You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డ్రోన్లు, బెదిరింపులు, పేలుళ్లు: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి?
- రచయిత, జోయల్ గునిటో, జునా మూన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
దక్షిణ కొరియా తమ రాజధాని మీద డ్రోన్లు ఎగరవేసిందని ఉత్తర కొరియా ఇటీవల ఆరోపించింది. ఈ రెండు దేశాల మధ్య కొన్నాళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
దక్షిణ కొరియా డ్రోన్ల ద్వారా తమ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ప్రచార కరపత్రాలను వెదజల్లిందని ఉత్తర కొరియా ఆరోపించింది. ఇది రెచ్చగొట్టే చర్య అని, సాయుధ సంఘర్షణకు దారి తీస్తుందని హెచ్చరించింది.
సరిహద్దుల్లో బలగాలు కాల్పులు జరిపేందుకు సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా ఆదేశించింది.
ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు సౌత్ కొరియా ప్రకటించింది. తమ ప్రజల భద్రతకు భంగం కలిగితే “నార్త్ కొరియా కథ ముగిసినట్లే” అని హెచ్చరించింది. తర్వాత, నార్త్ కొరియా, సౌత్ కొరియాను కలిపే రహదారులలో కొన్ని భాగాలను పేల్చి వేసింది.
దీన్ని గతానుభవాల నుంచి నేర్చుకున్న పాఠంగా చూడవచ్చు.
తర్వాతి రోజు నార్త్ కొరియాలో 14 లక్షల మంది యువకులు సైన్యంలో చేరేందుకు లేదా సైన్యంలోకి తిరిగి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆ దేశం వెల్లడించింది.
సౌత్ కొరియా తన ప్రభుత్వానికి మొదటి శత్రువని 2024 జనవరిలో నార్త్ కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.
రెండు కొరియాల మధ్య ఏం జరుగుతోంది?
సౌత్ కొరియా రెండు వారాలుగా రాత్రి పూట ప్యాంగ్యాంగ్ మీదకు డ్రోన్లు పంపిస్తోందని అక్టోబర్ 11న నార్త్ కొరియా విదేశాంగ శాఖ ఆరోపించింది.
ఈ డ్రోన్ల ద్వారా వెదజల్లుతున్న కరపత్రాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు సమాచారం ఉందని పేర్కొంది.
మరోసారి డ్రోన్లు తమ భూభాగం మీద కనిపిస్తే “భయంకరమైన పరిణామాలు ఉంటాయని” నార్త్ కొరియా పాలకుడు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాను హెచ్చరించారు. ఈ రెచ్చగొట్టే చర్యల వెనుక సౌత్ కొరియన్ “సైనిక ముఠా నాయకులు ఉన్నట్లు” చెప్పేందుకు ఇవి ప్రత్యక్ష ఆధారాలని ఆమె అన్నారు.
ఆకాశంలో డ్రోన్లు ఎగురుతున్నట్లుగా ఆరోపిస్తూ నార్త్ కొరియా మసగ్గా ఉన్న చిత్రాలను విడుదల చేసింది.
ఈ చిత్రాలలో డ్రోన్లతో పాటు అవి వెదజల్లుతున్న కరపత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను స్వతంత్రంగా ధ్రువీకరించుకునేందుకు మార్గం లేకుండా పోయింది.
నార్త్ కొరియా మీదకు డ్రోన్లు పంపించామన్న ఆరోపణలను తొలుత సౌత్ కొరియా తిరస్కరించింది. ప్యాంగ్యాంగ్ ఆరోపణలను తాము తిరస్కరించడం లేదని అలాగని ఆమోదించడం లేదని సౌత్ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు.
అయితే, ఈ డ్రోన్లను స్థానిక కార్యకర్తలు ఎగరవేశారని స్థానికులు అనుమానిస్తున్నారు.
వాళ్లే ఆ సామగ్రిని నార్త్ కొరియా వైపు బెలూన్ల ద్వారా పంపించి ఉంటారని భావిస్తున్నారు.
వారం కిందట కిమ్ జోంగ్ ఉన్ సైన్యాధిపతులను కలిశారు. అంతర్గత భద్రత, రక్షణ శాఖల మంత్రులతో సమావేశం అయ్యారని నార్త్ కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది.
ఈ సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్ “ సత్వర సైనిక చర్యకు సంబంధించి సూచనలు” చెయ్యడంతో పాటు “శత్రువును ఎదుర్కొనే ఆపరేషన్‌తో పాటు ఆత్మరక్షణకు సంబంధించిన విన్యాసాలు” చేపట్టాలని చెప్పారు.
ఆ తర్వాత ప్రముఖ జియోంగుయ్, డోంఘే రోడ్లపై పేలుళ్లు సంభవించాయి.
ఈ రోడ్లను చాలా కాలం క్రితమే మూసివేశారు. ఈ రోడ్లను ధ్వంసం చెయ్యడం ద్వారా కిమ్ జోంగ్ ఉన్ తాను సౌత్ కొరియాతో చర్చలకు సిద్ధంగా లేననే సంకేతాన్ని పంపించారని విశ్లేషకులు అంటున్నారు.
రోడ్ల మీద పేలుళ్ల తర్వాత, తాము తమ బలాన్ని ప్రదర్శించేందుకు కొన్ని ఆయుధాలను పేల్చామని నార్త్ కొరియా వైపు నిఘాను పెంచామని సౌత్ కొరియన్ సైన్యం తెలిపింది.
ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత, రెండు కొరియాల మధ్య సరిహద్దుల్లో 11ప్రాంతాలు “ప్రమాదకరమైనవని” సోల్ నగరం చుట్టు పక్కల ఉన్న గ్యియోంగి ప్రావిన్స్ ప్రభుత్వం ప్రకటించింది.
తమ సరిహద్దుల నుంచి నార్త్ కొరియాకు వ్యతిరేకంగా కరపత్రాలను నార్త్ కొరియా వైపు పంపించడాన్ని ఆపేందుకు ఇలా చేసింది.
“నార్త్ కొరియాలో కరపత్రాలను విసరడం ప్రమాదకరమైన చర్య, అది సైనిక సంఘర్షణకు దారి తియ్యవచ్చు. దీన్ని ఆపేందుకు గ్యియోంగి ప్రావిన్స్ కట్టుబడి ఉంది” అని ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ కిమ్ సంగ్ జూంగ్ తెలిపారు.
ఉభయ కొరియాల అంతర్గత సంబంధాలు వేగంగా దిగజారుతున్నాయని, ఇలా కరపత్రాలను విసరడం ‘స్థానిక ప్రజల జీవితాలు, భద్రతకు ముప్పుగా మారుతుందని’ కిమ్ అన్నారు.
ఈ ప్రదర్శన ఏంటి?
నార్త్ కొరియా ప్రభుత్వం డ్రోన్ల సంఘటన గురించి ఆరోపించడం ద్వారా దేశానికి ముప్పు పొంచి ఉందని చెబుతూ దేశ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సౌత్ కొరియా గురించి ప్రస్తావిస్తూ “ప్రత్యేక రాష్ట్రాలు” “స్వదేశీయులు”, “ఏకీకరణ” లాంటి పదాలను ప్రయోగించడం కూడా వ్యూహంలో భాగమై ఉండవచ్చని ప్రొఫెసర్ కంగ్ డాంగ్ వన్ చెప్పారు. ఆయన బుసాన్‌లోని డంగ్ ఏ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం గురించి బోధిస్తున్నారు.
“ఉత్తర కొరియా పాలకులకు ఎప్పుడూ ఒక శత్రువు అవసరం. ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా బయట నుంచి ప్రమాదం పొంచి ఉందని చెబుతూ దేశంలో తమ ప్రభుత్వం పట్ల విధేయత పెరిగేలా చేస్తారు” అని ప్రొఫెసర్ కంగ్ చెప్పారు.
రెండు కొరియాల మధ్య దెబ్బకి దెబ్బ అనే పరిస్థితి ఉండటం వల్ల ఈ రెండు దేశాలు పందెం కోళ్లలా మారాయని, ఉద్రిక్తతల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
“ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశం కూడా ఏకాభిప్రాయ సాధనకు సిద్ధంగా లేదు” అని సోల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కొరియన్ స్టడీస్ ప్రొఫెసర్ కిమ్ డాంగ్ యుప్ చెప్పారు.
ఒకరినొకరు నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఈ సంక్షోభాన్ని వ్యూహాత్మకంగా ఎలా చక్కదిద్దాలా అని సోల్ ఆలోచిస్తోంది.
కొరియాలు యుద్ధం వైపు వెళుతున్నాయా?
ప్రస్తుతం అలాంటిదేమీ లేదని విశ్లేషకులు అంటున్నారు.
“ఈ పరిస్థితి యుద్ధానికి దారి తీస్తుందని నేను అనుకోవడం లేదు. నార్త్ కొరియా అంతర్గత పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు సైనిక సంఘర్షణను వాడుకుంటోంది” అని ప్రొఫెసర్ కంగ్ చెప్పారు.
“నార్త్ కొరియాకు పూర్తి స్థాయి యుద్ధం చేసే శక్తిపై సందేహాలున్నాయి. యుద్ధం జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని నార్త్ కొరియా పాలకులకు తెలుసు” అని ఆయన అన్నారు.
డ్రోన్ల వల్ల ప్రస్తుతం ఇరువైపుల మొదలైన వాదనలు కేవలం మాటల యుద్ధం మాత్రమే కావచ్చని ప్రొఫెసర్ నమ్ సుంగ్ వూక్ చెప్పారు.
ఎందుకంటే పూర్తిస్థాయి యుద్ధాన్ని తాము భరించలేమని ఈ రెండు దేశాలకు తెలుసు. యుద్ధం వస్తే అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం కూడా తక్కువే అని ప్రొఫెసర్ నమ్ అన్నారు.
1953లో కొరియాల యుద్ధం ముగిసిన తర్వాత ఈ రెండు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకం చెయ్యలేదు. దీంతో సాంకేతికంగా అవి యుద్ధం చేస్తున్నట్లే భావించాలి.
కిమ్ జోంగ్ ఉన్ నార్త్ కొరియాను సౌత్ కొరియా భాగస్వాములైన అమెరికా, పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా వ్లాదిమిర్ పుతిన్ పాలనలోని రష్యాకు చేరువగా చేర్చారు.
అలాగే చాలా కాలంగా చైనాతో ఉన్న సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. డ్రోన్ల సంఘటన తర్వాత ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాలు ముందుకు రావాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పిలుపిచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఇంటింటికీ చేరుకోవడంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)