You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కామారెడ్డి వరదలు: 'చెరువు గండి పూడుస్తుంటే మా పక్కనే పిడుగు పడింది'
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ వణికిపోతోంది.
కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతినడంతో రాకపోకలపై ప్రభావం పడింది. సాధారణ జనజీవనం స్తంభించింది.
కశ్మీర్‌ను కన్యాకుమారితో కలిపే జాతీయ రహదారి-44 పలు ప్రాంతాల్లో దెబ్బతినడంతో హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో పోలీసులు వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా బిక్నూర్-తలమడ్ల మధ్య వరద ప్రవాహంతో రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.
కామారెడ్డి, నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల కోసం సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసింది.
సైనిక హెలికాప్టర్ల సహాయంతో
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు ప్రవాహంలో చిక్కుకుపోయిన అయిదుగురు పశువుల కాపరులను రెండు సైనిక హెలికాప్టర్ల సహాయంతో అధికారులు సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
మరో రెండు రోజులు వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే కొన్ని గంటల్లో హన్మకొండ, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.
వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
కామారెడ్డిలో ఎడతెరిపి లేని వర్షం
భారీ వర్షాలతో కామారెడ్డి వణికిపోయింది. జిల్లాలో అత్యధికంగా రాజంపేట మండలం అర్గొండలో 41 సెం.మీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి పట్టణంలో 28 సెం.మీ వర్షంతో హౌజింగ్ బోర్డ్ కాలనీలో వరద ప్రవాహంలో వాహనాలు కొట్టుకుపోయాయి.
కామారెడ్డిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. గురువారం మధ్యాహ్నం 1 గంట వరకు 17 సెం.మీ వర్షపాతం నమోదైంది.
బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తొమ్మిది మేజర్ రెస్క్యూ ఆపరేషన్లలో భాగంగా 543 మందిని సురక్షితంగా వరద ప్రవాహం నుంచి బయటకు తెచ్చామని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు.
కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో భారీ వర్షాల ప్రభావంతో పంటలు వరి, మొక్కజొన్న, చెరుకు, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. పశువులు కొట్టుకుపోయాయి.
కామారెడ్డి పట్టణంలో సరంపల్లి రోడ్, జీఆర్ కాలనీలపై వరద ప్రభావం ఎక్కువగా పడింది. ఇళ్లలోకి వరదనీరు రావడంతో వందల ఇళ్లు నీటి మునిగాయి.
14 గంటల తర్వాత కట్టుబట్టలతో..
వరదలో తన అనుభవాలను జీఆర్ కాలనీకి చెందిన అనమల శ్రీకాంత్ బీబీసీతో పంచుకున్నారు. జీవనోపాధి కోసం ఆయన కామారెడ్డికి కుటుంబంతో వలస వచ్చారు. అద్దె ఇంట్లో ఉంటున్నారు.
"నిమిషాల వ్యవధిలో ఇంట్లోకి వరద వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కు వెళ్లిపోయాం. సుమారు 14 గంటల తర్వాత జేసీబీలతో వచ్చిన రెస్క్యూ టీమ్ సహాయంతో కట్టుబట్టలతో బయటపడ్డాం. పట్టణాల్లో వరద పరిస్థితులు చూస్తుంటే పల్లెల్లో నివసించడమే సేఫ్ అనిపిస్తోంది'' అని శ్రీకాంత్ అన్నారు.
''రెండు గంటల వ్యవధిలో మా బతుకులు ఆగమయ్యాయి''
జిల్లాలో అత్యధిక వర్షాపాతం నమోదైన రాజంపేట మండలం కొండాపూర్‌కు చెందిన రైతు నిమ్మల శ్యామ్ ప్రసాద్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
"రెండు గంటల వ్యవధిలోనే మా బతుకుల ఆగం అయ్యాయి. క్లౌడ్ బరస్ట్ లాంటి పరిస్థితి ఏర్పడింది. చెరువు గండిని పూడుస్తుంటే మా పక్కనే పిడుగు పడితే అక్కడి నుండి దూరంగా వెళ్లిపోయాం. గండ్లుపడ్డ మా గ్రామ చెరువు, లింగరాయం చెరువుల నుండి వచ్చిన నీటితోనే పోచారం ప్రాజెక్ట్ గేట్ల పైనుండి నీరు పొంగిపొర్లింది'' అని బీబీసీతో చెప్పారు.
బుధవారం పోచారం ప్రాజెక్ట్ స్పిల్ వే పై నుంచి నీరు ప్రవహించింది. గేట్ల పక్కన భారీ గండి పడిందని, ఏక్షణమైనా కొట్టకుపోతుందన్న వదంతులు వ్యాపించాయి.
అయితే, ప్రాజెక్ట్‌కు ఏమీ కాలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
"గరిష్ట పరిమితికంటే ఎక్కువ వరద వచ్చినా 103 ఏళ్ల పురాతన పోచారం ప్రాజెక్ట్ బలంగా నిలబడింది. ఇది గర్వించదగ్గ, భావోద్వేగ సమయం'' అని ఉత్తంకుమార్ రెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)