లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే జనావాసాలు ఉంటంతో వందలమందిని అక్కడి నుంచి హుటాహుటిన తరలించాల్సి వచ్చింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ప్రభుత్వ రంగంలో నడిచే ఆయిల్ డిపోలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 17 మంది మరణించారు. అరవై మంది గాయపడ్డారు.
ప్రమాదంలో చిక్కుకున్న వారిలో చాలామంది ఒంటి మీద పెద్ద ఎత్తున కాలిన గాయాలయ్యాయి.
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే జనావాసాలు ఉంటంతో వందలమందిని అక్కడి నుంచి హుటాహుటిన తరలించాల్సి వచ్చింది.
ఈ ప్రమాదం తర్వాత దీనికి కారణాలను అన్వేషించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఇతర డిపోలలో కూడా జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.
ఇండోర్ టెస్ట్ మ్యాచ్ తర్వాత క్రికెటర్ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మ మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు.
భార్యభర్తలిద్దరూ కలిసి తెల్లవారుజామున జరిగిన భస్మ ఆర్తిలో పాల్గొన్నారు. ఆర్తి అయిన తర్వాత, విరాట్ అనుష్కలు మహాదేవునికి జలాభిషేకం నిర్వహించారు.
ఆర్తి సమయంలో విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు ప్రధాన ఆలయం వెలుపల కూర్చుని దేవుణ్ని దర్శించుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
గత కొన్ని రోజులుగా విరాట్, అనుష్కలు పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు.
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫి కోసం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది.
గౌతమ్ అదానీ గ్రూప్‌కు చెందిన పోర్ట్స్, ఎనర్జీ వ్యాపారాల రేటింగ్‌ను రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌కి చెందిన ఐక్రా డౌన్‌గ్రేడ్ చేసింది.
అదానీ గ్రూప్ వ్యాపారాల రేటింగ్‌ను ‘స్థిరత్వం’ నుంచి ‘నెగిటివ్’లోకి మార్చింది ఐక్రా.
రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేసిన వ్యాపారాల్లో అదానీ పోర్ట్, స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్‌లున్నాయి.
గత కొంత కాలంగా గౌతమ్ అదానీ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
ఈ సమయంలో, అదానీ గ్రూప్ రేటింగ్‌ను నెగిటివ్‌లోకి మార్చింది ఐక్రా.
ఫిబ్రవరి ప్రారంభంలో కూడా అదానీ గ్రూప్ కంపెనీల రేటింగ్‌ను మూడీస్ డౌన్‌గ్రేడ్ చేసింది.
భారతీయ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇండోర్ టెస్టులో 12 పరుగులకు మూడు వికెట్లు తీశాడు.
ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయినప్పటికీ, ఉమేష్ యాదవ్‌కి ఆ మ్యాచ్ ఎంతో ప్రత్యేకం.
ఈ మ్యాచ్ జరగడానికి కొన్ని రోజుల ముందు ఉమేష్ యాదవ్ తండ్రి మరణించారు.
అయినప్పటికీ, ఉమేష్ యాదవ్ ఈ ఆట ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఉమేష్ ఆటతీరుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.
ట్విటర్‌లో ప్రధాన మోదీ రాసిన లేఖను షేర్ చేస్తూ తన కృతజ్ఞత తెలియజేశాడు ఉమేష్ యాదవ్.
ఉమేష్ యాదవ్ తండ్రి మరణం తర్వాత ప్రధాన మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు.
ఉమేష్ యాదవ్ తండ్రి ఫిబ్రవరి 22న మరణించారు. ఫిబ్రవరి 27న ప్రధాన మంత్రి ఈ లేఖ రాశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ప్రస్తుతం ఆస్కార్ రేసులో పోటీపడుతోన్న సంగతి తెలిసిందే.
ఈ పాటకి ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ప్రస్తుతం ఈ పాట అభిమానుల జాబితాలో ప్రముఖ కొరియన్ గాయకుడు జంగ్‌కూక్ కూడా చేరారు.
ఆర్‌ఆర్‌ఆర్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో జంగ్‌కూక్‌కి చెందిన బీటీఎస్ బాయ్ బ్యాండ్ కనిపిస్తోంది.
బ్యాక్‌గ్రౌండ్‌లో నాటు నాటు పాట ప్లే అవుతుంటే, జంగ్‌కూక్ ఈ పాటని ఎంజాయ్ చేస్తున్నారు.
‘‘నాటు నాటు పాటని మీరు ఇష్టపడుతున్నారని తెలుసుకోవడం నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది.
మీకు, బీటీఎస్ టీమ్‌కి, దక్షిణ కొరియా మొత్తానికి మా ప్రేమను తెలియజేస్తున్నాం’’ అని ట్వీట్ చేసింది.
జంగ్‌కూక్ దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ బీటీఎస్ బ్యాండ్ గాయకుడు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ బ్యాండ్‌ను అమితంగా ఇష్టపడతారు.
జంగ్‌కూక్ ఫిఫా ప్రపంచ కప్ కార్యక్రమంలో కూడా ప్రదర్శన ఇచ్చారు.
కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన సమాచారాన్ని అన్ని దేశాలు తమతో పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అభ్యర్థిస్తోంది.
చైనా ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టి ఉండొచ్చని అమెరికా ఆరోపించింది. చైనా ప్రభుత్వాధీనంలో ఉన్న వూహాన్ ల్యాబ్ నుంచే ఇది జరిగిందని తమ పరిశీలనలో తేలిందని అమెరికా ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ స్పందించింది.
చైనా నగరం వుహాన్‌లో 2019లో తొలి కేసు నమోదైంది.
ఎఫ్‌బీఐ ఆరోపణలను చైనా అధికారులు తోసిపుచ్చారు. చైనాకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర ఇదని అన్నారు.
‘‘కరోనా మహమ్మారి పుట్టుక గురించి ఏ దేశం వద్దనైనా సమాచారం ఉంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ శాస్త్రీయ కమ్యూనిటీతో మీరు పంచుకోవడం ఎంతో ముఖ్యం’’ అని డబ్ల్యూహెచఓ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రియేసస్ అన్నారు.
కరోనా మహమ్మారి పుట్టుక గురించి తామింకా పనిచేస్తున్నట్టు తెలిపారు. పారదర్శకతతో డేటా అందజేయాలని తాము చైనాను అడుగుతున్నామని, విచారణ ప్రారంభం నుంచి ఏయే ఫలితాలు బయటికి వచ్చాయనే విషయాలను తమకు తెలియజేయాలని కోరుతున్నామని అన్నారు.
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, మానవ హక్కుల కార్యకర్త అలీస్ బియాలియాట్‌స్కీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది లెనిన్స్కి జిల్లా కోర్టు.
జైలు శిక్షతో పాటు 65 వేల డాలర్ల జరిమానా కూడా కోర్టు విధించింది.
వియస్నా మానవ హక్కుల కేంద్రానికి హెడ్‌గా ఉన్న అలీస్ బియాలియాట్‌స్కీపై ఉన్న క్రిమినల్ ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష వేసింది.
బెలారస్‌లోకి అక్రమంగా ఆయన డబ్బులను తీసుకొచ్చారని బియాలియాట్‌స్కీపై ఆరోపణలున్నాయి.
ఈ ఆరోపణలను బియాలియాట్‌స్కీపై ఖండిస్తున్నారు.
బియాలియాట్‌స్కీని తొలుత 2011 ఆగస్టులో అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు పన్నుల ఎగవేత కారణంతో నాలుగున్నరేళ్లు జైలు శిక్ష విధించారు.
ఆయన శిక్ష గడువు ముగుస్తున్న సమయంలో బియాలియాట్‌స్కీ విడుదలయ్యారు. మరోసారి 2021లో ఆర్థిక కార్యకలాపాల ఆరోపణ, మనీ స్మగ్లింగ్ కింద అరెస్ట్ అయ్యారు. జైలులో ఉండగానే అంటే అక్టోబర్ 2022లో ఆయనను నోబెల్ శాంతి పురస్కారం వరించింది.
ప్రస్తుతం బియాలియాట్‌స్కీతో పాటు ఈ మానవ హక్కుల సంస్థకు చెందిన మరో ముగ్గురికి కూడా కోర్టు శిక్ష విధించింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మార్చి 4 నుంచి భారత్‌లో ప్రారంభమవుతోంది.
మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలి మ్యాచ్‌లో ముంబై, గుజరాత్ టీమ్‌ల మధ్య జరగనుంది.
పురుషుల ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) భారత్‌లో చాలా పాపులర్. ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌పై కూడా దేశవ్యాప్తంగా అంతే ఆసక్తి నెలకొంది.
అంతకుముందు బీసీసీఐ ‘ఉమెన్స్ టీ20 ఛాలెంజ్’ను నిర్వహించేది.
చివరిసారి ‘ఉమెన్స్ టీ20 ఛాలెంజ్’ను 2020 ఏడాదిలో చేపట్టింది.
ఆ సమయంలో మూడు జట్లకు మధ్యనే ఈ ఛాలెంజ్‌ను నిర్వహించింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం ఐదు ఫ్రాంచైజీల నుంచి రూ.4,669 కోట్ల బిడ్స్ దాఖలయ్యాయి. అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,289 కోట్లకు అత్యంత ఖరీదైన టీమ్ అహ్మదాబాద్‌ను కొనుగోలు చేసింది.
ముంబై జట్టు కోసం ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.912.99 కోట్లను వెచ్చించగా.. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరును రూ.901 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇదే సమయంలో దిల్లీ, లక్నో టీమ్‌లు రూ.900 కోట్ల కంటే తక్కువకు అమ్ముడుపోయాయి.
ఈ టీమ్‌ల ప్లేయర్ల కోసం కూడా ఫిబ్రవరి 13న వేలం చేపట్టారు. వచ్చే ఐదేళ్ల కోసం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులను వయాకామ్18 రూ.951 కోట్లకు పొందింది.
నమస్కారం,
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను మీకెప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి