You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

హైదరాబాద్‌లోని సీనియర్ జర్నలిస్ట్ 'వీక్షణం' వేణుగోపాల్ నివాసంలో ఎన్ఐఏ సోదాలు

హైదరాబాద్‌లో సీనియర్ జర్నలిస్టు, వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్, రవిశర్మల నివాసాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచీ ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.

    గుడ్ నైట్.

  2. బ్రేకింగ్ న్యూస్, ఉత్తరాఖండ్: హల్ద్వానిలో మదర్సా కూల్చివేత, చెలరేగిన ఉద్రిక్తతలు, రాజేష్ దోబ్రియాల్, బీబీసీ హిందీ కోసం, డెహ్రాడూన్ నుంచి...

    ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపిస్తున్న మదర్సాను అధికారులు కూల్చివేయడంతో గురువారం ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

    పరిస్థితిని అదుపులో ఉంచేందుకు, కూల్చివేత స్థలం వద్ద నిరసనకారులపై కాల్పులు జరపాలని ఆదేశాలను జారీ చేశారు.

    ఈ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ కర్ఫ్యూను విధించారు. గురువారం రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.

    స్థలాన్ని ఆక్రమించడం ద్వారా ఈ మదర్సాను నిర్మించినట్లు వార్తా సంస్థ పీటీఐ రిపోర్టు చేసింది. ఈ మదర్సా బంభుల్‌పురా పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉంది.

    కోర్టు ఆదేశాల ప్రకారం అక్రమ ఆక్రమణను తొలగించేందుకు పరిపాలన యంత్రాంగం వెళ్లిందని, ఆ సమయంలో కొందరు పోలీసులతో ఘర్షణకు దిగారని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

    ‘‘పోలీసులకు, అధికారులకు గాయాలయ్యాయి. వెంటనే భద్రతా బలగాలను, ఇతర పోలీసులను అక్కడికి పంపించాం. శాంతియుతంగా ఉండాలని మేం ప్రతి ఒక్కర్ని అభ్యర్థిస్తున్నాం. కర్ఫ్యూను అమలు చేశాం. ఎవరైనా ఆందోళనలు చేసినా, ఘర్షణలకు దిగినా వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ధామి చెప్పారు.

    మదర్సాను కూల్చివేసిన తర్వాత, చాలా మంది నిరసనకారులు రాళ్లు రువ్వారు. వాహనాలకు నిప్పంటించారు.

    బంభుల్‌పురా పోలీస్ స్టేషన్‌పై నిరసనకారులు దాడి చేశారు. పలు పోలీసు వెహికిల్స్‌కు నిప్పంటించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ షెల్స్‌ను ప్రయోగించారు. లాఠీ ఛార్జ్ చేశారు. పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ‘షూట్ ఎట్ సైట్’ ఆర్డర్‌ను జారీ చేశారు.

    ఈ సంఘటనలో పలువురు జర్నలిస్ట్‌లకు గాయాలు పాలయ్యారు. ఆందోళనకారుల చేతుల్లో జర్నలిస్ట్‌ల వాహనాలు, స్కూటర్లు కూడా ధ్వంసమయ్యాయి.

  3. రేవంత్ రెడ్డి X కేసీఆర్: ముఖ్యమంత్రులు బూతులు మాట్లాడొచ్చా? నేతల దిగజారుడు భాషను ఎలా చూడాలి?

  4. పాకిస్తాన్ ఎన్నికలు: ఓటింగ్ రోజు ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులు బంద్

    పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేశారు. ఈ సేవల నిలిపివేతపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి.

    ‘‘దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల ఘటనలతో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు భద్రతా చర్యలను చేపట్టాల్సి ఉంది. రాబోయే ముప్పులను అరికట్టేందుకు, దేశంలో తాత్కాలికంగా మొబైల్ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించాం’’ అంటూ పాకిస్తాన్ హోం శాఖ ఒక ప్రకటనను జారీ చేసింది.

    బుధవారం బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జరిగిన రెండు భీకర బాంబు దాడుల్లో 28 మంది మృతి చెందారు.

    ఈ చర్యను పౌర హక్కులు కాలరాయడం, ప్రజాస్వామ్యాన్ని అపహ్యాసానికి గురిచేయడమని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ పీటీఐ అభివర్ణించింది. ఇమ్రాన్ ఖాన్‌కు జైలు శిక్ష పడటంతో, ఆయన ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరణకు గురయ్యారు.

    ఎన్నికల నేపథ్యంలో అఫ్గానిస్థాన్, ఇరాన్‌లతో ఉన్న సరిహద్దులను పాకిస్తాన్ గురువారం మూసివేసింది.

    పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఉన్న 336 సీట్లకు ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 169 సీట్లు అవసరం.

    రెండేళ్ల క్రితం ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మాన ఓటింగ్‌తో ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అవినీతి కేసులతో జైలు పాలయ్యారు. ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది.

    అయితే, ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడంపై లాహోర్‌లో చాలా మంది ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ట్యాక్సీలు బుక్ చేసుకుని, ఓటు వేసేందుకు వెళ్లడం కష్టతరమవుతుందన్నారు.

    పోలింగ్ స్టేషన్లకు వెళ్లేటప్పుడు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు, కోఆర్డినేట్ చేసుకునేందుకు చాటింగ్ చేసుకోలేకపోయామని చెప్పారు.

  5. భారత్, మియన్మార్‌ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలు నిలిపివేత

    భారత్, మియన్మార్ దేశాల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

    ''దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా సమతుల్యత తదితర కారణాల దృష్ట్యా స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని(FMR) రద్దు చేయాలని హోం శాఖ నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టాం. అందుకే తక్షణమే ఎఫ్ఎంఆర్‌ను నిలిపివేస్తున్నాం'' అని ఎక్స్(ట్విటర్)లో అమిత్ షా తెలిపారు.

    మియన్మార్‌తో 1,643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో కంచెను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఇందులో 10 కిలోమీటర్ల పొడవునా ఫెన్సింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.

  6. జగన్‌పై హత్యాయత్నం కేసు: నిందితుడు కోడికత్తి శ్రీనుకు బెయిల్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2018లో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో నిందితుడు జనుపెల్ల శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను)కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    వైఎస్ జగన్ మీద 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. విమానాశ్రయం క్యాంటీన్‌లో పని చేస్తున్న శ్రీనివాసరావు కోడికత్తితో ఈ దాడి చేశారంటూ ఆరోపణలు నమోదయ్యాయి.

    సంఘటన స్థలంలోనే శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఆయన వైజాగ్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

    శ్రీనివాసరావుకు హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనద్దని ఆంక్షలు విధించింది.

  7. నెల్లూరు కోర్టులో దొంగలు పడిన కేసులో సీబీఐ ఏం తేల్చింది... మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు పైళ్లు మాత్రమే ఎలా చోరీకి గురయ్యాయనే ప్రశ్నకు బదులేది?

  8. హైదరాబాద్‌లోని సీనియర్ జర్నలిస్ట్ 'వీక్షణం' వేణుగోపాల్ నివాసంలో ఎన్ఐఏ సోదాలు

    హైదరాబాద్‌లో సీనియర్ జర్నలిస్టు, వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్ ఇంటిలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది.

    వేణుగోపాల్ నివాసమైన హిమాయాత్ నగర్‌లో గురువారం తెల్లవారుజాము నుంచీ ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

    వేణుగోపాల్ విరసం నాయకులు వరవరరావుకు బావమరిది.

    అంతేకాకుండా ఎల్బీనగర్‌లోని రవిశర్మ అనే వ్యక్తి ఇంటిలో కూడా ఎన్ఐఏ సోదాలు చేస్తోంది.

  9. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.