కూకట్‌పల్లి సహస్ర హత్య: 14 ఏళ్ల బాలుడు నిందితుడిగా మారడానికి కారణమేంటి?

    • రచయిత, కమలాదేవి నల్లపనేని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్ కూకట్‌పల్లిలో 10 ఏళ్ల బాలిక సహస్ర‌ను క్రికెట్ బ్యాట్ కోసం 14ఏళ్ల బాలుడు హత్య చేసినట్టు పోలీసులు చెప్పారు.

క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయాలనుకున్న బాలుడిని, ఇంట్లోని బాలిక చూసి అరవడంతో ఆమెను చంపేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

ఐదురోజుల పాటు పలువురిని విచారించిన పోలీసులు, చివరకు బాలుడే నిందితుడని తేల్చారు.

దొంగతనం కోసం బాలుడు ఒక కాగితంపై ఇంగ్లిష్‌లో రాసుకున్న నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాలుడిపై ఓటీటీ, ఇతర క్రైమ్ సీరియల్, సిరీస్, సినిమాల ప్రభావం ఉందంటున్నారు పోలీసులు.

ప్రస్తుతం ఆ బాలుడిని చిల్డ్రన్ ఇన్ కాన్‌ఫ్లిక్ట్ విత్ లా అని వ్యవహరిస్తున్నారు.

ఓ 14 ఏళ్ల బాలుడు చోరీ చేయడానికి నోట్స్ తయారుచేసుకోవడం , అడ్డొచ్చిన బాలికను చంపడం ఏ ధోరణికి ప్రతీకగా నిలుస్తోంది? దీనిని ఎలా చూడాలి? పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఈ విషయంపై విద్యావేత్తలు, సామాజికవేత్తలు, సైకాలజిస్టులతో బీబీసీ మాట్లాడింది.

‘ఇమీడియట్ నీడ్ గ్రాటిఫికేషన్’

కూకట్‌పల్లి బాలిక హత్య కేసును ‘ఇమీడియట్ నీడ్ గ్రాటిఫికేషన్ కేటగిరీ’ కింద చూడాలని ప్రముఖ క్లినికల్, రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ రాధిక ఆచార్య చెప్పారు.

‘‘ కొంతమంది పిల్లల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమకు కావల్సింది పొందితీరాలనే ఉద్దేశం ఉంటుందని, అలాంటి వారు పర్యవసానాలు ఆలోచించర’’ని ఆమె తెలిపారు.

భార్యాభర్తలిద్దరూ పనిచేస్తే తప్ప కుటుంబం గడవని సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో పిల్లలకు సమయం కేటాయించడానికి బదులుగా వస్తువులు కేటాయించడం మొదలు పెట్టే పరిస్థితి నుంచే ఇలాంటివన్నీ మొదలవుతున్నాయని ఆమె విశ్లేషించారు.

''ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే అడగకుండానే అన్నీ కొనిస్తున్నారు. ఇక అడిగితే అసలు కాదనడం లేదు. ఒకవేళ కాదన్నా పిల్లలు ఒప్పుకునే స్థితి ఉండడం లేదు. ఏడ్చో, అలిగో, మరో రూపంలోనో తమకు కావాల్సింది పొందడం పిల్లలకు అలవాటయిపోయింది’’ అంటారు రాధిక.

‘‘పిల్లలకు తగిన సమయం కేటాయించాలేకపోతున్నామన్న భావనలోనో, వారిని బాధపెట్టడం ఎందుకనే ఉద్దేశంతోనో ముందు వద్దన్నా తర్వాత వారికి కావాల్సినవి అందిస్తున్నారు తల్లిదండ్రులు. ఇది పిల్లల్లో తాము కోరినవన్నీ ఎలాగైనా పొందగలం అనే భావన పెంపొందడానికి కారణమవుతుంది’’

కావాల్సినవన్నీదొరకవనీ, కొన్నిచోట్ల సర్దుకుపోవాలని పిల్లలకు తెలియడం లేదు. దీంతో తమకు కావాల్సినదాని కోసం ఎంతవరకైనా వెళ్తున్నారు. కూకట్‌పల్లిలో జరిగిందిదే'' అని ఆమె విశ్లేషించారు.

సినిమాలు, ఓటీటీల్లోని హింస ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా ఉంటోందని ఆమె అన్నారు.

‘18 ఏళ్లలోపు పిల్లలు సెల్ ఫోన్ వాడకూడదు’

సెల్‌ఫోన్ ప్రభావం పిల్లలపై ఏ స్థాయిలో ఉందనేదానికి కూకట్‌పల్లి కేసు ఉదాహరణ అని ప్రముఖ విద్యాసామాజికవేత్త వాసిరెడ్డి అమర్‌నాథ్ అభిప్రాయపడ్డారు. తాను కలిసిన పిల్లల్లో 80శాతం మందిపై సెల్‌ఫోన్, అందులోని కంటెంట్ ప్రభావం అనేక స్థాయిల్లో ఉందని ఆయన తెలిపారు.

''20 ఏళ్లలోపు పిల్లల్లో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటే మెదడులో ముందు భాగం సరిగ్గా అభివృద్ధి చెందదు. దానివల్ల వారిలో రీజనింగ్ స్కిల్స్, భావోద్వేగాలను సమతుల్యం చేసుకునే సామర్థ్యం ఉండదు. ఒక్కసారి దేనికైనా అలవాటు పడితే అదో వ్యసనంగా మారిపోతుంది.’’ అని చెప్పారు.

  • ‘‘సెల్ ఫోన్ రేడియేషన్ పిల్లల్లో కొన్ని మెదడు కణాలను నాశనం చేస్తుంది. దూకుడుతనం, అసహనం, డిప్రెషన్, యాంగ్జైటీ వంటివి పెరుగుతాయి. విపరీతమైన హింసతో కూడుకున్న సినిమాలు, సిరీస్‌లు, ఇతర కార్యక్రమాల ప్రభావం టీనేజర్ల సబ్ కాన్షస్ మైండ్‌లోకి తీవ్రస్థాయిలో వెళ్తుంది. సున్నితత్వం కోల్పోతారు’’ అని అమర్‌నాథ్ చెప్పారు.

‘‘కూకట్‌పల్లి కేసులో కత్తి తీసుకెళ్లడం, నోట్స్ రాసుకోవడం వంటివన్నీ దానికి నిదర్శనమే. ఇదొక్కటే కాదు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. పిల్లలను సెల్‌ఫోన్‌ను పట్టుకోనివ్వకూడదు. 18 ఏళ్లలోపు పిల్లలు మద్యం తాగకూడదని ఎలా చెబుతామో అలాగే. విద్యాసంబంధమైన విషయాలు నేర్చుకోవాలంటే పిల్లలకు ఇంట్లో డెస్క్ టాప్ పెట్టి, చైల్డ్ లాక్ పెట్టడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ ఫోన్, ల్యాప్ ట్యాప్ ఇస్తే వాళ్లు కచ్చితంగా దుర్వినియోగం చేస్తారు''అని చెప్పారు.

పిల్లల మనస్తత్వం ఎలాంటిదో ఎలా గుర్తించాలి?

కొందరు పిల్లల్లో వంశపారంపర్యంగా కొన్ని నేరపూరిత లక్షణాలు వస్తుంటాయని, మరికొందరిపై సామాజిక కారణాల ప్రభావం బలంగా ఉంటుందని ప్రముఖ సైకియాట్రిస్ట్ కర్రి రామారెడ్డి చెప్పారు.

''సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషి మనుసులో ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనే మూడు భాగాలుంటాయి. ఈగో అంటే నేనూ అనుకునే సెల్ఫ్. ఈడ్ అంటే కోరికల పుట్ట. నాకు కావాల్సింది తక్షణమే దొరకాలనే భావన. నేను వెంటనే ఐస్ క్రీమ్ తినాలి. బ్యాట్‌తో ఇప్పుడే ఆడుకోవాలి వంటివన్నీ ఇందులో భాగమే. నాకిది కావాలి..కావాలంతే అన్న భావన ఉంటుంది’’ అని తెలిపారు.

‘‘నైతిక విలువలు సూపర్ ఈగోలో భాగంగా ఉంటాయి. సూపర్ ఈగో ఎక్కువగా ఉన్నవాళ్లు తల్లిదండ్రులు, టీచర్లు చెప్పే విషయాల నుంచి, సమాజం నుంచి మంచి గ్రహిస్తారు. చిన్నప్పుడు ఈద్, సూపర్ ఈగో మధ్య ఘర్షణ ఉంటుంది. సూపర్ ఈగో బాగుంటే నైతిక విలువలు గ్రహిస్తారు. లేదంటే ఈద్ ప్రభావంలో ఉంటారు’’

  • ‘‘పిల్లలు అబద్ధాలాడడం, దొంగతనాలు చేయడం, నిప్పుతో ఆటలాడడం, తోటి పిల్లలను ఏడిపించడం వంటివి చేస్తుంటారు. వీళ్లను చిల్డ్రన్ ఇన్ కాన్‌ఫ్లిక్ట్ విత్ లా అని పిలుస్తుంటారు. పెద్దయ్యాక వీళ్లే సంఘ వ్యతిరేక శక్తులుగా మారతారు. చార్లెస్ శోభరాజ్ వంటివారు ఈ కోవలోకే వస్తారు. ఇలా మారితే ఇక ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. అయ్యోపాపం అన్న ఆలోచన రాదు'' అని ఆయన చెప్పారు.

పిల్లల మనస్తత్వాలను గుర్తించేందుకు ప్రముఖ కెనెడియన్-అమెరికన్ మనస్తత్వవేత్త ఆల్బర్ట్ బందూరా బోబో డాల్ ప్రయోగం మంచి సాధనమని సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు అంటున్నారు.

  • ఆల్బర్ట్ బందూరా చెప్పేదాని ప్రకారం బోబో డాల్ ఇస్తే కొందరు పిల్లలు దాన్ని కొడతారు. వారు దూకుడు మనస్తత్వంతో ఉంటారు. కొందరు డాల్‌ను లాలిస్తారు. అలాంటి పిల్లలు మెతక వైఖరితో ఉంటారు. వాళ్లకు రోల్ మోడల్స్ కూడా ఈ తరహాలోనే ఉంటారు. డాల్‌ను కొట్టేవాళ్లు సోషల్ మీడియాలో, ఇతర కార్యక్రమాల్లో హింసకు ఆకర్షితులవుతారని, అలాంటి వారినే ఇమిటేట్ చేస్తారని సైకాలజిస్టులంటున్నారు.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

పిల్లలకు లైఫ్ స్కిల్స్ నేర్పించడం ద్వారా వారిని సినిమాలు, సెల్‌ఫోన్ ప్రభావం నుంచి దూరం చేయవచ్చంటారు రాధికా ఆచార్య.

పిల్లల వ్యక్తిత్వం రూపొందడంలో ఇల్లు, తల్లిదండ్రులు, స్కూల్, ఇతర విద్యాసంస్థలు, మీడియా, సమాజం కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

  • ‘‘వైఫల్యాలను తట్టుకోవడం, అవమానాలను దాటుకుని ముందుకు సాగడం పిల్లలకు చిన్నప్పటినుంచే నేర్పించాలి, విలువైన సమయాన్ని వాళ్లకోసం కేటాయించాలని, తమ పనులు సజావుగా సాగాలన్న ఉద్దేశంతో పిల్లలను ఫోన్‌లకు అలవాటు చేయద్దు’’

టీవీలు, ఫోన్లలో పిల్లలు ఏం చూస్తున్నారో ఎల్లవేళలా పర్యవేక్షిస్తుండాలి. కథలు చెబుతూ పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలన్నారు.

‘పిన్ తీసిన బాంబు పిల్లల చేతిలో పెట్టడమే’

సమాజంపై ముఖ్యంగా పిల్లలపై మీడియా ప్రభావం ఎంత ఉందనేదానికి కూకట్‌పల్లి బాలిక హత్య నిదర్శనమని ప్రముఖ సామాజికవేత్త దేవీ విశ్లేషించారు.

హత్య, అత్యాచారం లాంటివి నేరాలని, వాటికి శిక్ష పడుతుందని తెలిసినప్పటికీ 25 ఏళ్లలోపు వయసున్న వారి మెదడుకు చేరాల్సిన స్థాయిలో ఆ విషయం చేరదని ఆమె తెలిపారు.

'' సమాజంలో రెండు నుంచి మూడు శాతం లోపు పిల్లలకు నేరపూరిత స్వభావం ఉంటుంది. పోర్నోగ్రఫీపైనా, మీడియాలో హింసాత్మక కార్యక్రమాలపైనా నియంత్రణలేని వ్యవస్థ వల్ల వారిలో నేరపూరిత లక్షణాలు ఊహించలేనిస్థాయిలో పెరిగిపోయి నేరాలకు పాల్పడుతున్నారు. చంపితే పాయింట్లు వచ్చే వీడియోగేమ్స్‌ వల్ల హత్య అనేది తప్పన్న మానవత్వ భావనను వారి మెదడు గ్రహించడం లేదు’’ అంటారు దేవి.

  • ‘‘పిల్లలను 16 ఏళ్లు వచ్చేవరకు స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉంచాలి. ఆస్ట్రేలియాలో 16ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదనే నిబంధన కొత్తగా తెచ్చారు. భారత్‌లాంటి సమాజానికి మరింత కఠిన చట్టాలు కావాలి. 16ఏళ్ల లోపు పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడమంటే పిన్ తీసేసిన బాంబు చేతిలో పెట్టడమే’’ అంటారు దేవి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)