ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఏసియన్ గేమ్స్‌లో భారత్ మరో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఏసియన్ గేమ్స్‌లో భారత్ మరో రెండు స్వర్ణాలు సాధించింది.
జావెలిన్ త్రో విభాగంలో అన్నూ రాణి గోల్డ్ మెడల్ గెలుచుకుంది.
5,000 మీటర్ల అథ్లెటిక్స్ ఈవెంట్‌లో పరుల్ చౌదరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
డెకాథ్లాన్ పోటీల్లో తేజస్విన్ శంకర్ రెండో స్థానంలో నిలిచి, రజత పతకం సాధించాడు.
ఏసియన్ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ 15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలతో మొత్తం 69 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, OTHER
భౌతిక శాస్త్రంలో పెర్రీ అగొస్తినీ, ఫెరెన్స్ క్రౌజ్, అన్నే ఎల్ హ్యూలియర్‌లకు ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది.
ఈ శాస్త్రవేత్తలు కాంతి అతి సూక్ష్మ తరంగాలను ఎలా నిర్మించవచ్చో చూపించారు.
ప్రొఫెసర్ ఫెరెన్స్ జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌లో క్వాంటం ఆప్టిక్స్ సబ్జెక్ట్ బోధిస్తున్నారు.
ప్రొఫెసర్ పెర్రీ అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయంలో పాఠాలు చెబుతారు.
ప్రొఫెసర్ హ్యూలియర్ స్వీడన్‌లోని ఒక వర్సిటీలో బోధిస్తున్నారు.

ఫొటో సోర్స్, twitter
తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు ఎన్డీఏలో చేరుతానన్నారని, అయితే తానే ఒప్పుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం జరిగిన 'ఇందూరు జన గర్జన'లో మోదీ ప్రసంగించారు.
ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారంటూ ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండించింది.
ఇందూరు సభలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మోదీ విమర్శలు గుప్పించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు స్వేచ్ఛ రాలేదని ఆయన ఆరోపించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం కేసీఆర్ వచ్చి ఎన్డీఏలో చేరుతానన్నారని మోదీ అన్నారు. ఆ ప్రతిపాదన తిరస్కరించడంతో కేసీఆర్ మళ్లీ దగ్గరికి రాలేదని, కొన్ని రోజుల తర్వాత వచ్చి కేటీఆర్ గురించి చెప్పారని తెలిపారు మోదీ.
‘‘కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తామని కేసీఆర్ నాతో చెప్పారు. మీరేమన్న రాజులా అని నేను ప్రశ్నించాను. అప్పటి నుంచి నన్ను కలవలేదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
''కేంద్రం ద్వారా తెలంగాణకు చేయాల్సిందంతా చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వానికి కోట్ల నిధులిచ్చాం. కేంద్రం నిధులను బీఆర్ఎస్ దోచుకుంది. అవినీతిని వాళ్లు ప్రోత్సహిస్తున్నారు. వాళ్లు ప్రజాస్వామ్యాన్ని కుటుంబవాదంగా మార్చారు'' అని అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం
''కాంగ్రెస్‌తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశమంతా ఆ పార్టీని తిరస్కరించింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తెర వెనుక మంత్రాంగం నడుస్తోంది. ఇరు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి'' అని మోదీ ఆరోపించారు.
మోదీ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండించింది. హైదరాబాద్ పర్యటనకు వచ్చినపుడు కేసీఆర్ వస్తానంటే మోదీనే వద్దన్నారని బీఆర్ఎస్ నాయకుడు వినోద్ కుమార్ హైదరాబాద్‌లో మీడియాతో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Twitter/BJPtelangana
అంతకుముందు నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మోదీ రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మనోహరాబాద్- సిద్ధిపేట రైల్వే లైన్ ప్రారంభించారు.
రెండు రోజుల కిందట మహబూబ్‌నగర్‌లో జరిగిన సభలో ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ, నిజామాబాద్‌కు పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
'ఇందూరు జన గర్జన' సభకు బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

ఫొటో సోర్స్, THAI POLICE
బ్యాంకాక్‌లోని సియామ్ పారగాన్ షాపింగ్ మాల్‌లో మంగళవారం కాల్పులు జరిగాయి. ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
14 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్పులు జరిపాడని పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.
బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాల్పుల శబ్దం వినపడటంతో మాల్‌లోని జనం బయటకు పరుగులు తీశారు. ఈ వీడియోలను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్ 9వ తేదీ, సోమవారానికి వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నమోదైన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్)ను కొట్టివేయాలంటూ నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది.
చంద్రబాబుపై నమోదైన కేసులో హైకోర్టుకు సమర్పించిన అన్ని పత్రాలను కోర్టుకు సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.

ఫొటో సోర్స్, ANI
న్యూస్‌క్లిక్ వెబ్‌సైట్‌కి చెందిన పలువురు జర్నలిస్టుల ఇళ్లపై దిల్లీ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
న్యూస్‌క్లిక్ మీడియా సంస్థకి సంబంధించిన దాదాపు 30 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు దిల్లీ పోలీసు వర్గాలు చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.
''న్యూస్‌క్లిక్‌కి సంబంధించిన పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు'' పోలీసు వర్గాలు తెలిపాయి.
''న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల ఇళ్లపై దాడులు ఆందోళన చెందుతున్నాం. ఈ విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నాం. జర్నలిస్టులకు అండగా ఉంటాం. ఎందుకు దాడులు చేస్తున్నారో మరింత సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం'' అని ది ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తెలిపింది.
న్యూస్‌క్లిక్ వెబ్‌సైట్‌కి చైనా నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఐపీసీ సెక్షన్లు 406, 420, 120-బీ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. విచారణలో నేరపూరిత చర్యలకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.
నిందితులు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద బయటి దేశాల నుంచి నిధులు సేకరించి అక్కడి వారికి అనుకూలంగా పనిచేసేలా కుట్రపూరిత పథకం రూపొందించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు ఏఎన్‌ఐ తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
న్యూస్‌క్లిక్‌పై దర్యాప్తు ఏజెన్సీ ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోకుండా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ దిల్లీ పోలీస్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ప్రబీర్ పుర్కాయస్థని అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ జులై 2021న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే, దర్యాప్తుకు సహకరించాలని, దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని సూచించింది.
ఈ కేసులో న్యాయస్థానం ఆగస్టు 22న న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థకి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో సౌరబ్ బెనర్జీ బెంచ్ ప్రబీర్ స్పందన కోరింది.
అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత ప్రబీర్ దర్యాప్తు సంస్థల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో పీపీకే న్యూస్‌క్లిక్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన 2017-18 నుంచి 2019-20 వరకూ బ్యాలెన్స్ షీట్లను సమర్పించారు. అయితే, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఖర్చులు, విదేశీ పెట్టుబడులను దేనికి ఉపయోగించారు? వంటి వివరాలు పొందుపరచలేదని ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ చెబుతోంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాల తాజా సమాచారం కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.