లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లాస్ ఏంజలీస్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉండే మాంటెరీ పార్క్‌లో కాల్పులు జరిగాయి. చైనా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఇక్కడకు వేల మంది ప్రజలు వచ్చారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు.
లాస్ ఏంజలీస్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉండే మాంటెరీ పార్క్‌లోని ఓ బాల్‌రూమ్‌లో ఈ కాల్పులు జరిగాయి. చైనా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఇక్కడకు వేల మంది ప్రజలు వచ్చారు.
అయితే ఇంత వరకు మరణాల గురించి సమాచారం లేదు.
ప్రస్తుతం పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సుమారు 60వేల మంది ఉండే మాంటెరీ పార్క్‌లో ఆసియా సంతతి ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు.
మెషీన్ గన్‌తో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాల్పులకు కారణం ఏంటనేది ఇంకా నిర్ధరించలేదు. విద్వేషం కారణంగా జరిగిన కాల్పులా కాదా అనేది ఇంకా తెలియదన్నారు.
స్వీడన్‌లో ఖురాన్‌ను కాల్చివేయడం మీద ఇస్లామిక్ దేశాల అధినేతలు స్పందిస్తున్నాయి.
పాకిస్తాన్ ప్రధాని, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్(ఓఐసీ) సెక్రటరీ జనరల్ వంటి వారు ఖండించారు.
‘స్వీడన్‌లోని రైట్ వింగ్ ఎక్స్‌ట్రిమిస్ట్ పవిత్ర ఖురాన్‌ను అవమానించేలా చేసిన ఘటనను ఖండించడానికి ఎటువంటి మాటలు సరిపోవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 కోట్ల ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వ్యక్తిగత స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు. దీన్ని అంగీకరించం’ అని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు.
నిందితుని మీద స్వీడన్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఓఐసీ సెక్రటరీ జనరల్ హిసేన్ బ్రాహిం కోరారు.
స్వీడన్ రైట్ వింగ్ లీడర్ రాస్ముస్ పలూడన్, స్టాక్‌హోంలోని టర్కీ ఎంబసీ ముందు ఖురాన్‌ను కాల్చివేశారు.
నాటోలో స్వీడన్ చేరడాన్ని టర్కీ వ్యతిరేకిస్తోంది. ఇది స్వీడన్ రైట్ వింగ్ గ్రూపులకు నచ్చడం లేదు.
అమరావతి ‘రైతుల’ పాదయాత్ర సందర్భంగా శ్రీకాకుళంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
జేఏసీ చైర్మన్ గద్దె తిరుపతిరావు ఆధ్వర్యంలో పాదయాత్ర శ్రీకాకుళం చేరుకుంది. స్థానిక సెవెన్ రోడ్డు జంక్షన్ వద్ద పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం అరసవెల్లి పాదయాత్రకు అనుమతించారు.
ఆస్ట్రేలియా ఓపెన్-2023లో విమెన్ డబుల్స్‌లో సానియా మీర్జా జోడి రెండో రౌండ్‌లో ఓడి పోయింది.
సానియా మీర్జా, అన్నా డానిలీనా జోడి అన్హెలీనా కలీనినా, అలీసన్ వాన్ జోడీ చేతిలో 4-6, 6-4,2-6 తేడాతో ఓటమి చవి చూసింది.
వచ్చే నెలలో జరిగిన దుబాయి ఓపెన్ తరువాత సానియా మీర్జా, టెన్నిస్ కెరియర్‌కు వీడ్కోలు పలకనున్నారు.
దీంతో సానియాకు ఇది చివరి ఆస్ట్రేలియా ఓపెన్ కానుంది.
ఇక తొలి రౌండ్‌లోనే రఫేల్ నాడల్ ఓడిపోయి ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. విమెన్ సింగిల్స్‌లోనూ ఇగా స్వయాతెక్ కూడా తొలి రౌండ్‌లో ఓడిపోయింది.
నరేంద్ర మోదీ మీద బీబీసీ తీసిన డాక్యుమెంటరీని నిషేధించాలంటూ యూట్యూబ్, ట్విటర్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి.
యూజర్లు షేర్ చేసిన బీబీసీ డాక్యుమెంటరీ, ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ లింకులను తొలగించాలంటూ యూట్యూబ్, ట్విటర్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.
‘భారతదేశ సార్వభౌమత్వాన్ని తక్కువ చేయడంతోపాటు దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లేలా ఇది ఉంది. ఇతర దేశాలతో ఉన్న స్నేహ సంబంధాలను సైతం అది దెబ్బతీసేలా ఉంది’ అని అధికారులు పేర్కొనట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది.
బీబీసీ డాక్యుమెంటరీని తొలగించాలంటూ ప్రభుత్వం ఆదేశించిందని వచ్చిన వార్తల మీద ప్రతిపక్షాలు స్పందించాయి.
దీన్ని ‘సెన్సార్షిప్’గా కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు డెరెక్ ఓబ్రయన్, మహువా మోయిత్ర కూడా విమర్శించారు.
నరేంద్ర మోదీ మీద బీబీసీ రెండు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ చేసింది. ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ అనే మొదటి భాగాన్ని జనవరి 17న ప్రచురించగా రెండో భాగం 24వ తేదీన పబ్లిష్ అవుతుంది.
తన ఇంట్లోకి ఒక వ్యక్తి బలవంతంగా చొరబడ్డారని తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ తెలిపారు.
‘నా జీవితంలో అత్యంత భయానక ఘటన గత రాత్రి జరిగింది. ఒక వ్యక్తి మా ఇంట్లోకి చొరబడ్డాడు. నేను చాలా జాగ్రత్తగా తెలివితో వ్యవహరించి, నా ప్రాణాలను కాపాడుకున్నాను.
మీరు ఎంత భద్రంగా ఉన్నారని అనుకున్నప్పటికీ తలుపులకు తాళాలు వేసారో లేదో చెక్ చేసుకోవాలి.
అత్యవసరమైతే 100 నెంబరకు ఫోన్ చేయండి’ అంటూ స్మిత సబర్వాల్ ట్వీట్ చేశారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన స్మిత సబర్వాల్, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి, జూబ్లీహిల్స్‌లోని స్మిత సబర్వాల్ నివాసంలోకి చొరబడ్డారని వార్తలు వచ్చాయి. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని ఘటన మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని ధర్మపురిలో శనివారం జరిగిన జల్లికట్టులో ఒక ఎద్దు కుమ్మడంతో 14ఏళ్ల బాలుడు చనిపోయాడు.
జల్లికట్లు పోటీలు చూసేందుకు బంధువులతో పాటు ఆ బాలుడు వచ్చాడు.
తీవ్రంగా గాయాలపాలైన ఆ బాలుడిని ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్నాయి.
శాసనసభ, శాసనమండలి రెండూ శుక్రవారం(3వ తేదీ) మధ్యాహ్నం నుంచి సమావేశం కానున్నట్లు లెజిస్లేటివ్ సెక్రటరీ వి.నరసింహాచార్యులు తెలిపారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
ఈ ఏడాది చివర్లో రాష్ట్ర ఎన్నికలు జరగనున్నందున కేసీఆర్ ప్రభుత్వానికి ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు కానున్నాయి.
డెలావర్‌లోని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రైవేటు నివాసంలో మరో ఆరు ‘రహస్య పత్రాలు’ దొరికాయని జో బైడెన్ న్యాయవాది తెలిపారు.
గత శుక్రవారం కూడా విల్మింగ్టన్‌లో బైడెన్ ప్రైవేటు నివాసంలో కూడ ‘రహస్య పత్రాలు’ లభించాయి. జో బైడెన్ సెనేటర్‌గాను, అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గాను పని చేసిన నాటి కాలానికి సంబంధించిన ‘రహస్య పత్రాలు’ ఆయన ఇంట్లో ఉన్నట్లు చెబుతున్నారు.
అధికారులు సోదాలు జరిపే సమయంలో జో బైడెన్, ఆయన భార్య ఇంట్లో లేరని లాయర్ తెలిపారు.
గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మీద కూడా ‘రహస్య పత్రాల’ను తన ప్రైవేటు నివాసాల్లో ఉంచారనే ఆరోపణలతో విచారణ చేపట్టారు.