You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీలో బీజేపీ ఘన విజయం, ఆప్ ఓటమి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలు ఉన్న దిల్లీ అసెంబ్లీలో బీజేపీ 48 స్థానాలు గెలుచుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు సరిపోతాయి.
ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 27 ఏళ్ల తరువాత దిల్లీ పీఠాన్ని దక్కించుకుంది.
బీజేపీ అనూహ్య విజయాన్ని అందుకోగా.. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా లాంటి నేతలు సైతం ఓటమి చవిచూశారు.
కేజ్రీవాల్ ఓటమి
ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రవేశ్ సాహిబ్ సింగ్, కేజ్రీవాల్ పై 4089 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
దిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశి విజయం సాధించారు.
మోదీ హర్షం
జనశక్తి ముఖ్యమని, అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని దిల్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా చెప్పారు. ఈ మహత్తరమైన, చారిత్రాత్మక తీర్పు ఇచ్చినందుకు దిల్లీ సోదర సోదరీమణులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.
దిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో, వికసిత్ భారత్ నిర్మాణంలో దేశరాజధాని ప్రధాన పాత్ర పోషించేలా చూడటంలో తాము ఏ మాత్రం వెనుకడుగు వేయబోమని హామీ ఇస్తున్నట్టు నరేంద్ర మోదీ ఆ పోస్టులో తెలిపారు.
కాంగ్రెస్ ఓటమికి నాదే బాధ్యత
న్యూదిల్లీలో కాంగ్రెస్ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ఆ పార్టీ నేత సందీప్ దీక్షిత్ చెప్పారు ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్టులో ''నాకు అగ్రశ్రేణి నాయకత్వ బాధ్యతలు అప్పగించి, నాపై నమ్మకం ఉంచి నాకీ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు'' అని సందీప్ చెప్పారు.
''న్యూదిల్లీలో ఈ అవమానకరమైన ఓటమికి వ్యక్తిగతంగా నాదే బాధ్యత. దిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారు.కానీ నేను దానిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాను'' అని చెప్పారు.
న్యూదిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన సందీప్ దీక్షిత్‌కు కేవలం 4568 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ గెలిచారు. ఆయన ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై 4089 ఓట్ల తేడాతో గెలిచారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)