క్రెమ్లిన్ బ్లడ్ కాక్‌టెయిల్స్: టీనేజర్లను భయపెడుతున్న రష్యా కొత్త పాఠ్యపుస్తకాలు, అందులో ఏం ఉందంటే?

    • రచయిత, మరియా కొరెన్యుక్
    • హోదా, గ్లోబల్ డిస్‌ఇన్ఫర్మేషన్ టీమ్

రష్యాలోని స్కూళ్లతో పాటు యుక్రెయిన్ నుంచి ఆక్రమించిన భూభాగాల్లోని పాఠశాలల్లో పుతిన్ ప్రభుత్వం ఒక కొత్త మిలిటరీ సబ్జెక్టును ప్రవేశపెడుతోంది.

‘‘ఫండమెంటల్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ఆఫ్ ద మదర్‌ల్యాండ్’’ పేరుతో ఈ సబ్జెక్టును తీసుకొచ్చింది. 15-18 ఏళ్లు ఉన్న హైస్కూల్ విద్యార్థులకు 2024 సెప్టెంబర్ 1 నుంచి ఈ సబ్జెక్టును చదవడం తప్పనిసరి చేయనుంది.

ఈ సబ్జెక్టుకు చెందిన కొత్త పాఠ్యపుస్తకం కాపీని బీబీసీ పొందగలిగింది. పుస్తకంలోని 368 పేజీలను విశ్లేషించింది. అందులో యుద్ధం గురించి, యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా చేసిన తప్పుడు కథనాలతో పాటు, విద్యార్థుల్ని సైన్యంలో చేరాలంటూ రష్యా పిలుపునిచ్చినట్లు ఆ పుస్తకంలో ఉంది.

వారానికి ఒకసారి ‘‘ఫండమెంటల్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ డిఫెన్స్ ఆఫ్ ద మదర్‌ల్యాండ్’’ సబ్జెక్టును బోధిస్తారు. ఎంతోకాలంగా బోధిస్తున్న ‘ఫండమెంటల్స్ ఆఫ్ సేఫ్ లివింగ్’’ పాఠాన్ని ఇది భర్తీ చేస్తుంది. రష్యాలోని అన్ని పాఠశాలలతో పాటు యుక్రెయిన్ నుంచి రష్యా ఆక్రమించిన అయిదు రీజియన్లలోని పాఠశాలల్లో ఈ సబ్జెక్టును బోధించనున్నారు.

ఈ కొత్త సబ్జెక్టుకు టీచర్లుగా మాజీ సైనికులు వ్యవహరించే అవకాశం ఉంది. యుక్రెయిన్ యుద్ధం నుంచి తిరిగొచ్చిన, పెడగాజీలో డిగ్రీ చేసిన రష్యన్లకు స్కూల్ టీచర్ అయ్యేందుకు ఇప్పటికే ఉచిత శిక్షణా కార్యక్రమాల్ని అందిస్తున్నారు.

‘‘ఆరంభ మిలిటరీ ట్రైనింగ్ మాడ్యూల్‌ను మరింత ఆధునీకంగా, ఆకర్షణీయంగా మార్చేందుకు మేం ప్రయత్నిస్తాం’’ అని రష్యా ఎన్‌లైటెన్‌మెంట్ మినిస్టర్ సెర్గీ క్రావ్‌స్టోవ్ అన్నారు.

కొత్త సబ్జెక్టుకు చెందిన తొలి టెక్ట్స్‌బుక్ ‘‘ద రష్యన్ ఆర్మీ ఇన్ డిఫెన్స్ ఆఫ్ ద ఫాదర్‌ల్యాండ్’’ పుస్తకాన్ని ఎన్‌లైటెన్‌మెంట్ సంస్థ ప్రచురించింది. రష్యాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషన్ పబ్లిషర్ ‘ఎన్‌లైటెన్‌మెంట్’ సంస్థ. ఈ కంపెనీ టీచర్ల కోసం జనవరిలో ఆన్‌లైన్ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సెషన్‌ను బీబీసీ చూసింది.

‘‘ప్రియమైన ఉపాధ్యాయులారా, మన దేశ దృక్కోణం నుంచి మన విద్యార్థులకు సమాచారాన్ని అందించడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. విద్యార్థులకు మనం ప్రత్యామ్నాయ కోణాలను అందించలేం. కాబట్టి ఈ పుస్తకం మీకు, పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో, నిర్దిష్ట ఘటనల తాలూకూ కచ్చితమైన సమాచారాన్ని అందించడంలో ఉపయోగపడుతుంది’’ అని పబ్లిషింగ్ హౌజ్ ప్రతినిధి ఓల్గా ప్లెచోవా అన్నారు.

ఆ నిర్దిష్ట ఘటనలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, లెఫ్టినెంట్ జనరల్ రాఫెల్ టిమోషెవ్, రష్యన్ న్యూస్‌పేపర్ డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఇగోర్ చెర్న్‌యాక్, స్కూల్‌బుక్ సహ రచయితల సహాయం కోరింది.

దాడికి సాకుగా నాజీ రాకెట్ దాడులు

‘‘ద రష్యన్ ఆర్మీ ఇన్ డిఫెన్స్ ఆఫ్ ద ఫాదర్‌ల్యాండ్’’ పుస్తక కాపీని బీబీసీ సంపాదించింది. ఈ పుస్తకంలోని పేజీలన్నీ రష్యా సైనికుల వీరోచిత విజయాలను వివరించే కథలతో నిండి ఉన్నాయి. 13వ శతాబ్దం నుంచి నేటివరకు రష్యా సైనికులు సాధించిన ఘనతలను అందులో ప్రస్తావించారు.

రచయితలు ఈ పుస్తకంలో సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్‌ను ప్రశంసించారు. గ్రేట్ ప్యాట్రియాటిక్ వార్ (రెండో ప్రపంచ యుద్ధానికి రష్యా పెట్టుకున్న పేరు) సమయంలో సోవియట్ ప్రజల విజయాలను, రష్యాలో క్రిమియా ఏకీకరణ (యుక్రెయిన్ ద్వీపకల్పంలో ఆక్రమణకు రష్యా పిలిచే పేరు)లో రష్యా మిలిటరీ పాత్రపై ప్రశంసలు కురిపించారు.

పుస్తకంలోని ఒక ప్రత్యేక సెక్షన్‌, యుక్రెయిన్‌లో రష్యా మిలిటరీ ప్రత్యేక ఆపరేషన్ (యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి దండయాత్రకు రష్యా పెట్టుకున్న పేరు) గురించి ప్రస్తావిస్తుంది.

‘‘2014లో కీవ్‌లో తిరుగుబాటు జరిగినప్పుడు, రష్యాకు చెందిన అన్నింటి మీద కొత్త ప్రభుత్వం అణచివేతను ప్రారంభించింది. రష్యన్ పుస్తకాల్ని తగులబెట్టారు. కట్టడాల్ని ధ్వంసం చేశారు. రష్యన్ పాటలు, భాషలను నిషేధించారు. రెస్టారెంట్లలో రష్యన్ బ్లడ్ కాక్‌టెయిల్స్‌ను సర్వ్ చేశారు’’ అంటూ రచయితలు తప్పుడు కథనాలను పుస్తకంలో పొందుపరిచారు.

మరిన్ని తప్పుడు వివరణల్ని అందులో జోడించారు. ‘‘ఇలాంటి విధానాలకు వ్యతిరేకత కనబరిచిన లుహాన్స్క్, దోన్యస్క్ రీజియన్ల నగరాల్లో నాజీలు బాంబులు, రాకెట్లను ప్రయోగించారు’’ అని రాశారు.

‘‘యుద్ధం మొదలుపెట్టాలని యుక్రెయిన్, నాటోలు ప్రణాళిక రచించాయని టెక్ట్స్‌బుక్‌లో రచయితలు పేర్కొన్నారు. ఇంకా పుస్తకంలో రాసిన దాని ప్రకారం, 2022 ఫిబ్రవరి 19న మ్యూనిక్ సమావేశంలో, యుక్రెయిన్ అణ్వాయుధాలను సొంతం చేసుకునే యోచనలో ఉందంటూ రష్యాను యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియన్‌స్కీ బెదిరించారు. నాటో బలగాల మోహరింపు తర్వాత దోన్బస్‌పై నియంత్రణను తిరిగి చేజిక్కించుకునే, క్రిమియాను స్వాధీనం చేసుకునే యోచనలో కీవ్ ఉంది అంటూ పుస్తకంలో రాశారు. ఇక్కడితోనే ఆగకుండా, సరిహద్దుల వద్ద యుక్రెయిన్ బలగాలు, సాయుధ వాహనాల్ని భారీగా మోహరించారని పుస్తకంలో నొక్కి చెప్పారు.

ఇదంతా తప్పుడు సమాచారమని, అందులో ఉన్నవన్నీ అబద్ధాలేనని యుక్రెయిన్ రాజకీయ విశ్లేషకులు వొలొదిమీర్ ఫెసెంకో అన్నారు. మ్యూనిక్‌ ప్రసంగంలో జెలియన్‌స్కీ, బుడాపెస్ట్ మెమోరాండం గురించి ప్రస్తావించినట్లు ఆయన చెప్పారు. 1994లో కుదిరిన ఒప్పందం ప్రకారం యుక్రెయిన్ తన అణ్వాయుధాలను సరెండర్ చేయాల్సి ఉంది. ఇందుకు బదులుగా రష్యా సహా మరికొన్ని దేశాల నుంచి భద్రతా హామీని ఆ దేశం పొందుతుంది. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించినప్పుడు ఈ హామీల ఉల్లంఘన జరిగింది.

టెక్ట్స్‌బుక్స్‌లో పేర్కొన్న దానికి పూర్తి విరుద్ధంగా నిజ జీవితంలో జరిగిందని అన్నారు. 2021 చివర్ల నుంచి యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా మిలిటరీ మోహరింపుల పట్ల పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ ఈ ఉల్లంఘన గురించి సమావేశంలో నొక్కి చెప్పారని ఫెసెంకో వెల్లడించారు. మ్యూనిక్ సమావేశం ముగిసిన వెంటనే యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి దండయాత్రను రష్యా ప్రారంభించింది.

మరియుపూల్ నగరం నాజీలు, విదేశీ కిరాయి సైనికుల మధ్య యుద్ధంలో ధ్వంసమైందని పుస్తకంలో రష్యా తప్పుగా పేర్కొంది. మరియుపూల్‌పై నిజానికి రష్యా బాంబు దాడులు చేసినట్లు ఫెసెంకో చెప్పారు.

యుక్రెయిన్ పౌరుల భద్రతకు రష్యా ప్రాధాన్యం ఇస్తుందంటూ, అక్కడ జరిగిన విధ్వంసాన్ని స్వల్పస్థాయిలో పుస్తకంలో రష్యా ఎలా చూపించిందో బీబీసీ ఇంటర్వ్యూలో నిపుణులు హైలైట్ చేశారు. యుక్రెయిన్ తరచుగా పౌరుల మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకుంటుందంటూ, రష్యా మాత్రం సమగ్రతతో పోరాడుతుందంటూ పుస్తకంలో రాశారు.

‘‘కీవ్ రీజియన్‌లోని బుచా ప్రాంతంలో జరిగిన విషాదం అందరికీ గుర్తుంది. అక్కడ డజన్ల కొద్ది యుక్రెయిన్ పౌరుల్ని రష్యన్లు చంపేశారు. మహిళల్ని అత్యాచారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. ఇలాంటి డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం నేను పనిచేసిన ఖార్కియెవ్ నేషనల్ యూనివర్సిటీ భవనాన్ని రష్యా, ఖార్కియెవ్‌పై దాడి మొదలుపెట్టిన తొలిరోజే ధ్వంసం చేసింది. నా కూతుళ్లు చదువుకున్న పాఠశాలపై కూడా బాంబులు వేశారు. పౌరుల భవనాలను రష్యా ఘోరంగా ధ్వంసం చేసింది’’ అని ఫెసెంకో చెప్పారు.

పాఠశాల బెంచ్ నుంచి యుద్ధరంగానికి

‘‘ద రష్యన్ ఆర్మీ ఇన్ డిఫెన్స్ ఆఫ్ ద ఫాదర్‌ల్యాండ్’’ పుస్తకంలోని మరో సెక్షన్, రష్యా సైనిక బలగాల నిర్మాణం గురించి లోతైన అవలోకనంతో ప్రారంభం అవుతుంది. ఈ సెక్షన్‌లో ముందుకు వెళ్తున్నకొద్ది, 18 ఏళ్లు దాటిన వారు ఆర్మీలో చేరాలంటూ సూచిస్తుంది.

ఆర్మీలో చేరే ప్రక్రియ, కావాల్సిన పత్రాలు, ఫొటో సైజ్ వివరాలు, దరఖాస్తు ఫారమ్ లింక్, సమీపంలో దరఖాస్తు కార్యాలయాల అడ్రస్‌ల గురించి పుస్తకంలో పేర్కొన్నారు. ఉచిత వైద్య సంరక్షణ, ఇన్సూరెన్స్, ఆకర్షణీయ వేతనం, రోజుకు మూడు పూటల భోజనం వంటి ప్రయోజనాల గురించి పుస్తకంలో ప్రస్తావించారు.

ఒకవేళ ఎన్‌లిస్ట్‌మెంట్ కార్యాలయాల వద్ద పేర్లు నమోదు చేయించడంలో విఫలమైతే క్రెడిట్ తిరస్కరణ, కార్ డ్రైవింగ్‌పై నిషేధం, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌పై నిషేధం వంటి పరిమితుల గురించి కూడా అందులో పేర్కొన్నారు.

ఆక్రమిత క్రిమియా, దోన్బస్ భూభాగాల్లోని యువకులకు ఈ ఆర్థిక ప్రయోజనాలను చూపి ప్రలోభానికి గురిచేయవచ్చని క్రిమియా మానవహక్కుల సంఘం అధ్యక్షుడు ఓలా స్క్రిప్నిక్ హెచ్చరించారు.

‘‘ఆక్రమిత ప్రదేశాల్లోని యువకులకు అక్కడ డబ్బు సంపాదించే మార్గాలేవీ లేవు. ఇంత శాలరీ వారికి ఎక్కడ దొరుకుతుంది?’’ అని ఓలా అన్నారు.

కాబట్టి ఈ కొత్త పుస్తకం రష్యాకు సైనికుల్ని అందించేందుకు దోహదపడుతుంది. ‘‘ఈ పిల్లలంతా యుద్ధానికి వెళ్తారు. చనిపోతారు’’ అని ఆమె చెప్పారు.

రెండేళ్ల ఈ యుద్ధంలో రష్యా 20 ఏళ్ల లోపు ఉన్న 1,240కి పైగా సైనికుల్ని కోల్పోయింది. ఓపెన్ సోర్స్ సమాచారం ఆధారంగా బీబీసీ రష్యన్ సర్వీస్ ధ్రువీకరించిన మరణాల సంఖ్య మాత్రమే ఇది.

గ్రాఫిక్స్: ఏంజెలినా కోర్బా

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)