తెలంగాణ: రూ.500 కే గ్యాస్ సిలిండర్... ఈ పథకానికి ఎవరు అర్హులు, కనెక్షన్ మహిళ పేరు మీదే ఉండాలా?

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీలను అమల్లోకి తీసుకువచ్చింది.

మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే పథకాన్ని కూడా అమల్లోకి తెచ్చింది.

ఈ రెండు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

పథకాల ప్రారంభానికి ముందు రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీకి సంబంధించి నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది.

పథకం వెంటనే అమల్లోకి వస్తుందని పౌరసరఫరాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

మహాలక్ష్మి పథకం ఉద్దేశం

2023 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మూడు హామీలను అమలు చేస్తామని తెలిపింది.

అందులో భాగంగా మహిళలకు ప్రతినెలా 2500 రూపాయల నగదు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.

వీటిల్లో ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళలకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీని ప్రారంభించారు.

కట్టెల పొయ్యితో మహిళలు ఇబ్బంది పడకుండా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించారు. మహిళా సాధికారతలో భాగంగా ఈ పథకం ప్రవేశపెట్టినట్టు తెలిపారు.

ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద మహిళలకు నెలకు రూ.2500లను ఆర్థిక సాయం పంపిణీ అమల్లోకి రావాల్సి ఉంది.

పథకంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత బీబీసీతో మాట్లాడారు.

‘‘మహిళా సాధికారిత పెంచాలనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. 2014 వరకు గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలే ఉండేది. కానీ ఇప్పుడు అది రూ.900 దాటింది. ఇంత భారం మోయలేక పేద కుటుంబాల మహిళలు కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నారు. ఈ ఇబ్బంది తీర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా సబ్సిడీపై సిలిండర్ పథకాన్ని తీసుకువచ్చాం’’ అని ఆమె తెలిపారు.

త్వరలోనే అర్హులైన పేద మహిళలకు రూ.2500 నెలకు సాయం అందించే కార్యక్రమాన్ని కూడా అమల్లోకి తెస్తామని చెప్పారు.

రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే..

రాయితీపై గ్యాస్ సిలిండర్ పథకానికి ప్రధానంగా మూడు అర్హతలు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలండర్ కోసం దరఖాస్తు చేసుకుని ఉండాలి.
  • తెలంగాణలో తెల్లరేషన్ కార్డు దారులై ఉండాలి.
  • వినియోగంలో ఉన్న ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ ఉండాలి.

మహిళ పేరుతోనే సిలిండర్ ఉండాలా..?

మహాలక్ష్మిపథకం మహిళలు కోసం ప్రవేశపెట్టిన పథకం కావడంతో గ్యాస్ సిలిండర్ కూడా మహిళ పేరుతోనే ఉండాలా అనే సందేహం అంతటా నెలకొంది. అయితే, ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా మహిళల పేరుతోనే గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉండాలని లేదు.

ఎన్ని సిలిండర్లకైనా సబ్సీడీ ఇస్తారా?

కొందరు సబ్సిడీ సిలిండర్లను తీసుకుని ప్రైవేటుగా ఎక్కువ ధరకు అమ్ముకునే వీలుందని అధికారులు చెబుతున్నారు.

ఏడాదికి ఎన్ని సిలిండర్లకు సబ్సిడీ ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

ఇందుకు వినియోగదారులు గత మూడేళ్ల సిలిండర్ వినియోగాన్ని సగటు తీస్తారు. ‌‍ దాని ఆధారంగా ఆ కుటుంబానికి సబ్సిడీ వర్తింపజేస్తారు.

అంటే ఒక కుటుంబం ఏడాదికి వినియోగించే సిలిండర్ల సగటు 3 అయితే మూడు సిలిండర్లకే సబ్సిడీ ఇస్తారు. అంతే కానీ ఎన్ని సిలిండర్లు తీసుకుంటే అన్నింటికీ సబ్సిడీ ఇవ్వరు.

సిలిండర్ ఇంటికి వస్తే ఎంత ఇవ్వాలి..

గతంలో సిలిండర్ ధర రూ.1155గా ఉండేది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కారణంగా రూ.200 తగ్గించి తెలంగాణలో గ్యాస్ కంపెనీలు రూ. 955 రూపాయలకు సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికైతే ఇదే ధరను వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది.

అంటే మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చినా, సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు రూ.955 చెల్లించాలి. సబ్సిడీ మొత్తాన్ని తర్వాత ప్రభుత్వం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది.

ఇందుకు నెల వారీగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రాష్ట్ర ప్ర‌భుత్వం అడ్వాన్సుగా సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తుంది.ఆయిల్ కంపెనీలు సిలిండర్ తీసుకున్న అర్హులైన వినియోగదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేస్తాయి.

ఇది కేవలం పైలెట్ పద్ధతిలోనే అమలు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

‘‘ప్రస్తుతం సబ్సిడీ ఇవ్వడమనేది పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తాం. పౌరసరఫరాల శాఖ, ఆర్థిక శాఖ చర్చించి వినియోగదారులు రూ.500 మాత్రమే చెల్లించే విధానాన్ని తీసుకురానున్నాం.’’ అని పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ తెలిపారు.

కలెక్టర్ల పర్యవేక్షణ

మహాలక్ష్మీ పథకం పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది.

క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది సాయంతో అర్హులైన తెల్ల రేషను కార్డుదారులకు సబ్సిడీ సిలిండర్లు అందేలా చూడాలి.

పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. వినియోగదారుల రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, డేటా అప్ డేట్ చేయడానికి కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాలి.

దీనికి తగిన ప్రచారం కల్పించాలని ప్ర‌భుత్వం ప్రకటించింది.

39.50లక్షల మందికే లబ్ధి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో మహాలక్ష్మీ పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.

వీరిలో తెల్ల రేషను కార్డు ఉన్న పేదలకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తం మహాలక్ష్మీ పథకానికి 92.23లక్షల దరఖాస్తులు అందినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.

వీటిల్లో సబ్సిడీ సిలిండర్ పథకానికి 39.50లక్షల మంది అర్హులని పౌరసరఫరాల శాఖ తేల్చింది.

వీరికి గత మూడేళ్ల సిలిండర్ల వినియోగం లెక్కించినప్పుడు...ఏటా 2 కోట్ల వరకు సిలిండర్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. ఇందుకు రూ.855 కోట్లు సబ్సిడీ రూపంలో భరించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా కట్టింది.

లబ్ధిదారులను తగ్గించారంటున్న బీఆర్ఎస్

గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం కుదించిందని బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ విమర్శించారు.

‘‘గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి రూ.500కే ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో ఉంది. తెలంగాణలో కోటి 24లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషను కార్డు ఉన్న వారు 90లక్షల మంది ఉన్నారు.ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, కేవలం 40లక్షల మందికే ప్రయోజనం కల్పిస్తామని చెప్పడం సరికాదు. తెల్లరేషను కార్డుదారులందరికీ కూడా మహాలక్ష్మీ పథకం అమలు చేయడం లేదని స్పష్టమవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంఖ్యను కుదించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది .’’ అని అన్నారు.

మహాలక్ష్మి స్కీమ్‌తోపాటు గృహాలకు 200 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్‌ను అందించే గృహ జ్యోతి పథకాన్ని కూడా ముఖ్యమంత్రి సచివాలయంలో ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)