You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విద్వేషపూరిత ప్రసంగాలపై కర్ణాటక తెస్తున్న చట్టంలో ఏముంది, బీజేపీ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టడానికి ఓ చట్టం సాయపడనుందా? కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా అడుగులేస్తోంది.
వ్యక్తులను, సమూహాలను లక్ష్యంగా చేసుకుని లేదా మత ఘర్షణలను ప్రేరేపించే విద్వేష ప్రసంగాలను, విద్వేష నేరాలను అరికట్టే లక్ష్యంతో గత నెలలో కర్ణాటక శాసన సభ్యులు ఒక బిల్లును ఆమోదించారు.
విద్వేషపూరిత ప్రసంగాలు భారత్‌లో కొత్తేమీ కాదు. కానీ, సోషల్ మీడియా విస్తరించడంతో ఇటీవల ఇవి మరింత తీవ్రతరమయ్యాయి.
టెలివిజన్ ఛానళ్లు కూడా ద్వేషపూరిత వ్యాఖ్యలను, రియాక్షన్లను మరింత ఎక్కువ చేసి చూపిస్తున్నాయి.
మైనార్టీలకు వ్యతిరేకంగా ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన విద్వేషపూరిత ప్రసంగాలు 2024లో 74 శాతం పెరిగాయని, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇవి తీవ్ర స్థాయికి చేరుకున్నాయని గత ఏడాది విడుదలైన ఓ నివేదిక తెలిపింది.
అందుకే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఈ చట్టం అవసరమని చెబుతోంది. ద్వేషపూరిత ప్రసంగం ప్రజల సాధారణ జీవితంలో హింసకు దారితీస్తుందని పేర్కొంటోంది.
కానీ, దీనివల్ల ప్రజల స్వేచ్ఛకు, వాక్ స్వాతంత్య్రానికి భంగం వాటిల్లనుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.
కర్ణాటక తీసుకొచ్చిన విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాలు (నివారణ) బిల్లు, 2025 చట్టంగా మారేందుకు ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్ సంతకం కావాల్సి ఉంది.
విద్వేషపూరిత ప్రసంగాలపై ఎలా దర్యాప్తు చేయాలి, ఎలా శిక్షలు విధించాలో ఈ బిల్లులో పేర్కొన్నారు.
బహిరంగంగా మాటల రూపంలోనో, ముద్రితరూపంలోనో, టీవీ, సామాజిక మాధ్యమాలలో చేసే, ప్రచురించే లేదా వ్యాప్తిచేసే ఏ విధమైన ద్వేషపూరిత వ్యక్తీకరణనైనా ద్వేషపూరిత ప్రసంగంగా ఈ బిల్లు నిర్వచిస్తోంది. అలాగే అలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలను ఇతరులకు చేరేలా చెప్పడం, లేదా ప్రచారం చేయడాన్ని ద్వేషపూరిత నేరంగా నిర్వచిస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలు తప్పనిసరిగా హింసకు దారితీయాలా, లేక హింస జరగకపోయినా నేరంగా పరిగణించాలా అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా పేర్కొనలేదు.
విద్వేషపూరిత ప్రసంగం కిందకు వచ్చే కంటెంట్‌ను తీసివేయాలని సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించే అధికారం ఈ బిల్లు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇలా చేయగలదు.
విద్వేషపూరిత ప్రసంగానికి వ్యతిరేకంగా భారత్‌లో ప్రత్యేకంగా ఎలాంటి చట్టం లేదు.
అయితే, వాక్ స్వాతంత్య్రానికి కూడా మినహాయింపులు విధిస్తూ కొన్ని నిర్దిష్ట రూపాల్లో చేసే ప్రసంగాలను, రాతలను, చర్యలను ప్రస్తుతం అమల్లో ఉన్న పలు చట్టాల్లోని నిబంధనలు అడ్డుకుంటున్నాయి.
వీటిల్లో ముఖ్యంగా మతం ఆధారంగా వేర్వేరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే చర్యలను, అలాగే ఏదైనా మతాన్ని లేదా మతవిశ్వాసాలను అవమానించడం ద్వారా ఒక వర్గానికి చెందినవారి భావాలను దురుద్దేశంతో బాధపెట్టే చర్యలను నేరంగా పరిగణించడం కూడా ఉంది.
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, కర్ణాటకలో ప్రతిపక్షానికే పరిమితమైన బీజేపీ.. విద్వేషపూరిత ప్రసంగానికి ప్రత్యేక చట్టం అవసరం లేదంటోంది.
ప్రస్తుత చట్టాల్లో ఉన్న లొసుగులను పూడ్చే విధంగా అసెంబ్లీ ఈ బిల్లును తీసుకొచ్చిందని, విద్వేషపూరిత ప్రసంగం, విద్వేషపూరిత నేరాలను నాన్-బెయిలబుల్‌గా మార్చి, వీటిపై చర్య తీసుకునేందుకు ఇది రాష్ట్రానికి విస్తృతమైన అధికారాన్ని ఇస్తుందని కర్ణాటక హోమ్ మంత్రి జీ. పరమేశ్వర చెప్పారు.
అలాగే, జైలు శిక్షలను కూడా విధించనున్నారు. ఒకవేళ ఇది చట్టంగా మారితే.. విద్వేషపూరిత నేరాల్లో ఎవరైనా దోషిగా తేలితే.. ఏడాది నుంచి ఏడేళ్ల పాటు నాన్-బెయిలబుల్ జైలు శిక్షను ఎదుర్కోనున్నారు.
అలాగే, రూ.50 వేల జరిమానా కూడా విధిస్తారు . పదేపదే ఈ నేరానికి పాల్పడే వారికి కఠినమైన జరిమానాలు ఉండనున్నాయి.
ఇదేరకమైన బిల్లును తాము కూడా ప్రవేశపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రకటించారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది.
కేంద్రంలో, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విమర్శకుల, నిరసనకారుల అభిప్రాయాలను తీవ్రంగా నొక్కిపడుతోందని ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ సైతం ప్రస్తుతం కర్ణాటక తీసుకొచ్చిన ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోంది.
వాక్ స్వాతంత్య్రాన్ని ఇది అడ్డుకుంటుందని చెబుతోంది.
''రాజ్యాంగం ప్రజలకు కల్పించిన వాక్ స్వాతంత్య్రపు హక్కును ప్రభుత్వం ఈ చట్టం ద్వారా హరించడమే కాకుండా విపక్ష నేతలను, మీడియాను ఊచల వెనుక నిలబెట్టాలనుకుంటోంది'' అని ప్రతిపక్ష నేత ఆర్ అశోక అసెంబ్లీలో విమర్శించారు.
న్యాయ నిపుణులు, వాక్ స్వాతంత్య్ర కార్యకర్తలు కూడా తమ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ చట్టాన్ని రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు న్యాయవాది సంజయ్ హెగ్డే హెచ్చరించారు.
''ఒక పార్టీ విద్వేషపూరిత ప్రసంగం మరో వ్యక్తికి రాజకీయ ప్రచారంగా అనిపించవచ్చు. లేదా, దీనికి భిన్నంగా కూడా అనిపించవచ్చు. కేవలం మీకు నచ్చలేదని ఆ ప్రసంగం.. విద్వేషపూరిత ప్రసంగం కాకూడదు'' అన్నారు.
ఈ చట్టం వెనుక ఆంతర్యం మంచిదే కావచ్చు. కానీ, దుర్వినియోగం అయ్యేందుకు కూడా అపారమైన అవకాశం ఉందని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ కోఫౌండర్, అడ్వకేట్ అశోక్ ప్రసన్న కుమార్ చెప్పారు.
విద్వేషపూరిత ప్రసంగాన్ని, నేరాన్ని ఈ చట్టం ఎలా నిర్వచించిందనే దానిపై జరుగుతోన్న చర్చ కూడా మరింత ప్రాథమిక అంశాన్ని లేవనెత్తింది.
''విద్వేషపూరిత ప్రసంగం అనే పదానికి ఈ చట్టంలో నిర్వచనం చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. శత్రుత్వాన్ని రెచ్చగొట్టే, మత మనోభావనలను దెబ్బతీసే ప్రసంగాలకు ప్రస్తుతమున్న నిబంధనలను మించి.. కులం, మతం, ఇతర గుర్తింపులను లక్ష్యంగా చేసుకుని చేసే ప్రసంగాలను కూడా ఈ చట్టంలో చేర్చింది'' అని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సిద్ధార్థ నరైన్ అన్నారు.
అయితే, విద్వేషపూరిత ప్రసంగానికి, విద్వేషపూరిత నేరానికి మధ్యనున్న గీతను ఈ బిల్లు తుడిచివేసిందని చెప్పారు.
'' విద్వేషపూరిత ప్రసంగంపై చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఇది హింసకు దారితీస్తుంది కాబట్టి. కానీ, ప్రస్తుత పదాలు హింస జరగనప్పటికీ అభిప్రాయాలను పంచుకునే ప్రసంగాలనూ (కమ్యూనికేషన్‌ను) విద్వేషపూరిత నేరంగా పరిగణిస్తున్నాయి'' అన్నారు.
శిక్షలు పడతాయనే భయంతో ప్రజలు సెల్ఫ్ సెన్సార్ చేసుకునే (తమకు తాము గొంతు నొక్కేసుకునే) స్థితిని అరికట్టేందుకు 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇక్కడ నిపుణులు ప్రస్తావిస్తున్నారు.
ప్రసంగాన్ని నేరాలుగా పరిగణించే చట్టాలు కచ్చితమైనవిగా ఉండాలని, అస్పష్టంగా, అతిగా ఉండకూడదని 2015లో సుప్రీంకోర్టు పేర్కొంది.
గవర్నర్ ఈ బిల్లును ఆమోదించకూడదని, బదులుగా దీన్ని రాష్ట్రపతి వద్దకు పరిశీలనకు పంపాలని బీజేపీ నేతలు, కొందరు సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
ఈ బిల్లు విద్వేషపూరిత ప్రసంగానికి బదులు ప్రజలను నియంత్రిస్తుందని చెబుతూ గవర్నర్‌కు లేఖ రాశారు న్యాయవాది, సామాజిక కార్యకర్త గిరీష్ భరద్వాజ్.
సీనియర్ పోలీసులకు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు ఏ ప్రసంగం ఈ చట్టం కిందకు వస్తుందో నిర్ణయించే అధికారం అత్యధికంగా ఉంటుందని ఆయన అంటున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు, 'కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరస్ట్' నెలకొనే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, దీనిపై పేరు చెప్పడానికి ఇష్టపడని కర్ణాటక ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి బీబీసీతో మాట్లాడుతూ.. ''అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ.. చార్జ్‌షీట్లను దాఖలు చేసేందుకు ప్రభుత్వ అనుమతులను తొలగిస్తూ.. ఈ బిల్లు పోలీసులకు మరింత అధికారం కల్పిస్తుంది'' అన్నారు.
'' పోలీసులు నేరుగా కోర్టును సంప్రదించవచ్చు. నిందితుడు తన తప్పుడు చర్యలకు లేదా తప్పులకు పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని ఆ అధికారి తెలిపారు.
అంటే, నిందితుడిని రాజకీయ ప్రమేయంతో సంబంధం లేకుండా విచారించవచ్చని ఆ అధికారి అన్నారు.
''ఒకవేళ పార్టీ కార్యకర్త ఏదైనా విద్వేషపూరిత ప్రసంగం లేదా విద్వేషపూరిత నేరం చేసినట్లయితే.. అధికార పార్టీ విచారణకు ఆదేశించకపోవచ్చు. కానీ, ఈ చట్టం ప్రకారం.. ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకునేందుకు వీలుండదు'' అని అధికారి తెలిపారు.
అయితే, ఈ విషయంలో పోలీసులదే ప్రథమ చర్యగా ఉంటుందని విమర్శకులు అంటున్నారు. ద్వేష ప్రసంగంగా ఏది ఉంటుందో నిర్ణయించే విస్తృతమైన విచక్షణ అధికారం వారికే ఎక్కువగా ఉండే అవకాశముందని చెప్పారు.
''తొలుత చర్యలు తీసుకునేది పోలీసులే. ఆ తర్వాతనే జ్యూడిషియరీ వస్తుంది'' అని కుమార్ చెప్పారు.
కఠినమైన జరిమానాలు, శిక్షలు స్వతంత్రంగా కాకుండా రాజకీయ ప్రోద్భలంతో చర్యలు తీసుకునేలా పోలీసులను ప్రోత్సహించవచ్చని అంటున్నారు.
అందుకే, ఈ బిల్లు చివరికు నిర్దేశిత ప్రయోజనాలను నెరవేరుస్తుందో లేదో తనకు తెలియదన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)