3 వేల ఏళ్ల నాటి బంగారు కంకణం చోరీ.. దొంగలు దాన్ని ఏం చేశారంటే?

    • రచయిత, డేవిడ్ గ్రిటెన్
    • హోదా, బీబీసీ న్యూస్

కైరోలోని ఈజిప్ట్ మ్యూజియం నుంచి 3 వేల ఏళ్ల నాటి గోల్డ్ బ్రేస్‌లెట్ (బంగారు కంకణం) చోరీకి గురైందని, దాన్ని నిందితులు కరిగించేశారని ఈజిప్ట్ హోమ్ మంత్రిత్వ శాఖ (ఇంటీరియర్ మినిస్ట్రీ) తెలిపింది.

క్రీస్తు పూర్వం 1000 ప్రాంతంలో ఈజిప్ట్‌ను పాలించిన ఫారో రాజు అమెనెమోపే కాలానికి చెందిన ఈ ఆభరణాన్ని రీస్టోరేషన్ స్పెషలిస్ట్ ఒకరు తొమ్మిది రోజుల క్రితం మ్యూజియంలోని ఒక బీరువా నుంచి బయటకు తీశారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

‘అనంతరం ఆ మహిళ తనకు తెలిసిన వెండి ఆభరణాల వర్తకుని సంప్రదించారు.. ఆయన ఈ కంకణాన్ని 3,735 డాలర్లకు (సుమారు రూ.3,29,161) ఒక బంగారు ఆభరణాల వర్తకునికి అమ్మేశారు’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆ తర్వాత బంగారు నగల వర్తకుడు దాన్ని గోల్డ్ ఫౌండ్రీ వర్కర్‌కు 4,025 డాలర్లకు (సుమారు రూ.3,54,735కు) విక్రయించారని.. దాన్ని అక్కడ ఇతర ఆభరణాలతో కలిపి కరిగించేశారని హోమ్ మంత్రిత్వ శాఖ చెప్పింది.

అరెస్ట్ చేసిన తర్వాత ఈ నలుగురు తమ నేరాన్ని అంగీకరించారని హోమ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఆ డబ్బులను సీజ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కూడా పేర్కొంది.

ఈజిప్ట్ మ్యూజియంలోని రీస్టోరేషన్ ల్యాబరేటరీ నుంచి ఈ బంగారు కంకణం అదృశ్యమైన తర్వాత వెంటనే తాము చర్యలు తీసుకున్నట్లు ఈజిప్ట్ పర్యటక, పురావస్తు శాఖ తెలిపింది.

ఈ కేసును పోలీసులకు అప్పగించినట్లు చెప్పింది.

గోళాకారంలో నీలపు రంగులో ఉండే పూసతో అందంగా అలకరించి ఉండే ఈ బంగారం కంకణం చోరీకి గురైన తర్వాత, అది దేశం నుంచి బయటికి రవాణా కాకుండా అడ్డుకునేందుకు ఈజిప్ట్‌లోని అన్ని విమానాశ్రయాలకు, నౌకాశ్రయాలకు, సరిహద్దు క్రాసింగ్‌లకు దీని ఫొటోను పంపినట్లు ఈజిప్ట్ పర్యటక, పురావస్తు శాఖ తెలిపింది.

రోమ్‌లో జరిగే ఎగ్జిబిషన్‌ కోసం మ్యూజియం ఉద్యోగులు డజన్ల కొద్ది కళాఖండాలను పంపే క్రమంలో ఇది అదృశ్యమైందని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.

కైరోలోని ఈజిప్ట్ మ్యూజియాన్ని మిడిల్ ఈస్ట్‌ ప్రాంతంలో అత్యంత పురాతన పురావస్తు మ్యూజియంగా చెబుతారు. ఇక్కడ 1,70,000 వేలకు పైగా కళాఖండాలు ఉన్నాయి.

సమీపంలోని గిజాలో గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభానికి కొన్ని వారాల ముందు ఈ కంకణం చోరీకి గురైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)