బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం. న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్‌పాల్ సింగ్‌ను తక్షణమే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేస్తూ ఆ సంస్థ న్యాయ సలహాదారు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం. న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.
‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్‌పాల్ సింగ్‌ను తక్షణమే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేస్తూ ఆ సంస్థ న్యాయ సలహాదారు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.ఎస్.షిఖావత్ నివాసంలో ఈ పిటిషన్‌ను విచారించారు.
‘వారిస్ పంజాబ్ దే’ న్యాయ సలహాదారు ఇమాన్ సింగ్ ఖారా బీబీసీ పంజాబీ ప్రతినిధి అరవింద్ ఛాబ్రాతో మాట్లాడుతూ.. ‘‘అమృత్‌పాల్ సింగ్‌ను వెంటనే కోర్టులో హాజరు పరచాలని మేం కోరుతున్నాం. రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద ఆయనకు గల జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు ఉందని మేం ఆందోళన చెందుతున్నాం. వారు బూటకపు ఎన్‌కౌంటర్ చేయవచ్చు. ఆయన మీద తప్పుడు కేసు ఏదీ పెట్టకూడదు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాలి’’ అని పేర్కొన్నారు.
అమృత్‌పాల్ సింగ్ పరారీలో ఉన్నారని, ఆయన కోసం గాలిస్తున్నామని పంజాబ్ పోలీసులు చెప్తున్నారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కే కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీయొద్దని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
తనను ప్రశ్నించేందుకు ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ, అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మార్చి 24న విచారణకు రానుంది.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 16న తమ విచారణకు హాజరు కావాలని కవితను ఈడీ కోరింది. అయితే ఈ విచారణకు కవిత హాజరు కాలేదు.
దీంతో, మార్చి 20న (సోమవారం) మరోసారి తమ ముందు హాజరు కావాలంటూ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేసింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాడు అకస్మత్తుగా మరియుపూల్‌లో పర్యటించారు.
యుక్రెయిన్‌లోని రేవు నగరమైన మరియుపూల్‌ను.. ఆ దేశం మీద సైనిక దండయాత్ర చేపట్టిన రష్యా ఆక్రమించుకుంది. దాదాపు 10 నెలలుగా ఈ నగరం రష్యా ఆక్రమణలో ఉంది.
ఒక వీడియోలో పుతిన్ రాత్రివేళ మరియుపూల్ రోడ్ల మీద కారు నడుపుతూ ప్రజలతో మాట్లాడుతున్న దృశ్యం కనిపిస్తోంది. కారులో పుతిన్ పక్కన రష్యా ఉప ప్రధానమంత్రి మారాట్ కుస్నులిన్ కూర్చుని ఉన్నారు. ఆ నగర పునర్నిర్మాణం పనుల గురించి పుతిన్‌కు ఆయన వివరిస్తున్నారు.
శనివారం రాత్రి పుతిన్ ఈ పర్యటన చేసినట్లు రష్యా అధ్యక్షభవనం చెప్తోంది. పుతిన్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని మరియుపూల్ వెళ్లారని క్రెమ్లిన్ పేర్కొంది. ఆయన హెలికాప్టర్‌లో ఆ నగరానికి వెళ్లారని టాస్ వార్తా సంస్థ తెలిపింది.
రష్యా కొత్తగా ఆక్రమించిన యుక్రెయిన్ భూభాగం మీద పుతిన్ తొలి పర్యటన ఇదేనని భావిస్తున్నారు. మరియుపూల్‌కు తూర్పుగా సమీపంలోనే ఉన్న రష్యా నగరం రోస్తోవ్-ఆన్-డాన్‌లో ఉన్నతస్థాయి సైనిక కమాండర్లను కూడా పుతిన్ కలిసినట్లు చెప్తున్నారు.
మరియుపూల్‌లో పుతిన్ పర్యటనపై ఆ నగరం నుంచి వెళ్లిపోయిన మేయర్ వాడిమ్ బోయ్‌చెంకో బీబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘పుతిన్ నేర ప్రాంతానికి తిరిగి వచ్చిన నేరస్తుడు’’ అని వ్యాఖ్యానించారు.
యుద్ధంలో మరియుపూల్‌లో 20,000 మందికి పైగా జనం చనిపోయారని యుక్రెయిన్ చెప్తోంది. ఈ నగరంలోని 90 శాతం భవనాలు దెబ్బతిన్నాయని.. దాదాపు 5 లక్షల మంది జనాభాలో 3.5 లక్షల మంది ఊరు విడిచి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి అంచనా.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య విశాఖపట్నంలో జరుగుతున్న రెండో వన్డే క్రికెట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది.
అంతకుముందు భారత జట్టు 117 పరుగులకే కుప్పకూలింది. భారత జట్టు మొత్తం 26 ఓవర్లలో ఆలౌట్ అయింది. భారత జట్టుకు సొంత గడ్డ మీద ఇది నాలుగో అత్యల్ప స్కోరు.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేసిన 31 పరుగులే భారత జట్టు తరఫున ఒక బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక పరుగులు.
ఓపెనర్ శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ఖాతా కూడా తెరవలేదు.
రోహిత్ శర్మ 13 పరుగుల వద్ద ఔటయ్యాడు. కె.ఎల్. రాహుల్ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు.
హార్దిక్ పాండ్యా 1 పరుగు మాత్రమే చేశాడు. అక్షర్ పటేల్ 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఆస్ట్రేలియా బౌలర్ మిషెల్ స్టార్క్ 53 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చాడు. షాన్ అబాట్ 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసి గెలిచింది.
ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 51 నాటౌట్; 10 ఫోర్లు), మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయంగా మ్యాచ్‌ను పూర్తి చేశారు.
ఇరు జట్ల మధ్య మొత్తం మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ భారత్ జట్టు గెలిచింది. రెండో మ్యాచ్ ఆస్ట్రేలియా గెలవటంతో.. సిరీస్ విజేతను మూడో మ్యాచ్ తేల్చనుంది.
సిరీస్‌లో మూడో వన్డే ఈ నెల 22వ తేదీన చెన్నైలో జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ హాస్టల్స్ కు చెందిన విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. వారితో ముచ్చటించారు.
విజ్ఞాన యాత్రలో భాగంగా దిల్లీ వెళ్లిన ఏపీ విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని వారికి పుస్తకాలను కూడా బహూకరించారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్ బ్యాంక్ తన సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో ఈ యాత్ర ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వైయస్సార్ కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎస్సీ హాస్టళ్లలోని ప్రతిభావంతులైన 42 మంది బాల, బాలికలు పాల్గొన్నారు.
ఈ నెల 14 నుంచి 19 దాకా కొనసాగిన ఈ యాత్రలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులు అక్కడి పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. విద్యార్థులతో కొద్ది సమయం గడిపిన ప్రధాని.. వారి ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు పార్లమెంటును సందర్శించగా అక్కడి అధికారులు పార్లమెంటులో ఎవరు ఎక్కడ కూర్చుంటారనే వివరాలను విద్యార్థులకు తెలుపుతూ పార్లమెంటు మొత్తాన్ని చూపించారు.
భారతదేశంలో జర్మనీ రాయబారి ఫిలిప్ ఆకర్మన్.. శనివారం నాడు పాత దిల్లీలో తన రాయబార కార్యాలయ సిబ్బందితో కలిసి ‘నాటు నాటు’ పాటకు నాట్యం చేశారు.
ఆ స్టెప్పుల వీడియోను ఆయన ట్వీట్ చేశారు.
‘‘జర్మన్లు డ్యాన్స్ చేయలేరా? నేను, నా ఇండో – జర్మన్ టీమ్.. ఆస్కార్‌లో నాటు నాటు పాట విజయాన్ని పాత దిల్లీలో వేడుకగా జరుపుకున్నాం. సరే, పెర్ఫెక్ట్‌గా లేదు. కానీ ఫన్ ఉంది’’ అని ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.
ఆ వీడియోలో ఫిలిప్ ఆకర్మన్ రిక్షా నుంచి దిగటం, నాటు నాటు పాట మొదలవటం కనిపిస్తుంది. ఆ పాట వినగానే ఆయన, ఆయన బృందం రోడ్డు మీద నాట్యం చేస్తూ కనిపిస్తారు.
డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) వ్యవస్థాపకులు పీవీ సతీశ్ మృతి చెందారు.
కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం ఆయన మృతి తుదిశ్వాస విడిచారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో అణగారిన వర్గాలకు చెందిన మహిళల అభ్యున్నతి కోసం 'పస్తాపూర్' కేంద్రంగా 1983లో ఆయన డీడీఎస్‌ను స్థాపించారు.
చిరుధాన్యాల సాగుపై స్థానిక మహిళా రైతులను ప్రోత్సహించి, వారి ఆర్థిక స్వావలంబన కోసం పీవీ సతీశ్ ఆధ్వర్యంలో డీడీఎస్ అనేక కార్యక్రమాలను రూపొందించింది.
స్వయం ప్రతిపత్తి కలిగిన ఆహార ఉత్పత్తి, విత్తనాల తయారు, మార్కెటింగ్ పై మహిళా సంఘాలకు డీడీఎస్ శిక్షణ ఇచ్చింది.
మిల్లెట్ల సాగును ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా దాన్నొక ఉత్సవంలా 'పాత పంటల జాతర' ను డీడీఎస్ నిర్వహిస్తూ వస్తోంది.
మిల్లెట్ల సాగులో డీడీఎస్ సేవలకు గాను 2019 లో ఈక్వేటర్ ప్రైజ్‌కు ఎంపికైంది.
అబ్దుల్లాపూర్ మెట్-నవీన్ మర్డర్ కేసులో నిందితురాలు నిహారికకు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరుచేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ ఏ1 కాగా, అతని స్నేహితుడు హసన్ ఏ2, నిహారిక ఏ3 గా ఉన్నారు. ఫిబ్రవరి 6న వీరిని అరెస్ట్ చేశారు.
నవీన్‌ను హరిహరికృష్ణ చంపాడన్న నిజం తెలిసినా, దాచిపెట్టినందుకు, హత్యానంతరం వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను తొలగించడం ఆరోపణలపై నిహారికను నిందితురాలిగా చేర్చారు.
ఖలిస్తాన్ అనుకూల సంస్థ 'వారిస్ పంజాబ్ దె' నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకుని, అరెస్ట్ చేయటానికి పంజాబ్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటికే 78 మందిని అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో, అమృత్‌పాల్ సింగ్‌కు సన్నిహితుడు, ఫైనాన్సర్ అని చెబుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారని అధికారులు చెబుతున్నారు.
దల్‌జీత్ సింగ్ కల్సి అలియాస్ సరబ్జీత్ సింగ్ కల్సి.. అమృత్‌పాల్ సింగ్‌కు సలహాదారు, ఫైనాన్సర్‌గా వ్యవహరిస్తారని, ఆయన్ను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.
అమృత్‌పాల్ సింగ్ పరీరీలో ఉన్నారు. ఆయన్ను వెతికి పట్టుకునేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఆయన అనుసచరులు, సహచరులు, మద్దతుదారులను అరెస్ట్ చేస్తున్నారు.
ఈరోజు ఉదయం అమృతసర్‌లోని జల్లుపుర్ ఖేరా గ్రామంలో అమృతపాల్ సింగ్ ఇంటి ముందు పోలీసులు మోహరించారు. రాష్ట్రమంతటా భద్రత కట్టుదిట్టం చేశారు.
రోడ్ షో, పబ్లిక్ మీటింగులు, వీధుల్లో ఆందోళనలు, నిరసనలపై ఆంక్షలు విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1 వివాదాస్పదమయ్యింది.
ఆ జీవో కి వ్యతిరేకంగా సోమవారం నేడు చలో అసెంబ్లీకి జెఏసీ పిలుపునిచ్చింది. అసెంబ్లీ ముట్టడికి వివిధ విపక్ష పార్టీలు మద్దతు పలికాయి.
దాంతో ప్రభుత్వం ముందస్తు చర్యలకు రంగంలో దిగింది. పోలీసులు.. వివిధ పార్టీల నాయకులకు నోటీసులు ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుల కార్యాలయాలు, ఇళ్ల వద్ద పోలీసు పహారా పెట్టారు.
అసెంబ్లీ ముట్టడికి ఎవరు వెళ్లకుండా నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసు చర్యలని పార్టీలు తప్పుబడుతున్నాయి.
అంగన్ వాడి వర్కర్స్ యూనియన్ కూడా విజయవాడలో ధర్నాకు సిద్ధం అవుతోంది. దాంతో, ఆ యూనియన్ నాయకులు, అంగన్ వాడి కార్యకర్తలకి కూడా పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు.
ఈక్వెడార్ దక్షిణ తీరంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. 12 మంది మరణించారు. పలు నగారాల్లో భవనాలు కూలిపోయాయి.
ఎల్ ఒరో నగరాన్ని భూకంపం తీవ్రంగా తాకింది. కూలిన భవనాల శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోయారని అత్యవసర సేవల సిబ్బంది తెలిపారు.
ఒక్క ఎల్ ఓరోలోనే 11 మంది చనిపోయారు. అజుయ్‌లో ఒకరు మరణించారు.
మచాలా, క్యూనా నగరాల్లో కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈక్వెడార్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన గ్వాయాక్విల్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలావో కేంద్రంగా భీకంపం సంభవించింది.
పెరులో కూడా ప్రకంపనలు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం
ఇవాళ విశాఖ మధురవాడలోని ఏసీఏ-వీసీడీఏ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది.
మూడు వన్డే మ్యాచ్‌ల సీరిస్‌లో భాగంగా విశాఖలో రెండో వన్డే జరగనుంది. తొలి వన్డే ఇప్పటికే ఇండియా గెలుచుకుంది.
విశాఖపట్నంలో జరగనున్న రెండో వన్డే మ్యాచ్ మధ్యాహ్నం 1:30కి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కి సంబంధించి మూడు రోజులు ముందుగానే టికెట్లు అన్నీ అమ్ముడైపోయాయి. ఇరుజట్ల ప్లేయర్లు నిన్న సాయంత్రమే విశాఖ చేరుకున్నారు.
అయితే, గత రెండు రోజులుగా విశాఖలో వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి మోస్తరు స్థాయిని దాటి వర్షాలు కురుస్తున్నడంతో గ్రౌండ్లో కవర్లు కప్పి ఉంచారు. ఇవాళ ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏసీఏ- వీసీడీఏ స్టేడియంలో అత్యధిక డ్రైనేజీ వ్యవస్థ ఉండడంతో మ్యాచ్ ప్రారంభ సమయానికి ఒక గంట ముందు వాతావరణం అనుకూలించినా, మ్యాచ్ పూర్తిగా నిర్వహించే అవకాశం ఉందని మ్యాచ్ నిర్వాహ కమిటీ తెలిపింది.
మరోవైపు, వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం, ఇవాళ కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రధానంగా, విశాఖ జిల్లాలో వర్షాలు కొనసాగెతుండడంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యమా? కాదా? అనే అనుమానం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ కాంక్షలు విధించారు. టికెట్లు ఉన్న వారందరినీ ఉదయం 11.00 గంటల తర్వాత గ్రౌండ్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించమని ఏసీఏ తెలిపింది.
విశాఖ బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇక్కడ పరుగుల వరద ఖాయమని అభిమానులంతా ఆశిస్తున్నారు. గతంలో జరిగిన అనేక మ్యాచ్లో భారీ పరుగులు నమోదయ్యాయి.
పైగా, ఇండియాకి ఈ పిచ్ సెంటిమెంట్ కావడం, ఎక్కువ విజయాలు నమోదు చేసిన గ్రౌండ్ కావడంతో ఈ మ్యాచ్ జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు విశాఖ చేరుకున్నారు.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా సమాచారం కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.