#IStandWithVirat: విరాట్ కోహ్లీ వీడియోపై విమర్శల వెల్లువ... ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్

దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ విరాట్ కోహ్లీ ఒక వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసారు.

"మీకూ మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళికి టపాకాయలు కాల్చకండి. పర్యావరణాన్ని సంరక్షించండి. ఇంట్లో దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి" అంటూ ఆ వీడియోలో కోహ్లీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. చాలామందికి ఈ వీడియోలో కోహ్లీ ఇచ్చిన సందేశం నచ్చలేదు. కానీ, మరెంతో మందికి నచ్చింది. వారంతా విరాట్‌కు మద్దతు తెలుపుతూ #IStandWithVirat (ఐ స్టాండ్ విత్ విరాట్) హ్యాష్ ట్యాగ్‌ను మొదలుపెట్టారు.

విరాట్ ఈ వీడియోలో టపాసులు పేల్చొద్దు అంటూ ఇచ్చిన సందేశం అనేకమందికి రుచించలేదు. వారంతా విరాట్, అనుష్కలను విమర్శిస్తూ ట్వీట్ చేసారు. విరాట్ సందేశాన్ని పలు విధాల ట్రోల్ చేశారు.

అయితే, పర్యావరణం గురించి కోహ్లీ ఇచ్చిన సందేశం కొత్తదేం కాదు. దీపావళికి టపాకాయలు కాల్చొద్దని, కాలుష్యాన్ని నివారించమని ప్రభుత్వం, కోర్టులు కూడా విజ్ఞప్తి చేసాయి.

కానీ విరాట్ వీడియోపై అనేకమంది ప్రతికూలంగా స్పందించారు.

కొన్ని రోజుల క్రితం విరాట్ పుట్టినరోజునాడు టపాసులు పేల్చిన విషయాన్ని గుర్తు చేస్తూ అప్పుడు ఇలాంటి సందేశాలేమీ ఇవ్వలేదేమని అనేకమంది విమర్శించారు.

"మేము పండుగ జరుపుకుంటున్నరోజే మీ జ్ఞానాన్ని మాకు పంచక్కర్లేదు. మా పండుగ మీ సామాజిక అవగాహన ప్రచారానికి వేదిక కాదు" అంటూ సోనికా శర్మ అనే యూజర్ ట్వీట్ చేశారు.

"క్రికెట్ బాగా ఆడుతారని మీరంటే మాకిష్టం. దానర్థం మీరేదో మాకు నాయకులైపోయారని కాదు. మాకు ఉపదేశాలు ఇవ్వడం ఆపండి. అందుకు మీకు అర్హత లేదు" అంటూ నిషీత్ శరణ్ వ్యాఖ్యానించారు.

"ఇతను ఐపీఎల్ ఫైనల్లో క్రాకర్స్ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మరి ఇదే సందేశాన్ని బీసీసీఐకిగానీ ఐపీఎల్ నిర్వాహకులకు గానీ ఇచ్చారా? మనకి మాత్రం ఎందుకు చెప్తున్నారు?" అని ఆశిష్ ట్వీట్ చేసారు.

మరి కొంతమంది కోహ్లీ జీవనశైలిని, వినియోగిస్తున్న కార్లను, విమాన ప్రయాణాలను విమర్శించారు. వీటన్నింటి వల్లా పర్యావరణానికి కలగని హాని దీపావళినాడు టపాసులు పేలిస్తే మాత్రమే కలుగుతుందా? అంటూ విమర్శలు గుప్పించారు.

అయితే, మరో పక్క అనేకమంది అభిమానులు విరాట్ కోహ్లీ సందేశాన్ని సమర్థిస్తూ ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేసారు.

"దీపావళి అంటే దీపాల పండుగ. టపాకాయల పండుగ కాదు. అతను చెప్పినదాన్లో తప్పేమీ లేదు" అంటూ అనిల్ ఎస్ అనే యూజర్ కోహ్లీని సమర్థించారు.

"విమర్శలకు భయపడి అనేకమంది సెలబ్రిటీస్ ఇలాంటి సందేశాలు ఇవ్వడానికి జంకుతారు. కానీ విరాట్ ధైర్యంగా ఈ సందేశాన్ని ఇచ్చారు. అందుకే, ఆయనంటే నాకు చాలా ఇష్టం" అంటూ ఆర్య వ్యాఖ్యానించారు.

"విరాట్ మన దేశానికి గర్వకారణం" అంటూ యశస్విని రావు ట్వీట్ చేశారు.

షాలిని అనే యూజర్ కూడా కోహ్లీని మెచ్చుకున్నారు. ఆయన కళ్లల్లో క్రికెట్ పట్ల ప్రేమ కనిపిస్తూనే ఉంటుందని అన్నారు.

"గొప్ప క్రికెట్ ఆడి విరాట్ అభిమానులందరినీ ఎంతో మురిపించారు. క్రికెట్ పట్ల ప్రేమ ఆయన కళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది. విమర్శలు చేసేవాళ్లను పట్టించుకోకండి. వీళ్లే మళ్లీ మీరు బాగా ఆడి ఇండియాను గెలిపించాలని ప్రార్థనలు చేస్తారు" అంటూ షాలిని అనే యూజర్ కోహ్లీకి మద్దతు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)