‘రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోండి’ - తెలంగాణ చీఫ్ సెక్రటరీకి కేంద్రం ఆదేశాలు

రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను ఆంధ్రాకు కేటాయించారు. కానీ ఆయన క్యాట్‌కి వెళ్లి తెలంగాణలో కొనసాగేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. క్యాట్ తీర్పును హైకోర్టు తాజాగా పక్కన పెట్టేసింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  2. దక్షిణ కొరియా: చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు

  3. ఉత్తరాఖండ్: ‘‘మా ఇళ్లన్నీ కూలగొట్టేస్తే మేం ఎక్కడికి వెళ్లాలి?’’ అంటున్న హల్ద్వానీ మహిళలు

  4. భూపిందర్ సింగ్ గిల్: బ్రిటన్ ప్రీమియర్ లీగ్ రిఫరీగా ఎన్నికైన తొలి సిక్కు-పంజాబీ వ్యక్తి

  5. తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ విజయం

    Umran Malik

    ఫొటో సోర్స్, BCCI

    శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 67 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేయగా... భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలో దిగిన శ్రీలంక బ్యాటర్లు 50 ఓవర్లలో 306 పరుగులు చేశారు. ఈ క్రమంలో 8 వికెట్లు కోల్పోయింది శ్రీలంక జట్టు.

    భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు, మొహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. షమీ, హార్దిక్ పాండ్యా, చాహల్ చెరో వికెట్ తీశారు.

    భారత జట్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా శ్రీలంక జట్టులో దాసన్ శనక సెంచరీ చేశాడు.

    శనక 88 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్స్‌లో 108 పరుగులు సాధించాడు.

    శ్రీలంక ఓపెనర్ నిసాంక 72 పరుగులు, మరో బ్యాటర్ ధనంజయ డి సిల్వ 47 పరుగులు చేశారు.

    మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది.

    ఓపెనర్లు రోహిత్ శర్మ 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 పరుగులు.. శుభమన్ గిల్ 60 బంతుల్లో 11 ఫోర్లతో 70 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ 87 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 113 పరుగులు చేశాడు.

    వీరితో పాటు కేఎల్ రాహుల్ 39, శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో జట్టు భారీ స్కోరు సాధించడానికి సాయపడ్డారు.

    శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు తీశాడు.

  6. ఆహారం: క్యాలరీలు లెక్కపెట్టుకుని తినడం ప్రమాదకరమా? ఎందుకు? నిపుణులు ఏమంటున్నారు?

  7. ప్రియుడు చేసిన నేరానికి.. ఉరికంబం ఎక్కిన భార్య – వందేళ్ల కిందటి తీర్పుపై ఇప్పటికీ చర్చ

  8. రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోండి.. తెలంగాణ ఛీఫ్ సెక్రటరీకి కేంద్రం ఆదేశాలు, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

    Somesh Kumar IAS

    ఫొటో సోర్స్, twitter/SomeshKumarIAS

    ఛీఫ్ సెక్రటరీ అంటే రాష్ట్రంలోని అందరు గవర్నమెంటు ఉద్యోగులకూ పెద్ద. ఆ పదవిలో ఇక రిటైర్మెంటే తప్ప బదిలీలు ఉండవు.

    కానీ తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ మాత్రం అంతర్రాష్ట్ర బదిలీ ఎదుర్కోబోతున్నారా? అవుననే అనిపిస్తోంది పరిస్థితులు చూస్తుంటే.

    బిహార్ రాష్ట్రానికి చెందిన సోమేశ్ కుమార్ 1989 సంవత్సరం బ్యాచ్ కి చెందిన ఐఎఎస్ అధికారి.

    రాష్ట్ర విభజన సమయంలో ఆయనకు ఆంధ్రా కేటాయించారు. కానీ ఆయన మాత్రం సెంట్రల్ ఎడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) కి వెళ్లి తెలంగాణలో కొనసాగేలా ఆదేశాలు తెచ్చుకున్నారు.

    రాష్ట్రాల మధ్య ఐఎఎస్ ల కేటాయింపులను కేంద్రం చేపట్టింది.

    సోమేశ్ కేటాయింపుపై ట్రైబ్యునల్ తీర్పును కేంద్రం హైకోర్టులో సవాల్ చేసింది.

    ఈ రోజు కేసు విచారించిన హైకోర్టు క్యాట్ తీర్పును పక్కన పెట్టేసింది.

    దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీర్పు అమలు కోసం కనీసం మూడు వారాల గడవు ఇవ్వమని సోమేశ్ తరపున లాయర్ హైకోర్టును అడిగినా ప్రయోజనం లేకపోయింది.

    సోమేశ్ కుమార్ బదిలీ ఉత్తర్వులు

    ఉత్తర్వులు అందిన వెంటనే ఆంధ్రలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది హైకోర్టు. దీనిపై ఏం చేయాలనే విషయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అయ్యారు సోమేశ్ కుమార్.

    ఆ సమావేశంలో ఏం తేల్చుకున్నారనేది తేలకముందే, కేంద్రం ప్రభుత్వం సోమేశ్ బదిలీ ఉత్తర్వులు ఇచ్చింది.

    హైకోర్టు తీర్పును అనుసరించి ఈనెల 12వ తేదీలోగా సోమేశ్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రిపోర్టు చేయాలంటూ కేంద్ర పర్సనల్ డిపార్టమెంటు ఉత్తర్వులు ఇచ్చింది.

    దీంతో ఇప్పుడు సోమేశ్ కుమార్ ఏం చేయబోతున్నారనేది ప్రశ్నార్థకంగా ఉన్నారు.

    ఆయన హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకున్నప్పటికీ ముందుగా ఇక్కడ ఉత్తర్వులను అయితే పాటించక తప్పదని బీబీసీతో చెప్పారు ఒక ఉన్నతాధికారి.

    ఆయన సెలవుపై వెళతారా, ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేస్తారా? లేక సర్వీసును వదిలేసుకుని కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా తెలంగాణలో సలహాదారు పదవి ఏదైనా తీసుకుంటారా అనే చర్చ సచివాలయ వర్గాల్లో సాగుతోంది. మరో విషయం ఏంటంటే, ఎందరో సీనియర్ అధికారులను కాదని, సోమేశ్ కుమార్ ని ఛీఫ్ సెక్రటరీ చేశారు కేసీఆర్.

    సాధారణంగా ఛీఫ్ సెక్రటరీలు రెండేళ్లు ఆ పదవిలో ఉంటే గొప్ప విషయం. కానీ సోమేశ్ కు మాత్రం ఏకంగా నాలుగేళ్లు అంటే 2020 జనవరి నుంచి 2023 డిసెంబరు వరకూ పదవిలో ఉండే అవకాశం వచ్చింది.

    వచ్చే ఎన్నికల సమయంలో కూడా ఆయనే పదవిలో ఉండేలా ప్లాన్ చేశారు కేసీఆర్.

    ఛీఫ్ సెక్రటరీలు అంత సుదీర్ఘంగా ఆ పోస్టులో ఉండడం అరుదు. కానీ ఆ రికార్డు సాధించేలోపే ఈ తీర్పు వచ్చింది.

  9. సొంతగడ్డపై 20వ సెంచరీ.. సచిన్ రికార్డ్ సమం చేసిన కోహ్లీ

    virat kohli

    ఫొటో సోర్స్, Getty Images

    విరాట్ కోహ్లీ వన్డేలలో తన 45వ సెంచరీ సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో 113 పరుగులు చేసిన కోహ్లీకి ఇది వన్డేలలో 45వ సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ మొత్తం 73 సెంచరీలు సాధించాడు.

    స్వదేశంలో చేసిన సెంచరీల లెక్క చూస్తే ఇది 20వది. స్వదేశంలో 20 సెంచరీలు చేసిన ఆటగాడిగా ఇంతవరకు సచిన్ పేరిట రికార్డ్ ఉండగా తాజా సెంచరీతో కోహ్లీ కూడా సచిన్ సరసన చేరాడు.

    కాగా సచిన్ స్వదేశంలో 20వ సెంచరీని 160 మ్యాచ్‌లలో చేయగా.. విరాట్ కోహ్లీ తన 99వ మ్యాచ్‌లో ఈ రికార్డు సమయం చేశాడు.

    వీరిద్దరి తరువాత దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ అమ్లా, ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్‌లు 14 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. అమ్లా స్వదేశంలో 69 వన్డే మ్యాచ్‌లలో 4 సెంచరీలు సాధించగా పాంటింగ్ 151 వన్డే ఇన్నింగ్స్‌లలో 14 సెంచరీలు చేశాడు.

    మరోవైపు కోహ్లీ ఈ సెంచరీతో సచిన్ పేరిట ఉన్న మరో రికార్డునూ అధిగమించాడు. శ్రీలంకపై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డు స్థాపించాడు. శ్రీలంకపై కోహ్లీ మొత్తం 9 సెంచరీలు చేయగా సచిన్ 8 సెంచరీలు చేశాడు.

    ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్నవారిలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు కోహ్లీయే. ఆయన మొత్తం73 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ 45, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 44, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ 42, భారత్‌కే చెందిన రోహిత్ శర్మ 41 సెంచరీలతో తరువాత స్థానాలలో ఉన్నారు.

  10. శ్రీలంక 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు.. లక్ష్యం 374

    Virat Kohli

    ఫొటో సోర్స్, Getty Images

    శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసింది. గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది.

    ఓపెనర్లు రోహిత్ శర్మ 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 పరుగులు.. శుభమన్ గిల్ 60 బంతుల్లో 11 ఫోర్లతో 70 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ 87 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 113 పరుగులు చేశాడు.

    వీరితో పాటు కేఎల్ రాహుల్ 39, శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో జట్టు భారీ స్కోరు సాధించడానికి సాయపడ్డారు.

    శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు తీశాడు.

    అనంతరం 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక జట్టు 11 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులతో ఆడుతోంది.

  11. హైదరాబాద్: ‘డ్రైవర్‌కు బీమా చేయించి చంపేశారు - హెడ్ కానిస్టేబుల్‌ సాయంతో ప్లాన్ వేశారు’

  12. సిద్దిపేట జిల్లాలో కాలువలో పడ్డ కారు.. ఐదుగురు మృతి, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

    సిద్దిపేటలో కారు ప్రమాదం

    ఫొటో సోర్స్, UGC

    తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో జరిగిన ఓ కారు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

    జగదేవ్పూర్ మండలం మునిగడప మల్లన్న గుడి మూల మలుపు వద్ద అదుపుతప్పిన కారు కల్వర్టునుఢీకొని పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది.

    మృతులు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

    వీరు వేములవాడ ఆలయ సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

    గాయపడ్డ మరో వ్యక్తిని అత్యవసర చికిత్సకు గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.

  13. చికెన్‌: కోడి మాంసాన్ని షాపు నుంచి తెచ్చాక కడగకూడదా? వాష్ చేస్తే ప్రమాదమా? మరి ఎలా వండాలి?

  14. 10 రూపాయల కాయిన్స్‌తో బైక్ కొనుగోలు, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    పది రూపాయల కాయిన్లతో బైక్ కొనుగోలు

    ఫొటో సోర్స్, UGC

    తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లో 10 రూపాయల కాయిన్స్ చెల్లుబాటు కావడం చాలామందికి సమస్య అవుతోంది. వాటిని తీసుకునేందుకు కొందరు వెనుకాడుతున్నారు.

    కానీ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఓ యువకుడు పది రూపాయల నాణాలు పోగేసి ఏకంగా మోటార్ బైక్ కొనేశాడు.

    మొత్తం 1.65 లక్షల రూపాయల విలువ చేసే బైక్ కోసం అన్నీ పది రూపాయల కాయిన్స్ తెచ్చాడు.

    పది రూపాయల కాయిన్స్ చెల్లుబాటు కావటం లేదనే ప్రచారాన్ని, ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకే తాము ఆ కాయిన్స్‌కి బైక్ అమ్మినట్టు వంటెద్దు సోమసుందర్ రావు హీరో షోరూమ్ అధినేత వెంకట్ మీడియాతో అన్నారు.

    తణుకు పట్టణానికి చెందిన బొబ్బలి రాఘవేంద్రరావు ఈ బైక్ కొన్నారు. సంచులతో తీసుకొచ్చిన కాయిన్స్ ని షోరూమ్ సిబ్బంది లెక్కించిన తర్వాత అతనికి బైక్ అప్పగించారు.

    పది రూపాయల కాయిన్స్ చాలాకాలంగా పోగేసి ఈ బైక్ కొనుగోలు చేయడం ఆనందంగా ఉందని రాఘవేంద్రరావు చెప్పారు.

    10 రూపాయల కాయిన్స్

    ఫొటో సోర్స్, UGC

  15. బ్రెజిల్: ‘సెల్మా పార్టీ’ పేరుతో పార్లమెంటు ముట్టడికి ఆహ్వానం.. ఆ ‘కోడ్ వర్డ్‌’ను ఎలా ప్రచారం చేశారు?

  16. కేరళ ఫుడ్ పాయిజనింగ్ కేసు: రెస్టారెంట్ యజమాని, కుక్ అరెస్ట్

    కేరళ ఫుడ్ పాయిజనింగ్ కేసు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    కేరళలోని ఓ రెస్టారెంట్‌లో ఆహారం తిన్న ఒక మహిళ చనిపోయారు. ఆ రెస్టారెంట్ ఫుడ్ తిని మరొక 21 మంది అనారోగ్యం పాలైనట్లు పోలీసులు తెలిపారు.

    రెస్టారెంట్ యజమాని, కుక్‌పై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ కస్టడీలో ఉన్నారు. తమపై వచ్చిన అరోపణలపై ఇంతవరకూ స్పందించలేదు.

    కోట్టయం మెడికల్ కాలేజీలో నర్స్‌గా పనిచేస్తున్న రష్మి రాజ్ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. బార్బిక్యూ చికెన్, అన్నం అర్దర్ చేసుకుని తిన్న తరువాత ఆమె అనారోగ్యం పాలయ్యారు. డిసెంబర్ 30న ఆస్పత్రిలో చేరారు. జనవరి 2న ఆమె చనిపోయారు.

    అంతర్గత అవయవాల ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె మరణించినట్లు ప్రాథమిక పోస్టుమార్టంలో తేలిందని స్థానిక వార్తాపత్రికలు తెలిపాయి.

    అదే రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న పలువురు అనారోగ్యం పాలైనట్లు నివేదికలు వచ్చాయి.

    ఫుడ్ పాయిజనింగ్ వల్లే నర్స్ చనిపోయారని, ఆ రెస్టారెంట్‌లో ఆహార నాణ్యత "పేలవంగా" ఉన్నట్టు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.

  17. అమరావతి అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

    అమరావతి

    ఫొటో సోర్స్, ANI

    రాజధాని అమరావతి అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

    హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ ఏపీ ప్రభుత్వం గతంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

    దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు, పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది.

    ఈనెల 31లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సూచించింది.

  18. నవజాత శిశువుల కోసం చిన్న చిన్న దుస్తుల్ని కుడుతున్న మహిళ

  19. భారత్ vs శ్రీలంక: తొలి వన్‌డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

    క్రికెట్

    ఫొటో సోర్స్, ANI

    గౌహతి వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.

    భారత్ పదకొండు మంది జట్టులో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు చోటుదక్కలేదు.

    భారత జట్టు:

    రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్.

    శ్రీలంక జట్టు:

    డీ షనక (కెప్టెన్), పీ నిశాంక, కే మెండిస్ (వికెట్ కీపర్), ఏ ఫెర్నాండో, డీడీ సిల్వా, సీ అస్లాంక, హసరంగా, సీ కరుణరత్నే, డీ వెల్లేగ్, కే రజిత్, డీ మధుశంక.

  20. మానసిక వైకల్యంతో బాధపడుతున్న 9 మంది పిల్లలను భిక్షాటన చేసి సాకుతున్న వృద్దురాలు