You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మహిళల టి20 వరల్డ్ కప్: ఆరోసారి విజేతగా ఆస్ట్రేలియా, ఫైనల్లో బోల్తా కొట్టిన దక్షిణాఫ్రికా

ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆరోసారి టి20 ప్రపంచకప్‌ను గెలుపొంది తమ ఆధిపత్యాన్ని చాటింది. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 19 పరుగుల తేడాతో ఆసీస్ గెలిచింది.

లైవ్ కవరేజీ

  1. సావర్కర్: అండమాన్ జైలులో ఉన్నప్పుడు క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ వారికి లేఖలు రాసింది నిజమేనా?

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  3. మెడికో ప్రీతి కన్నుమూత - ప్రకటించిన నిమ్స్ వైద్యులు

  4. బ్రేకింగ్ న్యూస్, AUSvsSA: టి20 వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియా, ఫైనల్లో బోల్తా కొట్టిన దక్షిణాఫ్రికా

    ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆరోసారి టి20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది.

    ఆదివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మహిళల టి20 వరల్డ్ కఫ్ ఫైనల్లో ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది.

    బేత్ మూనీ (53 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీతో చెలరేగగా, ఆష్లే గార్డ్‌నగర్ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించింది.

    దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్, మరిజానే కప్ చెరో 2 వికెట్లు తీశారు.

    అనంతరం 157 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది.

    ఓపెనర్ లారా వోల్వార్ట్ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత పోరాటం వృథా అయింది. లారాకు ట్రియాన్ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) చక్కగా సహకరించింది.

    స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ అవుట్ కావడంతో సఫారీలు కోలుకోలేకపోయారు.

    చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా బౌలర్లు దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు.

    మెగాన్ షుట్, ఆష్లే గార్డ్‌నర్, డార్సీ బ్రౌన్, జెస్ తలా ఓ వికెట్ తీశారు.

  5. బ్రేకింగ్ న్యూస్, మెడికో ప్రీతి కన్నుమూత - ప్రకటించిన నిమ్స్ వైద్యులు

    ఆత్మహత్యా యత్నం చేసిన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ మెడికో ప్రీతి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

    అయిదు రోజులపాటు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ప్రీతి, ఆదివారం సాయంత్రం 9.10 గం.ల ప్రాంతంలో మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

    వివిధ విభాగాలకు చెందిన వైద్యులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె ప్రాణాలు కాపాడలేకపోయామని నిమ్స్ ఆసుపత్రి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

    వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సీనియర్ విద్యార్థి వేధింపుల కారణంగా జూనియర్ పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

    అయితే, ప్రీతి మృతికి నిరసనగా ఆమె బంధువులు, గిరిజన సంఘాలు నిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు.

    ప్రీతికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి కదలినివ్వబోమని గిరిజన సంఘాల నాయకులు హెచ్చరించారు.

    మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖమంత్రి టి.హరీశ్ రావు అన్నారు.

    ‘‘ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించింది. పూర్తి అరోగ్య వంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసింది. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన ఒక ప్రకటనలో అన్నారు.

    బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హరీశ్ రావు హామీ ఇచ్చారు.

  6. పంజాబ్ జైలులో గ్యాంగ్ వార్-ఇద్దరు మృతి

    పంజాబ్‌లోని తరన్ తరన్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ జైలులో సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులు కొందరు పరస్పరం ఘర్షణ దిగారు.

    ఈ గ్యాంగ్‌ వార్‌లో మన్‌దీప్ సింగ్, మన్మోహన్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు తరన్ తరన్ ఎస్ఎస్ఫీ గుర్మీత్ సింగ్ చౌహాన్ బీబీసీకి ధృవీకరించారు.

    మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతనికి చికిత్స కోసం అమృత్‌సర్ తరలించారు.

  7. మనీష్ సిసోడియా: దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టు చేసిన సీబీఐ

  8. అబ్దుల్లాపూర్ మెట్-నవీన్ మర్డర్ కేసు: హత్య జరిగిన తీరుపై ఎఫ్ఐఆర్‌లో పోలీసులు ఏం చెప్పారు?

  9. ఇటలీ: వలస కార్మికులతో వెళ్తున్న పడవ బోల్తా పడి 27 మంది మృతి

    ఇటలీలోని దక్షిణ ప్రాంతంలో వలస కూలీలతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. 30 కంటే ఎక్కువమంది చనిపోయారు.

    సుమారు 100 మందితో కూడిన పడవ కాలాబ్రియా ప్రాంతంలోని క్రోటోన్ తీరానికి చేరేలోపు మునిగిపోయింది. ఇప్పటికే పలువురి మృతదేహాలను వెలికితీశారు.

    ఆఫ్రికాలో అంతర్గత ఘర్షణలు, పేదరికం నుంచి తప్పించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఇటలీకి వలస వస్తారు.

    అయితే, ఈ పడవ ఎక్కడ బయలుదేరిందో స్పష్టంగా తెలియలేదు. అందులో ఉన్నవారు ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాలకు చెందినవారని Adnkronos న్యూస్ తెలిపింది.

    వాతావరణం సహరించక, పడవ బండరాళ్లను ఢీకొని మునిగిపోయిందని ఆ పత్రిక వెల్లడించింది.

    ఇటలీ ప్రభుత్వం గాలింపు, సహాయక చర్యలు చేపట్టింది.

  10. కదిరి: వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ

    తులసీ ప్రసాద్ రెడ్డి, బీబీసీ కోసం

    సత్య సాయి జిల్లా కదిరిలో ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్నాయి. లక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ ఉన్న పలు దుకాణాలను తొలగించే విషయంలో సీఐ దురుసు ప్రవర్తన వివాదానికి తీసిందని ఒక వర్గం చెబుతోంది.

    శనివారం రాత్రి టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

    బాధితులకు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మద్దతుగా నిలవడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది.

    దుకాణదారులకు, సీఐ మధుకు మధ్య జరుగుతున్న వాగ్వాదంలో.. దుకాణదారులకు టీడీపీ మద్దతుగా నిలవడంతో అది కాస్త టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పోరుగా మారిపోయింది.

    దీంతో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీ చార్జీకి దిగారు. పలువురు గాయపడ్డారు.

    గాయపడ్డ వారిని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చారు. మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బీకే పార్థసారథి కదిరికి చేరుకొని గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు.

    ఈ ఘటనకు కారకుడైన సీఐని సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు.

    "ఇది రెండోసారి సీఐ మధు టీడీపీ కదిరి ఇంచార్జ్ ప్రసాద్ పైన దౌర్జన్యానికి పాల్పడడం. నరసింహస్వామి టెంపుల్ దగ్గర పాకలేసుంటే తీయడానికి వెళ్లిన సీఐ దగ్గరికి వెళ్లి అసలు ఏం జరుగుతుందని మాట్లాడుతుండగా ప్రసాద్‌ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. మహిళలను ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? సీఐ ఇంటి దగ్గరికి వెళ్ళిన మహిళలను లాఠీలతో, పశువుల కంటే హీనంగా కొట్టరాని చోట కొట్టారు. మగవాళ్ళని ఎంతో దారుణంగా కొట్టారు. రాళ్లు తీసుకొని వైసీపీ నాయకులు, పోలీసులు దాడులకు దిగారు. టీడీపీ కార్యకర్తలు తమ ఇన్చార్జిని కాపాడుకోవాల్సి పరిస్థితి వచ్చింది. సీఐ.. వైయెస్సార్సీపీ చొక్కా తొడుక్కున్న విధంగా వైయెస్సార్సీపీ గుండాలను వెంటబెట్టుకొచ్చి కొట్టించాడు. గతంలో కదిరిలో ఇలాంటివి జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరిగిందని అందరూ చెప్తున్నారు. దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు దృష్టిపెట్టి మహిళలపై దాడి చేసిన సీఐని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోతే మేం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం. గాయాలపాలైన తెలుగుదేశం కార్యకర్తల పైనే కేసులు పెడుతున్నారు. వెంటనే సీఐ పైన కేసు బుక్ చేయాలి. ఈ విధంగా కొట్టుకుంటూపోతే.. మేం కూడా గాజులు తొడుక్కుని లేం. మేం రివర్స్ అయితే మీ పరిస్థితి ఏంటని పోలీసులు ఆలోచించండి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు మేమేంటనేది చూపిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నా" అన్నారు పరిటాల సునీత.

  11. అరుంధతి నక్షత్ర దర్శనం: పెళ్లిలో ఈ సంప్రదాయం వెనుక సైన్స్ ఉందా?

  12. డబ్బు ఎప్పుడు పుట్టింది... డాలర్ ప్రపంచ ప్రధాన కరెన్సీగా ఎప్పుడు మారింది?

  13. తుర్కియే భూకంపం: భవనాలు కూలిపోవడంపై దర్యాప్తు.. 184 మంది అరెస్ట్

    ఫిబ్రవరి 6న తుర్కియేలో వచ్చిన భూకంపం కారణంగా కూలిన భవనాలపై ఆ దేశ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది.

    ఈ దిశలో 600 కంటే ఎక్కువమందిని విచారణ చేస్తున్నారు.

    నిర్మాణ కాంట్రాక్టర్లు, ప్రాపర్టీ యజమానులు సహా 184 అనుమానితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు న్యాయ శాఖ మంత్రి బెకిర్ బోజ్‌డాగ్ తెలిపారు.

    అరెస్ట్ అయినవారిలో ఒక మేయర్ కూడా ఉన్నారు.

    తుర్కియేలో పేరుకుపోయిన అవినీతి, ప్రభుత్వ విధానాల కారణంగా కొత్తగా నిర్మిస్తున్న భవనాలు పటిష్టంగా లేవని, సురక్షితం కాదని నిపుణులు కొన్నేళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నారు.

    తుర్కియే, సిరియాలలో భూకంప మృతుల సంఖ్య 50,000 దాటింది.

    తుర్కియేలో 1,60,00 కంటే ఎక్కువ భవనాలు కూలిపోయాయి లేదా తీవ్రంగా ధ్వంసమయ్యాయి.

    దాంతో, ప్రకృతి వైపరీత్యాలు.. మానవ వైఫల్యాల వల్ల మరింత తీవ్రంగా మారాయా అనే ప్రశ్న తలెత్తింది.

    తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్ ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైందని, భూకంపం ముప్పు ఉన్న ప్రాంతాల్లో కూడా నిర్మాణ పనులను ప్రోత్సహించిందని ప్రతిపక్ష పార్టీలు, నిపుణులు ఆరోపిస్తున్నారు.

    అయితే, లోపాలు ఉన్నాయని ఎర్దోవాన్ అంగీకరించినప్పటికీ ఇంత భారీ విపత్తు సంభవించడం "విధిరాత" అని అన్నారు.

  14. పుల్వామాలో టెర్రరిస్టుల కాల్పుల్లో మరో కశ్మీరీ మృతి

    కశ్మీర్‌లోని పుల్వామాలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో మైనారిటీ వర్గానికి చెందిన సంజయ్ శర్మ అనే వ్యక్తి మరణించినట్లు జమ్ము, కశ్మీర్ పోలీసులు తెలిపారు.

    కాల్పులు జరిగిన వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ, ప్రాణాలు దక్కలేదు.

    ఆదివారం ఉదయం సంజయ్ శర్మ మార్కెట్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

    దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారని, దుండగుల కోసం వెతుకుతున్నారని జమ్ము, కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.

    "ఈరోజు ఉదయం సుమారు 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మైనారిటీ వర్గానికి చెందిన ఒక వ్యక్తిపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఆ వ్యక్తి తన భార్యతో కలిసి మార్కెట్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. టెర్రరిస్టుల కోసం వెతుకుతున్నాం. వీలైనంత త్వరగా పట్టుకుంటాం" అని జమ్ము, కశ్మీర్ డీఐజీ రాయీస్ మొహమ్మద్ భట్ ఏఎన్‌ఐతో చెప్పారు.

    జమ్ము, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దులా సంజయ్ పండిట్ మృతికి సంతాపం తెలిపారు. టెర్రరిస్ట్ దాడిని ఖండించారు.

  15. సావర్కర్‌కు బ్రిటిష్ పాలకులు నెలకు రూ. 60 పెన్షన్ ఎందుకు ఇచ్చేవారు... వారితో ఆయన కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి?

  16. సోనియా గాంధీ: 'ఇన్నింగ్స్ ముగింపు' అనడంలో అర్థమేంటి... కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా రిటైర్ అయినట్లేనా?

  17. నైజీరియా ఎన్నికలు 2023: ఓటింగ్ ముగిసింది.. కౌంటింగ్ ప్రారంభమైంది

    నైజీరియాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ ప్రారంభమైంది. కానీ, ఫలితాలు వెలువడడానికి కొన్ని రోజులు పట్టవచ్చు.

    1999లో సైనిక పాలన అంతమైన తరువాత, పోటాపోటీగా జరిగిన ఎన్నికలు ఇవే.

    శనివారం అనేక అవకతవకల మధ్య ఓటింగ్ జరిగింది. కొన్నిచోట్ల బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లారని, మరికొన్ని చోట్ల బలవంతపు ఓటింగ్ జరిగిందని రిపోర్టులు వచ్చాయి.

    ఆఫ్రికాలో జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలు ఇవే. నైజీరియాలో మొత్తం 8.7 కోట్ల ఓటర్లు ఉన్నారు.

    నైజీరియాలో 24 ఏళ్ల క్రితం సైనిక పాలన ముగిసి, ప్రజాస్వామ్యం ఏర్పడ్డ తరువాత.. రెండు పెద్ద పార్టీలు రాజ్యమేలుతూ వచ్చాయి.

    ఆల్ ప్రోగ్రెసివ్ కాంగ్రెస్, (ఏపీసీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ).. ఈ రెండే బలమైన పార్టీలు.

    కానీ, ఈసారి లేబర్ పార్టీ నుంచి కూడా గట్టి పోటీ వచ్చింది. యువత లేబర్ పార్టీకి సపోర్ట్ చేశారు.

    2015 వరకు పీడీపీ ప్రభుత్వంలో ఉంది. తరువాత ఏపీసీ పదవిలోకి వచ్చింది.

    2015 నుంచి ఏపీసీకి చెందిన ముహమ్మద్ బుహారి నైజీరియా అధ్యక్షుడిగా ఉన్నారు.

    ఈసారి ఎన్నికల బరిలోకి దిగిన లేబర్ పార్టీ అభ్యర్థి పీటర్ ఒబి ఈ రెండు పెద్ద పార్టీలకు చెక్ పెట్టగలరని భావిస్తున్నారు.

  18. మహిళల టీ20 ప్రపంచకప్ 2023: ఫైనల్‌లో తలపడనున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా

    ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఈరోజు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది.

    దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో న్యూలాండ్స్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

    దక్షిణాఫ్రికా మహిళల జట్టు టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.

    ఇప్పటికే అయిదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి టైటిల్‌ను చేజిక్కించుకునేందుకు ఉత్సాహంగా ఉంది.

    ఆస్ట్రేలియా గ్రూప్ దశలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది. సెమీఫైనల్‌లో భారత్‌తో తలపడింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ అయిదు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

    మరోవైపు, దక్షిణాఫ్రికా చాలా కష్టపడి ఫైనల్స్‌కు వచ్చింది. గ్రూపు మ్యాచుల్లో మొదటే ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో ఓడిపోయింది. కానీ, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లపై గెలిచి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. నాక్ అవుట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది.

  19. దిల్లీ మద్యం పాలసీ కేసులో మనీశ్ సిసోడియాను మరోసారి విచారించనున్న సీబీఐ

    మద్యం పాలసీ కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ ఇవాళ మరోసారి విచారణకు పిలిచింది.

    మనీష్ సిసోడియా సీబీఐకు పూర్తిగా సహకరిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది.

    ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియా ఇంటి ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

    మనీష్ సిసోడియా సీబీఐ విచారణకు బయలుదేరుతుండగా, ఇంటి ముందు అభిమానులు ప్లకార్డులతో గుమికూడారు.

    ఉదయం మనీష్ సిసోడియా ట్వీట్ చేస్తూ, "ఈరోజు మళ్లీ సీబీఐ విచారణకు వెళుతున్నాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. లక్షలాది పిల్లల ప్రేమ, కోట్లాది దేశప్రజల ఆశీస్సులు మా వెంట ఉన్నాయి. కొన్నాళ్లు జైల్లో ఉండాల్సి వచ్చినా ఫరవాలేదు. భగత్ సింగ్ అనుచరులం. దేశం కోసం భగత్ సింగ్ ఉరికంబానికి ఎక్కారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో జైలుకు వెళ్లడం చాలా చిన్న విషయం" అన్నారు.

    ఆయన ట్వీట్‌పై కేజ్రీవాల్ స్పందిస్తూ, "దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మనీష్. లక్షలాది పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఉన్నాయి. దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లడం శాపం కాదు. అది ఘనత. మీరు త్వరగా జైలు నుంచి తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. దిల్లీలోని పిల్లలు, తల్లిదండ్రులు, మేమంతా మీ రాక కోసం ఎదురు చూస్తుంటాం" అన్నారు.