You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తీస్తా సీతల్‌వాడ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ఈ కేసు విచారణ కోసం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఏర్పాటు చేయాలని సూచిస్తూ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ముందుకు కేసు పంపినట్లు ‘లైవ్ లా’ వార్తాసంస్థ తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. తీస్తా సీతల్‌వాడ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

    హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ తీస్తా సీతల్‌వాడ్‌కు సుప్రీంకోర్టు మరో 8 రోజులకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు ‘లైవ్ లా’ వెబ్‌సైట్ పేర్కొంది.

    శనివారం రాత్రి ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపింది.

    తొలుత గుజరాత్ హైకోర్టు తీస్తాకు బెయిల్ నిరాకరించగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    అయితే, సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ను మొదట ఇద్దరు సభ్యుల బెంచ్ విచారించింది.

    బెంచ్‌లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి రిఫర్ చేశారు.

    జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీస్తా సీతల్‌వాడ్‌కు మరో 8 రోజులకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

  3. ఇయర్ ఫోన్స్ వల్ల వచ్చే 5 సమస్యలు ఏంటంటే?

  4. సేమ్ సెక్స్ మేరేజెస్‌లో భర్త ఎవరు, భార్య ఎవరు? ఎలా తెలుస్తుంది

  5. ‘నా కోరిక తీర్చకపోతే నీ భర్తను ఉరేసి చంపుతామని ఆంధ్రా పోలీసులు బెదిరించారు’ - చిత్తూరు పోలీసులపై తమిళనాడు మహిళల తీవ్ర ఆరోపణ.. దర్యాప్తు జరుపుతున్నామన్న ఎస్పీ

  6. తీస్తా సీతల్‌వాడ్ బెయిల్ పిటిషన్‌పై ఎటూ తేల్చని సుప్రీం, మరో బెంచ్‌ విచారణకు సిఫారసు

    మానవ హక్కుల కార్యకర్త తీస్తా సీతల్‌వాడ్‌కు బెయిల్ రద్దు కేసులో 'మధ్యంతర ఉపశమనం' కల్పించడంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో ఏకాభిప్రాయం రాలేదు.

    దీంతో ఈ కేసు విచారణ కోసం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఏర్పాటు చేయాలని సూచిస్తూ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ముందుకు కేసు పంపినట్లు ‘లైవ్ లా’ వార్తాసంస్థ తెలిపింది.

    తీస్తా సీతల్‌వాడ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు శనివారం బెయిల్ తిరస్కరిస్తూ, వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది.

    దీంతో తీస్తా సీతల్‌వాడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    తీస్తా సీతల్‌వాడ్‌కు మధ్యంతర ఉపశమనం కల్పించడంపై జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ పీకె మిశ్రాలతో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది.

  7. ‘మా నాన్న పుట్టింటికి తీసుకెళ్లి నాపై అత్యాచారం చేసేవాడు’.. భర్త సాయంతో తండ్రిపై ఫిర్యాదు చేసిన వివాహిత

  8. సూది రంధ్రంలో దూరేటంత చిన్న హ్యాండ్ బ్యాగ్, ధర మాత్రం..

  9. కూల్‌డ్రింక్స్‌లో వాడే స్వీటెనర్ 'అస్పార్టేమ్' క్యాన్సర్ కారకమా?

  10. గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు

    సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్‌పై శనివారం విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె వెంటనే లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

    2002 గుజరాత్ అల్లర్ల కేసులో, సాక్ష్యాధారాలు సృష్టించారని వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసులో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

    ఈ కేసులో 2022 సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో తీస్తా సెతల్వాద్‌కు అరెస్టు నుంచి మినహాయింపు లభించింది.

    బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో పాటు వెంటనే లొంగిపోవాలని హైకోర్టు న్యాయమూర్తి నిర్జార్ దేశాయ్ ఇచ్చిన ఆదేశాలపై అమలుకు నెల రోజులు గడువు ఇవ్వాలని, సీనియర్ న్యాయవాది మిహిర్ ఠాకూర్ కోర్టును కోరారు. 30 రోజులు స్టే విధించాలన్న ఆయన వినతిని కోర్టు తోసిపుచ్చింది.

    తీస్తా సెతల్వాద్‌ను గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2022 జూన్ 25న ముంబైలో అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ఆమె అరెస్టయ్యారు.

    ఈ కేసులో తీస్తా సెతల్వాద్‌తో పాటు గుజరాత్ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్, సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌పై కూడా గుజరాత్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉరిశిక్ష పడే కేసుల్లో అమాయకులను ఇరికించారని వారిపై అభియోగాలు నమోదయ్యాయి.

    తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ శ్రీకుమార్‌ను అరెస్టు చేసిన అనంతరం అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించాలని కోరారు.

    వాదనలు విన్న మెట్రోపాలిటన్ కోర్టు తీస్తా సెతల్వాద్‌కు ఏడు రోజుల రిమాండ్ విధించడంతో పాటు జూలై 2 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.

  11. మహారాష్ట్ర బస్సు ప్రమాదం ఎలా జరిగింది... ప్రత్యక్ష సాక్షి ఏమన్నారు?

    మహారాష్ట్రలో హైవే మీద జరిగిన బస్సు ప్రమాదంలో 25 మంది చనిపోయిన ఘటన చాలా కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు?

  12. మహారాష్ట్ర బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటన

    మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

    ''మహారాష్ట్రలోని బుల్దానాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర బాధను కలిగించింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. వారి కోసం ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తోంది'' అని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

    ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

    ''బుల్దానా బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాం.'' అని ప్రధాన మంత్రి కార్యాలయం మరో ట్వీట్ చేసింది.

    మహారాష్ట్రలోని బుల్దానాలో జరిగిన రోడ్డు ప్రమాదం మనసును కలిచివేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.

    ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నానని, ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తున్నానన్నారు. గాయపడిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారని, వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అమిత్ షా ట్వీట్ చేశారు.

    మృతుల కుటుంబ సభ్యులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.

    ''ఘోర ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి దర్యాప్తునకు ఆదేశించారు'' అని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

    బస్సు ప్రమాద మృతులకు నివాళులు అర్పిస్తున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

  13. కెన్యాలో కూతురి హంతకుల జాడ కోసం అక్కడికి 100 సార్లు వెళ్ళారు, 16 కోట్లు ఖర్చు చేశారు

  14. ఉమ్మడి పౌరస్మృతిపై కాంగ్రెస్ పార్టీ సమావేశం

    కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ (పీఎస్‌జీ) శనివారం దిల్లీలో సమావేశం కానుంది.

    సోనియా గాంధీ అధికారిక నివాసం 10 జన్‌పథ్‌లో ఈ భేటీ జరగనుంది.

    చట్టం, న్యాయ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ జూలై 3వ తేదీ సోమవారం ఈ అంశాన్ని పరిశీలించనున్న నేపథ్యంలో పీఎస్‌జీ సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది.

    జూన్ 27న మధ్యప్రదేశ్‌ పర్యటనలో తొలిసారి యూనిఫాం సివిల్ కోడ్ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. దీంతో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఈ అంశాన్ని ముఖ్యమైనదిగా పరిగణిస్తోంది.

    ప్రధానమంత్రి ఏమన్నారంటే..

    ''ఒక కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు నిబంధనలు ఉండకూడదు. ఇలాంటి ద్వంద్వ వ్యవస్థతో ఇల్లు ఎలా నడుస్తుంది'' అని భోపాల్‌ పర్యటన సందర్భంగా ప్రధానిమోదీ వ్యాఖ్యానించారు.

    ''సుప్రీం కోర్టు పదే పదే చెప్పింది. సుప్రీం కోర్టు అదే నిర్ణయంపై ఉంది. ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలని చెప్పింది. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారు దానిని అడ్డుకుంటున్నారు. అయినా బీజేపీ అందరి తరఫున ఉంటుంది. అందరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది'' అని మోదీ అన్నారు. దేశంపై ప్రేమతో పనిచేస్తున్నామని ఆయన అన్నారు.

    అయితే, ప్రధాని వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. యూనిఫాం సివిల్ కోడ్ పేరుతో 2024 ఎన్నికల వేళ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి విషయాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రధాన మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

  15. చిరుతపులి మచ్చల కప్పలు: ఈ అరుదైన జీవుల సెక్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే...

  16. ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం క్రైమ్ క్యాపిటల్‌గా మారుతోందా?

  17. ‘మంటల్లో చిక్కుకున్న ప్రయాణికుల అరుపులు వినబడుతున్నా ఏమీ చేయలేకపోయాం’

    ముంబై - నాగ్‌పూర్ హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో అద్దాలు పగలగొట్టి బయటపడిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు.

    మంటల్లో కాలిపోతున్న తోటి ప్రయాణికుల అరుపులు వినిపించాయని, కానీ ఆ సమయంలో ఏమీ చేయలేకపోయామని బస్సులో నుంచి దూకేసి ప్రాణాలు దక్కించుకున్న ఒక ప్రయాణికుడు చెప్పారు.

    ''నేను ఛత్రపతి శంభాజీనగర్‌లో దిగాల్సి ఉంది. ఒక గంటలో నా స్టాప్‌ వచ్చేస్తుందని దిగేందుకు సిద్ధమవుతున్నా. ఇంతలో బస్సు బోల్తా పడింది. నేను, నా స్నేహితుడు కిందపడిపోయాం. తర్వాత కొద్దిసేపటికి మా ముందు ఉన్న ఒక వ్యక్తి బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు దూకారు. మేము కూడా అతని వెనకే దూకేశాం.

    మా తర్వాత మరికొందరు బస్సు నుంచి బయటపడ్డారు. బస్సు బోల్తా పడిన వెంటనే మంటలు చెలరేగాయి. నెమ్మదిగా ఆ మంటలు పెరిగాయి. మంటల్లో కాలిపోతున్న ప్రయాణికుల అరుపులు వినిపించాయి. కానీ మేము ఏమీ చేయలేకపోయాం.'' అని ప్రమాదం నుంచి బయటపడిన ఒక ప్రయాణికుడు చెప్పారు.

    బస్సు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

  18. మహారాష్ట్రలో బస్సు ప్రమాదం, మంటల్లో కాలిపోయి 25 మంది మృతి

    మహారాష్ట్రలోని ముంబై - నాగ్‌పూర్ సమృద్ధి హైవేపై బస్సు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజాము సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారని బుల్దానా ఎస్పీ సునీల్ కడాసనే తెలిపారు.

    బస్సు ప్రమాదానికి గురైన సమయంలో 33 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. నిద్రలోనే 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయాలపాలయ్యారు.

    విదర్భ ట్రావెల్స్‌కి చెందిన ఎంహెచ్ 29 బీఈ 1819 నంబరు గల బస్సు సమృద్ధి హైవేపై నాగ్‌పూర్ నుంచి పుణెకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. టైరు పేలిపోవడంతో బుల్దాని సమీపంలోని సింద్‌ఖేడ్ రాజా వద్ద బస్సు అదుపుతప్పి దూసుకెళ్లి పిల్లర్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత ఓ చిన్న బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా కొట్టినట్లు చెబుతున్నారు.

    ఈ ప్రమాాదంలో బస్సు డీజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టి బయటపడినట్లు కడాసనే చెప్పారు.

    మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు ప్రమాద ఘటనపై నిపుణులు విచారణ జరుపుతున్నారు. గాయపడిన ప్రయాణికులు బుల్దానా అసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.