు ముస్లిం శ్మశాన వాటికలు ఉన్నాయి.
కోవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భిగో దహన వాటికాలోనే 15 రోజుల్లో 52 మృతదేహాలను దహనం చేశారు. 12 దేహాలను సమాధి చేశారు.
దర్భంగా సిటీ శివారు పల్లెటూర్ల గురించి సమాచారం అందుబాటులో లేదు.
బీబీసీ తెలుగు కరస్పాండెంట్ బళ్ల సతీశ్ కరీంనగర్ జిల్లాలో పరిస్థితిని పరిశీలించారు.
జిల్లాలో 60 ఆసుపత్రులకు కోవిడ్ చికిత్సకు అనుమతించారు. అయితే, మృతుల వివరాలు అడిగినప్పుడు మార్చురి స్టాఫ్ పెదవి విప్పలేదు. తమ ఉన్నతాధికారి ఈ వివరాలు ఎవరికి చెప్పవద్దన్నారని, తన పేరు కూడా బైటపెట్టవద్దని ఓ అధికారి బీబీసీతో అన్నారు. మున్సిపల్ అధికారులు కూడా మృతుల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు సమాధానం చెప్పలేదు. ‘‘మేం దీనికి సమాధానం ఇవ్వకూడదు’’ అని మాత్రం అన్నారు.
ఛత్తీస్‌గఢ్
రాయ్‌పూర్‌లో కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 516 అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, మా పరిశోధనలో అది 857 అని తేలింది. కానీ, వాస్తవ సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. ఉన్న శ్మశాన వాటికల్లో అంత్యక్రియల నిర్వహణ కష్టం కావడంతో అధికారులు 26 తాత్కాలిక శ్మశానాలు నిర్మించారు.
‘‘ నా13 సంవత్సరాల సర్వీసులో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలను చూడలేదు ’’ అన్నారు ఈ శ్మశాన వాటికలో పని చేస్తున్న బలరామ్ హిర్వానీ
‘‘ముగ్గురి కోసం ఏర్పాటు చేసిన దహన ప్రదేశాన్ని దాదాపు 10మంది కోసం వాడాల్సి వచ్చింది’’ అన్నారాయన. ఈ శవాలన్నింటినీ రోడ్డు పక్కనే దహనం చేసినట్లు వెల్లడించారు.
ఉత్తర ప్రదేశ్
ఉత్తర ప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో మే 1 నుంచి 15 మధ్య 51మంది కోవిడ్‌తో చనిపోయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
కానీ, ఈ సమయంలో జాన్‌పూర్‌లోని పిల్కిచ్చా ఘాట్ శ్మశాన వాటిలోనే కోవిడ్, నాన్ కోవిడ్ కలిపి 431మందిని దహనం చేశారు. మామూలు రోజుల్లో ఇక్కడ దహనం చేసే మృతదేహాల సంఖ్య 70 నుంచి 100 వరకు ఉంటుంది.
ఇక రాతపూర్వకంగా ఎలాంటి ఆధారాలు నమోదు చేయని రామ్‌ఘాట్ వంటి చిన్న చిన్న శ్మశాన వాటికల్లో ఎంత మందికి అంత్యక్రియలు జరిగాయో తెలియదు
రామ్‌ఘాట్‌ను తరచూ సందర్శిస్తూ, అక్కడి అధికారులతో నిత్యం టచ్‌లో ఉండే స్వచ్ఛంద సేవకుడు సత్యవీర్ సింగ్ అభిప్రాయం ప్రకారం రామ్‌ఘాట్‌లో మే 1 నుంచి 15 తేదీ మధ్య సుమారు 500 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి.
మామూలు రోజుల్లో ఇక్కడ 100 నుంచి 125మందికి పైగా అంత్యక్రియలు జరుగుతాయి.
ఈ దహనవాటికల్లో ఎలాంటి రికార్డులు ఉండవు.
కరోనా సమయంలో ఇక్కడ 500-700 వరకు మృత దేహాలకు అంత్యక్రియలు జరిగినట్లు రామ్‌ఘాట్ కేర్ టేకర్ రాకేశ్ వెల్లడించారు.
శవాల దహనం నిత్యం జరగడంతో ఇక్కడ టిన్‌తో చేసిన షెడ్ వేడికి కరిగిపోయింది
గ్రామీణ ప్రాంతాల ప్రజలు గోమతి నది తీరంలో అంత్య క్రియలు నిర్వహించారు. వీటికి కూడా రికార్డులు లేవు.
అలహాబాద్ జిల్లాలో మే 1 నుంచి 15 మధ్య 140 మంది కోవిడ్ తో చనిపోయినట్లు అధికారుల రికార్డుల్లో ఉంది.
కానీ, కోవిడ్ రోగుల అంత్యక్రియల కోసం కేటాయించిన ఫఫమావు ఘాట్‌లో 300 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఆయన అక్కడ భద్రతా విధుల్లో పాల్గొన్నారు.
ఈ శ్మశాన వాటికలో కూడా రికార్డులు లేవు. సెకండ్ వేవ్ సమయంలో ఎక్కువ మృతదేహాలు వచ్చినట్టు పోలీసులు తెలిపారు
50 కంటే తక్కువగా శవాలకు అంత్యక్రియలు జరిగిన రోజులు చాలా తక్కువని అక్కడ పని చేసే కొందరు వ్యక్తులు బీబీసీకి తెలిపారు
ఈ సిటీలో అయిదు శ్మశాన వాటికలుండగా, అందులో ఒక్కదాంట్లోనే రికార్డులు మెయిన్‌టెయిన్ చేస్తున్నారు.
2020 మే 1 నుంచి 15 మధ్య 150 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయని శ్మశానం కేర్ టేకర్ అజయ్ నిషాద్ తెలిపారు. అదే 2021లో ఆ సంఖ్య 331కి పెరిగిందని ఆయన వెల్లడించారు.
గత సంవత్సరం మే 1 నుంచి 15 మధ్య 216 డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన జిల్లా అధికార యంత్రాంగం ఈ ఏడాది 767 మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసింది.
కానీ, గ్రామీణ ప్రాంతాలలో మరణాల సంఖ్య మీద ఎలాంటి రికార్డులు లేవు. ఇంటింటికి తిరిగి పరిశీలిస్తే తప్ప వాస్తవమైన సంఖ్యలు వెల్లడి కావు
నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న శ్మశాన వాటికలు, రికార్డులు రాయడానికి కావాలసిన వారిని నియమించుకోలేక పోతున్నాయి
కోవిడ్ మరణాలు వర్సెస్ మొత్తం మరణాలు
ఎక్కువ మరణాలు నమోదైన మాట వాస్తవమే అయినా, పెరిగిన మరణాలన్నింటినీ కోవిడ్ మరణాలని చెప్పలేం.
నాగ్‌పూర్ అర్బన్, రూరల్ ప్రాంతాలో మే 15 వరకు 1132 మరణాలు నమోదయ్యాయి. ఇందులో బయటి నుంచి వచ్చిన 118 మంది కోవిడ్ రోగులు కూడా ఉన్నారు.
ఒక్క నాగ్‌పూర్ నగరంలోనే 4,446 మరణాలు నమోదయ్యాయి.
మే నెల మొత్తంలో నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 6892 మరణాలు సంభవించినట్లు మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ డిపార్ట్‌మెంట్ హెడ్ సంజయ్ మహాజన్ చెప్పారు.

నాగ్‌పూర్, మహారాష్ట్ర
నాగ్‌పూర్, మహారాష్ట్ర
అదే మే 2020 లో అక్కడ 1624 మరణాలు మాత్రమే సంభవించాయి. అంతకు ముందు సంవత్సరం 1900 మంది చనిపోయారు.
‘‘కోవిడ్ సెకండ్ వేవ్‌లో హాస్పిటల్స్ అన్నీ కిక్కిరిసి పోయాయి. కోవిడ్ అనంతర సమస్యలకు చికిత్స అందక చాలామంది మరణించారు.’’ అని విదర్భ హాస్పిటల్స్ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ అనూప్ మరార్ అన్నారు.

నాగ్‌పూర్, మహారాష్ట్ర
నాగ్‌పూర్, మహారాష్ట్ర
మే మొదటి రెండు వారాలలో పంజాబ్‌లోని మన్సా జిల్లాలో 49మంది కోవిడ్‌తో మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి.
జిల్లాలో 240కి పైగా గ్రామాలకు 250 శ్మశానాలలో 300కి పైగా చిన్నా పెద్దా దహన వాటికలు ఉన్నాయి.
మూడు పట్టణ, ఒక గ్రామీణ శ్మశాన వాటికల నుంచి రికార్డులు సేకరించగా, కోవిడ్, నాన్ కోవిడ్ కలిపి 162 మంది చనిపోయినట్లు తేలింది
గ్రామీణ ప్రాంతాల నుంచి డేటా సేకరించడం చాలా కష్టమైంది
గ్రామీణ ప్రాంతాలలో సవాళ్లు
ఇండియాలో కోవిడ్ మొదటి వేవ్ పట్టణ ప్రాంతాలను కుదిపేసింది. కానీ, సెకండ్ వేవ్ గ్రామీణ ప్రాంతాలపై విరుచుకుపడింది
‘‘ మొదట నా భార్య చనిపోయింది. ఆ తర్వాత రెండు గంటలకే నా కొడుకు కూడా చనిపోయాడు’’ అని బిహార్‌కు చెందిన శివకాంత్ ఝా బీబీసీతో అన్నారు. శివకాంత్ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు కోవిడ్‌కు బలయ్యారు. ముగ్గురికీ కోవిడ్ పాజిటివ్ రిపోర్టులున్నాయి.

శివకాంత్ ఝా
శివకాంత్ ఝా
‘‘నా భార్యకు అంత్యక్రియలు చేయడానికి శ్మశానంలో చోటు కూడా దొరకలేదు. కొందరు అధికారులు, స్థానికులు అంత్యక్రియలకు సాయం చేశారు’’ అన్నారు శివకాంత్ ఝా.
రాష్ట్రాలలో ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. డబ్బున్న వారు పట్టణాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. మిగిలిన వాళ్లు ఇంటి దగ్గరే ఉండి వైరస్ సమస్యను తగ్గించుకునే ప్రయత్నం చేశారు
రాజస్థాన్‌లోని దంతారు జిల్లాకు చెందిన లక్ష్మీచంద్ జేతుకు తన భార్య కోవిడ్ వల్ల చనిపోయిందా లేక మరో కారణంతో చనిపోయిందా అన్న విషయం తెలియదు.
తమ ఊళ్లో చాలామంది పరిస్థితి ఇదేనని, టెస్టులు చేయకపోవడం వల్ల చాలామందికి కోవిడ్ సోకింది లేనిది తెలియదని జేతు బీబీసీతో చెప్పారు
శివకాంత్ ఝా
శివకాంత్ ఝా
అదే గ్రామానికి చెందిన సుఖ్‌దేవ్ సింగ్ కూతురు కూడా చనిపోయారు. ఆమెకు కోవిడ్ సోకి ఉంటుందని సుఖ్‌దేవ్ సింగ్ అనుమానించారు.
‘‘చనిపోవడానికి ముందైనా ఆసుపత్రికి వెళ్లే అవకాశం పట్టణ ప్రాంతాల వారితో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల వారికి చాలా తక్కువ’’ అని మిడిల్‌సెక్స్ యూనివర్సిటీ గణాంక నిపుణుడు మురాద్ బనాజి అన్నారు. ఆరంభం నుంచి ఆయన ఇండియాలో కోవిడ్ వైరస్ గణాంకాలను పరిశీలిస్తున్నారు.
‘‘ ఇదేమీ కొత్త విషయం కాదు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాలు చాలా తక్కువ’’ అన్నారాయన.
తుమ్ములు, దగ్గు విషయంలో ఏది కోవిడ్ లక్షణం అన్నది గుర్తించడంలో చాలామంది అయోమయానికి గురయ్యారు. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం వచ్చేటప్పటికి మెరుగైన సదుపాయాలు అందుబాటులో లేవు
చాలామంది కోవిడ్ లక్షణాలను లక్ష్యపెట్టకపోవడం కూడా సమస్య తీవ్రతకు కారణమైంది. డేటా సేకరణకు అది కూడా ఒక ఇబ్బందిగా మారింది.
‘‘ఐసోలేషన్ నిబంధనలు, భౌతికదూరం, ప్రభుత్వాల ఆంక్షలు తదితర కారణాలతో చాలామంది తమకు సమస్య ఉన్నట్లు చెప్పుకోవడానికి ఇష్ట పడలేదు’’ అని ఉత్తర్‌ప్రదేశ్ బిజ్నోర్ జిల్లాకు చెందిన ఓ గ్రామస్తుడు అన్నారు.
‘‘కోవిడ్ లక్షణాలు కనిపించాయంటే మీ పొరుగు వాళ్లు మిమ్మల్ని నేరస్తుడిగా చూడటం మొదలు పెడతారు’’ అని మరో గ్రామస్తుడు వ్యాఖ్యానించారు.
‘‘కోవిడ్ మరణాలను తక్కువగా చేసి చూపడం ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాకపోతే, దక్షిణాసియా దేశాలలో కాస్త ఎక్కువ’’ అన్నారు మురాద్ బనాజీ
‘‘కొన్ని సమస్యలు ఉన్నమాట నిజం. కానీ, ప్రభుత్వాలు తలుచుకుంటే వాటిని సరి చేసుకోవచ్చు’’ అన్నారు బనాజీ.
“ఏదో ఒక మార్గం చూడాల్సిందిగా ప్రభుత్వాలను మనం డిమాండ్ చేయవచ్చు’’ అన్నారు బనాజీ.
మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలు కోవిడ్ మరణాల గణాంకాలను సమీక్షిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ బాటలో నడవచ్చు.
దేశవ్యాప్తంగా ఈ అండర్ రిపోర్టింగ్ కారణంగా మరణాల నమోదు అయిదు రెట్లు తక్కువ ఉండవచ్చు అని మురాద్ బనాజీ అభిప్రాయపడ్డారు
‘‘ వాస్తవ మరణాలకు, నమోదు అయిన మరణాలకు మధ్య వ్యత్యాసం భారీగా ఉండవచ్చు. అయితే, దీనిని సరి చేయడానికి పెద్ద ఎత్తున విచారణ అవసరం’’ అన్నారు బనాజీ.
‘‘అధికంగా నమోదైన మరణాలన్నీ కోవిడ్ మరణాలేనని చెప్పలేం. కానీ, ఎక్కువ మరణాలు అవే ఉంటాయి’’ అన్నారాయన.
ఒక అంచనా నిజమైతే, భారత్‌లో కోవిడ్ మృతుల సంఖ్య 20 లక్షలు ఉండవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యధిక మరణాలు నమోదైన ఏడు దేశాలు అంటే అమెరికా, బ్రెజిల్, మెక్సికో, పెరు, రష్యా, యూకే, ఇటలీలలో సంభవించిన మరణాల కన్నా ఎక్కువ.
దిల్లీ నుంచి నితిన్ శ్రీవాస్తవ, మేధావి అరోరా, లఖ్‌నవూ నుంచి సమీరాత్మజ్ మిశ్రా, హైదరాబాద్ నుంచి బళ్ల సతీశ్ ,దర్భంగా నుంచి నీరజ్ సహాయ్, జంషెడ్‌పూర్, జాన్‌పూర్‌ల నుంచి మహ్మద్ సర్తాజ్ ఆలం, సికార్ నుంచి మొహర్ సింగ్ మీనా, పట్నా నుంచి సీతు తివారి, రాయ్‌పూర్ నుంచి అలోక్ పుతుల్, ప్రయాగ్‌రాజ్ నుంచి ప్రభాత్ కుమార్ వర్మ, షిమ్లా నుంచి పంకజ్ శర్మ/రాజేశ్ కుమార్ శర్మ, మన్సా నుంచి సురీందర్ మాన్, నాగ్‌పూర్ నుంచి ప్రవీణ్
ఎడిటోరియల్ ప్రొడక్షన్- వినీత్ ఖరే, సుహైల్ హలీమ్
షార్ట్ హ్యాండ్ ప్రొడక్షన్ - షాదాబ్ నజ్మీ
చిత్రాలు: గోపాల్ శూన్య ఇమేజ్ కాపీరైట్స్: గెట్టీ ఇమేజెస్
పరిశోధన విధానం
దేశంలోని వివిధ నగరాల నుంచి 12 మంది రిపోర్టర్లను ఆసుపత్రులు, శ్మశాన వాటికలు సందర్శనతోపాటు హెల్త్ వర్కర్‌లు, మే 1 నుంచి మే 15 తేదీల మధ్య కాలంలో మరణించిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సిందిగా బీబీసీ రిపోర్టర్లకు సూచించాం. దేశం మొత్తానికి ప్రతిబింబించేలా నగరాలు, పట్టణాలను ఎంచుకున్నాం. దీని ద్వారా కోవిడ్ మరణాలు తక్కువగా నమోదయ్యాయో తెలిపే ప్రయత్నం చేశాం.
సవాళ్లు
- శ్మశానాలు, దహన వాటికల నుంచి మరణించిన వారి సంఖ్యను తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. కోవిడ్ వచ్చినట్లు అనుమానం ఉన్నవారి మృతదేహాలకు కూడా కోవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారమే అంత్యక్రియలు జరిపారు.
- చాలా శ్మశానాలో అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు రికార్డు చేయడానికి చాలా పరిమిత సంఖ్యలో వనరులు ఉన్నాయి. వివరాలు సేకరించడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.
- గ్రామీణ ప్రాంతాల నుంచి కోవిడ్ సమస్యలతో పట్టణాలకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారికి పట్టణాలలోని శ్మశాన వాటికల్లోనే అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో పట్టణాలలో మృతుల సంఖ్య ఎక్కువగా కనిపించింది.
- ఈ కథనం కోసం మే 1 నుంచి 15 మధ్య మృతుల సంఖ్యను గత సంవత్సరంతో పోల్చడానికి ప్రయత్నించిన బీబీసీకి, ఒక్క పట్నాలో తప్ప ఎక్కడా గత ఏడాది మృతులకు సంబంధించిన డేటా దొరకలేదు
- నిర్ధిష్ట కాలానికి మృతుల సంఖ్యకు సంబంధించిన సమాచారం లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాలలో అదనపు మరణాలపై అంచనాకు రావడం కష్టంగా మారింది. దీంతో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డెత్ రికార్డుల నుంచి బీబీసీ జర్నలిస్టులు, కోవిడ్, నాన్ కోవిడ్ మరణాల వివరాలను యాక్సెస్ చేశారు. కోవిడ్ నాన్ కోవిడ్ కాలాలోని మరణాల మధ్య వ్యత్యాసం అదనపు మరణాల వివరాలను ఇస్తుంది.