చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ: ‘జీవో నంబర్ 1పై ఎలా పోరాడాలనే అంశంపై చర్చించాం’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, బ్రిటిష్ కాలం నాటి జీవోతో ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని జనసేన, టీడీపీ అధినేతలు పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు ఆరోపించారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఆదివారం నాడు భేటీ అయ్యారు.

హైదరాబాద్‌లో ఉన్న పవన్, హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం 11.40 ప్రాంతంలో బాబు ఇంటికి పవన్ చేరుకున్నారు. దాదాపు గంటన్నర సేపు ఇరువురూ సమావేశమయ్యారు.

అనంతరం ఇద్దరు నాయకులూ మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘‘కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్నారు. వైజాగ్‌లో నన్ను అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేతలు కారు ఎక్కకూడదు, దిగకూడదు అంటూ ఆంక్షలు పెట్టి తిరగకుండా చేస్తున్నారు’’ అని పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘‘జీవో నంబర్ 1పై ఎలా పోరాడాలి అనే దానిపై చర్చించాం. భవిష్యత్తులో ఈ జీవోను వెనక్కు తీసుకునేలా ఏం చేయాలనేది చంద్రబాబుతో మాట్లాడాను’’ అని తెలిపారు.

‘‘కుప్పంలో జీవో నంబరు 1 తీసుకొచ్చిన తర్వాత సంఘీభావం తెలియజేసేందుకు పవన్ కల్యాణ్ వచ్చారు’’ అని చంద్రబాబు చెప్పారు.

‘‘ఇప్పటం లోనూ ఇలానే చేశారు. అప్పట్లోనూ కారు ఎక్కకూడదు. ఇలా చేయకూడదు అని ఆంక్షలు విధించారు. మేం ఎక్కడకు వెళ్లినా ఇలాంటి ఆంక్షలే పెట్టారు. మొన్న జరిగింది మాత్రం పరాకాష్ట. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

‘‘ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు...’’

‘‘40 ఏళ్లకు ముందు ఇదే రోజు ఎన్‌టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు దశాబ్దాలు పూర్తయ్యాయి. ప్రతి రాజకీయ పార్టీకి ప్రణాళికలు ఉంటాయి. కానీ, వైసీపీ మాత్రం నేరాలు, రౌడీయిజం, వ్యవస్థలను నాశనం చేయడం లాంటి ఆయుధాలతో ముందుకు వెళ్తోంది’’ అని చంద్రబాబు అన్నారు.

‘‘నా నియోజకవర్గంలోనే ప్రజలకు పరామర్శించడానికి వెళ్తే నన్ను రానీయకుండా 2,000 మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. ఆంక్షలతో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు’’అని ఆయన వివరించారు.

‘‘నల్ల జీవో తెచ్చి ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో-01 ఆమోదనీయం కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘వంద మంది ఒక దగ్గరకు వస్తే, పోలీసులు భద్రత కల్పించాలి. వారే అన్నీ చూసుకోవాలి. కానీ, అసలు మీటింగులే పెట్టొద్దంటే ఎలా? మీరు మాత్రం మీటింగులు పెట్టుకోవచ్చు. మేం పెట్టకూడదా?’’ అని ఆయన ప్రశ్నించారు.

‘‘కందుకూరు, గుంటూరుల్లో జరిగింది వైసీపీ కుట్ర. దీన్ని అమలుచేసింది పోలీసులే’’ అని బాబు ఆరోపించారు.

బీజేపీతో కూడా చర్చిస్తాం: పవన్ కల్యాణ్

‘‘ఈ రోజు జీవో నంబరు 1పైనే మేం చర్చించాం. ఇతర అంశాలపై మాట్లాడలేదు’’అని చంద్రబాబు చెప్పారు.

నిబంధనలన్నీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందని పవన్ కల్యాణ్ అన్నారు.

‘‘ప్రతిపక్షాలు బయటకు రాకూడదు. మాట్లాడకూడదు. ఇదే వారి లక్ష్యం. అసలు ప్రజల్లోకి వెళ్లకూడదు అనేదే వారి ఉద్దేశం’’ అని ఆయన విమర్శించారు.

‘‘అసలు ఎంతమంది వచ్చినా పోలీసులు యంత్రాంగం చూసుకోవాలి. మేం ముందుగానే అనుమతులు తీసుకునేటప్పుడే అన్నీ చెబుతాం. కానీ, ఇప్పుడు పోలీసులే సంబంధం లేదంటే ఏం చేస్తాం. లాఠీలు కూడా మేమే పట్టుకోవాలా? అప్పుడు పోలీసులు ఎందుకు? ప్రభుత్వం ఎందుకు? అసలు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం అవుతోంది’’ అని పవన్ అన్నారు.

‘‘ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో వైసీపీ విశ్వరూపం చూపిస్తుంది. ఎన్ని రకాలు కేసులు పెట్టాలి? హత్యలు చేయాలి లాంటివి అన్నీ వారు ముందే సిద్ధమయ్యారు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.

వైసీపీ అరాచకాలపై బీజేపీతోనూ చర్చిస్తామని ఆయన వివరించారు.

‘‘వైసీపి సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తే గుంటూరు సభకు అంతమంది ఎందుకు వస్తారు’’ అని ఆయన ప్రశ్నించారు.

అయితే జగన్ ప్రభుత్వాన్ని చూస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వణుకుతున్నారని వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

పవన్ కల్యాణ్ ను వాడుకుని కాపు ఓట్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ అది సాధ్యం కాదని అంబటి అన్నారు.

రెండు పార్టీలు కలిస్తే తప్ప జగన్ ను ఎదుర్కోలేమని చంద్రబాబు, పవన్‌లకు అర్ధమైందని, నిజంగా ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత ఉంటే వారు విడివిడిగా ఎందుకు పోటీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)