ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్ల పట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ప్రపంచకప్‌లో బాగంగా అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్ల పట్ల వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
ఇదే విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు మీడియా విభాగం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
దీంతో పాటు ప్రస్తుతం భారత్‌లో జరుగుతోన్న ప్రపంచ కప్ 2023లో పాలుపంచుకునే పాకిస్తానీ జర్నలిస్టులకు వీసాల జారీ జాప్యం చేయడంపై కూడా ఫిర్యాదు దాఖలు చేసింది.
పాకిస్తాన్ అభిమానులకు వీసా పాలసీ లభించడం లేదని ఆరోపించింది.
ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి ఇప్పటి వరకు 18 మంది నేపాలీ పౌరులు సహా 286 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఎక్స్(ట్విటర్)లో ట్వీట్ చేశారు.
ఈ ఆపరేషన్‌లో బాగంగా ఇప్పటి వరకు ఐదు విమానాలను నడిపినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు.
ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయుల విజ్ఞప్తుల మేరకు పరిస్థితులను బట్టి భారతీయ రాయబార కార్యాలయం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
ఇజ్రాయెల్, గాజాలో పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్న భారతీయులకు సాయం అందించేందుకు విదేశాంగ శాఖ 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆపరేషన్ అజయ్ కింద 18వేల మంది భారతీయులను వెనక్కి తీసుకురావాల్సి ఉంది. వీళ్ల రిజిస్ట్రేషన్ గత గురువారం మొదలైంది.
చంద్రుడిపైకి తొలి భారతీయుడిని లేదా భారతీయురాలిని 2040లోగా పంపించే లక్ష్యంతో పనిచేయాలని భారత శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు.
2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా శాస్త్రవేత్తలను ఆయన కోరినట్లు వార్తాసంస్థ పీటీఐ తెలిపింది.
గగన్‌యాన్ మిషన్ సన్నద్ధతపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు.
దీంతోపాటు అక్టోబర్ 21న నిర్వహించే క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికల్‌కు చెందిన తొలి డిమానిస్ట్రేషన్ ఫ్లయిట్‌ను కూడా ఆయన పరిశీలించారు.
అంగారక గ్రహంపై ల్యాండ్ కావడంతో పాటు వీనస్ ఆర్బిటార్ మిషన్‌కు కూడా సిద్ధం కావాలని సూచించారు.
ఈ లక్ష్యాలను సాధనకు భారతీయ అంతరిక్ష విభాగం రోడ్డు మ్యాప్‌ను తయారు చేయనుందని మీడియా ప్రకటన ఒకటి తెలిపింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు.
పుష్ప సినిమాలో నటనకుగాను ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉత్తమ నటి అవార్డును అలియా భట్, కృతి సనన్ సంయుక్తంగా అందుకున్నారు.
రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ మూవీకి గాను ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును నిర్మాత వర్ఘాస్ మూలన్, నటుడు, డైరెక్టర్ ఆర్.మాధవన్ పొందారు.
కశ్మీర్ ఫైల్స్ మూవీలో నటించిన నటి పల్లవి జోషి ఉత్తమ సహాయ నటి అవార్డును స్వీకరించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
ఈ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో రెండు పక్షాల తరపున ఇవాళ కూడా వాడి వేడి వాదనలు జరిగాయి.
చంద్రబాబును రిమాండ్ సమయంలో నిందితుడిగా చేర్చారని ఆయన తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికలకు ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉందని, వాటిని ఆపడానికే సెక్షన్ 17 ఏ ఉందని వాదించారు.
ఈ కేసులో 17ఏ వర్తించదని సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ మరోసారి వాదించారు. వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పుడుక్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 482 కింద క్వాష్ చెయ్యలేమన్నారు.
ఫైబర్‌నెట్ వ్యవహారం కేసులో చంద్రబాబును శుక్రవారం వరకూ అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు, ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్‌పై విచారణను వాయిదా వేసింది.
స్వలింగ సంపర్క జంటలు పిల్లలను దత్తత తీసుకునే హక్కుపై సుప్రీం ధర్మాసనంలోని న్యాయమూర్తులు విభేదించారు. ఐదుగురిలో ముగ్గురు న్యాయమూర్తుల మెజార్జీ నిర్ణయం ప్రకారం, పిల్లలను దత్తత తీసుకునే హక్కు వారికి వర్తించదు.
స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అనుకూలత తెలుపగా, మరో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ రవీంద్ర భట్ వ్యతిరేకించారు. మెజార్టీ నిర్ణయం వ్యతిరేకంగా ఉండడంతో స్వలింగ జంటలు పిల్లలను దత్తత తీసుకోలేరు.
స్వలింగ జంటలు పిల్లలను దత్తత తీసుకునే హక్కుపై విభేదిస్తున్నామని జస్టిస్ రవీంద్ర భట్ తన తీర్పులో పేర్కొన్నారు. ఎలాంటి పౌరులకైనా చట్టపరమైన హక్కులు రావాలంటే, ముందు అలాంటి చట్టం ఉండాలని జస్టిస్ భట్ చెప్పారు.
లింగమార్పిడి చేయించుకున్న జంటలు స్వలింగ సంపర్కంలో ఉంటే, అలాంటి వారికి వివాహం చేసుకునే హక్కు ఉందని తెలిపారు. అయితే, ఇది స్వలింగ సంబంధాలను నివారించలేదని పేర్కొన్నారు.
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధంగా హక్కులు కల్పించడం పార్లమెంట్, శాసన సభల పరిధిలోకి వస్తుందని, వాటి ద్వారానే అది జరగాలని ధర్మాసనం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది.
వివాహ హక్కు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పరిగణించలేదని, అందువల్ల ప్రత్యేక వివాహ చట్టం లేదా, విదేశీ వివాహ చట్టం రాజ్యాంగాన్ని సవాల్ చేయలేవని ధర్మాసనం పేర్కొంది.
స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా చేసే బాధ్యత పార్లమెంట్, రాష్ట్ర శాసన సభల పని అని చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అన్నారు.
స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం నాడు తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.
స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్‌కు ఎలాంటి వ్యాఖ్యానాలను జోడించలేమని, ఆ పని చట్ట సభలు చేస్తాయని ఆయన అన్నారు. సాధారణ జంటల మాదిరిగానే స్వలింగ సంపర్కులకు కూడా సమాన వివాహ హక్కులు ఉండాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.
ఒకవేళ స్వలింగ జంటలు ఈ హక్కులు పొందలేకపోతే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
స్వలింగ జంటల సహజీవనాన్ని అనుమతించే విషయంలో కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలలోని ప్రభుత్వాలు వారి పట్ల వివక్ష చూపరాదన్నారు ప్రధాన న్యాయమూర్తి.
పెళ్లి అనేది లేకుండా ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ సభ్యులు ఒక భాగస్వామిని ఎంచుకోవడానికి, వారితో కలిసి జీవించడానికి సంపూర్ణ హక్కులు ఉంటాయన్న న్యాయమూర్తి, ప్రభుత్వం అలాంటి జంటలు తమ హక్కులను వినియోగించుకునేందుకు ప్రభుత్వాలు సహకరించాలని స్పష్టం చేశారు.
వివాహం చేసుకోని జంటలు, క్వీర్ కపుల్స్ పిల్లలను దత్తత తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
స్వలింగ సంపర్క మనస్తత్వం కేవలం గ్రామీణ ప్రాంతాలలోనే ఉండదని పట్టణాలలో కూడా ఉంటుంది, సమాజంలోని అనేక వర్గాలలో ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ధోరణి ఉందని చీఫ్ జస్టిస్ అన్నారు.
ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు వారిద్దరిలో ఒకరు ట్రాన్స్ మ్యాన్, ట్రాన్స్ వుమన్ గా ప్రకటించుకుంటే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చని ఆయన అన్నారు.
అలాగే, స్త్రీ పురుషుల వివాహాలలోనే పిల్లలు భద్రంగా, సురక్షితంగా ఉంటారు అనడానికి ఆధారాల్లేవని సీజేఐ అభిప్రాయపడ్డారు.
స్వలింగ జంటల వివాహాలను చట్టబద్ధం చేసే బాధ్యత చట్ట సభలదే తప్ప కోర్టులది కాదన్న ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జడ్జిలలో ఒకరైన జస్టిస్ సంజయ్ కౌల్ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నట్లు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయెల్‌లో ప్రకటించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అమెరికాకి చెందిన అగ్ర దౌత్యవేత్త బ్లింకెన్ దాదాపు ఏడుగంటల పాటు సమావేశమయ్యారు. ఈ సుదీర్థ సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నట్లు జెరూసలెంలోని యూఎస్ ఎంబసీ తెలిపింది.
నెతన్యాహు ఆహ్వానం మేరకు బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు వస్తున్నట్లు బ్లింకెన్ తెలిపారు. ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలు, వ్యూహాలపై జోబైడెన్‌కు పూర్తి సమాచారం అందుతుందని చెప్పారు.
పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం వైట్‌హౌస్ వర్గాలు తెలియజేస్తాయని ఆయన తెలిపారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణ నెలకొన్న సంక్లిష్ట సమయంలో జోబైడెన్ పర్యటించనున్నారని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.
ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలవడంతో పాటు గాజాలోని పౌరులకు సాయం అందించడం బైడెన్ ప్రధాన లక్ష్యాలు. ''మానవతా సాయంపై ఆయన చర్చిస్తారు. గాజా పౌరులు కోరుకుంటే గాజాను విడిచి వెళ్లేందుకు సురక్షిత మార్గాన్ని కల్పించేందుకు బైడెన్ కృషి చేస్తారు'' అని కిర్బీ చెప్పారు.
ఇజ్రాయెల్ పర్యటన అనంతరం ఆయన జోర్డాన్‌లోని అమ్మన్‌కు వెళ్తారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.