You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రాష్ట్రపతి వల్ల గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం పెరిగింది: ప్రధాని మోదీ

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం లోక్‌సభలో ప్రసంగించారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. క్యూబా: రికార్డు స్థాయిలో దేశంలో వదిలి వెళుతున్న యువత

  3. ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?

  4. భూకంప ప్రభావిత ప్రాంతాలలో ఎర్దొవాన్ పర్యటన

    తుర్కియేలోని భూకంప ప్రభావిత ప్రాంతాలలో ఆ దేశ అధ్యక్షుడు ఎర్దొవాన్ పర్యటించారు.

    రెండో సారి ప్రకంపనలు వచ్చి తీవ్రంగా దెబ్బతిన్న కహ్రమన్మరాస్ ప్రాంతంలో ఆయన నష్టాన్ని పరిశీలించారు.

    బాధితులతో మాట్లాడారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

  5. భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి?

  6. గిరిజనులకు పోడుభూములకు పట్టాలు, ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీ: పాదయాత్రలో రేవంత్ రెడ్డి హామీలు

    ‘పాదయాత్ర దారి వెంట ఎవరిని కలిసినా దుఃఖం పొంగుకు వస్తుంది. ఆవేదన ఆవేశంగా మారి కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 మీటర్ల లోతులో బొంద పెట్టమని వేడుకుంటున్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే బాగుపడతామని మా ఆడబిడ్డలు చెప్పారు’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

    హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా బుధవారం మహబూబాబాద్ కోర్టు సర్కిల్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

    ‘పాదయాత్రలో ఆర్టీసీ కార్మికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిరంకుశ పాలనలో తమను వేధిస్తున్నారని ఆవేదనగా చెబుతున్నారు. ఆర్టీసీలో 6200 బస్సులుంటే 3200 బస్సులు ప్రయివేటువేనని చెప్పారు’ అని రేవంత్ అన్నారు.

    ‘‘రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరు. కలెక్టర్లకు, కౌన్సిలర్లకు, పోడు భూములకు , పేదలకు ఇక్కడ రక్షణ లేదు. అప్పుల బాధతో 29 మంది రైతులు పురుగుల మందు తాగి చనిపోయారు. వారిలో 23 మంది గిరిజనులే.

    కొత్త సంవత్సరంలో జనవరి 1, 2024న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన ఆదివాసీ, గిరిజనులకు పోడు భూముల పట్టాలిస్తాం. భూ నిర్వాసితులందరికి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. 40 వేల ఆర్టీసీ కార్మికులను చూసుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. చనిపోయిన 50 మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూడా మాదే’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

  7. ఆస్ట్రేలియాలో హిందువులు, సిక్కుల మధ్య కొట్లాటలు.. ‘ఖలిస్తాన్’ కారణమా?

  8. ఆంధ్రప్రదేశ్: ఈ ఊరి బావి నీళ్ళు తాగితే కవల పిల్లలు పుడతారా?

  9. ‘ప్రతిపక్షాలు ఈడీ వల్ల ఏకమయ్యాయి.. ఈడీకి వాళ్లు కృతజ్ఞతలు చెప్పాలి’: ప్రధాని మోదీ

    ‘‘ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష నేతలను ఒకే వేదికపైకి తెచ్చి ఏకం చేస్తాయని నేను అనుకున్నాను. కానీ అలా జరగలేదు. వాళ్లు ఈడీకి కృతజ్ఞతలు చెప్పాలి. దానివల్ల వాళ్లు ఏకమయ్యారు’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు.

    రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో చర్చకు సమాధానం ఇస్తూ ప్రధాని సుదీర్ఘంగా ప్రసంగించారు. అంతకుముందు అదానీ కేసులో ప్రతిపక్ష సభ్యుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై మోదీ ఏమీ మాట్లాడలేదు. అయితే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో కుంభకోణం ఆరోపణల గురించి ఆయన ప్రస్తావించారు.

    ‘‘2004 నుంచి 2014 వరకూ గల దశాబ్దం స్వతంత్ర భారత చరిత్రలో కుంభకోణాల దశాబ్దం. పదేళ్ల పాటు భారతదేశంలోని ప్రతి మూలనా ఉగ్రవాద దాడులు జరిగాయి. ప్రతి పౌరుడూ అభద్రతలో ఉన్నాడు. కశ్మీర్ నుంచి ఈశాన్యం వరకూ దేశం ఆ పదేళ్లూ హింసా బాధితమయ్యింది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

  10. ఆంధ్రప్రదేశ్ ‘మూడు రాజధానుల’పై మాతో చర్చించలేదు: కేంద్రం, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ పేరుతో తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనపై తమతో చర్చించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

    ఏపీ రాజధాని అంశంపై బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

    విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ల ప్రకారం రాజధాని నిర్ణయానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ రిపోర్ట్‌ని రాష్ట్రానికి పంపించామని తన సమాధానంలో ఉటంకించారు.

    ఈ మేరకు అమరావతిని రాష్ట్ర రాజధాని నగరంగా ప్రకటిస్తూ 2015 ఏప్రిల్‌ 23న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు.

    ‘‘తదనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేసింది. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సంఘటిత అభివృద్ధి చట్టం, 2020 (ఏపీడీఐడీఏఆర్‌)ని తీసుకువచ్చింది’’ అని మంత్రి వివరించారు.

    ఈ చట్టం చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని చెప్పారు.

    ‘‘తదుపరి రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఈ చట్టాన్ని రద్దు చేసింది. మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్‌ హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్‌ అప్పీల్‌ (సివిల్‌)ను దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ అంశం విచారణలో ఉంది’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

    ఏపీ రాజధానులకు సంబంధించిన అంశంపై ఈ నెల 23న సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది.

    ఇప్పటికే రాజధాని అంశం తమ పరిధిలో అంశం కాదని గతంలో కోర్టుకి అఫిడవిట్ సమర్పించిన కేంద్రం తాజాగా పార్లమెంటులో ఇచ్చిన సమాధానం ఆసక్తి రేకెత్తిస్తోంది.

  11. చాట్‌ జీపీటీ కి పోటీగా వస్తున్న 'గూగుల్ బార్డ్' ప్రత్యేకతలు ఏమిటి?

  12. రాష్ట్రపతి వల్ల గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం పెరిగింది: ప్రధాని మోదీ

    గిరిజన సమాజపు గర్వాన్ని రాష్ట్రపతి ఇనుమడింపజేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.

    ‘‘స్వాతంత్ర్యం పొందిన ఎన్నో ఏళ్ల తర్వాత నేడు గిరిజన సమాజంలో ఒక గర్వం ఉంది. వారి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇందుకుగాను దేశం, సభ ఆమెకు రుణపడి ఉంటుంది’’ అని మోదీ చెప్పారు.

    పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం లోక్‌సభలో ప్రసంగించారు.

    ‘‘రాష్ట్రపతి ప్రసంగం కొనసాగుతుండగా కొందరు దానిని విస్మరించారు. ఒక పెద్ద నేత అయితే రాష్ట్రపతిని అవమానించారు కూడా. వారు ఎస్‌టీల పట్ల ద్వేషం ప్రదర్శించారు. వారిలో అంతర్లీనంగా లోతుగా ఉన్న ద్వేషభావం వెలికివచ్చింది. ఆ తర్వాత ఒక లేఖ రాయటం ద్వారా తమను తాము కాపాడుకోవటానికి ప్రయత్నించారు’’ అని మోదీ విమర్శించారు.

    ఈ సందర్భంగా.. అదానీ వ్యవహారంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వాకౌట్ చేసింది.

  13. సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్‌కు రాజా రామ మోహన్ రాయ్ అవార్డు

    జర్నలిజానికి అందించిన సేవలకు గాను ‘రాజా రామ మోహన్ రాయ్ అవార్డు’కు డాక్టర్ ఏబీకే ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

    ఏబీకేగా పేరు పొందిన డాక్టర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్‌కు పాత్రికేయ రంగంలో 75 సంవత్సరాల అనుభవం ఉంది.

    ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రధాన పత్రికలకు సంపాదకుడిగా ఆయన పని చేశారు. 2004-09 మధ్య ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షునిగా ఏబీకే పని చేశారు.

    దిల్లీలో ఈ నెల 28న జరిగే కార్యక్రమంలో ఆయనకు ఆ అవార్డును ప్రదానం చేస్తారు.

  14. జీవీకే గ్రూప్: ‘అదానీకి మా ఇష్టప్రకారమే ముంబయి ఎయిర్‌పోర్ట్ విక్రయించాం’

    ముంబయి ఎయిర్‌పోర్టులో వాటాను తమ ఇష్టప్రకారమే విక్రయించామని జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ జీవీ సంజయ్ రెడ్డి అన్నారు.

    జీవీకే గ్రూప్‌ నుంచి ముంబయి ఎయిర్‌పోర్ట్‌ను అదానీ కోసం ‘హైజాక్’ చేశారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిన్న పార్లమెంటులో అన్న నేపథ్యంలో జీవీ సంజయ్ స్పందించారు.

    ‘అదానీ గ్రూప్ నుంచి కానీ ఇతర ఏజెన్సీల నుంచి కానీ మాకు ఎటువంటి ఒత్తిడి రాలేదు. మా వ్యాపార ప్రయోజనాల కోసమే మేం ఎయిర్‌పోర్టును విక్రయించాం. మా ఇష్ట ప్రకారమే చేశాం.

    తీసుకున్న రుణాలను తీర్చేందుకు ఆ పని చేశాం. అంతకు కొద్ది సంవత్సరాల ముందు నుంచే పెట్టుబడిదారులతో నిధుల కోసం చర్చలు జరిపాం.

    మరోవైపు కరోనా సంక్షోభంతో మా వ్యాపారం మీద బాగా ప్రభావం పడింది. దాంతో పెట్టుబడులు రావడం మరింత ఆలస్యం అయింది.

    ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్ట్ మీద తనకు ఆసక్తి ఉందని గౌతమ్ అదానీ తెలిపారు. అలా ఆ డీల్ జరిగింది’ అని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో జీవీ సంజయ్ అన్నారు.

  15. తెలంగాణ: ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?

  16. తుర్కియే-సిరియా భూకంపం: 9 వేలు దాటిన మృతుల సంఖ్య

    తుర్కియే, సిరియా సరిహద్దుల్లో వచ్చిన భూకంపంలో మృతుల సంఖ్య 9 వేలు దాటింది.

    తుర్కియేలో చనిపోయిన వారి సంఖ్య 6,957కు చేరింది.

    సిరియాలో మృతుల సంఖ్య 2,500కు చేరినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

    భూకంప ప్రభావిత ప్రాంతాలను తుర్కియే అధ్యక్షుడు ఎర్దోవాన్ సందర్శించనున్నారు.

    ప్రస్తుతం తుర్కియేలో మూడు నెల పాటు అత్యవసర పరిస్థితి విధించారు.

    ఉత్తర సిరియాలో రోడ్లు దెబ్బతినడంతో సాయం చేయడం కష్టంగా మారిందని యూనిసెఫ్ చెబుతోంది.

  17. ప్లాస్టిక్ బాటిల్స్‌తో తయారు చేసిన జాకెట్ ధరించిన నరేంద్ర మోదీ

    ప్లాస్టిక్ బాటిల్స్‌ నుంచి తయారు చేసిన జాకెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ధరించినట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ తెలిపింది.

    నేడు ఆ జాకెట్ ధరించి ఆయన పార్లమెంటుకు వచ్చారు.

    ‘అన్‌బాటిల్డ్’ పేరుతో ప్లాస్టిక్ బాటిల్స్‌ను రీసైకిల్ చేసి వాటి నుంచి దుస్తులు తయారు చేస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.

    ఇటీవల బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్లాస్టిక్ బాటిల్స్‌తో తయారు చేసిన జాకెట్‌ను నరేంద్ర మోదీకి బహుకరించారు.

  18. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి: ఫోన్ ట్యాపింగ్ మీద కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తున్నా

    తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

    రానున్న రోజుల్లో అపాయింట్‌మెంట్ దొరికితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తానని ఆయన వెల్లడించారు.

    ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా లేఖ రాయాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు.

    వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి, కొద్ది రోజుల కిందట ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

    వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తన మీద నమ్మకం పోయిందని, అందుకే తన ఫోన్ ట్యాప్ చేయించారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలిపారు.

  19. తుర్కియే అంతటా దాదాపుగా 312 సార్లు బలమైన ప్రకంపనలు

  20. గుజరాత్: మామను, బావను చంపిన హంతకుడిని ఈ ట్రక్కు వెనక రాసిన అక్షరాలే పట్టించాయి...