విదేశీ భర్తల చేతిలో మోసపోయిన మహిళలు న్యాయ పోరాటానికి రూ.2.45 లక్షల సాయం పొందడం ఎలా?

    • రచయిత, ఎ.కిశోర్‌బాబు
    • హోదా, బీబీసీ కోసం

విదేశీ భర్త లేదా ఎన్ఆర్ఐల చేతిలో మోసపోయే మహిళలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఎవర్ని సంప్రదించాలో, ఎవర్ని అడగాలో తెలియక వారు మానసిక వేదనకు గురవుతుంటారు.

తామున్న పరాయి దేశంలో వకీలును పెట్టుకుని న్యాయ పోరాటం చేద్దామన్నా అది ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తుంది.

ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనున్న మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అమలుచేస్తోంది. న్యాయ పోరాటం చేయడానికి, పరిహారం పొందడానికి వీలుగా దీన్ని తీసుకొచ్చింది..

ఇలాంటి మహిళలకు 2000 డాలర్ల (రూ.1.63 లక్షలు) నుంచి 3000 డాలర్ల (రూ.2.45 లక్షలు) ఆర్థిక సహాయం అందిస్తోంది.

ఈ పథకం ఏమిటి, దరఖాస్తు చేసుకోవడం ఎలా? తదితర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏమిటీ ప‌థ‌కం?

విదేశాల్లో ఉన్న ప్ర‌వాస భార‌తీయుల‌ను లేదా విదేశీయుల‌ను పెళ్లి చేసుకున్న భార‌తీయ మ‌హిళ‌ల కోసం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం ఇది.

కేంద్ర ప్రభుత్వ జాతీయ మహిళా కమిషన్ గణాంకాల ప్రకారం ఇలా ఎన్ఆర్ఐలను వివాహం చేసుకున్న మహిళల నుంచి ఫిర్యాదుల విభాగానికి గత ఏడేళ్లలో 6000కుపైగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 2000 పైగా కేసులు విడాకులకు సంబంధించినవే.

ఇలాంటి మ‌హిళ‌లు త‌మ భ‌ర్త నుంచి విడాకులు లేదా భ‌ర‌ణం లేదా ఆస్తి హ‌క్కులు పొంద‌డం త‌దిత‌ర అంశాల‌పై విదేశీ కోర్టుల్లో పోరాటం చేయాల్సి వ‌స్తుంటుంది. ఇది ఎంతో ఖ‌ర్చుతో కూడుకున్న‌ది.

ఈ ప‌రిస్థితుల్లో ఆర్థికంగా చేయూత ఇవ్వ‌డంతో పాటు మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయ‌డానికి వారికి కౌన్సెలింగ్ లాంటివి కూడా ఇచ్చి కేంద్రం భ‌రోసా క‌ల్పిస్తుంది.

కేంద్ర ప్ర‌భుత్వ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ, నేష‌న‌ల్ క‌మిష‌న్ ఫ‌ర్ వుమెన్ ఈ ప‌థ‌కాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్నాయి.

ఎంత ఆర్థిక సాయం వస్తుంది?

ఇలాంటి మ‌హిళ‌లకు కేంద్ర ప్ర‌భుత్వం వారి కేసు స్థాయిని బ‌ట్టి వారు ఉంటున్న దేశ ప‌రిస్థితిని బ‌ట్టి 2000 డాల‌ర్ల (రూ.1.63 లక్షల)నుంచీ 3000 డాల‌ర్ల(రూ.2.45 లక్షలు) వ‌ర‌కు ఆర్థిక సాయం చేస్తుంది.

  • అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, మ‌లేసియాతోపాటు యూరప్ దేశాల్లో ఉన్న మ‌హిళ‌ల‌కు 3000 డాల‌ర్ల (రూ.2.45 లక్షలు) వ‌ర‌కు సాయం చేస్తారు.
  • గ‌ల్ఫ్ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నవారికి 2000 డాల‌ర్ల (రూ.1.63 లక్షల) వ‌ర‌కు ఆర్థిక సాయం చేస్తారు.

ఎలాంటి అంశాల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది?

విదేశీ భ‌ర్త చేతిలో వేధింపుల‌కు, నిర్ల‌క్ష్యానికి, హింస‌కు గురైన మ‌హిళ‌లకు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది

ఈ కేసులు ప్ర‌ధానంగా

  • భార్యను విడిచిపెట్టడం
  • వరకట్నం ఇవ్వాలని వేధించడం
  • అత్తింటివారు పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవడం
  • పిల్లలను బాధిత మహిళ దగ్గర నుంచి తీసేసుకోవడం
  • భరణం పొందడంలో సాయం కోసం
  • భార్యను నిర్లక్ష్యం చేసినప్పుడు..
  • విదేశాల్లో కోర్టు ప్రక్రియల్లో సాయం కోసం

నేరుగా మ‌హిళ‌ల‌కే ఈ డ‌బ్బు ఇస్తారా?

నేరుగా అంద‌జేయ‌రు. ఇలా న్యాయ‌ స‌హాయం కోరుకున్న మ‌హిళ‌లు వారుంటున్న దేశంలోని భారత రాయ‌బార కార్యాల‌యాన్ని సంప్ర‌దించాలి.

అక్క‌డ రాయ‌బార కార్యాల‌యం గుర్తింపు పొందిన కొన్ని సంస్థ‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఉంటాయి.

వారి ద్వారా ఆ మ‌హిళ‌ల‌కు కావాల్సిన ఆర్థిక సాయం చేస్తారు

ఈ ప‌థ‌కానికి ఎవరు అర్హులు?

  • ఈ ప‌థ‌కం కేవ‌లం మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే.
  • త‌ప్ప‌నిస‌రిగా ఆ మ‌హిళ విదేశాల్లో ఉంటున్న ప్ర‌వాస భార‌తీయుణ్ని లేదా విదేశీయుణ్ని వివాహం చేసుకుని ఉండాలి.
  • మ‌హిళ త‌ప్ప‌నిస‌రిగా భార‌త ప్ర‌భుత్వం జారీ చేసిన పాస్‌పోర్టు క‌లిగి ఉండాలి.
  • ఆమె త‌న భ‌ర్త చేతిలో వేధింపుల‌కు గుర‌వ‌డం, నిరాదర‌ణ‌కు గుర‌వ‌డం, లేదా మోసపోవడం లేదా హింస‌కు గురికావ‌డం లాంటివి జ‌రిగి ఉండాలి.

ఎన్ని సంవ‌త్స‌రాలు ఉండాలి?

విదేశీయుడు లేదా ప్ర‌వాస భార‌తీయుడితో వివాహం జ‌రిగి 15 ఏళ్లు పూర్తికాని వారు ఈ ప‌థ‌కానికి అర్హులు.

ఏయే ప‌త్రాలు స‌మ‌ర్పించాలి?

ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్పుడు ఈ కింది ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రిగా పొందుప‌ర‌చాలి.

  • గుర్తింపు కార్డు
  • జన‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
  • జాతీయ‌త ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (Signed Undertaking about Nationality)
  • చిరునామా ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
  • వివాహ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (Marriage Certificate)
  • వివాహం ద్వారా ఆ దంప‌తుల‌కు సంక్రమించిన సంతానం వివ‌రాలు, వారి పుట్టిన తేదీ, వ‌య‌సు వివ‌రాల‌ పత్రాలు
  • పాసుపోర్టు కాపీ
  • వివాహిత ఉద్యోగ వివ‌రాలు
  • విడాకులు కోరుతూ న్యాయ‌స్థానంలో దాఖ‌లు చేసిన పిటిష‌న్ కాపీ
  • వివాహిత మీద ఏవైనా క్రిమిన‌ల్ కేసులుంటే వాటి వివ‌రాల కాపీ

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డ‌మెలా?

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆఫ్‌లైన్‌లోనే ఉంటుంది.

ద‌ర‌ఖాస్తును ఈ కింది వెబ్‌లింక్‌లో డౌన్‌లోడ్ చేసుకుని అందులో అడిగిన వివ‌రాల‌న్నీ పూర్తీ చేయాలి.

https://www.mea.gov.in/images/pdf/proforma-legal-assistance.pdf

ఇలా పూరించిన ద‌ర‌ఖాస్తును వివాహిత ఉంటున్న దేశంలోని భార‌త రాయ‌బార కార్యాలయంలో స‌మ‌ర్పించాలి.

విదేశాల్లోని రాయ‌బార కార్యాల‌యాల వివ‌రాల ఎక్క‌డ ఉంటాయి?

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా వివిద దేశాల్లోని భార‌త రాయ‌బార కార్యాల‌యాల వివ‌రాల‌ను విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ త‌న వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చింది.

https://www.mea.gov.in/images/pdf/proforma-legal-assistance.pdf

ఎన్ఆర్‌ఐ లేదా విదేశీయుడైన భ‌ర్త మ‌ర‌ణించారు. ఈ కేసులో ప‌రిహారం పొందొచ్చా?

త‌ప్ప‌కుండా.

విదేశీ భ‌ర్త చేతిలో మోస‌పోయిన మ‌హిళ‌ల‌కు సాయ‌ప‌డే ఎన్‌జీవోల వివ‌రాలు పొంద‌డ‌మెలా?

ఈ వివ‌రాల‌న్నీ కూడా ఈ వెబ్ లింక్‌లో తెలుసుకోవ‌చ్చు. https://www.mea.gov.in/images/pdf/proforma-legal-assistance.pdf

బాధిత మ‌హిళ‌లు సంప్ర‌దించాల్సిన చిరునామా

ఎన్నారై సెల్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్

ప్లాట్ నం. 21, జసోలా ఇనిస్టిట్యూషనల్ ఏరియా

న్యూదిల్లీ-110025

ఫోన్ నంబర్స్ : 011 - 26942369, 26944740, 26944754, 26944805, 26944809

మెయిల్: [email protected]

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)