You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆడ ఈగలకు మద్యం తాగిన మగ ఈగలంటే ఇష్టమా, కొత్త పరిశోధన ఏం చెబుతోంది?
- రచయిత, టిమ్ డాడ్
- హోదా, క్లైమెట్ అండ్ సైన్స్ రిపోర్టర్
ఆల్కహాల్ సేవించే మగ ఈగలు (మేల్ ఫ్రూట్ ఫ్లైస్) ఆడ ఈగలను మరింతగా ఆకర్షిస్తాయని తాజా అధ్యయనం సూచిస్తోంది.
మగ ఈగల ఆహారంలో ఆల్కహాల్ జోడించిన శాస్త్రవేత్తలు, దీనివల్ల వాటిలో ఆడ ఈగలను ఆకర్షించే రసాయనాల విడుదల పెరిగిందని, జతకట్టే విజయశాతం కూడా ఎక్కువ ఉందని గుర్తించారు.
మేల్ ఫ్రూట్ ఫ్లైస్‌గా పిలిచే ఈ ఈగల శాస్త్రీయ నామం డ్రోెసోఫిలా మెలనోగాస్టర్.
ఈ రకం ఈగలు సహజంగా చెత్తబుట్టల వద్ద తరుచుగా కనిపిస్తుంటాయి. అవి కుళ్లిపోయిన పండ్లను తింటాయి. కుళ్లిన పండ్లు ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేస్తాయి.
ఈ ఆల్కహాల్‌కి ఈగలు ఎందుకు ఆకర్షితమవుతున్నాయి, ఈగలపై ఆల్కహాల్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
మనుషుల్లానే ప్రవర్తిస్తాయా?
ఈగల ఆకర్షణపై జరిగిన గత పరిశోధన, వివిధ సిద్ధాంతాలను పరిశీలించింది.
ఈగలు ఆనందోత్సాహ స్థితిని కోరుకుంటాయని, లేదా ఆడ ఈగలు తిరస్కరించిన మగ ఈగలు దానికి ప్రత్యామ్నాయంగా ఆల్కహాల్‌ను భావించడం వీటిలో ఒకటి.
జర్మనీలో ప్రధాన కార్యాలయం ఉన్న మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఎవల్యూషనరీ న్యూరోథియాలజీ విభాగాధిపతి, అధ్యయన రచయిత బిల్ హాన్సెన్ మాట్లాడుతూ.. గతంలో ఈగలకు మనుషుల ప్రవర్తనను ఆపాదించారని, కానీ ఈ తాజా అధ్యయనం మద్యం తాగడం వల్ల ఈగలకు పునరుత్పత్తి ప్రయోజనం లభిస్తున్నట్టు సూచిస్తోందని వివరించారు.
"ఈగలు నిరాశకు గురై మద్యం తాగుతున్నాయని మేం అనుకోం" అని ఆయన చెప్పారు.
కుళ్లిన పండ్లలోని కార్బోహైడ్రేట్లు, ఈస్టుల కోసం ఈగ సహజంగానే ఆకర్షితమవుతుంది. దీంతోపాటు అది ఉత్పత్తి చేసే ఆల్కహాల్‌కు కూడా. ఈ ఆకర్షణను వేరుచేసి చూడలేమని ఆయన తెలిపారు.
ఆల్కహాల్, ముఖ్యంగా మిథనాల్ అనేది ఫెరోమోన్లు అని పిలిచే రసాయన లైంగిక సంకేతాల విడుదలను పెంచింది, ఇది ఆడ ఈగలకు మరింత ఆకర్షణీయంగా మారిందని అధ్యయనం తెలిపింది.
ఫెరోమోన్స్ అంటే, ఒక జాతికి చెందిన జీవి గాలిలోకి విడుదల చేసే రసాయన సంకేతాలు. ఇది అదే జాతికి చెందిన మరొక జీవి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది.
అందుకే మగ ఈగలు, ముఖ్యంగా ఎప్పుడూ జతకట్టని ఈగలు, మద్యం పట్ల అంతగా ఆకర్షితులవుతాయని ఆయన చెప్పారు.
ఈగ మెదడులో ఏం జరుగుతుంది?
మద్యం వాసనకు ఈగల ప్రతిస్పందన వాటి మెదడులోని మూడు వేర్వేరు న్యూరల్ సర్క్యూట్‌ల ద్వారా నియంత్రింతమవుతుందని కొత్త అధ్యయనం తెలుపుతోంది.
వీటిలో రెండు సర్య్కూట్లు మగ ఈగలు కొద్దిమొత్తంలో ఆల్కహాల్‌కు ఆకర్షితమయ్యేలా చేస్తాయి, మూడోది ఎక్కువ తాగకుండా నిరోధించే స్వభావం కలిగివుంది.
ఆల్కహాల్‌తో దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి, ఈగ మెదడు దాని ప్రయోజనాలను, ముప్పును జాగ్రత్తగా తూకంగా వేయాలి. ఇది ఆకర్షణ సంకేతాలను అనాసక్తి సంకేతాలతో సమన్వయం చేస్తుంది.
"దీనర్థం, ఈగలు నియంత్రణ యంత్రాంగాన్ని కలిగివున్నాయి. ఇది ఆల్కహాల్ మత్తును ముప్పు కలగకుండా, దాని ద్వారా అన్ని ప్రయోజనాలను పొందడానికి అనుమతిస్తుంది" అని నెబ్రాస్కా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రధాన రచయిత ఇయాన్ కీసీ చెప్పారు.
ఈ పరిశోధనా పత్రం సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)