You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మణిపూర్‌లోని తెలంగాణ విద్యార్థులను తరలించేందుకు రేపు ప్రత్యేక విమానం

ఇబ్బందుల్లో ఉన్న విద్యార్ధులు సంప్రదించడానికి హెల్ప్ లైన్ నంబర్‌ను, ఈమెయిల్ ‌అడ్రస్‌ను కూడా ప్రకటించింది తెలంగాణ పోలీస్ శాఖ.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు మళ్లీ తాజా వార్తలతో కలుసుకుందాం.

  2. మణిపూర్‌లోని తెలంగాణ విద్యార్థులను తరలించేందుకు ఆదివారం ప్రత్యేక విమానం

    మణిపూర్‌లో శాంతిభద్రతల సమస్యలు నెలకొన్న నేపథ్యంలో..అక్కడ ఉన్న తెలంగాణ విద్యార్థులు, ప్రజల భద్రతకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

    అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్, పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు.

    తెలంగాణ విద్యార్థులను ఇంఫాల్ నుంచి తక్షణమే ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

    ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రదించారు.

    మణిపూర్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రజలు/విద్యార్థుల భద్రత కోసం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

    ఇబ్బందుల్లో ఉన్న విద్యార్ధులు సంప్రదించడానికి హెల్ప్ లైన్ నంబర్‌ను, ఈమెయిల్ ‌అడ్రస్‌ను కూడా ప్రకటించింది తెలంగాణ పోలీస్ శాఖ.

    మణిపూర్‌లో తెలంగాణ విద్యార్ధులు సహాయం కోసం 7901643283 నెంబర్‌కు ఫోన్ కాల్, లేదా [email protected] మెయిల్ చేయవచ్చునని పోలీసులు అధికారులు వెల్లడించారు.

  3. మరికొన్ని గంటల్లో చార్లెస్ III పట్టాభిషేకం మొదలు

    బ్రిటన్ రాజుగా చార్లెస్ III పట్టాభిషేకానికి లండన్‌లో తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కొన్నిగంటల్లో ఈ కార్యక్రమం మొదలుకానుంది.

    2022 సెప్టెంబరులో తల్లి ఎలిజబెత్-2 మరణించడంతో చార్లెస్‌ రాజు అయ్యారు

    వెస్ట్‌మినిస్టర్ అబేలో నిర్వహించే వేడుకలో కింగ్ చార్లెస్‌ను పట్టాభిషిక్తుడిని చేస్తారు.

    పట్టాభిషేకం అనేది ఒక మతపరమైన కార్యక్రమం లాంటిది. కాంటెర్‌బరీ ఆర్చిబిషప్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. 'పవిత్రమైన' నూనెను రాజు తల, భుజాలు, ఛాతిపై ఆర్చిబిషప్ చల్లుతారు. ఆ తర్వాత రాజరికానికి చిహ్నాలైన ఆర్బ్ (శిలువ ముద్రతో కనిపించే గోళం), సెప్టెర్ (రాజదండం)లను రాజు చేతికి అందిస్తారు.

    ఈ కార్యక్రమం చివర్లో చార్లెస్ తలపై సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని రాజుకు పెడతారు. ఈ బంగారు కిరీటం 1660ల నాటిది.

    పట్టాభిషేకాన్ని చూసేందుకు వేల మంది రాజకుటుంబ అభిమానులు, ప్రజలు సెంట్రల్ లండన్ చేరుకొంటున్నారు.

    ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది సాయుధ బలగాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఆర్మీ, నౌకాదళం, ఆర్‌ఏఎఫ్ సిబ్బంది ఉన్నారు.

    ఒకవైపు పట్టాభిషేకాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు వస్తుండగా, మరోవైపు రాజరికాన్ని వ్యతిరేకిస్తూ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో కొంత మంది నిరసన ప్రదర్శన చేపట్టారు.

    రాజరిక వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్‌తో రిపబ్లిక్ అనే గ్రూప్ ఈ నిరసనను చేపట్టింది. ఈ నిరసనలో 1500 మంది వరకు పాల్గొంటారని ఈ గ్రూప్ ఆశిస్తోంది.

  4. బైడెన్ దేశీయ విధాన సలహాదారుగా నీరా టాండన్

    భారతీయ అమెరికన్ నీరా టాండన్‌ను అమెరికా దేశీయ విధాన మండలి సారథిగా నియమిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారని వార్తాసంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. సుసాన్ రైస్ స్థానంలో దేశీయ విధాన సలహాదారుగా నీరా నియమితులయ్యారు.

    ఆర్థిక పురోగతి, అన్ని జాతుల వారి ఆరోగ్య సంరక్షణ, విద్య, వలసలు దేశీయ విధానాల పరిధిలోకి వస్తాయి.

    అధ్యక్షుడి మూడు ముఖ్యమైన విధానాలను అమలు చేయబోయే తొలి భారతీయ అమెరికన్‌గా నీరా టాండన్ చరిత్ర సృష్టించబోతున్నారని బైడెన్ చెప్పారు.

    నీరా ప్రస్తుతం బైడెన్ సీనియర్ సలహాదారుగా, స్టాఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

  5. బ్రిజ్ భూషణ్‌పై ఫిర్యాదులో మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలు ఏమిటి?

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ తమను లైంగికంగా వేధించారంటూ క్రీడాకారిణులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న అంశాలను ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించింది.

    ఆరోపణలు చేసిన ఏడుగురిలో ఇద్దరు బ్రిజ్ భూషణ్ తమను అనేకసార్లు లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదుచేశారు.

    దిల్లీలోని కనాట్‌ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో ఏప్రిల్ 21న ఈ ఫిర్యాదులు ఇచ్చారు. లైంగిక వేధింపులకు సంబంధించి కనీసం ఎనిమిది ఘటనలను ఆ ఫిర్యాదులలో వారు ప్రస్తావించారు.

    శ్వాస పరీక్ష చేస్తానంటూ బ్రిజ్ భూషణ్ తమను అనుచితంగా తాకారంటూ ఫిర్యాదు చేసిన ఇద్దరూ ఆరోపించారు.

    రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ ఉండడం వల్ల తమ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందనే భయంతో ఈ వేధింపుల విషయం అంతకుముందు చెప్పలేదని వారు తెలిపారు.

    ఫిర్యాదు చేసిన ఇద్దరిలో ఒకరు.. బ్రిజ్ భూషణ్ తనపై అయిదు కంటే ఎక్కువసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

    2016లో ఓ టోర్నమెంట్ సమయంలో రెస్టారెంట్‌లో బ్రిజ్ భూషణ్ తాను ఉన్న చోటికే పిలిపించుకుని తన ఛాతీ, పొట్టపై అనుచితంగా తాకినట్లు మహిళా రెజ్లర్ ఆరోపించారు.

    ఆ ఘటన తరువాత తాను డిప్రెషన్‌కు గురయ్యానని, భోజనం చేయలేకపోయానని, నిద్ర కూడా పట్టలేదని చెప్పారు.

    2019లో మరో టోర్నమెంట్ సమయంలో కూడా బ్రిజ్ భూషణ్ మరోసారి తన ఛాతీ, పొట్టను తాకారని ఆమె ఆరోపించారు.

    అశోకా రోడ్‌లోని ఆయన బంగ్లాలోనే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఉందని, అక్కడికి వెళ్లినప్పుడు కూడా ఓసారి ఇలాగే అసభ్యంగా తాకారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    మొదటి రోజున తన తొడలు, భుజాలను బ్రిజ్ భూషణ్ తాకారని.. ఆ తరువాత రెండో రోజు శ్వాస పరీక్షిస్తానంటూ ఛాతీ, పొట్టను తాకారని ఆమె ఆరోపించారు.

    2018లో ఓసారి బ్రిజ్ భూషణ్ తనను గట్టిగా కౌగిలించుకుని చాలా సేపు వదల్లేదని, చివరకు తన రొమ్ములకు దగ్గరగా ఆయన చేతిని తేవడంతో ఒక్కసారిగా తోసేశానని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు.

    ఇంకో మహిళా రెజ్లర్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు.

    2018లో తాను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బ్రిజ్ భూషణ్ వచ్చారని, తన ట్రైనింగ్ జెర్సీని ఒక్కసారిగా పైకెత్తి పొట్ట, ఛాతీని తాకారని, శ్వాస పరీక్ష చేస్తున్నానన్న సాకుతో అలా చేశారని ఆమె తన ఫిర్యాదులో రాశారు.

    అక్కడికి ఏడాది తరువాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లగా అక్కడున్నవారందని బయటకు పంపించిన బ్రిజ్ భూషణ్.. తనను బలవంతంగా పట్టుకునేందుకు యత్నించారని ఆమె ఆరోపించారు.

    బ్రిజ్ భూషణ్ తనను పర్సనల్ ఫోన్ నంబర్ కూడా అడిగారని, ఆయన ఫోన్ నంబర్ తనకు ఇచ్చారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

    దిల్లీ పోలీసులు ఈ ఇద్దరి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది.

    వీరి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఇంతవరకు బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయలేదు.

    తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమంటూ బ్రిజ్ భూషణ్ కొట్టిపారేస్తున్నారు.

  6. డైమండ్ లీగ్ టైటిల్ గెలిచిన నీరజ్ చోప్రా

    దోహాలో జరుగుతున్న డైమండ్ లీగ్‌ జావెలిన్ త్రో పోటీల్లో భారత్‌కు చెందిన ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా 88.67 మీటర్ల దూరం విసిరి టైటిల్ గెలిచారు.

    వరల్డ్ జావెలిన్ చాంపియన్ ఆండర్సన్ పీటర్సన్, 2020 టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ జాకబ్ వాడ్‌లిచ్‌లను వెనక్కు నెట్టి నీరజ్ ఈ టైటిల్ గెలుచుకున్నారు.

    ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లకు సంబంధించిన ముఖ్యమైన పోటీలలో డైమండ్ లీగ్‌ ఒకటి. ఖతార్ రాజధాని దోహాలో ప్రస్తుతం ఈ పోటీలు జరుగుతున్నాయి.