You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కేటీఆర్: ‘‘అవును.. మాది కుటుంబ పాలనే’’

ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి నిధులిచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.

లైవ్ కవరేజీ

  1. అదానీ గ్రూప్‌, సెబీ చీఫ్‌లపై తీవ్ర ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ కథ ఏంటి, దాని వెనుక ఉన్న అండర్సన్ ఎవరు?

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  3. కేటీఆర్: ‘‘అవును.. మాది కుటుంబ పాలనే’’

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం సభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడీ చర్చలు సాగాయి.

    ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, అధికార పార్టీ మంత్రి కేటీఆర్‌లు సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

    ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి నిధులిచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.

    స్పెషల్ డెవలెప్‌మెంట్‌ స్కీం కింద గజ్వేల్‌కు, సిద్ధిపేటకు నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్.. దుబ్బాక నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    సర్పంచుల సమస్యను సభలో ప్రస్తావించిన రఘునందన్..ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో వారు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు.

    2019లో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించినా ప్రభుత్వం మూడేళ్లైనా ఇంకా అమలు చేయలేదని గుర్తు చేశారు. ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడంలేదని ఆరోపించారు. వడ్ల కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కారు కేంద్రాన్ని బద్నాం చేస్తోందన్నారు.

    అనంతరం సభలో మాట్లాడిన కేటీఆర్ విపక్షాలు తమ కుటుంబంపై చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ..‘‘అవును.. మాది కుటుంబ పాలనే. అయితే, తెలంగాణలోని నాలుగు కోట్ల మంది మా కుటుంబమే’’ అంటూ చమత్కరించారు.

    మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టిందని.. హర్ ఘర్ జల్ పేరుతో నీళ్లు ఇస్తున్నానని కేంద్రం చెప్తోందన్నారు. ఇంటింటికి ఇళ్లు ఇవ్వండి కానీ.. విషం నింపకండి అంటూ కేటీఆర్ హితవు పలికారు.

    దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ ఎదిగిందని మంత్రి కేటీఆర్ వివరించారు. సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తిరుగులేదన్నారు. తెలంగాణలో కరెంట్‌ కష్టాలు.. తాగునీటి తిప్పులు లేవన్నారు.

    దేశ ప్రజల చూపు కేసీఆర్‌ వైపు ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీల్లో 9 గ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు.

    ఈ క్రమంలో ఈటల రాజేందర్‌పై కేటీఆర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. "రాజేందరన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండే.. అక్కడికి పోయినంక ఆగమైండు.." అంటూ తనదైన శైలిలో చురకలు అంటించారు.

  4. పుతిన్ సైన్యంలో క్రిమినల్స్: 'ఆ సైనికుడు తనను తాను పేల్చుకుని తనతో ఉన్న ముగ్గురు యుక్రెయిన్ సైనికులను హతమార్చాడు'

  5. ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూత... అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు

  6. అగ్నివీరుల నియామక ప్రక్రియలో మార్పులు... భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుందంటే...

    అగ్నివీరుల నియామక ప్రక్రియలో మార్పులు చేస్తున్నట్లు భారత సైన్యం ప్రకటించింది.

    అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ కావాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు ముందుగా ఆన్‌లైన్ పరీక్షను రాయాల్సి ఉంటుంది.

    శారీరక దారుఢ్యం, వైద్య పరీక్షల కంటే ముందు ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ) రాయాలి.ఆ తర్వాత ఫిజికల్ టెస్టు, మెడికల్ టెస్టులను నిర్వహిస్తారు.

    రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మార్పు గురించి సైన్యం వార్తా పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలలో పేర్కొంది.

    ఫిబ్రవరి 14 నాటికి దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

    ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 200 పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

  7. చాట్‌జీపీటీ అంటే ఏంటి? ఈ ఏఐ టూల్ త్వరలోనే గూగుల్‌నే కాదు మానవ మేధనూ మించిపోతుందా?

  8. ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూత

    ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు.

    తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని నివాసంలో వాణీ జయరాంను చనిపోయిన స్థితిలో గుర్తించినట్లు థౌజండ్ లైట్స్ పోలీసు అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికిగానూ ఆమెకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.

    వాణీ జయరాం 1945లో తమిళనాడులోని వేలూరులో జన్మించారు.

    దాదాపు 5 దశాబ్దాల పాటు తన స్వరంతోప్రేక్షకులను అలరించారు. సినిమా పాటలతో పాటు భక్తి గీతాలు, ప్రైవేట్ ఆల్బమ్స్‌లోనూ ఎన్నో పాటలు పాడారు.

    తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ సహా 19 భాషల్లో పదివేలకు పైగా పాటలను ఆమె పాడారు.

    అయిదేళ్ల వయస్సులో కడలూరి శ్రీనివాస్ అయ్యంగార్ వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు.

    పదేళ్ల వయస్సులోనే తొలిసారి ఆలిండియా రేడియాలో పాటలు పాడారు.

    1970లో గుడ్డీ చిత్రంతో ఆమె గాయనిగా పరిచయం అయ్యారు. ‘అభిమానవంతుడు’ సినిమాతో ఆమె తెలుగు సినిమాలో అరంగేంట్రం చేశారు.

    అపూర్వ రాగంగళ్ , శంకరాభరణం, స్వాతికిరణం చిత్రాల్లో పాడిన పాటలకు ఆమె జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

    స్వాతికిరణం సినిమాలోని "ఆనతినీయరా హరా" పాట ఆమెకు ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది.

  9. అదానీ ఎంటర్‌ప్రైజెస్: ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందా?

  10. మియన్మార్: రెండేళ్లుగా ఏం జరుగుతోంది?

  11. ‘‘ఆ బెలూన్ వెదర్ ఎయిర్‌షిప్.. శాంతంగా ఉండండి’’: అమెరికాకు చైనా వినతి

    అమెరికా గగనతలంపైకి చైనా భారీ బెలూన్ వెళ్లిన విషయంలో ‘శాంతం’గా ఉండాలని చైనా విజ్ఞప్తి చేసింది.

    చైనాకు చెందిన ఈ ‘నిఘా’ బెలూన్ తమ దేశ గగతలంపైకి రావటం ‘‘బాధ్యతారహితమైన చర్య’’ అని అమెరికా మండిపడింది. ఈ విషయంలో నిరసన తెలుపుతూ.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తన బీజింగ్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

    చైనాకు చెందిన మరో బెలూన్ లాటిన్ అమెరికా గగనతలంలో ఎగురుతోందని అమెరికా ఆ తర్వాత వెల్లడించింది.

    అమెరికా గగనతలం మీదకు తమ బెలూన్ వెళ్లటం పట్ల చైనా విచారం వ్యక్తం చేసింది. అది వాతావరణానికి సంబంధించిన ఎయిర్‌షిప్ అని, గాలికి కొట్టుకువచ్చిందని పేర్కొంది. ఆ భారీ బెలూన్ చివరి సారిగా మిసోరి గగనతలంలో కనిపించింది.

    ఈ బెలూన్ ఈ వారాంతానికి కరోలినా రాష్ట్రాల సమీపంలో అమెరికా తూర్పు తీరానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

    అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

    ఆకాశంలో ఎత్తుగా ఎగురుతున్న ఈ బెలూన్‌ను కూల్చివేస్తే దాని శకలాలు నేల మీద, జనావాసాల మీద పడే ప్రమాదం ఉన్నందున.. దానిని కూల్చివేయరాదని అమెరికా నిర్ణయించింది.

  12. మాంటిస్సోరి స్కూల్: గాంధీ మెచ్చారు.. ఠాగూర్ స్కూళ్లు పెట్టారు - పిల్లలకు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన విద్యా విధానం ఇదేనా?

  13. ఆంధ్రప్రదేశ్: ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిల ప్రియ హౌస్ అరెస్ట్, ఎన్. తులసీ ప్రసాద్ రెడ్డి, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు శనివారం నాడు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో అఖిలప్రియ ఇంటిదగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

    నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి అక్రమాలకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అఖిలప్రియ చెప్పారు. నంద్యాల గాంధీచౌక్ దగ్గరకు వస్తే ఆధారాలు బహిర్గతం చేస్తానని, అక్కడికి రావాలంటూ రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఆమె సవాల్ విసిరారు.

    శనివారం ఉదయం ఆళ్లగడ్డ నుంచి నంద్యాల గాంధీ చౌక్ వెళ్లేందుకు అఖిల ప్రియ సిద్ధమయ్యారు. ఆమె వెళితే నంద్యాలలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడతాయన్న అనుమానంతో ఆర్లగడ్డ డీఎస్‌పీ సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో ఆర్లగడ్డలోని అఖిలప్రియ నివాసానికి వెళ్లారు.

    శాంతిభద్రతల దృష్ట్యా నంద్యాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నామని చెబుతూ గృహనిర్బంధం నోటీసులు ఇచ్చారు. అఖిలప్రియ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

  14. ఉప్పల్ ఐడీఏలో అగ్నిప్రమాదం - ప్లైఉడ్ దుకాణంలో మంటలు, అమరేంద్ర, బీబీసీ తెలుగు

    హైదరాబాద్ ఉప్పల్ ఐడిఏ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

    ఈజీ ప్లైవుడ్ దుకాణంలో నిల్వ ఉంచిన చెక్కలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.

    మూడు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువస్తున్నాయి.

    ఈ ఘటనలో కొంత ఆస్తి నష్టం జరగగా, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదని అగ్నిమాపక శాఖ చెబుతోంది.

  15. ‘‘దేశం కోసం ఫుట్‌బాల్ ఆడాను.. కానీ, ఇప్పుడు సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తున్నాను’’ - పౌలమి అధికారి

  16. రూ. 295 కోట్ల విలువైన లాటరీ గెలిచిన కెనడా అమ్మాయి

    కెనడాకు చెందిన 18 ఏళ్ల జూలియెట్ లేమర్ 4.8 కోట్ల కెనడియన్ డాలర్ల(సుమారు రూ. 285 కోట్లు) ప్రైజ్‌మనీ గల లాటరీ గెలుచుకున్నారు.

    దీంతో కెనడాలో లాటరీలో ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్న అత్యంత పిన్నవయస్కురాలిగా జూలియెట్ గుర్తింపు పొందారు.

    ఇంత పెద్ద మొత్తం గెలిచిన ఆమె లాటరీ టికెట్ కొనడం ఇదే తొలిసారి.

    ఒక్కసారిగా ఇంత డబ్బు రావడంతో ఆమె తన ఆర్థిక ప్రణాళికలు ప్రారంభించారు.

    తన చదువు పూర్తిచేసుకుని డాక్టర్ కావాలని జూలియెట్ కోరుకుంటున్నారు.

    గత నెల డ్రాలో బహుమతి గెలుచుకున్న జూలియెట్ శుక్రవారం ‘ఆంటెరియో లాటరీ అండ్ గేమింగ్ కార్పొరేషన్’ వద్ద మాట్లాడుతూ తనకు ఆనందబాష్పాలు ఆగడం లేదన్నారు.

    ‘నేను కొన్న మొదటి లాటరీ టికెట్‌కు బహుమతి రావడం నమ్మశక్యంగా లేదు’ అన్నారామె.

    ఆంటెరియో ప్రావిన్స్‌లోని‘సూ సెయింట్ మేరీ’ పట్టణానికి చెందిన జూలియెట్ లాటరీ టికెట్ కొన్న తరువాత ఆ విషయం మర్చిపోయారు. జనవరి 7న తీసిన డ్రాలో బహుమతి వచ్చినట్లు సమాచారం వచ్చేవరకు తనకు లాటరీ టికెట్ కొన్న విషయమే గుర్తులేదన్నారామె.

    డ్రాలో గెలిచినట్లు సమాచారం అందిన తరువాత ఆమె లాటరీ మొబైల్ యాప్ తెరిచి తన టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే ‘బిగ్ విన్నర్’ అంటూ స్క్రీన్‌పై కనిపించింది.

    కాగా తన తండ్రి సహాయంతో ఈ డబ్బు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తానని జూలియెట్ చెప్పారు.

    ఎడ్యుకేషన్ లోన్‌పై ఆధారపడకుండా తన వైద్య విద్య పూర్తిచేసేందుకు ఇందులో కొంత మొత్తాన్ని ఉపయోగిస్తానని ఆమె చెప్పారు.

    అలాగే చదువుపూర్తయ్యాక కుటుంబంతో కలిసి వేర్వేరు దేశాలలో పర్యటించి అక్కడి చరిత్ర, సంస్కృతి కూడా అధ్యయనం చేస్తానన్నారు జూలియెట్.

  17. మస్క్ ట్వీట్‌లో మోసం లేదు: టెస్లా షేర్ హోల్డర్ల కేసులో శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టు తీర్పు

    ‘టెస్లాను కొనడానికి డబ్బు సిద్ధం’ అంటూ ఎలాన్ మస్క్ 2018 ఆగస్ట్ 7న చేసిన ట్వీట్ విషయంలో శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.

    ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాను తాను ప్రైవేటుగా తీసుకోవాలనుకుంటున్నానని, ఒక్కో షేర్‌కు 420 డాలర్లు (సుమారు రూ. 34 వేలు) చెల్లించడానికి డబ్బులు సిద్ధంగా ఉన్నాయంటూ 2018 ఆగస్ట్ 7న ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

    దీనికి ఇన్వెస్టర్ల సపోర్ట్ కూడా ఉందని ఆ తరువాత ఆయన మరో ట్వీట్ చేశారు.

    ఆయన ట్వీట్ల తరువాత టెస్లా షేర్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కానీ, మస్క్ చెప్పినలాంటి కొనుగోలు ఏదీ కార్యరూపం దాల్చకపోవడంతో టెస్లా షేర్ల ధరలు మళ్లీ తగ్గాయి.

    దీంతో ఇన్వెస్టర్లు 1,200 కోట్ల డాలర్ల (సుమారు రూ. 98 వేల కోట్లు) మేర నష్టపోయినట్లు షేర్ హోల్డర్ల తరఫు లాయర్ అంచాన వేశారు.

    ఈ ట్వీట్ కారణంగా మార్కెట్లో కుదుపులు ఏర్పడి నష్టపోయామంటూ టెస్లా షేర్‌హోల్డర్లు కోర్టులో కేసు వేశారు.

    మస్క్ ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించారంటూ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) కూడా కేసు వేసింది.

    కేసులో వాదనలు విన్న శాన్‌ఫ్రాన్సిస్కో న్యాయస్థానం మస్క్ తప్పేమీ లేదని తీర్పుచెప్పింది.

    ఒకవేళ ఈ కేసులో మస్క్‌కి కనుక శిక్ష పడితే ఆయన వందల కోట్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉండేది.

    కాగా టెస్లా ప్రధాన కేంద్రమైన టెక్సస్‌ కోర్టుకు ఈ కేసు మార్చాలని గతంలో మస్క్ కోరినప్పటికీ కేసు శాన్‌ఫ్రాన్సిస్కో న్యాయస్థానంలోనే కొనసాగింది.

    తాజాగా తీర్పు అనుకూలంగా రావడంతో మస్క్ ‘నా తప్పేమీ లేదని గుర్తించిన న్యాయమూర్తులందరికీ అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.

    ‘నేనేదో ట్వీట్ చేసినంత మాత్రాన ప్రజలు అది నమ్మేసి దాని ప్రకారం నడుచుకుంటారని అనుకోను’ అని మస్క్ విచారణ సమయంలో అన్నారు.

    కాగా తీర్పు చెప్పిన సమయంలో మస్క్ కోర్టులో లేరు.

    తీర్పు అనంతరం మస్క్ తరఫు న్యాయవాది అలెక్స్ స్పిరో మాట్లాడుతూ... ఒక ట్వీట్ చెడ్డదైనంత మాత్రాన అది మోసపూరితం అనుకోవడానికి వీల్లేదని అన్నారు.

    మరోవైపు టెస్లా షేర్ హోల్డర్ల తరఫు న్యాయవాది నికోలస్ పారిట్ మాట్లాడుతూ... తీర్పు తమను అసంతృప్తికి గురిచేసిందని, తదుపరి చర్యల విషయం ఆలోచిస్తున్నామని అన్నారు.

  18. గుడ్‌ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.