You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మాజీ సీఎం కేసీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతం

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తుంటి ఎముక శస్త్రచికిత్సను యశోద ఆస్పత్రి వైద్యులు శుక్రవారం విజయవంతంగా పూర్తి చేశారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. మాజీ సీఎం కేసీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతం

    తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తుంటి ఎముక శస్త్ర చికిత్సను యశోద ఆస్పత్రి వైద్యులు శుక్రవారం విజయవంతంగా పూర్తి చేశారు.

    గురువారం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కాలు జారి పడ్డారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్చారు.

    కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.

  3. ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

    ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది.

    2024 జనవరి 1 నుంచి 21 వరకు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 21న నిర్వహిస్తారు.

    ఆఫ్‌లైన్ మోడ్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉండనుంది. డిస్క్రిప్టివ్ పరీక్ష (మెయిన్స్) తేదీలను ఇంకా ఖరారు చేయలేదు.

    గురువారం 897 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.

  4. ఉత్తర భారతం, దక్షిణ భారతం గొడవేంటి, బీజేపీపై ఉత్తరాది పార్టీ ముద్రపడుతోందా?

  5. ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా

    మల్కాజ్‌గిరి ఎంపీ పదవికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు.

    లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా లేఖ పంపారు.

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

    రాజీనామా లేఖ ఇచ్చిన అనంతరం మల్కాజ్‌గిరి ప్రజలకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు చెబుతూ ఒక లేఖ విడుదల చేశారు.

    కొడంగల్‌లో ఓటమి పాలైన తర్వాత 6 నెలల్లోనే మల్కాజ్‌గిరి‌లో ఎంపీగా ఓటర్లు గెలిపించారని, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.

  6. మహాలక్ష్మి పథకం: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి..

  7. పట్టపగలు బ్యాంకు చోరీ.. పోలీసులను తికమక పెట్టి దొంగలు ఎలా పరారయ్యారంటే..

  8. ప్రగతి భవన్ పేరు మార్పు..

    తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ పేరును ‘మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌’గా మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    ఈ పేరు మార్పు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రగతి భవన్ కంచె బద్దలు కొడతామని గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు.

    ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ వద్ద కంచెలను తొలగించే పని మొదలైంది. కంచెను తొలగిస్తామని, తెలంగాణలోని ప్రజలందరూ ఎప్పడైనా కుటుంబంతో సహా తమ వద్దకు వచ్చి ఆలోచనలను పంచుకోవచ్చని రేవంత్ ప్రమాణస్వీకార ప్రసంగంలో చెప్పారు.

    శుక్రవారం ప్రజా భవన్‌‌లో ప్రజా దర్భారు నిర్వహించారు.

  9. లోక్‌సభ నుంచి ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణ.. అసలేం జరిగింది?

  10. లోక్‌సభ నుంచి మహువా మొయిత్రా బహిష్కరణ

    తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించారు. పార్లమెంటు ఎథిక్స్ ప్యానల్ సిఫారసు మేరకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

    అయితే, అన్ని నియమనిబంధనలను అతిక్రమించి తనను బహిష్కరించారని మహువా మొయిత్రా అన్నారు.

    వివాదం ఏంటి?

    పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నించేందుకు మహువా మొయిత్రా ఒక వ్యాపారవేత్త నుంచి లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

    అదానీ గ్రూప్ సంస్థలే లక్ష్యంగా ఎంపీ మొయిత్రా ప్రశ్నలు అడుగుతున్నారని, అందుకు ప్రతిఫలంగా ఒక వ్యాపారవేత్త నుంచి ఖరీదైన బహుమతులు, నగదు అందుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గతంలో ఆరోపించారు.

    అయితే, ఈ ఆరోపణలను ఖండించిన మొయిత్రా, తాను ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. దూబే ఆరోపణలపై పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ విచారణ చేసింది.

    మహువా మొయిత్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.

    కమిటీ సిఫార్సుతో సభ ఏకీభవించిందని లోక్‌సభ స్పీకర్ తెలిపారు.

    "ఎంపీగా మహువా మోయిత్రా ప్రవర్తన అనైతికంగా, అనుచితంగా ఉందని, ఆమె ఎంపీగా కొనసాగడం సరికాదని ఎథిక్స్ కమిటీ పేర్కొంది. అందుకు సభ అంగీకరించింది’’ అని స్పీకర్ చెప్పారు.

    అదానీ కంపెనీల వ్యవహారంపై పార్లమెంటులో ప్రశ్నించినందుకే మోదీ ప్రభుత్వం తనను ఇలా వేదిస్తోందని మహువా మొయిత్రా ఆరోపించారు. ఇది మీ (బీజేపీ) అంతానికి ఆరంభం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

    మహువా మొయిత్రా బహిష్కరణను శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఖండించారు. ఆరోపణలు చేసిన వ్యక్తి వివరణ ఆధారంగా ఆమెపై ఈ చర్యలు తీసుకున్నారని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ప్రియాంక అన్నారు.

    తనను బహిష్కరించిన అనంతరం మహువా మొయిత్రా పార్లమెంటు నుంచి బయటకు వెళ్లిపోయారు.

    మహువా మొయిత్రా బహిష్కరణను విపక్ష పార్టీలు ఖండించాయి. విపక్ష ఎంపీలు పార్లమెంట్ పార్లమెంటు నుంచి వాకౌట్ చేశారు.

    ఇది నిరాధారమైన ఆరోపణల ఆధారంగా తీసుకున్న కక్షపూరిత చర్య అని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ అన్నారు.

  11. ఆర్‌బీఐ: ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు

    ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది.

    అంతకుముందు ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితి లక్ష రూపాయలుగానే ఉండేది.

    దీంతోపాటు రికరింగ్ పేమెంట్లకు యూపీఐ ఎలక్ట్రానిక్ మ్యాండేట్ పరిమితిని లక్ష రూపాయలకు పెంచింది.

    ఈ-మ్యాండేట్ విధానం కింద, రూ.15 వేలకు మించి రికరింగ్ పేమెంట్లు చేయాలంటే అదనపు ధ్రువీకరణ అవసరం.

    ‘‘మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్‌కు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులకు, క్రెడిట్ కార్డు పేమెంట్లకు ఈ-మ్యాండేట్స్ పరిమితిని రూ.లక్షకు పెంచుతున్నాం’’ అని ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటించారు.

  12. మెఫెనామిక్ యాసిడ్: పీరియడ్స్ కడుపునొప్పి, ఇతర నొప్పులకు వాడే ఈ పెయిన్ కిల్లర్‌తో సైడ్ ఎఫెక్ట్స్...అలర్ట్ జారీ చేసిన ఐపీసీ

  13. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన ప్రభుత్వం

    దేశీయంగా ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి వరకు వీటి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

    ధరలను అదుపులో ఉంచుతూ, దేశీయంగా వీటి అందుబాటును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    ‘‘ఉల్లి ఎగుమతుల విధానం మారింది. 2024 మార్చి 31 వరకు వీటి ఎగుమతులను నిషేధిస్తున్నాం’’ అని తెలుపుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

  14. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ప్రకటన, వరుసగా ఐదోసారి వడ్డీ రేట్లు యథాతథం

    వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షను ప్రకటించారు.

    దీంతో ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 6.5 శాతంగా ఉంది. వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచడం వరుసగా ఇది ఐదో నెల.

    రెండో త్రైమాసికానికి చెందిన జీడీపీ గణాంకాలు అంచనావేసిన దానికంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా కాకుండా 7 శాతంగా ఉంటుందని శక్తికాంత దాస్ అంచనావేశారు.

    ఇదే సమయంలో, రిటైల్ ద్రవ్యోల్బణ రేటు 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా ఉంటుందని అంచనావేశారు శక్తికాంత దాస్.

    ప్రపంచంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆర్థిక వృద్ధి అవకాశాలకు సవాళ్లుగా ఉన్నాయని ద్వైపాక్షిక ద్రవ్యపరపతి విధాన ప్రకటన సందర్భంగా దాస్ వ్యాఖ్యానించారు.

  15. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ముస్లింలను ఎలా చూపిస్తున్నారంటే...

  16. శ్వేతపత్రం విడుదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు.. ఇంతకూ శ్వేతపత్రం అంటే ఏంటి?

  17. తెలంగాణ: ప్రజా భవన్‌లో ఇవాళ ప్రజా దర్బార్, తరలివస్తున్న ప్రజలు

    తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.

    ముఖ్యమంత్రి అధికారిక నివాసం పేరు ఇకపై ప్రగతి భవన్ కాకుండా, జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌గా మార్చుతున్నట్లు ప్రమాణ స్వీకారం సందర్భంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రకటించారు. ఈ భవన్‌లో ఇవాళ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని తెలిపారు.

    ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించనున్నారు రేవంత్ రెడ్డి.

    ప్రజా దర్బార్‌లో తమ సమస్యలను విన్నపించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా ప్రజా భవన్‌కు చేరుకున్నారు.

    ప్రజా దర్బార్‌లో మంత్రులు, అధికారులు కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

    తాము పాలకులం కాదని, సేవకులమని రేవంత్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నొక్కి చెప్పారు.

    ప్రజా భవన్‌లోకి ప్రజలందరికీ అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రగతి భవన్ వద్దనున్న ఇనుప కంచెలను సైతం తొలగించేశారు.

  18. విశాఖ: దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణం ఎందుకు ముందుకు కదలడం లేదు... తప్పు కేంద్రానిదా, రాష్ట్రానిదా?

  19. మాజీ సీఎం కేసీఆర్‌కు అస్వస్థత, యశోద ఆస్పత్రిలో చికిత్స

    తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అస్వస్థతకు గురయ్యారు. ఫామ్‌హౌస్‌లో కాలు జారి కింద పడటంతో హుటాహుటిన కేసీఆర్‌ను యశోద ఆసుపత్రికి తరలించారు.

    కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అటు ఆసుపత్రి వర్గాల నుంచి గానీ, కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎటువంటి అధికారిక సమాచారం విడుదల కాలేదు.

    కాసేపట్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని యశోద ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

  20. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.