భారత్‌: పిల్లలు ఎత్తు పెరగకపోవడానికి, కులవివక్షకు సంబంధం ఉందా?

    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సబ్ -సహారా ఆఫ్రికా ప్రాంతంతో పోల్చితే భారత్‌లో పిల్లలు తక్కువ ఎత్తు కలిగి ఉండటానికి దశాబ్దాల కులవివక్ష కూడా కారణమని కొత్త అధ్యయనం ఒకటి వెల్లడించింది.

ప్రపంచంలో 5 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో 44 శాతం మంది ఈ రెండు ప్రాంతాల్లోనే ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా తగినంత ఎత్తులేని పిల్లలలో 70 శాతం మంది ఇక్కడే ఉన్నారు. పోషకాహార లోపానికి ఇదో స్పష్టమైన సంకేతం.

పోషాకాహారలోపాన్ని నివారించేందుకు ఈ రెండు ప్రాంతాలు కొన్నాళ్లుగా గణనీయమైన వృద్ధి సాధించినప్పటికీ, భారత్ రేటు 35.7 శాతంగా ఉంటే, సబ్-సహారా ఆఫ్రికాలోని 49 దేశాల సగటు 33.6 శాతంగా ఉంది.

ఒక పిల్లాడు తన వయసుకు తగినంత ఎత్తు లేకపోవడాన్ని లోపంగా పరిగణిస్తారు. పోషకాహార లోపానికి ఇదో స్పష్టమైన సంకేతం.

సబ్-సహారా ఆఫ్రికాలోని పిల్లల కంటే భారత్‌లోని పిల్లల ఎత్తు ఎందుకు తక్కువగా ఉందనే అంశంపై పరిశోధనలు చేశారు. అందులో భాగంగా పోషకాహార లోపానికి కుల వివక్ష కూడా ఒక కారణంగా గుర్తించారు.

పిల్లలకు సంబంధించిన మొదటి వెయ్యి రోజుల కాలాన్ని ‘గోల్డెన్ పీరియడ్’ గా చెబుతుంటారు. 2 ఏళ్ల వయసు వచ్చేసరికి మెదడు 80 శాతం వృద్ధి చెంది, జీవితకాల సామర్థ్యానికి పునాది వేస్తుంది. ఈ పసితనపు రోజుల్లోనే వారికి అందించే ఆరోగ్య సంరక్షణ, మంచి పోషకాహారం, విద్య, మెరుగైన వాతావరణం వంటివి వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

వేగంగా వృద్ధి చెందుతున్న మధ్య తరగతి కుటుంబాలు, యువత జనాభా, గణనీయమైన శ్రామిక శక్తి తదితర విషయాలలో దీర్ఘకాలంగా భారత్, సబ్-సహారా ఆఫ్రికాలకు పోలికలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలలో 85 శాతం మంది సబ్-సహారా ఆఫ్రికా, దక్షిణాసియాలోనే (ఇండియా సహా) ఉన్నారని వరల్డ్ బ్యాంక్ 2021లో ఇచ్చిన ఒక నివేదికలో తెలిపింది.

వెనుకబడిన వర్గాల్లో ఎక్కువగా పోషకాహార లోపం

అధికారిక సమాచారాన్ని ఉపయోగించి భారత్‌తో పాటు సబ్-సహారా ఆఫ్రికాలోని 19 దేశాల మధ్య ఎత్తుకు సంబంధించిన అంతరాలను పరిశోధకులు పరిశీలించారు.

అధికార లెక్కల ప్రకారం భారత్‌లో 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు 13.7 కోట్లమంది ఉన్నారు. వారిలో 35 శాతం మంది వయసుకు తగినంత ఎత్తును కలిగి లేరు. అలాగే, ప్రతి ముగ్గురిలో ఒకరు తక్కువ బరువుతో ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే 5 ఏళ్ల లోపు వయసున్న 22 శాతం మంది వయసుకు తగినంత ఎత్తు కలిగి లేరు.

ఈ అంశంపై భారత్‌లో సామాజికంగా వెనుబడిన ఆరు వర్గాలను పరిశోధకులు పరిశీలించారు. ఆ జాబితాలో ఆదివాసీ (మారుమూల ప్రాంతాలలో నివసించేవారు) దళిత వర్గాలు ఉన్నాయి. 5 ఏళ్ల కంటే తక్కువ వయసు గల పిల్లల జనాభాలో మూడోవంతు కంటే ఎక్కువగా ఈ వర్గాల్లోనే ఉన్నారు.

భారత్‌లోని ఉన్నతకులాలు, సామాజిక వివక్షలేని వర్గాల పిల్లల్లో తక్కువ ఎత్తు కలిగినవారి శాతం 27గా ఉంది. ఇది సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల కంటే తక్కువ.

భారత్‌లో వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలతో పోల్చితే అగ్రవర్ణాలకు చెందిన పిల్లల్లో వయసుకు తగినంత ఎత్తు లేనివారు 20 శాతం తక్కువగా ఉన్నారని గుర్తించారు.

ఈ అంతరాలను తగ్గించేందుకు 7 దశాబ్దాలుగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కుల వ్యవస్థ లోతుగా పాతుకుపోవడంతో తగిన ఫలితాలు కనిపించడం లేదు.

“భారత్‌లో సంపన్న వర్గాలకు చెందిన పిల్లలు కేలరీలు తీసుకునే అవకాశం ఎక్కువగా, వ్యాధికి గురయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుసుకోవడం ఆశ్చర్యం కలిగించదు” అని పరిశోధకులు తెలిపారు.

తక్కువ ఎత్తుకు గల కారణమేంటి?

భారత్‌లోని పిల్లల్లో తక్కువ ఎదుగుదల రేటుకు గల కారణాలపై అనేక సంవత్సరాలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

సాధారణంగానే జన్యువుల కారణంగా భారత్‌లోని పిల్లలు తక్కువ ఎత్తును కలిగి ఉంటారని కొంతమంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

అయితే జన్యు పరంగా ఎలా ఉన్నప్పటికీ తరతరాలుగా మెరుగైన పోషకాహారం అందిస్తే ఎత్తులో పెరుగుదల కనిపిస్తుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్య అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే వివిధ వర్గాల్లోని జీవన స్థితిగతులు మెరుగుపడటం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, పోషకాహారం తీసుకోవడం వంటివాటి కారణంగా భారత్‌లో తక్కువ ఎత్తు పెరుగుదల లోపం క్రమంగా తగ్గుతోందని 2022లో ఒక అధ్యయనం స్పష్టం చేసింది.

అయినప్పటికీ, అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలే ఎక్కువగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

2010 నుంచి చూసుకుంటే ఆఫ్రికా దేశాల్లో తక్కువ ఎత్తు పెరుగుదల రేటు తగ్గుతూ వస్తోంది.

పిల్లలు వయసుకు తగినంత ఎత్తు పెరగకపోవడానికి పేద కుటుంబాల్లో, వెనుకబడిన వర్గాల్లో పుట్టడం, అంతగా చదువుకోని తల్లులు ఉండటం వంటివి కారణాలుగా చెబుతున్నారు.

“ పిల్లల్లోని ఎత్తు అంతరాలపై సబ్-సహారా ఆఫ్రికా, భారత్‌ మధ్య చర్చ జరిగినప్పుడు వెనుకబడిన వర్గాలు, కులాల స్థితిగతుల పాత్ర కీలమైనది” అని పరిశోధకులు తెలిపారు.

“భారత్‌లో బాలల పోషకాహార భారాన్ని అర్థం చేసుకోవడానికి ఇదో కీలకమైన అంశం” అని అధ్యయనం స్పష్టం చేసింది.

(ఈ విశ్లేషణ కోసం జనాభా, ఆరోగ్య సర్వేలకు సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించారు. భారత్‌లోని వివరాల కోసం 2019-2021 మధ్యలోని సమాచారం, సబ్-సహారా ఆఫ్రికన్‌‌ దేశాలలోని 19 దేశాలకు సంబంధించి 2015 తరువాతి సమాచారాన్ని తీసుకున్నారు. అయిదేళ్లలోపు వయసు గల వారిని భారత్ నుంచి 1,95,024, సబ్-సహారా ఆఫ్రికా నుంచి 2,02,557 మంది వివరాలను ఇందు కోసం ఉపయోగించారు.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)