You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ప్రపంచ కప్‌ 2023: విరాట్ కోహ్లీ తొలి సెంచరీ.. బంగ్లాదేశ్‌పై ఇండియా ఘన విజయం

ఈ ప్రపంచ కప్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 48వ శతకం.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. ఇండియాలో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల తయారీ: గూగుల్

    భారతదేశంలో పిక్సెల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయబోతున్నట్లు గూగుల్ సంస్థ గురువారం ప్రకటించింది.

    ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి అంతర్జాతీయ తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు గూగుల్ డివైసెస్ అండ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టర్‌లో ఒక ప్రకటనలో తెలిపారని వార్తా సంస్థ పీటీఐ చెప్పింది.

    భారత్‌లో గూగుల్ పిక్సెల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీని ప్రారంభిస్తామని, ఈ హ్యాండ్‌సెట్‌లు 2024 నుంచి అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారని తెలిపింది. టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఆయన ఈ ప్రకటన చేశారంది.

    పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ తయారీపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఒక ప్రకటన చేశారు.

    మేకిన్ ఇండియాకు మద్దతుగా భారతదేశం డిజిటల్ వృద్ధిలో విశ్వసనీయ భాగస్వామి కావడానికి కట్టుబడి ఉన్నామని సుందర్ పిచాయ్ ట్విటర్‌(ఎక్స్)లో తెలిపారు.

    గూగుల్ సెర్చ్‌ ఇంజిన్‌లో లోకల్ జెనరేటివ్ ఏఐ పొందుపరుస్తోందని, తద్వారా ఇది ప్రభుత్వ ముఖ్యమైన పథకాల్లో సహాయపడుతుందని ఆయన వివరించారు.

  3. తెలంగాణలోనూ కుల గణన: రాహుల్ గాంధీ, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

    తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కుల గణన మొదలు పెడతామని గురువారం పెద్దపల్లిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్రలో పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చెప్పారు.

    ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుల గణన విషయంలో భయపడుతున్నారని, దీనికి కారణమేంటని రాహుల్ ప్రశ్నించారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక దేశంలోనూ కుల గణన చేపడతామని చెప్పారు.

    కేసీఆర్ కుటుంబం చేతిలోనే మద్యం, భూములు ఉన్నాయని, ఆయన ముఖ్యమంత్రిలా కాకుండా రాజులా పరిపాలిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.

    ధరణి, కంప్యూటరైజేషన్ పేరుతో భూముల రికార్డులు మార్చి పేదల భూములను లాక్కున్నారని, రైతుబంధుతో కేవలం పెద్ద రైతులు మాత్రమే లాభపడ్డారని ఆయన విమర్శించారు.

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలకు మొదటి కేబినేట్ మీటింగ్‌లోనే ఆమోదం తెలిపి, అమలు చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్.

  4. ఈ ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ తొలి సెంచరీ.. బంగ్లాదేశ్‌పై ఇండియా విజయం

    ఈ ప్రపంచ కప్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి సెంచరీ నమోదు చేశాడు.వన్డేల్లో కోహ్లీకి ఇది 48వ శతకం.

    గురువారం పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోహ్లీ 97 బంతుల్లో 103 పరుగులు సాధించి నాటౌట్‌‌గా నిలిచాడు.

    కోహ్లీ, శుభ్‌మన్ గిల్ (53 పరుగులు), కెప్టెన్ రోహిత్ శర్మ(48 పరుగులు) రాణించడంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది.

    టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులు చేసింది.

    బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్ (66 పరుగులు) టాప్ స్కోరర్. జస్పీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్లు తీశారు.

    అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. జట్టు స్కోరు 88 పరుగుల వద్ద ఉండగా రోహిత్ శర్మ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు.

    కోహ్లీకి కేఎల్ రాహుల్(34 నాటౌట్) కూడా తోడవడంతో టీమిండియా 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది.

    చివర్లో భారత విజయానికి 2 పరుగులు అవసరం ఉండగా, కోహ్లీ సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్నందించడంతోపాటు తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

    ఈ ఇన్నింగ్స్‌తో క్రికెట్‌లో అత్యంత వేగంగా 26 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.

    కాగా, ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు.

  5. 4 రోజులు తిండి, నిద్ర లేకుండా వీడియో గేమ్స్ ఆడిన విద్యార్థి ఏమయ్యాడో చూడండి

  6. భూపాలపల్లి‌: కాంగ్రెస్ ర్యాలీలో కొండా సురేఖకు ప్రమాదం, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

    కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ ప్రమాదానికి గురయ్యారు.

    గురువారం భూపాలపల్లి‌లో పార్టీ కార్యకర్తలతో కలిసి సురేఖ స్వయంగా స్కూటీ నడుపుతూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

    స్కూటీ అదుపు తప్పడంతో సురేఖ కిందపడిపోయారు. ఆమెకు కుడి కన్ను వద్ద, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.

    కాంగ్రెస్ కార్యకర్తలు సురేఖ‌ను హన్మకొండ‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

  7. డ్రీమ్ 11 యాప్‌లో క్రికెట్ ఆడి ఈ ఎస్సై కోటిన్నర ఎలా గెలుచుకున్నారు? ఆ తర్వాత ఏమైంది?

  8. తెరుచుకోనున్న రఫా క్రాసింగ్

    ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల నేపథ్యంలో మూసివేసిన రాఫా క్రాసింగ్‌ను తెరిచేందుకు ఈజిప్ట్ అంగీకరించింది.

    మానవతాసాయం అందించేందుకు సరిహద్దు వద్ద వేచి ఉన్న 20 ట్రక్కులను పంపించేందుకు క్రాసింగ్‌ను తెరుస్తామని ఈజిప్ట్ ప్రకటించింది.

    ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ సాయం గాజాలోని ప్రజలకు అందేందుకు శుక్రవారం వరకు వేచి ఉండాలని తెలిపారు.

    దీనిపై ఇజ్రాయెల్ కూడా స్పందించింది. ఈ సాయం హమాస్‌కు చేరనంతవరకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రకటించింది.

    శుక్రవారానికి సాయం అందొచ్చు-బైడెన్

    ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న బైడెన్, గాజాలోని ప్రజలకు మానవతా సాయం అందించే విషయమై ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దెల్ ఫతాహ్ అల్-సిసితో చర్చలు జరిపారు. అనంతరం మీడియాకు వివరాలు తెలియజేశారు.

    తమ అభ్యర్థనను ఈజిప్ట్ అంగీకరించిందని, తొలిదశలో సరిహద్దు వద్ద ఉన్న 20 ట్రక్కులను క్రాసింగ్ తెరిచి, గాజాలోకి వెళ్లేందుకు అనుమతిని ఇచ్చిందని అన్నారు.

    “ట్రక్కులు సరిహద్దులు దాటి, గాజాకు శుక్రవారానికి చేరుకుంటాయి. ట్రక్కులు వెళ్లేందుకు వీలుగా శిథిలమైన రోడ్లను బాగుచేయడానికి సమయం పడుతుంది. గురువారం రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తారు. బహుశా శుక్రవారానికి తొలి విడత సాయం గాజాకు చేరుతుంది” అని జో బైడెన్ రిపోర్టర్లకు తెలియజేశారు.

    ఇప్పటికైతే 20 ట్రక్కులు పంపిస్తున్నామని, 150 కన్నా ఎక్కువ ట్రక్కులు గాజాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పరిస్థితులను బట్టి, ఎన్ని ట్రక్కులను పంపగలమో చూడాలని అన్నారు.

    అయితే గాజాను వదిలివెళ్లాలనుకునే వారిని అనుమతించే విషయమై స్పష్టత రాలేదు.

    రుషి సునక్ పర్యటన

    యూకె ప్రధాని రుషి సునక్ ఇజ్రాయెల్‌కు వెళ్లనున్నారు. గురువారం ఉదయం ఇజ్రాయెల్‌కు చేరుకోనున్న రుషి సునక్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, అధ్యక్షులు ఇసాక్ హెర్జోగ్‌లతో భేటీ అవుతారు.

  9. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.