You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

లోక్‌సభలోకి దూకిన ఇద్దరు ఆగంతకులు, అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఓ వ్యక్తి సభ్యుల టేబుల్స్ మీదుగా దూకుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు, కొందరు ఎంపీలు అతన్ని అడ్డుకునేందుకు చుట్టుముట్టే ప్రయత్నం చేసినట్లు వీడియోలో కనిపించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..

    గుడ్ నైట్

  2. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక లాంఛనమే, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధి

    తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది.

    బుధవారం సాయంత్రం గడువు ముగిసే సమయానికి వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రమే నామినేషన్ పత్రాలు దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది.

    ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు ఆయనతోపాటు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఇతరులు ఉన్నారు.

    ప్రజాస్వామ్య ప్రక్రియలో శాసన సభాపతి ఎన్నిక ఒక కీలక ఘట్టమని, ఇందులో భాగంగా గడ్డం ప్రసాద్ శాసనసభాపతిగా నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొన్నానని సీఎం రేవంత్ ‘ఎక్స్‌’లో చెప్పారు.

  3. బ్రేకింగ్ న్యూస్, లోక్‌సభలో ఇద్దరు ఆగంతకుల కలకలం, అదుపులోకి తీసుకున్న పోలీసులు

    విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకడంతో లోక్‌సభలో కలకలం చెలరేగింది. గుర్తుతెలియని వ్యక్తులు సభలోకి దూకడంతో ఎంపీలు కంగారుగా బయటకు వచ్చేశారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

    అగంతకుల చేతిలో గ్యాస్ విడుదల చేసే పరికరాలు ఉన్నాయని కొందరు ఎంపీలు వెల్లడించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. సభలో ఒక్కసారిగా అలజడి చెలరేగడంతో సభ్యులు హడావుడిగా బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.

    ఆ వ్యక్తి సభ్యుల టేబుల్స్ మీదుగా దూకుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు, కొందరు ఎంపీలు అతన్ని అడ్డుకునేందుకు చుట్టుముట్టే ప్రయత్నం చేసినట్లు వీడియోలో కనిపించింది. సభ బయట వీరిని పోలీసులు పట్టుకున్నట్లు కూడా వీడియోలు మీడియా చానెళ్లలో ప్రసారమయ్యాయి.

    పార్లమెంటుపై దాడికి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సహా పలువురు మంత్రులు, ఎంపీలు ఆనాటి ఘటనలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. అది జరిగిన కొద్దిగంటలకే అగంతకులు లోక్‌సభలో ప్రవేశించడం చర్చనీయాంశం అయ్యింది.

  4. ఇజ్రాయెల్ తీరు ఇలాగే ఉంటే అమెరికా ఇకపై మద్దతు ఇవ్వదు: జో బైడెన్

    ఇజ్రాయెల్ పై హమాస్ దాడి, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతిదాడులు మొదలయ్యాక అమెరికా తొలిసారి ఇజ్రాయెల్‌పై తొలిసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గాజాపై నిరంతర బాంబు దాడులతో ప్రపంచ దేశాల మద్దతు కూడా కోల్పోతోందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే అమెరికా ఇకపై ఇజ్రాయెల్ పక్షం ఉండకపోవచ్చని బైడెన్ హెచ్చరించారు.

    ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో పాల్గొన్న జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    ‘‘ఇజ్రాయెల్ భద్రత అన్నది ఇప్పటి వరకు అమెరికా మీద ఆధారపడి ఉంది. కానీ ఇక ముందు అది అమెరికా బాధ్యత కాకపోవచ్చు. ఇప్పుడది యూరోపియన్ యూనియన్ మీదనో, యూరప్ మీదను, మిగతా ప్రపంచం మీద ఆధారపడాల్సి రావచ్చు’’ అని బైడెన్ స్పష్టం చేశారు.

    అయితే, హమాస్ మీద ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదని, ఆ దేశానికి ఆ హక్కు ఉందని బైడెన్ అన్నారు. కానీ, దాని కోసం సామాన్యుల ప్రాణాలను పణంగా పెట్టరాదని బైడెన్ అభిప్రాయపడ్డారు.

  5. గుడ్ మార్నింగ్

    . బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.