బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం. న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ కేసుపై మీడియాలో కొందరు ట్రయల్స్ నిర్వహించే పని చేస్తున్నారని, వాటిని మానుకోవాలని అవినాశ్ రెడ్డి అన్నారు.
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం. న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.
కడప ఎంపీ వై.ఎస్. అవినాశ్ రెడ్డిని సీబీఐ మరోసారి విచారించింది. వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో గత నెల 28న సీబీఐ ఒకసారి విచారించింది.
శుక్రవారం హైదరాబాద్ లో సుమారు నాలుగున్నర గంటల పాటు ఈ విచారణ జరిగింది. పలు అంశాల్లో అవినాశ్ రెడ్డి నుంచి సీబీఐ అధికారులు వివరాలు సేకరించారు.
విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన అవినాశ్ రెడ్డి సీబీఐ పై విమర్శలు చేశారు. టీడీపీ చేస్తున్న ఆరోపణలు సీబీఐ కౌంటర్‌లో ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.
‘‘గూగుల్ టేక్ అవుటా, టీడీపీ టేక్ అవుటా అన్నది తేలాలి. ఇప్పుడు సీబీఐ చెబుతున్న కౌంటర్‌లోని వివరాలు ఏడాది క్రితం టీడీపీ చేసిన విమర్శలే. ఇప్పుడవి సీబీఐ అధికారులు ప్రస్తావించడం ఆశ్చర్యంగా ఉంది. కేసు విచారణలో భాగంగా కొన్ని విషయాలు అడిగారు. నాకు తెలిసిన సమాచారం చెప్పాను. రాతపూర్వకంగా తెలియజేశాను. గతంలో విచారణ సమయంలో మళ్లీ రావాల్సి ఉంటుందని అన్నారు. ఈసారి ఆ మాట చెప్పలేదు " అని అవినాశ్ రెడ్డి వెల్లడించారు.
ఈ కేసుపై మీడియాలో కొందరు ట్రయల్స్ నిర్వహించే పని చేస్తున్నారని, వాటిని మానుకోవాలని అవినాశ్ రెడ్డి అన్నారు.
వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్, 30 కంటే ఎక్కువ దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ ఫీజులను తగ్గించింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఈజిప్టు, యెమెన్, జోర్డాన్, లిబియా, ఇరాన్, కెన్యా, క్రొయేషియా, స్లొవేనియా, బల్గేరియా, నికరగ్వా, ఈక్వెడార్, వెనెజులా, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ ఫీజు తగ్గనుంది.
భారత్ ఈ జాబితాలో లేదు. నెట్‌ఫ్లిక్స్ 190 దేశాలలో పనిచేస్తుంది. అమెజాన్, హెచ్‌బీఓ, డిస్నీ, సోనీ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధికుక్కల సమస్యకు సత్వర పరిష్కారం చూపుతామని, ప్రత్యేక చర్యల కోసం ఎనిమిది బృందాలను రంగంలోకి దింపుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.
అంబర్‌పేటలో కుక్కకాటు దుర్ఘటన దురదృష్టకరం అని అన్నారు.
నెలరోజులపాటు ఎనిమిది బృందాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేయిస్తామని చెప్పారు.
కోతులు, కుక్కలతో సమస్యలు ఉన్న వారు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూం నంబరు 040 2111 1111కు ఫోన్ చేయాలని సూచించారు.
ఫిర్యాదుల కోసం మొబైల్ యాప్‌నూ అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనం జరిగింది.
సుమారు 10 లక్షల విలువచేసే 15 కిలోల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
గురువారం ఆలయం తలుపులు మూసివేసిన తర్వాత, అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్లు జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ తెలిపారు.
ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు బేతాళస్వామి ఆలయం వెనుక నుంచి ప్రవేశించి అర్థమండపంలోని వెండి తోరణం,శఠగోపం, రామరక్షలను ఎత్తుకెళ్లారని ఆయన చెప్పారు.
ఆలయంలోకి ప్రవేశించిన 15 నిమిషాల్లోనే చోరీకి పాల్పడి పరారైనట్టుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిందని, దొంగలను పట్టుకునేందుకు 10 టీమ్‌లను ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు.
క్లూస్ టీం, ఐటీ, సైబర్ టీం, సీసీ టెక్నికల్ వింగ్ సహకారంతో దొంగల కోసం గాలింపు ముమ్మరం చేశామని అన్నారు.
ప్రధాన ఆలయంలో విగ్రహాలను దొంగలు తాకలేదని వెల్లడించారు.
దొంగతనం నేపథ్యంలో పోలీస్ క్లూస్ టీమ్ విచారణ సందర్భంగా ఉదయం ఆలయాన్ని కాసేపు మూసివేశారు.
అనంతరం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు యధావిధిగా దర్శనాలు కల్పించారు.
యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం దీనికోసం మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది.
ఇటీవల సీఎం కేసీఆర్ ఆలయాన్ని సందర్శించి మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారులతో చర్చించారు. మొదటి విడతగా వందకోట్ల నిధులను ప్రకటించారు.
అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో మీడియా కవరేజీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
దీనితో పాటు, ఈ అంశంపై ‘దర్యాప్తు కమిటీ ఏర్పాటు’కు సంబంధించిన నిర్ణయాన్ని రిజర్వ్ చేశామని, త్వరలో ఆ నిర్ణయం కూడా ప్రకటిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
"మేం మీడియాపై నిషేధాజ్ఞలు విధించబోం. మీడియా కవరేజీకి వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోం. త్వరలోనే మా తీర్పును ప్రకటిస్తాం’’ అని సీజేఐ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో మీడియా రిపోర్టింగ్‌ను నిలిపివేయాని కోరుతూ మనోహర్ లాల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది.
ఈ కేసుపై సుప్రీం కోర్టు, దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసేంతవరకు దీనికి సంబంధించిన వార్తల ప్రచురణలో మీడియాను నియంత్రించాలని కోరుతూ మనోహర్ లాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అయితే, కోర్టు ఈ విజ్ఞప్తిని తిరస్కరించింది.
జపాన్‌లోని ఓ బీచ్‌లోకి కొట్టుకొచ్చిన ఒక పెద్ద లోహపు గోళం (మెటల్ బాల్)ను క్రేన్ సహాయంతో తొలగించారు.
ఈ లోహపు గోళంపై స్థానికులు ఆందోళన చెందారని, దీనిపై అనేక ఊహాగానాలు వస్తున్నాయని స్థానిక మీడియా పేర్కొంది.
దీన్ని కొంతకాలం భద్రపరిచి, తర్వాత డిస్పోస్ చేస్తామని హమామత్సు నగర అధికారులు చెప్పారు.
అసలు ఆ వస్తువు ఏంటి? అనే అంశంపై అధికారులు ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదని పలువురు పౌరులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
బీచ్‌లో ఒక అసాధారణ వస్తువు ఉన్నట్లు ఈ వారం ప్రారంభంలో స్థానిక పోలీసులకు సమాచారం అందింది.
ఆ తర్వాత, అది ఒక గాడ్జిల్లా గుడ్డు అని, పడవలు నీటిపై తేలియాడేలా చేసే ఒక నిర్మాణం (మూరింగ్ బాయ్) అని, అంతరిక్ష వస్తువు అయ్యుండొచ్చు అని ఇలా పలు ఊహాగానాలు మొదలయ్యాయి.
బాంబ్ స్క్వాడ్ కూడా దీన్ని పరిశీలించింది. అధికారులు ఈ మెటల్ బాల్ ఎక్స్‌రే తీశారు. తర్వాత ఇది ప్రాణాంతక వస్తువు కాదని తేల్చారు. అంతేకానీ, నిజానికి ఆ వస్తువు ఏంటి? అనేది ఇంకా తెలియలేదు.
మెటల్ బాల్‌ను బీచ్ నుంచి తొలగించారు.
‘‘హమామత్సు నగరంలోని ప్రతీ ఒక్కరూ ఈ వింత వస్తువు గురించి ఆసక్తితో ఉన్నారని నేను అనుకుంటున్నా’’ అని స్థానిక అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
శ్రీకాళహస్తి ఆలయంలో ప్రముఖ గాయని మంగ్లీ, భక్తి పాట చిత్రీకరణ విషయంలో వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో, వార్తాపత్రికల్లో అసత్య కథనాలు వస్తున్నాయని శ్రీకాళహస్తి దేవస్థానం వ్యాఖ్యానించింది.
ఈ పాట చిత్రీకరణ అనుమతుల విషయంలో స్పష్టతను ఇచ్చింది.
వీడియో చిత్రీకరణపై నిషేధం ఉన్న ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ఆలయంలో మంగ్లీ పాట చిత్రించారని, అందుకుఆలయ అధికారులు సహకరించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే, ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ అనుమతులు ఇచ్చాకే ఈ పాట చిత్రీకరణ జరిగిందని దేవస్థానం ఒక ప్రకటనలో వెల్లడించింది.
‘‘ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్, ఫిబ్రవరి 3వ తేదీన అనుమతులు ఇచ్చారు. మంగ్లీకి చెందిన గరుడ ప్రొడక్షన్ సంస్థ, ఫిబ్రవరి 5,6 తేదీల్లో ఆలయంలో శివుని భక్తి పాట చిత్రీకరణ చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారమే వారు భక్తిపాటను చిత్రీకరించారు. ఆలయంలో గతంలో వివిధ చిత్రాలు, చిత్రీకరించిన ప్రాంతాల్లోనే సదరు పాటను కూడా చిత్రీకరించారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మదాయ శాఖ, సీడీ రూపంలో విడుదల చేసిన క్షేత్ర దర్శిని అనే డాక్యుమెంటరీలో కూడా ఇప్పుడు గాయని మంగ్లీ చిత్రీకరణ చేసిన స్థలాలను చూడొచ్చు. శివునిపై భక్తిపాట, సాంప్రదాయ నృత్యం అయినందున అనుమతులు ఇచ్చారు.
చిత్రీకరణపై నిషేధం ఉన్న శ్రీ స్వామి వారి సన్నిధి, శ్రీ అమ్మవారి సన్నిధిని మినహాయించి, గతంలో వివిధ చిత్రాలను చిత్రీకరించిన స్థలాలలోనే వారు పాటను షూట్ చేశారు’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.