ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జోర్డాన్ సరిహద్దులో గల సిరియాలోని మూడు అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
సూడాన్, దక్షిణ సూడాన్ సరిహద్దులో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో 50 మందికి పైగా మరణించారని అక్కడి అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. వీరిలో ఇద్దరు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకులు సహా మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఘర్షణలో మరో 64 మంది గాయపడ్డారని చెప్పింది.
దక్షిణ సూడాన్‌లోని వారెప్ స్టేట్‌కు చెందిన సాయుధులు శనివారం పొరుగున ఉన్న అబై ప్రాంతంపై దాడి చేశారని అబై మంత్రి బులిస్ కోచ్ చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది.
అబై అనేది చమురు సమృద్ధిగా ఉన్న ప్రాంతం.
జోర్డాన్ సరిహద్దులో సిరియాలోని మూడు అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారు. పదుల కొద్దీ సైనికులు గాయపడ్డారు.
ఈ దాడులకు ఇరాన్ మద్దతుతో నడిచే మిలిటెంట్ గ్రూపులే బాధ్యులని అమెరికా అంటోంది. అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది.
ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. "మేం ప్రతిస్పందిస్తాం" అని బైడెన్ ప్రకటించారు.
అయితే ఈ డ్రోన్ దాడులకు ఇరాక్‌లోని 'ఇస్లామిక్ రెసిస్టెన్స్' సంస్థ బాధ్యత తీసుకుంది. 2023 చివరలో ఏర్పాటైన ఈ గ్రూపు ఇరాక్‌లో పనిచేస్తోంది.
ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ 'ప్రత్యేక ఆపరేషన్' కోసం పనిచేశారని ఆరోపిస్తూ నలుగురికి ఇరాన్ మరణశిక్ష అమలుచేసింది.
ఈ నలుగురు మొహమ్మద్ ఫరమర్జీ, మొహ్సిన్ మజ్లూమ్, వఫా అజర్బర్, పెజ్మాన్ ఫతేహిలని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది.
ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో రక్షణ శాఖ కార్యాలయంపై దాడికి కుట్ర పన్నారనే ఆరోపణలపై ఈ నలుగురిని 2022 జులైలో అరెస్టు చేశారు. వీరికి 2023 సెప్టెంబర్లో మరణశిక్ష విధించింది ఇరాన్.
"ఈ నలుగురికి జియోనిస్ట్ (ఇజ్రాయెల్) గూఢచార సంస్థతో సంబంధం ఉంది. ఇస్ఫహాన్‌లో దాడికి కుట్ర పన్నారనే ఆరోపణలపై వీరిని అరెస్టు చేశారు" అని ఇరాన్ వార్తాసంస్థ మిజాన్‌ను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ తెలిపింది.
ఈ నలుగురిని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ (మొసాద్) వారి 'ఆపరేషన్' కోసం ఏడాదిన్నర కిందట నియమించిందని ఇరాన్ చెబుతోంది.
మీజాన్ వార్తాసంస్థ ప్రకారం- ఈ నలుగురిని శిక్షణ కోసం ఆఫ్రికన్ దేశాలకు పంపారు, అక్కడ మొసాద్ అధికారుల పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు.
బాలిస్టిక్ క్షిపణి ప్రాజెక్టును నాశనం చేయడానికి మొసాద్ నాయకత్వంలో పన్నిన కుట్రను 2023 ఆగస్టులో భగ్నం చేశామని ఇరాన్ తెలిపింది.
అదే ఏడాది ఫిబ్రవరిలో ఇస్ఫాహాన్‌లోని సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని ఇరాన్ ఆరోపించింది.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు దశాబ్దాలుగా గొడవలు ఉన్నాయి.
రాజ్యసభలోని 56 ఎంపీ సీట్ల భర్తీకి భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ షెడ్యూల్‌లోనే తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో రాజ్యసభ ఎంపీలైన లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్‌కుమార్, వద్దిరాజు రవిచంద్ర, ఆంధ్రప్రదేశ్‌లో కనకమేడల రవీంద్ర కుమార్, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్‌ల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది.
56 సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్లు ఈసీఐ తెలిపింది.
అభ్యర్థులు ఫిబ్రవరి 15 వరకు నామినేషన్ వేయవచ్చు. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇదే
నోటిఫికేషన్ జారీ- 2024 ఫిబ్రవరి 8
నామినేషన్ చివరి తేదీ - ఫిబ్రవరి 15
నామినేషన్ల పరిశీలన - ఫిబ్రవరి 16
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ - ఫిబ్రవరి 20
పోలింగ్ తేదీ, కౌంటింగ్- ఫిబ్రవరి 27
ఈ ఆరు స్థానాలతోపాటు ఉత్తరప్రదేశ్, బిహార్, ఇతర రాష్ట్రాల్లోని స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి 10 స్థానాలు, బిహార్-6, మహారాష్ట్ర -6, మధ్యప్రదేశ్- 5, పశ్చిమ బెంగాల్-5, గుజరాత్-4, కర్ణాటక -4, ఒడిశా -3, రాజస్థాన్ - 3, ఛత్తీస్‌గఢ్-1, హరియాణా-1, హిమాచల్ ప్రదేశ్-1, ఉత్తరాఖండ్- 1 స్థానాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అనర్హత పిటిషన్లకు సంబంధించి నోటీసులు అందుకున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు సోమవారం శాసన సభ స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ని కలిసి, తమ వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కోరారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, అనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.
రాజ్యసభ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ వ్యవహారం తెరమీదకు తెచ్చారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు.
స్పీకర్ నోటీసులను వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తప్పుబట్టారు. గంటా శ్రీనివాసరావు రాజీనామాపై మూడున్నరేళ్ల పాటు స్పీకర్ పట్టించుకోలేదన్నారు. తమకు నోటీసులిచ్చిన రెండు వారాల్లోనే సమాధానం ఇవ్వమనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తాను క్రాస్ ఓటింగ్‍కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయా? అని ఆయన నిలదీశారు.
మరోవైపు స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదన వినకుండా, సంబంధిత మెటీరియల్ ఇవ్వకుండా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని రెబల్ ఎమ్మెల్యేలు పిటిషన్‌లో పేర్కొన్నారు.
స్పీకర్ నోటీసులు రద్దు చేయాలని పిటిషన్‌లో రెబల్ ఎమ్మెల్యేలు కోరారు.
రాజీనామాపై నిబంధనలు పాటించలేదు..
తన రాజీనామా నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారంటూ గంటా శ్రీనివాసరావు ఏపీ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ సోమవారం జరిగింది. దానిపై కౌంటర్ వేయాలని స్పీకర్, న్యాయ శాఖ కార్యదర్శి, సీఈసీ సహా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
చందమామపైకి జపాన్ ప్రయోగించిన మూన్ మిషన్ ‘స్లిమ్’ తిరిగి పనిచేస్తోందని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) చెప్పింది.
సోలార్ పవర్ సిస్టమ్‌లో ఏర్పడిన సమస్యల కారణంగా చంద్రుడిపై ‘స్లిమ్’ నిద్రాణంగా ఉండిపోయింది. ఇప్పుడా సమస్యలు తొలగిపోవడంతో భూమితో దాని సంబంధాలు పునరుద్దరణ అయినట్టు అధికారులు చెప్పారు. స్లిమ్‌లోని సౌరఫలకాలు తిరిగి పనిచేయడం మొదలయ్యాయని, దానికి జీవం వచ్చిందని తెలిపారు.
‘స్లిమ్’ జనవరి 20న చంద్రుడిపైకి దిగినప్పుడు దానిలోని సౌరఫలకాలు సూర్య కిరణాలు తాకే కోణంలో లేకపోవడంతో అవి విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేకపోయాయి.
గతంలో అనేకసార్లు విఫలమైన తరువాత జపాన్ ఈ స్లిమ్ మిషన్‌తో విజయాన్ని సాధించింది. గతంలో ఐ స్పేస్ అనే స్టార్టప్ కంపెనీ కూడా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. కానీ, అది ప్రయోగించిన మిషన్‌లో ఆన్‌బోర్డ్ కంప్యూటర్ చంద్రుడి ఎత్తు గురించి గందరగోళానికి గురవడంతో క్రాష్ అయింది.
ఈ నెల మొదట్లో ఓ ప్రైవేటు కంపెనీ చంద్రునిపైకి పంపిన అంతరిక్ష నౌక మంటల్లో చిక్కుని పసిఫిక్‌లో కూలిపోయింది. కిందటేడాది ఆగస్టులో రష్యా ప్రయోగించిన మొదట చంద్రమండల అంతరిక్ష నౌక కూడా నియంత్రణ కోల్పోయి చంద్రునిపై కూలిపోయింది.
మరో ఏడు రోజుల్లో దేశంలో సీఏఏ (సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ - పౌరసత్వ సవరణ చట్టం) అమల్లోకి వస్తుందని కేంద్ర సహాయ మంత్రి శంతను ఠాకూర్ అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో సౌత్ 24 పరగణాల జిల్లాలో ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
''అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ పూర్తయింది. మరో ఏడు రోజుల్లో సీఏఏ అమల్లోకి వస్తుంది. ఇది నా గ్యారెంటీ. సీఏఏ కేవలం పశ్చిమ బెంగాల్‌లోనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మరో వారం రోజుల్లో అమలవుతుంది'' అన్నారాయన.
సీఏఏకి వ్యతిరేకంగా గతంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.
మాల్దీవుల పార్లమెంట్‌లో అధికార కూటమి (పీపీఎం/పీఎన్‌సీ) ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్, స్పీకర్ విధులకు అంతరాయం కలిగించడంతో హింస చెలరేగినట్లు మాల్దీవులకు చెందిన వార్తా సంస్థ అధాధు తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
మాలెకి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ)ఎంపీ ఇసా, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్‌సీ) ఎంపీ అబ్దుల్లా షహీమ్ అబ్దుల్ హకీమ్ కనిపించారు.
అధాధు ప్రకారం, ఇసా కాలు పట్టుకుని షహీమ్ లాగడంతో ఇద్దరూ కిందపడిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. మరో వీడియోలో ఇసా మెడపై షహీమ్ కాలుపెట్టి నొక్కడంతో పాటు జుట్టు పీకుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇతర ఎంపీలు షహీమ్‌ను అక్కడి నుంచి నెట్టివేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఒక పార్లమెంట్ సభ్యుడికి గాయాలు కావడంతో అంబులెన్స్‌లో తీసుకెళ్లినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ముయిజ్జు ప్రభుత్వానికి పార్లమెంట్ ఆమోదంపై కీలకమైన ఓటింగ్ జరగాల్సి ఉన్నట్లు అక్కడి మీడియా పేర్కొంది.
అధికార పార్టీకి చెందిన నలుగురు సభ్యులను ముయిజ్జు క్యాబినెట్‌లోకి తీసుకోవడంపై పార్లమెంట్ ఆమోదానికి ప్రతిపక్ష ఎండీపీ నిరాకరించింది. దీంతో అధికార కూటమికి చెందిన ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలను చాంబర్‌లోకి రాకుండా అడ్డుకోవడంతో వివాదం చెలరేగినట్లు అధాధు తెలిపినట్లు ఇండియా టుడే కథనంలో పేర్కొంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.