ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ పడుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫారాలు ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో ఓడించి అఫ్గానిస్తాన్ జట్టు సంచలనం సృష్టించింది.
అఫ్గానిస్తాన్ ఇచ్చిన 285 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 215 పరుగులకే ఆలౌటైంది.
ప్రపంచకప్‌లో భాగంగా దిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
అఫ్గానిస్థాన్‌లో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 80, ఇక్రమ్ 58 పరుగులు చేశారు. తర్వాత బ్యాంటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. హ్యారీ బ్రూక్ ఒక్కడే అత్యధికంగా 66 పరుగులు చేశాడు.
అఫ్గానిస్తాన్ బౌలర్లు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్ చెరో మూడు వికెట్లు తీశారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టోపై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పందించారు. “తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలని కాపీ కొట్టి, ఈ మేనిఫెస్టో రూపొందించారు. మేం ప్రకటనలు చేసినప్పుడు, హామీల అమలు ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. ఇప్పుడేమో అవే హామీలను మార్పులు చేసి ప్రకటించుకున్నారు. మేం ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలు చేస్తామంటే, ఎట్లా చేస్తారని ప్రశ్నలు వేసి, ఇప్పుడు మీరు రూ.15 లక్షలకు పెంచుతామని చెప్తున్నారు. మరి ఇదెలా సాధ్యం?” అని ప్రశ్నించారు.
“మీ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. దాచిపెట్టిన లక్ష కోట్లను పెట్టుబడిగా మార్చుకుని, దేశ రాజకీయాల మీద పట్టు సాధించాలని ప్రయత్నించారు” అని కేసీఆర్‌పై విమర్శలు చేశారు.
“కేసీఆర్ ఆలోచనాశక్తి సన్నగిల్లింది. ఆయన పరాన్నజీవి. ఈరోజు నాకు ఆత్మవిశ్వాసం కోల్పోయిన చంద్రశేఖర్ రావు కనిపించారు. ఆయనకు ఓ సలహా ఇస్తున్నా, ఇక ఎన్నికల నుంచి తప్పుకుని, మీ శేష జీవితాన్ని ఫాంహౌస్‌లో గడిపండి” అన్నారు.
ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా కేసీఆర్ విజయం సాధించగలరా అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.
అమరేంద్ర యార్లగడ్డ
బీబీసీ ప్రతినిధి
బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు పంపిణీ చేసిన అనంతరం బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
ప్రస్తుతం అమలవుతోన్న పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని కొత్త పథకాలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలు..
తెలంగాణను నంబర్ వన్ గా నిలిపాం: కేసీఆర్
మేనిఫెస్టో విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.
తమ పాలనలో అన్ని రంగాల్లో దేశంలో తెలంగాణను నంబర్ వన్ గా నిలిపామని చెప్పారు.
‘‘బెస్ట్ ఎకనమిక్ పాలసీ, బెస్ట్ పవర్ పాలసీ, బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ, బెస్ట్ ఇరిగేషన్ పాలసీ, బెస్ట్ అగ్రికల్చర్ పాలసీ, బెస్ట్ దళిత్ పాలసీ, బెస్ట్ వెల్ఫేర్ పాలసీ, బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ, బెస్ట్ హెల్త్ పాలసీ, బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, బెస్ట్ హౌసింగ్ పాలసీని అమలు చేస్తున్నాం. ఈ పాలసీలన్నీ యథావిధిగా అమలు చేస్తాం. ప్రస్తుత మేనిఫెస్టోలో ప్రకటిస్తున్న హామీలన్నీ అధికారంలోకి వచ్చాక ఆరేడు నెలల్లోనే అమలు చేస్తాం. కాలానుగుణంగా మరిన్ని కొత్త పథకాలు తీసుకువస్తాం.’’ అని ఆయన అన్నారు.
తెలంగాణలో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామరస్య పాలన అందించామని కేసీఆర్ ప్రకటించారు.
అభ్యర్థులకు బీఫారాల అందజేత
మేనిఫెస్టో విడుదలకు ముందు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం అయ్యారు.
ఇప్పటికే 115 స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. మరో నాలుగు స్థానాలకు తాజాగా అభ్యర్థులను ఖరారు చేశారు.
తొలుత ప్రకటించిన అభ్యర్థులతో మల్కాజిగిరి నుంచి పోటీ చేయనున్న మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడారు.
ఆయన, ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. మైనంపల్లి హన్మంతరావుకు కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్‌ను కేటాయించగా.. ఆయన కుమారుడు రోహిత్ రావుకు మెదక్ టికెట్ ఇచ్చింది.
మల్కాజిగిరి అసెంబ్లీ స్థానానికి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది.
ముందుగా 51మందికి బీఫారాలు అందజేస్తున్నట్లు కేసీఆర్ అందించారు. తర్వాత మిగిలిన వారికి బీఫారాలు అందించనున్నట్లు ప్రకటించారు.
బీఫారాలు సిద్ధమవుతున్నాయని, రెండు, మూడు రోజుల్లో మిగిలిన వారందరికీ అందిస్తామని చెప్పారు.
ఎన్నికల్లో చాలా కీలకంగా వ్యవహరించాలని, ఇప్పుడు బీఫారాలు అందని నాయకులు నిరాశ పడొద్దని కేసీఆర్ అన్నారు.
భవిష్యత్‌లో అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం ప్రకటించింది.
55 స్థానాల్లో పోటీపడే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు.
సామాజిక వర్గాల వారీగా చూస్తే రెడ్లకు-17, బీసీలకు-12, ఎస్సీ-12, వెలమ -7, ముస్లింలు-3, ఎస్టీ-2, బ్రహ్మణులను-2 నియోజకవర్గాల నుంచి ప్రకటించింది.
కొత్తగా చేరిన వారికి 12 స్థానాలను కేటాయించింది.
తొలి జాబితా ప్రకారం మైనంపల్లి కుటుంబానికి, ఉత్తంరెడ్డి కుటుంబానికి రెండు సీట్లు దక్కాయి.
మైనంపల్లి రోహిత్ రావుకు మెదక్, మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజ్‌గిరి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజుర్‌నగర్, ఆయన భార్య పద్మావతికి కోదాడ సీట్లు కేటాయించారు.
కొడంగల్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మధిర నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ భట్టి విక్రమార్క, నాగార్జున సాగర్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి పోటీ చేయనున్నారు.
అలాగే మాజీ మంత్రులు గడ్డం వినోద్ (బెల్లంపల్లి), సుదర్శన్ రెడ్డి (బోధన్), శ్రీధర్ బాబు (మంథని), దామోదర్ రాజనర్సింహా (ఆందోల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), జీవన్ రెడ్డి (జగిత్యాల), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ)కి కూడా టిక్కెట్లు లభించాయి.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.