ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అయోధ్య ఆలయంలో ప్రతిష్టించిన రాముడి విగ్రహాన్ని రూపొందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్, తనను తాను భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిగా పేర్కొన్నారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
అయోధ్య ఆలయంలో ప్రతిష్టించిన రాముడి విగ్రహాన్ని రూపొందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్, తనను తాను భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిగా పేర్కొన్నారు.
రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నేను ఈ భూమ్మీద ఉన్న అదృష్టవంతులలో ఒకడినని అనిపిస్తోంది. నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామ్‌లల్లా ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉంది. ఒక్కోసారి ఇదంతా కలలా అనిపిస్తుంది’’ అని ఆయన అన్నారు.
రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో సినీ, వ్యాపార, క్రీడా, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
శిల్పి అరుణ్ యోగిరాజ్ స్వస్థలం కర్ణాటకలోని మైసూరు.ఆయన తండ్రికి ప్రముఖ శిల్పిగా పేరుంది. ఇండియా గేట్ దగ్గర ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించారు.
రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని 'అతీంద్రియ కార్యక్రమం' అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత మోదీ ప్రసంగిస్తూ, న్యాయానికి పర్యాయపదమైన రాముడి ఆలయాన్ని కూడా న్యాయబద్ధంగా నిర్మించారని అన్నారు.
రామ మందిరానికి సంబంధించిన వివాదం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘రామ మందిరం నిర్మిస్తే అగ్ని జ్వాలలు చెలరేగుతాయని కొందరు అనేవారు. వారికి భారత సమాజం వివేకం గురించి తెలియదు’’ అని వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
‘‘రాముడు నిప్పు కాదు, రాముడు శక్తి. రాముడు వివాదం కాదు, రాముడు పరిష్కారం.
శతాబ్దాల నిరీక్షణ తర్వాత మన రాముడు వచ్చాడు. తపస్సు, త్యాగం, బలిదానాల తర్వాత మన రాముడు వచ్చాడు.
చెప్పడానికి చాలా ఉంది. కానీ, నా గొంతు పెగలట్లేదు. నా శరీరం ఇంకా కంపిస్తూనే ఉంది. నా మనస్సు ఇంకా ప్రాణ ప్రతిష్ట జరిగిన క్షణంలోనే లీనమై ఉంది.
మన రామ్‌లల్లా ఇకపై డేరాలో నివసించడు. దివ్య మందిరంలో ఉంటాడు. ఈ క్షణం అతీంద్రియమైనది. దేశంలో, ప్రపంచంలోని నలు మూలల్లో ఉన్న రామభక్తులు ఇదే అనుభూతి చెందుతున్నారని నేను గట్టిగా నమ్ముతున్నా.
2021 జనవరి 22వ తేదీ ఒక కొత్త కాలచక్రానికి మూలం.
ఇప్పటి నుంచి వెయ్యి ఏళ్ల తర్వాత కూడా ప్రజలు ఈ తేదీని గుర్తుంచుకుంటారు. ఈ క్షణం గురించి చర్చిస్తారు.
ఈ క్షణాలను సాక్షాత్తూ చూడటం రాముడు మనకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం.
మన ప్రేమ, ప్రయత్నం, తపస్సులో ఏదో లోపం ఉండి ఉంటుంది. అందుకే రామ మందిర నిర్మాణానికి ఇన్ని శతాబ్దాలు పట్టింది. ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. ఈరోజు శ్రీ రాముడు మనల్ని తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నా.
నా పదకొండు రోజుల ఉపవాస దీక్షా కాలంలో శ్రీరాముని పాదాలు నడయాడిన ప్రాంతాలను తాకడానికి నేను ప్రయత్నించా’’ అని మోదీ ప్రసంగించారు.
అయోధ్యలో విశాలమైన వీధులు, కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, రంగురంగుల దీపాలు అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాయి.
ఎక్కడ చూసినా దుకాణాలపై ‘జై శ్రీరాం’ అని రాసి ఉంది. ఎటు చూసినా జనాలతో నగరం సందడిగా కనిపిస్తోంది.
మరోవైపు ఇప్పుడిప్పుడే విస్తరణ పూర్తి చేసుకుంటున్న కొన్ని దారులు, విస్తరణలో తొలగించిన దుకాణాలు దర్శనమిస్తున్నాయి.
స్థానికులతో మాట్లాడుతున్నప్పుడు గతంతో పోలిస్తే అయోధ్య రూపురేఖలు చాలా మారిపోయాయని చెబుతున్నారు.
విశాలమైన రహదారులు, అత్యాధునిక సౌకర్యాలుగల రైల్వే స్టేషన్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి వాటితో అయోధ్య కొత్తగా కనిపిస్తోంది.
వ్యూహం సినిమాను మళ్లీ రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకూ ఆ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌పై ఉన్న సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు హైకోర్టు చెప్పింది.
ఆంధ్రా రాజకీయాలపై రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశారని చెబుతూ, దానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ సినిమాలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ప్రతిష్టకు భంగం కలిగించారని ఆయన తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.
దీంతో వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ని హైకోర్టు సస్పెండ్ చేసింది.
సస్పెన్షన్ ఎత్తేయాలంటూ వ్యూహం సినిమా నిర్మాత పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తెలంగాణలోనైనా విడుదలకు అనుమతించాలని కోర్టును కోరారు.
విచారణ చేపట్టిన న్యాయస్థానం, మరో మూడు వారాల పాటు సెన్సార్ సర్టిఫికెట్‌పై సస్పెన్షన్‌ను కొనసాగించింది. అదే సమయంలో సినిమాను మళ్లీ రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. కొత్త సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో మూడు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించడానికి దేశం నలు మూలల నుంచి అనేక మంది ప్రముఖులు ఈ నగరానికి చేరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సినీ నటులు చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ తదితరులు అయోధ్యకు చేరుకున్నారు.
పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు, కేంద్ర మంత్రులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు అయోధ్యకు వచ్చారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
అయోధ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాముని విగ్రహాన్ని 114 కుండలలో వివిధ తీర్థ స్థలాల నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో స్నానం చేయిస్తారు. అనంతరం అయోధ్య రామ మందిరాన్ని సామాన్య ప్రజల కోసం తెరుస్తారు.
రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులతోపాటు అనేకమంది వీఐపీలు రావడంతో అయోధ్యలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
సమ్మెలో ఉన్న కార్యకర్తలు సోమవారం అంగన్‌వాడీ సెంటర్లను తెరవకపోతే వారందరినీ విధుల నుంచి తొలగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకుముందే హెచ్చరించింది.
ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.సెంటర్లు తెరవని వారి వివరాలను సేకరించేందుకు జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు.
మరోవైపు ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అంగన్‌వాడీలు పెద్ద సంఖ్యలో విజయవాడలో నిరసన ప్రదర్శనలకు దిగారు.
ఎక్కడికక్కడ పోలీసులు వీరిని అడ్డుకుంటున్నప్పటికీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
సమ్మె కొనసాగుతుంది: అంగన్‌వాడీలు
అంగన్ వాడీ వర్కర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించే వరకూ సమ్మె కొనసాగిస్తామని ఏపీ అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కే సుబ్బారావమ్మ బీబీసీతో అన్నారు.
"ప్రభుత్వం మొదటి నుంచి సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో కనిపించడం లేదు. చర్చలకు పిలిచినప్పుడు కూడా బెదిరించే ప్రయత్నమే చేశారు. ఆ తర్వాత ఎస్మా పేరుతో నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు తొలగిస్తామని ఆదేశాలు ఇచ్చామంటున్నారు. అవి చెల్లవు. మేం గౌరవ వేతనాలతో పనిచేస్తున్నాం. మాకు ఎస్మా వర్తించదన్నది కూడా స్పృహలో లేకుండా ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడు తొలగింపుల ఉత్తర్వులు కూడా సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే తప్ప ప్రభుత్వానికి అలాంటి అధికారం లేదు" అని ఆమె చెప్పారు.
ప్రభుత్వం అణచివేస్తోంది: గిడుగు రుద్రరాజు
అంగన్‌వాడీలు న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం వారిపై అణచివేతలకు పాల్పడుతోందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలను సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో, కరెంటు ఆపేసి మరీ విజయవాడ ధర్నా చౌక్ నుంచి అరెస్టు చేశారని, ఇది దుర్మార్గపు చర్య అని ఆయన వ్యాఖ్యానించారు.
వేటు సులువు కాదు: సుబ్బారావు,ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు
"సమ్మె చేశారన్న కారణంగా ఏకకాలంలో లక్ష మందికి పైగా సిబ్బందిని తొలగించే సాహసం ప్రభుత్వం చేస్తుందని అనుకోవడం లేదు. చట్టం ప్రకారం అలాంటివి చేసినా చెల్లుబాటు కావు. గతంలో తమిళనాడులో కూడా జయలలిత ప్రభుత్వం సమ్మె చేసినందుకు ఉద్యోగులను తొలగిస్తే, దానిని కూడా కోర్టు రద్దు చేసిన విషయం గుర్తు చేసుకోవాలి" అని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు బీబీసీతో చెప్పారు.
అంగన్‌వాడీల అరెస్టును నిరసిస్తూ సీపీఎం కార్యాలయంలో వామపక్ష నేతల దీక్షలు ప్రారంభించారు.
అస్సాంలోని బటద్రవ థాన్ ఆలయాన్ని సందర్శించడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అనుమతి లభించలేదు. దీంతో ఆయన నిరసన వ్యక్తం చేశారు.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, వైష్ణవ సన్యాసి శ్రీమంత్ దేవ్‌కు చెందిన బటద్రవ థాన్ ఆలయానికి వెళ్లాలని భావించారు. అయితే మార్గమధ్యంలో పోలీసులు రాహుల్ గాంధీని అడ్డుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది, అందులో రాహుల్ గాంధీ తన వాహనం నుంచి దిగి, తనను ఎందుకు ఆపుతున్నారని పోలీసులను ప్రశ్నించారు.
‘‘నన్ను గుడికి ఎందుకు వెళ్లనివ్వడం లేదు. గుడికి వెళ్లడానికి నాకు పర్మిషన్ ఉంది. ఆలయ నిర్వాహకులు నన్ను ఆహ్వానించారు’’ అని రాహుల్ అనడం వినిపించింది.
అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ ‘‘ఈ రోజు ఒక వ్యక్తి (ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి)కే మాత్రమే గుడికి వెళ్లే అవకాశం ఉందా ’’ అని ప్రశ్నించారు.
మధ్యాహ్నం 3 గంటల తర్వాతే గుడిలోకి అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
తీవ్రమైన మంచు తుపానుల కారణంగా అమెరికాలో గత వారం రోజులలో సుమారు 90 మంది చనిపోయారు.
మరణించిన వారిలో 25 మంది టెనెసీకి చెందిన వారు కాగా, 16 మంది ఒరెగాన్ ప్రాంతంవారు. మిగిలిన మరణాలు ఇలినాయిస్, పెన్సిల్వేనియా, వాషింగ్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ, కెంటకీలలో నమోదయ్యాయి.
మంచు తుపాన్ల కారణంగా ప్రస్తుతం అమెరికాలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరెంటు సరఫరా లేదు.
ఈ వారాంతం వరకు అమెరికాలో మంచు తీవ్రత ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
మంచు తీవ్రత కారణంగా అమెరికాలో 89 మంది చనిపోయారని బీబీసీ అమెరికా భాగస్వామి చానల్ సీబీఎస్ రిపోర్టు చేసింది.
బలమైన మంచు గాలులు వీయడంతో గత బుధవారం ఒరెగాన్ పోర్ట్‌ల్యాండ్‌లో ఒక కారుపై విద్యుత్ తీగలు ఊడిపడ్డాయి. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు కరెంట్ షాక్‌కు గురై చనిపోగా, వాహనంలో ఉన్న చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
అవసరమైతే తప్ప ప్రజలు బయటికి వచ్చి వాహనాలు నడపవద్దని, వాతావరణ పరిస్థితులు బాగాలేవని అధికారులు హెచ్చరించారు.
గుజరాత్ లోని మెహసానా జిల్లా ఖేరాలు గ్రామంలో రామ్ శోభా యాత్ర సందర్భంగా ఆదివారంనాడు స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
శోభా యాత్ర జరుగుతుండగా కొందరు వ్యక్తులు ఈ యాత్రపై రాళ్లు రువ్వారు. దీంతో యాత్రకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది.
మెహసానా రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వీరేంద్ర యాదవ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, “ఊరేగింపు సమయంలో పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు.పరిస్థితి విషమించడంతో మూడు టియర్ గ్యాస్ షెల్స్ కూడా ప్రయోగించారు.ప్రస్తుతం, విచారణ కొనసాగుతోంది. రాళ్లదాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నాం’’ అని వెల్లడించారు.
ఈ ఘటనలో తమవైపు నుంచి కవ్వింపు చర్యలేమీ జరగలేదని హిందూ సంఘాలు పేర్కొంటుండగా, యాత్రలో ట్రాక్టర్ వెనక కూర్చున్న కొందరు వ్యక్తులు రెచ్చగొట్టారని స్థానిక ముస్లిం నాయకులు కొందరు ఆరోపించారు.
పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తర్వాత యాత్ర ప్రశాంతంగా సాగిందని నిర్వాహకులు వెల్లడించారు.
విజయవాడలో నిరసనకు పిలుపునిచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలను, సీఐటీయూ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ మార్గాల్లో విజయవాడకు బయలుదేరిన అంగన్‌వాడీలను ఎక్కడికి అక్కడే అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్లకు తరలించారు.
రైళ్ళు, బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో విజయవాడకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
విజయవాడ ధర్నా చౌక్‌లోని అంగన్‌వాడీల నిరసన శిబిరాన్ని సోమవారం తెల్లవారుజామున పోలీసులు తొలగించి, టెంట్లు కూల్చేశారు.
దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేశారు.
డీసీపీ విశాల్ గున్ని నాయకత్వంలో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అంగన్‌వాడీ నాయకులను, కార్యకర్తలను వాహనాల్లో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అడ్డుకునే ప్రయత్నం చేసిన అంగన్‌వాడీ మహిళలను కూడా బస్సుల్లో ఎక్కించి నగరం వెలుపల ఉన్న పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు.
అయితే, సోమవారం విజయవాడలో ఎటువంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు.
అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇవాళ జరగనుంది.
అయోధ్య వీధులన్నీ విద్యుత్ దీపాలు, కాషాయ జెండాలు, తోరణాలతో అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాయి.
ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న జనాలతో అయోధ్య సందడిగా కనిపిస్తోంది.
వేదమంత్రాల నడుమ రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. మధ్యాహ్నం 12.20కి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం, ఒంటి గంట వరకు జరగనుంది.
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సాధువులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.
వేల మంది ప్రత్యక్షంగా, కోట్ల మంది పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని తిలకించనున్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత బాలరాముని దర్శనం ఉంటుంది.
ఇప్పటికే 30 వేల మంది పోలీసులను అయోధ్యలో భద్రతకు వినియోగిస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు.
10 వేల సీసీ కెమెరాలు అమర్చి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
అయోధ్యలో రామ మందిరానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో పాస్ ఉన్న వాహనాలకే అనుమతి ఇస్తున్నారు.
ఫైజాబాద్ నుంచి అయోధ్యకు వచ్చే ప్రధాన రహదారిలో ప్రవేశం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.