You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అభిశంసన: ఎన్నికల కమిషనర్‌ను తొలగించొచ్చా, ప్రాసెస్ ఏంటి?
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించడానికి ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకువచ్చే అంశాన్ని 'ఇండియా' కూటమి పరిశీలిస్తోంది. సోమవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల ఎంపీల సమావేశంలో దీనిపై చర్చించారు.
ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన తీర్మానం తీసుకురావడానికి ప్రతిపక్షాలు సన్నాహాలు ప్రారంభించాయని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
ఎన్నికల కమిషన్ 'ఓట్ల చోరీ' చేస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆగస్టు 7న ఆరోపించారు.
అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమైనవని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈనెల 17న జరిగిన విలేఖరుల సమావేశంలో స్పష్టంచేశారు. సీఈసీ మీడియా సమావేశం తర్వాత, సోమవారం ప్రతిపక్ష పార్టీల ఎంపీల సమావేశం జరిగింది.
ది హిందూ ఆంగ్ల వార్తాపత్రికతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ మాట్లాడుతూ "ఆయన (జ్ఞానేష్ కుమార్) ప్రధాన ఎన్నికల కమిషనర్ మాదిరి కాకుండా బీజేపీ నాయకుడిలా మాట్లాడారు" అని అన్నారు.
"ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలకు మీడియా సమావేశంలో సీఈసీ సమాధానం ఇవ్వలేదు. బదులుగా, ప్రశ్నలు లేవనెత్తినందుకు ప్రతిపక్షాలను ఆయన ఎగతాళి చేశారు. రాజకీయాల్లో పాల్గొనడం సీఈసీ పనా?" అని వేణుగోపాల్ ప్రశ్నించారు.
సీఈసీపై అభిశంసన తీర్మానం తీసుకురావడానికి ప్రతిపక్షాలకు తగినంత సంఖ్యాబలం ఉందని వేణుగోపాల్ అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్ట నిబంధనలను కూడా ఆయన ప్రశ్నించారు.
ఇంతకీ, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఆ పదవిలో నియమించడం, తొలగించే విధానం ఏంటి? చట్టాలు ఏం చెబుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం.
సీఈసీని ఎలా నియమిస్తారు?
దేశంలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడం ఎలక్షన్ కమిషన్ బాధ్యత. దీని అధికారులను అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లను భారత రాష్ట్రపతి నియమిస్తారు.
దీని కోసం, ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ సిఫార్సులు చేస్తుంది. ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు లేదా లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి మండలి సభ్యుడు ఉంటారు.
కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఎంపిక కమిటీకి అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తుంది.
ఎన్నికల కమిషనర్ నియామకం, వారి పదవీకాలం, తొలగింపు ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, 'చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్(అపాయింట్మెంట్స్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యుర్) యాక్ట్, 2023' నిబంధనల ప్రకారం జరుగుతాయి.
ఈ చట్టం ప్రకారం, ఈ పదవులకు ఎంపికైన వారు గతంలో ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయి పదవుల్లో పనిచేసి ఉండాలి. ఎన్నికల నిర్వహణలో కూడా అనుభవం ఉండాలి.
సదరు అధికారిని ఆరు సంవత్సరాల పదవీకాలం లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు (ఏది ముందు అయితే అది) నియమిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఇచ్చే సౌకర్యాలు, ప్రయోజనాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ పొందుతారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఎన్నికల సంఘం సభ్యుల నియామకం కోసం రూపొందించిన కొత్త చట్టం ప్రకారం బాధ్యతలు స్వీకరించిన మొదటి సీఈసీ ఆయనే.
గతంలో నియామకం ఎలా జరిగింది?
2023 చట్టం రాకముందు, ఎన్నికల కమిషనర్ల నియామకం 1991 ఎలక్షన్ కమిషన్ (సర్వీస్ కండీషన్స్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్)యాక్ట్ ప్రకారం జరిగేది. కానీ ఈ చట్టంలో ఎంపిక ప్రక్రియను నిర్వచించలేదు.
ఫలితంగా, ప్రధానమంత్రి, మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించేవారు.
ఎన్నికల కమిషనర్ల సంఖ్యను ఎప్పటికప్పుడు నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉండేది. పాత చట్టం ప్రకారం, ఎన్నికల కమిషనర్ల జీతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉండేది.
సీఈసీని తొలగించే విధానం ఏమిటి?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను "సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాదిరిగానే, అదే కారణాలతో" పదవి నుంచి తొలగించవచ్చు. 2023 చట్టంలోని సెక్షన్ 11(2) కింద ఇలాంటి నిబంధన ఉంది.
ఆర్టికల్ ప్రకారం, "ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సుపై తప్ప మరే ఇతర ఎన్నికల కమిషనర్ లేదా ప్రాంతీయ కమిషనర్‌ను పదవి నుంచి తొలగించకూడదు"
రాజకీయ ఒత్తిడి నుంచి ఎన్నికల కమిషన్‌ను రక్షించడానికి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా చాలా కష్టతరం చేశారు. 2023లో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సమీక్షించింది, ఎన్నికల కమిషనర్లను తొలగించే ప్రక్రియను మార్చడానికి రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానాన్ని నిర్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (4) ప్రకారం, "దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమైతే" మాత్రమే సీఈసీని తొలగించడానికి చర్య తీసుకోవచ్చు.
దుష్ప్రవర్తనలో అవినీతి పద్ధతులు లేదా పదవీ దుర్వినియోగం ఉండవచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవికి తగని చర్యలు లేదా అధికారిక విధులను నిర్వర్తించడంలో స్పష్టమైన వైఫల్యాలు కూడా ఇందులో ఉన్నాయని కాలానుగుణంగా కోర్టులు పేర్కొన్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగింపు ప్రక్రియను ప్రారంభించడానికి, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు దుష్ప్రవర్తన లేదా అసమర్థతను స్పష్టంగా ఆరోపించే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి.
ప్రతిపాదన ఆమోదం పొందిన తర్వాత, ఆరోపణల చెల్లుబాటును తనిఖీ చేస్తారు. దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.
సీఈసీని తన పదవి నుంచి తొలగించడానికి, పార్లమెంటు ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాలి. ఆ తర్వాత, తొలగింపు ఉత్తర్వుకు రాష్ట్రపతి తుది ఆమోదం ఇవ్వాలి.
వివాదమేంటి?
ఆగస్టు 7న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు.
బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి 'ఓట్ల చోరీ'కి పనిచేస్తున్నాయని, 'బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓట్లను దొంగిలించే ప్రయత్నం' అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చిన తర్వాత ఈ సందేహాలు మరింత బలపడ్డాయని ఆయన చెప్పారు.
ఇది 'ప్రజాస్వామ్య వ్యతిరేక కుట్ర'గా విమర్శిస్తూ, ఆధారాలంటూ కొన్ని వివరాలు కూడా చూపించారు రాహుల్. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలిచ్చారాయన.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తాను చెబుతున్నది నిజమని నమ్మితే అఫిడవిట్‌పై సంతకం చేసి, ఫిర్యాదు చేయాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. అంతేకాదు, రాహుల్ ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం ఏర్పాటుచేసింది.
బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాల ఆరోపణలు 'గందరగోళాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం' అని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను రాజకీయ పార్టీల డిమాండ్ మేరకే మొదలుపెట్టామని ఎన్నికల సంఘం తెలిపింది.
ఎస్ఐఆర్‌కి సంబంధించిన డాక్యుమెంట్లను రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన బూత్ స్థాయి ఏజెంట్లు ధ్రువీకరిస్తారని జ్ఞానేష్ కుమార్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)