You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్ పార్లమెంటులో ఎలుకల బడ్జెట్, రికార్డులు కొరికేస్తుండడంతో ఎలుకల నివారణకు నిధుల కేటాయింపు
- రచయిత, షాజాద్ మాలిక్, ఫ్లోరా డ్రూరీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
పాకిస్తాన్ పార్లమెంటులో కొత్త సమస్య వచ్చింది, కానీ అది రాజకీయాలకు సంబంధించింది కాదు.
ఎలుకలు పార్లమెంటును రాత్రిపూట "మారథాన్" ట్రాక్‌లుగా మారుస్తున్నాయి.
2008 నాటి సమావేశాల రికార్డులను అక్కడి 'కమిటీ' కోరడంతో అధికారులు వాటిని వెతికారు. అప్పుడే ఎలుకల సమస్య ఏ స్థాయిలో ఉందో బయటపడింది.
2008 నాటి ఆ రికార్డులలో చాలావరకు ఎలుకలు కొరికేశాయి.
‘ఈ అంతస్తులో చాలా పెద్ద ఎలుకలు ఉన్నాయి. పిల్లులు కూడా వాటికి భయపడవచ్చు’ అని జాతీయ అసెంబ్లీ ప్రతినిధి జాఫర్ సుల్తాన్ ‘బీబీసీ’తో చెప్పారు.
పార్లమెంట్‌లో ఎలుకల బెడద తీవ్రమవడంతో వాటి నివారణకు 12 లక్షల పాకిస్తానీ రూపాయల (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.3.6 లక్షలు)ను కేటాయించారు.
‘మారథాన్ పరుగు’
రాజకీయ పార్టీల సమావేశాలు జరిగే స్టాండింగ్ కమిటీల గదులతో పాటు ప్రతిపక్ష నాయకుడి కార్యాలయం ఉన్న మొదటి అంతస్తులోనూ చాలా ఎలుకలు కనిపిస్తున్నాయి. ఈ అంతస్తులో ఫుడ్ హాల్ కూడా ఉంది.
భవనం నుంచి అందరూ వెళ్లిపోయేంత వరకు ఎలుకలు పగటి పూట అంతా దాగి ఉంటాయి.
"సాయంత్రం ఇక్కడ సాధారణంగా ఎవరూ లేనప్పుడు, ఎలుకలు మారథాన్ పోటీ మాదిరి పరిగెత్తుతాయి" అని జాతీయ అసెంబ్లీలో పనిచేసే అధికారి ఒకరు చెప్పారు.
"అక్కడ నిత్యం పని చేసే సిబ్బంది అలవాటుపడ్డారు, కానీ కొత్తవారు భయపడుతున్నారు" అని తెలిపారు.
ఎలుకల బెడదను తొలగించడానికి పెస్ట్ కంట్రోల్ కంపెనీల కోసం పాకిస్తాన్ వార్తాపత్రికలలో ప్రకటనలు కూడా ఇచ్చారు, అయితే ఇప్పటివరకు కేవలం రెండు కంపెనీలు మాత్రమే ఆసక్తిని కనబరిచాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)