You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: అమరావతిలో రాజధాని నిర్మాణం ఆరు నెలల్లోగా పూర్తిచేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే
- రచయిత, సుచిత్ర కే మహంతి
- హోదా, బీబీసీ కోసం
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులు నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.
హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.
‘‘అమరావతిని మాత్రమే రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ నిర్మాణపు పనులను ఆరు నెలల్లో పూర్తిచేయాలంటూ 3 మార్చి, 2022లో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేం కోరుతున్నాం’’అని సుప్రీం కోర్టులోని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
అమరావతిని నగరాన్ని, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లోగా పూర్తిగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు పక్కనపెడుతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఈ కేసును జనవరి 31కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
‘‘ఈ అంశాన్ని మేం పరిశీలించాలని భావిస్తున్నాం. కేంద్రానికి నోటీసులు జారీచేశాం. వచ్చే వాయిదా వరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై నిలుపుదల ఆదేశాలు ఇస్తున్నాం’’అని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.
‘‘కోర్టులు టౌన్ ప్లానర్లుగా మారకూడదు’’
ఈ అంశంపై 2022 మార్చి 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిస్తూ అమరావతిని మాత్రమే రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తున్నామని, దీనికి సంబంధించిన అభివృద్ధి పనులు ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించింది. దీనిపై తాజాగా సుప్రీం కోర్టు స్పందిస్తూ.. ‘‘కోర్టులు టౌన్ ప్లానర్లుగా మారకూడదు’’ అని వ్యాఖ్యానించింది.
రాజధాని వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటుచేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అభివృద్ధిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ చేరువచేయాలని చెబుతూ అమరావతితోపాటు విశాఖపట్నం, కర్నూలులోనూ మూడు రాజధానులు ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది.
పరిపాలనా రాజధానిని విశాఖపట్నంలో, న్యాయ రాజధానికి కర్నూలు, శాసన రాజధాని అమరావతిలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాలను సవాల్ చేస్తూ హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి.
‘‘అధికారం రాష్ట్ర శాసన సభకు లేదా?’’
అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు కూడా ఈ ప్రతిపాదిత మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
లాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పీఎస్) పేరిట తమతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని, తమ భూముల్లో కొత్త రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చిందని పిటిషన్‌లో రైతులు వివరించారు.
ఈ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని డివిజన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర రాజధానికి సంబంధించి చట్టం చేసేందుకు రాష్ట్ర చట్టసభకు ఎలాంటి అధికారంలేదని చెబుతూ.. ప్రస్తుత ప్రతిపాదిత ప్రాంతం అమరావతి నుంచి రాజధానికి వేరే ప్రాంతానికి తరలించొద్దని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ క్యాపిటిల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) చట్టంలో నోటిఫై చేసినట్లే అమరావతిలో మాత్రమే రాజధానిని నిర్మించాలని, అక్కడి నుంచి రాజధానికి తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రైతుల నుంచి ఇదివరకటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం సేకరించిన 33,000 ఎకరాలల్లో రాష్ట్ర రాజధానిని నిర్మించాలని హైకోర్టు సూచించింది.
అమరావతిలో ఈ ‘‘గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ సిటీ’’’ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మార్చి 2022నాటికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
రాష్ట్ర రాజధానికి వేరే ప్రాంతానికి తరలించే అధికారాలు రాష్ట్ర శాసనసభకు లేవనే అంశాన్ని సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.
అసలేం జరిగింది?
అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులను పక్కన పెట్టేస్తున్నట్లు మే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి బదులుగా కార్యనిర్వాహక రాజధానికి విశాఖపట్నంలో, న్యాయ రాజధానిని కర్నూలు, శాసన రాజధానికి అమరావతిలో ఏర్పాటుచేస్తున్నట్లు ప్రతిపాదించింది.
దీంతో రాజధానికి నిర్మాణం కోసం తమ వేల ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చిన రైతులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
వాదనల అనంతరం అమరావతిలోనే రాష్ట్ర రాజధాని నిర్మించాలని, ముందుగా చెప్పినట్లే ఆరు నెలల్లోగా నిర్మాణపు పనులు పూర్తి చేయాలని హైకోర్టు కోర్టు సూచించింది.
హైకోర్టు తీర్పుపై స్టే రాలేదు: జేఏసీ ప్రతినిధి కే రామకృష్ణ
అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కేవలం కాలపరిమితి అంశం వరకు మాత్రమే స్టే ఇచ్చారని అమరావతి జేఏసీ ప్రతినిధి కే రామకృష్ణ అన్నారు.
అమరావతి రైతులకు ఒప్పందం మేరకు అన్నీ అభివృద్ధి చేస్తామని, ఏపీ హైకోర్టుని కర్నూలుకి తరలించే ఆలోచన చేయడం లేదని సుప్రీంకోర్టులో ప్రభుత్వ తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది చెప్పడం గమనించాలని ఆయన ప్రస్తావించారు.
"రాజధాని మార్పుపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. సంబంధిత సెక్షన్లందరికీ నోటీసులు జారీ చేశారు. తుది తీర్పు ఎలా ఉంటుందన్నది ఊహాగానాలు సరికాదు. రైతులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. చట్టం ప్రకారం అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం. సుప్రీంకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వ వాదన చెల్లుబాటు కానందున పునరాలోచన చేసి అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలని కోరుతున్నాం"అంటూ రామకృష్ణ బీబీసీతో అన్నారు.
కాస్త ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుందనడానికి ఇదొక ఉదాహరణ: గుడివాడ అమర్నాథ్
రాజధాని పైన సుప్రీం కోర్టు చేసిన వ్యాఖలు స్వాగతిస్తూ, వికేంద్రీకరణ కోసం సీఎం జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి వల్లే న్యాయం గెలుస్తుందని వ్యాఖ్యానించారు ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.
‘‘రాజధాని అంటే కొంత మంది స్వార్థపరుల నిర్ణయం కాదు.. అది రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష’’ అని తెలిపారు.
‘‘అమరావతిని రాజధానిగా కానీ అమరావతి అభివృద్ధికి గాని మేమెప్పుడూ వ్యతిత్రేకం కాదు. ఒక హైదరాబాద్ పైనే అభివృద్ధిని కేంద్రీకరించడం వల్లే రెండు రాష్ట్రాలు విడిపోడానికి కారణం అయ్యింది. అలాంటి పరిసితి ఎప్పటికి రాకుండా ఉండడానికే వికేంద్రీకరణ అవసరం’’అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నగ్న ఫోటోలు అప్పులోళ్ల దగ్గరకు ఎలా వెళ్లాయి’
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు
- విప్ప సారా: బ్రిటిషర్లు నిషేధించిన ఈ భారతీయ మద్యం అంతర్జాతీయంగా ఆదరణ పొందగలదా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)