You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సిడ్నీ టెస్ట్‌కు రోహిత్ ఎందుకు దూరమయ్యారు, ‘నేను రిటైర్ కాలేదు’ అని ఎందుకు ప్రకటించారు?
బోర్డర్ - గావస్కర్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన గత మూడు టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించిన రోహిత్ శర్మ, ఐదో టెస్టుకు దూరంగా ఉండటంపై స్పందించారు.
ఐదో టెస్ట్ లంచ్ సమయంలో మ్యాచ్ ప్రసారం చేస్తున్న చానల్‌తో మాట్లాడిన రోహిత్ శర్మ తన రిటైర్‌మెంట్ గురించిన ఊహాగానాలను తోసిపుచ్చాడు. తాను రిటైర్ కాలేదని చెప్పారు.
ఆస్ట్రేలియాతో సిరిస్‌లో భాగంగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉండటంపై స్పందిస్తూ, తనకు విశ్రాంతి ఇవ్వడం లేదా తొలగించడం లాంటివేమీ లేవని, సెలక్టర్లు, కోచ్‌తో మాట్లాడిన తర్వాత తానే మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రోహిత్ శర్మ చెప్పారు.
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌కి రోహిత్ శర్మ స్థానంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు.
రోహిత్ శర్మ ఏం చెప్పారు?
"నేను రిటైర్మెంట్ తీసుకోలేదు. ఈ పరీక్షకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది కష్టమైనప్పటికీ తెలివైన నిర్ణయం" అని రోహిత్ శర్మ చెప్పారు.
"సిడ్నీ చేరుకున్న వెంటనే మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మనం ఏం చేయాలో ఇతరులు నిర్ణయించలేరు" అని అన్నారు.
"నేను పరుగులు చేయడం లేదంటే దానర్థం రాబోయే రోజుల్లో కూడా నేను పరుగులు చేయలేను అని చెప్పడానికి ఇదొక్కటే ఆధారం కాదు. బుమ్రా కెప్టెన్సీ నాకు బాగా నచ్చింది. నేను ఎక్కడికీ వెళ్లను. ఫామ్‌లో లేనందు వల్లే ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. క్రికెట్‌లో మనం చాలా చూశాం. అక్కడ ఒక నిముషంలో జీవితం మారిపోతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మనం వాస్తవికంగా ఉండాలి" అని రోహిత్ చెప్పారు.
"అంత దూరం నుంచి బయట కూర్చోవడానికి రాలేదు. మ్యాచ్ గెలిచేందుకు, ఇండియాను గెలిపించేందుకు ఇక్కడకు వచ్చాను. ఇదే నా లక్ష్యం. జట్టుకేం కావాలో కొన్ని సార్లు మీరు అర్థం చేసుకోవాలి. జట్టు కోసం కాకుండా కేవలం మీ కోసం మీరు ఆడితే ఉపయోగం ఏముంటుంది?" అని రోహిత్ శర్మ ప్రశ్నించారు.
నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత భారత జట్టు గురించి మీడియాలో కొత్త కొత్త వివాదాలకు సంబంధించిన కథనాలు వచ్చాయి. ఇందులో ఎక్కువగా రోహిత్ శర్మ గురించే ఉన్నాయి. ఓటమికి ఆయన బాధ్యత తీసుకోవాలని, అతడినే బాధ్యుడిని చేస్తారని ఆ కథనాల్లో చర్చ జరిగింది.
సిడ్నీలో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మకు బదులుగా కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరు కావడంతో రోహిత్ శర్మ మీద వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది.
"రోహిత్ బాగానే ఉన్నాడు. ప్రధాన కోచ్ ఇక్కడే ఉన్నాడు. అది చాలు. టాస్‌కు ముందు పిచ్ చూసిన తర్వాత కెప్టెన్ ఆడతాడా లేదా అని నిర్ణయిస్తాం" అని గౌతం గంభీర్ చెప్పారు.
రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులో ఆడేందుకు జట్టు యాజమాన్యం అంగీకరించలేదని 'ది టైమ్స్' పత్రిక కథనం ప్రచురించిన తర్వాత అతని రిటైర్‌మెంట్ గురించిన ఊహాగానాలు మరింత పెరిగాయి.
నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు భారత జట్టు సభ్యుల్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానించారని ది టైమ్స్ రాసిన కథనంలో పేర్కొంది. ఆ వేడుకల్లో రోహిత్ శర్మ మాట్లాడాల్సి ఉన్నప్పటికీ చివరి నిముషంలో తప్పుకున్నారు.
రోహిత్‌కు బదులుగా జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సంఘటన తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితులు అంత బాగా లేవనే సూచనలు కనిపించడం మొదలైంది. ఆస్ట్రేలియాలో జట్టు ప్రదర్శన పేలవంగా ఉండటంపై కెప్టెన్, ప్రధాన కోచ్ మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని ది టైమ్స్ కథనం తెలిపింది.
మాజీ క్రికెటర్ల ప్రకటనలు ఊహాగానాలకు బలమిచ్చాయా?
రోహిత్ శర్మను సిడ్నీ మ్యాచ్ నుంచి తొలగించడంపై సీనియర్ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించారు.
"భారత క్రికెట్ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించకపోతే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో మెల్‌బోర్న్ మ్యాచ్ చివరిది అవుతుందని అనిపిస్తోంది" అని గావస్కర్ వ్యాఖ్యానించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
"ఇంగ్లండ్ సిరీస్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమవుతుంది. ఆటగాళ్లు 2027 వరకు అందుబాటులో ఉండాలని సెలక్టర్లు కోరుకుంటారు. భారత్ ఫైనల్ చేరుతుందా లేదా అనేది వేరే విషయం. అయితే సెలక్షన్ కమిటీ ఆలోచనలో మార్పు ఉండదు. టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ ఆడటం మనం గతంలో చూశాం" అని సన్నీ అన్నారు.
గావస్కర్ వ్యాఖ్యల పట్ల తాను ఏకీభవిస్తున్నట్లు భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పారు.
ఈ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పవచ్చని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.
"అసలు విషయం ఏమిటంటే, సిరీస్‌లోని చివరి నిర్ణయాత్మక టెస్టుకు దూరంగా ఉండాలని ఏ జట్టు కెప్టెన్ నిర్ణయించుకోడు. కచ్చితంగా అతన్ని పక్కన పెట్టారు. ఆయన్ను తొలగించారని నేరుగా ఎందుకు చెప్పండంలేదో తెలియదు" అని ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ చెప్పారు.
"ఒక మ్యాచ్‌కు పక్కన పెట్టారంటే దానర్థం అతడిని పూర్తిగా జట్టు నుంచి తొలగించారని కాదు. ఫామ్ సరిగ్గా లేకపోవడంతో అతను ఈ మ్యాచ్ బాగా ఆడలేడరని భావించిఉంటారు. ఫామ్‌లో లేకపోవడం నేరమేమీ కాదు" అని టేలర్ చెప్పారు.
రోహిత్ శర్మపై ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయి?
రోహిత్ ఫామ్‌ను కోసం శ్రమిస్తున్నారు. తొమ్మిది టెస్టు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ సగటు 10.93 . ఈ సిరీస్‌లోని ఐదు ఇన్నింగ్స్‌ల్లో అతని సగటు 6.2 మాత్రమే.
రోహిత్ ఇంకా ఎక్కువ ఆడాలని కోరుకుంటున్నాడని, అతనిలో చాలా క్రికెట్ మిగిలి ఉందని అతని కోచ్ దినేష్ లాడ్ చెప్పారు. అతను ఎప్పుడైనా ఫామ్‌లోకి రాగల బ్యాట్స్‌మెన్ అని చెప్పారు.
రోహిత్ ఫుట్‌వర్క్‌లో కొంత సమస్య ఉందని అతనే అంగీకరిస్తున్నాడు. అయినప్పటికీ ఇది తీవ్రమైన, శాశ్వతమైన సమస్య కాదు. కానీ గంభీర్ మాటలు విన్న తర్వాత రోహిత్‌కు పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు.
బ్యాటింగ్ ప్రారంభించగానే బౌలర్‌పై ఆధిపత్యం ప్రదర్శించాలనే ప్రయత్నంలో భాగంగా రోహిత్ శర్మ తన వికెట్‌ను కోల్పోవడం రెండేళ్లుగా చూస్తున్నాం. ఆఫ్ స్టంప్ మీద ఎత్తుగా వెళ్లే బంతుల్ని ఆడే ప్రయత్నంలో స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడం లేదా క్లీన్ బౌల్డ్ అవుతున్నాడు.
భారత క్రికెట్ జట్టులో ఏదైనా మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెరుగుతుందని అనేక మంది భావిస్తుంటారు.
మెల్‌బోర్న్ టెస్టులో వ్యాఖ్యాతగా ఉన్న గావస్కర్ టీమ్ ఇండియా ఘోర పరాజయం తర్వాత, "రోహిత్ శర్మ తెలివైన ఆటగాడు. ఆయన భారత జట్టుకు భారం కావాలని ఎన్నడూ కోరుకోడు. అతను అంకితభావం ఉన్న క్రికెటర్ అని, గౌరవప్రదమైన ఆటగాడు" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)