లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అయిదు వందల నోట్లపై స్టార్ గుర్తు ఉంటే అవి నకిలీవనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ విషయంలో ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
500 రూపాయల నోటుపై పుకార్లు వస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది.
ఐదు వందల కరెన్సీ నోటుపై స్టార్ గుర్తు ఉంటే నకిలీవని, అలాంటి నోట్లు మార్కెట్‌లో చెలామణి అవుతున్నాయంటూ కొద్దిరోజులుగా వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
అలాంటి నోట్లపై ఆర్బీఐ ఒక ప్రకటన చేసింది.
స్టార్ గుర్తు ఉన్న 500 నోట్లు నకిలీవి కావని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రింటింగ్ లోపం ఉన్న నోట్ల స్థానంలో వీటిని ముద్రించినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఒకటి నుంచి 100 వరకు ఉండే సీరియల్ నంబర్ నోట్లలో ప్రింటింగ్ లోపాలు ఉన్న వాటి స్థానంలో ఈ స్టార్ గుర్తున్న నోట్లను ముద్రించినట్లు వివరించింది.
500 నోటుపై సీరియల్ నంబర్‌కి ముందు స్టార్ గుర్తు ఉన్నవి మార్కెట్‌లో నిరభ్యంతరంగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ తెలిపింది. స్టార్ సింబల్ ఉంటే మరొక నోటు స్థానంలో ఈ నోటు ముద్రించినట్లు అర్థమని స్పష్టం చేసింది.
భీమా కోరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద వీరిని అరెస్ట్ చేశారు.
ఆగస్టు 2018 నుంచి వీరు జైలులో ఉంటున్నారు.
పుణేలోని భీమా కోరేగావ్‌లో 2018లో చెలరేగిన కుల హింసాకాండకి కారణమంటూ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
2021 డిసెంబర్‌లో వీరి బెయిల్ అప్లికేషన్‌ను బొంబై హైకోర్టు తిరస్కరించింది.
ఆ తర్వాత, గొంజాల్వెజ్, ఫెరీరాల ఫిర్యాదును విచారించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, సుదాన్షు దులియాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.
సుమారు ఐదేళ్లుగా వీరు కస్టడీలో ఉన్నారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వీరికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
వారికి వ్యతిరేకంగా సీరియస్ ఆరోపణలు ఉన్నప్పటికీ, బెయిల్ ఇవ్వడం నిరాకరించడానికి కేవలం ఇదొక్కటే సరిపోదని బెంచ్ తెలిపింది.
సింగపూర్ శుక్రవారం రోజున ఒక మహిళను ఉరి తీసింది. సింగపూర్‌లో గత 20 ఏళ్లలో ఒక మహిళను ఉరి తీయడం ఇదే తొలిసారని అధికారులు ధ్రువీకరించారు.
సింగపూర్ జాతీయురాలైన 45 ఏళ్ల సరిదేవీ జామని 2018లో 30 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. ఆ కేసులో ఆమె దోషిగా తేలారు.
సింగపూర్ చట్టాల ప్రకారం 500 గ్రాములకు పైగా గంజాయి, 15 గ్రాములకు పైగా హెరాయిన్‌ను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఎవరికైనా మరణశిక్ష విధించవచ్చు.
ఈ నేపథ్యంలో సరిదేవీకి 2018 జులై 6న ఉరిశిక్షను విధించారు. దాన్ని ఇప్పుడు అమలు చేశారు. ఈ వారంలోనే డ్రగ్స్ కేసులో మరో వ్యక్తిని కూడా సింగపూర్ ఉరి తీసింది.
2017లో 50 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన సింగపూర్ పౌరుడు అజీజ్‌ను కూడా బుధవారం ఉరి తీశారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఏలూరు, అల్లూరి జిల్లాల పరిధిలో పలు గ్రామాలు వరద ముప్పు ఎదుర్కొంటున్నాయి.
దిగువన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు డాక్టర్ బీఅర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లంకలు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి.
వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం రంగంలో దిగింది.
పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. గోదావరికి వరద తాకిడి మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోంది.
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది.
కెప్టెన్ షై హోప్ 45 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 43 పరుగులు చేశాడు. ఇదే టాప్ స్కోర్.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగగా, జడేజా 3 వికెట్లు తీశాడు.
అనంతరం భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది.
ఓపెనర్ ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52 పరుగులు చేశాడు. గిల్ 7 పరుగులకే అవుట్ కాగా, సూర్యకుమార్ యాదవ్ 19 పరుగులు సాధించాడు.
జడేజా (16 నాటౌట్) రాణించాడు. హార్దిక్ పాండ్యా (5) రనౌట్ అయ్యాడు.
ప్రత్యర్థి బౌలర్లలో మోతీ 2 వికెట్లు తీయగా, యానిక్ కరియా, జేడన్ సీల్స్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగనుంది.
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు అనేక పట్టణాలు, గ్రామాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, దిలాబాద్ జిల్లాల్లో వర్షాలతో రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో పాటు పంట పొలాలు నీట మునిగాయి. వరద ప్రవాహంలో పలువురు గల్లంతైన ఘటనలు కూడా నమోదయ్యాయి.
వరంగల్ రైల్వే స్టేషన్ కూడా నీట మునిగింది.
వరదల్లో చిక్కుకున్నవారిని కేంద్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్) టీమ్‌లు రక్షిస్తున్నాయి.
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాల కారణంగా ఎంతో మంది నీళ్లలో చిక్కుకుపోయారని వారిని తక్షణ సహాయం అందించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉద్వేగభరితం అయ్యారు.
తగిన సహాయం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కోరారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నైన్‌పాక గ్రామంలోని నీళ్లలో జేసీబీపై చిక్కుకుపోయిన ఆరుగురిని ఐఏఎఫ్ హెలికాప్టర్ల ద్వారా కాపాడారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.