‘లంకె బిందెలు’ అంటే ఏంటి? ‘లంకె పిందెల’ నుంచే ఆ పదం వచ్చిందా?

లంకె బిందెలు, లంకె పిందెలు, గుప్తనిధి, చిక్కం, పురాతన నాణేలు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఇంటిని నిర్మాణం కోసం తవ్వకాలు జరిపేటప్పుడు, పొలం దున్నేటప్పుడు పాత నాణేలు లేదా విలువైన వస్తువులు బయటపడితే... తెలుగునాట తరచూ వినిపించే మాట ‘లంకె బిందెలు’.

గుప్తనిధి, భూగర్భ నిధి, నాణేల కుండలు, లంకె బిందెలు అంటూ నిధుల గురించి మాట్లాడేటప్పుడు ఈ పదాలు తరచూ వినిపిస్తుంటాయి.

అయితే మనం ఇంతకాలం 'లంకె బిందెలు'గా పిలుస్తున్నది అసలు ఏమిటి?

ఈ పదం మొదటినుంచీ నిధినే సూచించేదా? లేక దీని వెనుక మరేదైనా చరిత్ర ఉందా?

ఈ విషయంపై అధ్యయనాలు చేస్తున్న న్యూమిస్‌మాటిస్ట్ (నాణేల సేకర్త) కందుల వెంకటేశ్ ఇంటికి వెళ్లి ఆయనతో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లంకె బిందెలు, లంకె పిందెలు, గుప్తనిధి, చిక్కం, పురాతన నాణేలు
ఫొటో క్యాప్షన్, మామిడి కాయ పిందెలా ఉండే ఈ సంచికి పైన ఒక లంకె ఉంటుంది. ఆ లంకెను నడుముకు కట్టుకునేవారు. అందులో నాణేలు పెట్టుకునేవారు.

మామిడి కాయ పిందెలాంటి సంచి...

కందుల వెంకటేశ్ ఇంట్లో చాలా పురాతన నాణేలతో పాటు మామిడి పిందె ఆకారంలో ఉన్న కొన్ని వస్తువులు ఉన్నాయి.

అవి చూడటానికి ఏదో దాచుకునేందుకు తయారు చేసిన ఇనుప తీగలతో నేసిన వస్తువులనే విషయం అర్థమవుతుంది.

దీనికి న్యూమిస్‌మాటిస్ట్ కందుల వెంకటేశ్ చెప్పిన వివరాలు ప్రకారం...

అది పెద్ద బిందె కాదు. చిన్న సంచి.

మామిడి కాయ పిందెలా ఉండే ఈ సంచికి పైన ఒక లంకె ఉంటుంది. ఆ లంకెను నడుముకు కట్టుకునేవారు. అందులో నాణేలు పెట్టుకునేవారు.

అంటే...ఇప్పటి చిన్న పర్సు లేదా మనీ పౌచ్‌లా అప్పట్లో ఉపయోగించిన వస్తువే 'లంకె పిందె' అని కందుల వెంకటేశ్ చెప్పారు.

తెలుగు నిఘంటువు ఆధారాల్లో 'పిందె'కు లేతగా ఏర్పడిన కాయ, పండు ప్రారంభ దశ వంటి అర్థాలు కనిపిస్తాయని ఆయన అన్నారు.

అందుకే ఆ వస్తువు ఆకారం పిందెలా ఉండటంతో 'లంకె పిందె' అనే పేరు వచ్చిందా? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.

అయితే దీనికి ప్రత్యేకమైన చారిత్రక ఆధారం ప్రస్తుతం మనకు లేదని చెప్పారు.

లంకె బిందెలు, లంకె పిందెలు, గుప్తనిధి, చిక్కం, పురాతన నాణేలు
ఫొటో క్యాప్షన్, న్యూమిస్‌మాటిస్ట్ కందుల వెంకటేశ్ దగ్గర పురాతన లంకెల పిందెలుగా చెప్పే వస్తువులు ఉన్నాయి.

పర్స్‌ నుంచి 'నిధి' కథ వరకు...

వెంకటేశ్ చెప్పే వివరాల ప్రకారం.. పాత రోజుల్లో బయటకు వెళ్లేటప్పుడు నాణేలను లంకె పిందెలో పెట్టుకునేవారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ డబ్బును ఇంటి చూరులో లేదా సురక్షితమైన చోట దాచుకునేవారు.

అలాంటి పాత ఇళ్లు తర్వాత కూలిపోయినా.. వాటి శిథిలాల్లో నాణేలు లేదా ఆ సంచులు దొరికితే, 'లంకె పిందెలు దొరికాయి' అని చెప్పడం మొదలై ఉండవచ్చని ఆయన వివరించారు.

ఆయన అభిప్రాయం ప్రకారం... కాలక్రమంలో 'లంకె పిందె' అనే పదం 'లంకె బిందెలు'గా మారి ఉండవచ్చు.

ఈ పదం అలా ఎలా మారిందన్న విషయానికి ఇప్పటివరకు సీపీ బ్రౌన్ నిఘంటువు లేదా మరో స్పష్టమైన ప్రాచీన లిఖిత ఆధారం లభించలేదు.

అందువల్ల 'లంకె పిందె నుంచి లంకె బిందెలు వచ్చింది' అనేది ఒక వాదనగానే చూడాలి.

'లంకె బిందెలు' అనే పదం మాత్రం కొత్తది కాదు. అయితే 'లంకె బిందెలు' అనే పదం చాలా కాలంగా తెలుగు వాడుకలో ఉన్నట్లు కనిపించే ఆధారాలు ఉన్నాయి.

తెలుగు నాటక రచయిత కొడాలి గోపాలరావు రచనల జాబితాలో 'లంకెల బిందెలు' అనే నాటకం 1959 నాటిదిగా నమోదైంది. ఇది 1960లో పుస్తక రూపంలో వచ్చింది.

అంటే... 'లంకె బిందెలు' అనే పదం కనీసం 20వ శతాబ్దం మధ్యకాలానికే సాహిత్య, నాటక ప్రపంచంలో బలంగా స్థిరపడినట్లు తెలుస్తోంది.

ఇక జానపద కథల్లో అయితే 'లంకె బిందెలు' అంటే భూమిలో దాచిన బంగారం, నాణేలు, విలువైన వస్తువులతో కూడిన నిధి అనే భావన బలపడింది.

కొన్ని ఆధునిక తెలుగు రచనల్లోనూ ఈ పదాన్ని దాచిన సంపద లేదా పూర్వీకులు భూమిలో పెట్టిన ధనం అనే అర్థంలో ఉపయోగిస్తున్నారు.

లంకె బిందెలు, లంకె పిందెలు, గుప్తనిధి, చిక్కం, పురాతన నాణేలు
ఫొటో క్యాప్షన్, పూర్వీకులు నాణేలను వీటిలో దాచుకునే వారని వెంకటేశ్ చెప్పారు.

మరి 'చిక్కం' సంగతేంటి?

లంకె పిందెతో పోల్చదగిన మరో ఆసక్తికరమైన వస్తువు 'చిక్కం'.

దారంతో వలలా అల్లి తయారు చేసిన చిన్న సంచిని చిక్కం అనేవారు. దాన్ని నడుముకు కట్టుకుని అందులో నాణేలు పెట్టుకునేవారని కందుల వెంకటేశ్ చెప్పారు.

ఇక్కడ వెంకటేశ్ చెప్పిన విషయానికి కొంత నిఘంటు/భాషా ఆధారం కూడా కనిపిస్తుంది. ఒక తెలుగు నిఘంటు ఆధారంలో చిక్కం అనేది తాళ్లు లేదా దారాలతో అల్లిన చిన్న సంచి. అందులో డబ్బులు దాచుకునేవారు అని అర్థం ఇచ్చారు.

పాత తెలుగు రచనల్లోనూ 'చిక్కాం సంచీ'లో దమ్మిడీలు వేసుకోవడం వంటి ప్రయోగాలు కనిపిస్తాయి.

అంటే 'చిక్కం' అనేది కేవలం నేటి ఊహలో ఉన్న పదం కాదు. డబ్బు పెట్టుకునే చిన్న సంచి అనే అర్థంలో తెలుగు వాడుకలో ఉన్న పదమే అని చెప్పడానికి కొంత భాషా ఆధారం ఉంది.

లంకె బిందెలు, లంకె పిందెలు, గుప్తనిధి, చిక్కం, పురాతన నాణేలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నల్లమలలో గుప్త నిధుల కోసం తవ్వారనే ఆరోపణలు ఉన్న ఘటనలో బయటపడిన కుండలు (ఫైల్ ఫోటో)

ఒక చిన్న పర్స్‌... ఒక పెద్ద నిధి కథ

ఇక్కడే ఈ కథలో అసలు ఆసక్తి ఉంది.

లంకె పిందె కావచ్చు.. చిక్కం కావచ్చు.. రెండూ ఒకప్పుడు నాణేలు పెట్టుకుని వెంట తీసుకెళ్లడానికి లేదా దాచుకోవడానికి ఉపయోగించిన చిన్న సంచులే అని కందుల వెంకటేశ్ వివరించారు.

అయితే పాత ఇళ్లు కూలిపోయిన తర్వాత వాటిలో దాచిన నాణేలు బయటపడటం, ఆ కథలు తరతరాలకు చెప్పుకోవడం, జానపద కథల్లో నిధుల ప్రస్తావన పెరగడం... ఇలాంటి పరిణామాలతో 'లంకె బిందెలు' అనే పదానికి నిధి అనే అర్థం బలపడి ఉండవచ్చన్నది ఆయన అభిప్రాయం.

అయితే 'లంకె పిందె' అనే పదం నుంచే 'లంకె బిందెలు' వచ్చిందని నిర్ధరించే ఏ లిఖిత ఆధారం ఇప్పటివరకు కనిపించలేదు. అందువల్ల దీన్ని ఒక ఆసక్తికరమైన భాషా, జానపద వాదనగానే చూడాలి.

మన ఊహల్లో 'లంకె బిందెలు' అంటే బంగారం, వెండి, నాణేలతో నిండిన పెద్ద బిందెలు.

కానీ కందుల వెంకటేశ్ చూపిస్తున్న 'లంకె పిందె' మాత్రం... నడుముకు కట్టుకునే చిన్న నాణేల సంచి.

అదే చిన్న సంచి.. కాలక్రమంలో పెద్ద నిధి కథగా మారిందా?

ఇదే 'లంకె పిందె-లంకె బిందెలు' కథలో ఆసక్తికరమైన ప్రశ్న.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)